వైఎస్ ఘాట్ రచ్చబండ.. హైకోర్టుకు అశోక్.. తుళ్లూరులో జై భీం.. టాప్‌న్యూస్ @1pm
posted on Dec 24, 2021 @ 12:00PM
1. సీఎం జగన్ కుటుంబంలో మరోసారి మనస్పర్ధలు బయటపడ్డాయి. ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ దగ్గర జగన్, షర్మిళ, విజయమ్మ ఎవరికి వారుగా వేర్వేరుగా నివాళులు అర్పించారు. వైఎస్ ఘాట్ దగ్గర రాత్రి నివాళులర్పించి జగన్ వెళ్లిపోయిన అనంతరం.. షర్మిళ, విజయమ్మ వచ్చారు. ఇడుపులపాయ చర్చిలో కూడా జగన్, విజయమ్మలు వేర్వేరుగా ప్రార్ధనలు నిర్వహించారు.
2. రామతీర్థం రగడపై మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. నెల్లిమర్ల పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ని రద్దు చేయాలంటూ.. హైకోర్టులో అశోక్ గజపతిరాజు పిటిషన్ వేశారు. పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
3. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నకిలీ, ఫోర్జరీ పత్రాలతో బంధువులను విదేశాలకు పంపారని పిటిషనర్ తెలిపారు. చట్టరిత్యా చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని గోనె ప్రకాష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
4. ఏపీలో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో కూడా నిర్వహించకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. తెలుగులో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు ఎందుకు నిర్వహించడం లేదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో చీఫ్ సెక్రటరీకి హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఆరు వారాల్లో పూర్తి అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
5. ఏపీ పోలీస్ వ్యవస్థపై కేంద్రం టెలీస్కోపుతో చూస్తోందని, త్వరలోనే ఏపీలో పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోందని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. పోలీస్ ఉన్నతాధికారుల తీరు సరిగా లేదని.. అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందని సీఎం రమేశ్ తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిందని చెప్పారు.
6. తుళ్లూరు పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి 8 మంది ముస్లింలను ఓ కేసులో జడ్జి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. అయితే, పోలీసులు తమను చిత్రహింసలు పెట్టారని నిందితులు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను జడ్జి గత రాత్రి జీజీహెచ్‌లో వైద్య పరీక్షలకు పంపారు. నిందితుల శరీరంపై గాయాలు ఉన్నట్లు జీజీహెచ్ వైద్యులు నివేదిక ఇచ్చారు. వెంటనే 8 మంది నిందితులకు రిమాండ్ రద్దు చేసిన జడ్జి.. వారి విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. స్టేషన్‌లో నిందితులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
7. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం వీరుని తండా సర్పంచ్ భర్త సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. టీఆర్ఎస్ పార్టీలో చేరి అప్పుల్లో కురుకుపోయానని గుగులోతు మోహన్ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికైనా ఫలితం లేదని మోహన్ తెలిపాడు. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు సరిపోక అప్పులు చేశానని వీడియోలో చెప్పాడు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు లేకుండా పోయిందని మోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
8. ఓ తెలుగువాడి ఎదుగుదలను మరో తెలుగువాడు గుర్తించకపోగా.. చిన్నచూపు చూసే దురలవాట్లు మానుకోవాలని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. తెలుగువాడు రూపొందించిన కొవాగ్జిన్ తయారీ సమయంలో నిరుత్సాహ పరచడంతో పాటు, డబ్యూహెచ్‌వో నుంచి అనుమతులు రాకుండా ఉండేందుకు కొంత మంది ప్రయత్నించారని, వారిలో విదేశీయులతో పాటు మనవాళ్లు కూడా ఉన్నారని ఆరోపించారు. ఇలాంటి ధోరణి విడిచిపెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
9. కోనసీమలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. అయినవల్లి మండలం నేదునూరి పెదపాలెంలో ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈనెల 19వ తేదీన కువైట్ నుంచి విజయవాడ మీదుగా కారులో మహిళ వచ్చింది. గన్నవరం ఎయిర్ పోర్టులో కరోనా పరీక్షలు నిర్వహించగా ఓమైక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్రమత్తం అయిన అధికారులు, కుటుంబ సభ్యులకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు.
10. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. గురువారం ఉదయానికి 236గా ఉన్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య.. శుక్రవారానికి 358కి పెరిగింది. అంటే, ఒక్క రోజులోనే 100కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది.