కుప్పంలో థియేటర్లు సీజ్.. జగనన్నకు ఎందుకంత కక్ష?
posted on Dec 23, 2021 @ 4:37PM
సినిమా టికెట్ల అంశంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. తమ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నా జగన్ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తమ నిబంధనలు పాటించడం లేదంటూ సీజ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పలు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో నాలుగు సినిమా థియేటర్లను అధికారులుసీజ్ చేశారు. బీ ఫామ్ లైసెన్స్ రెన్యువల్ కాలేదంటూ సీజ్ చేశారు.
పలమనేరులోనూ మూడు సినిమా థియేటర్లను అధికారులు మూసివేశారు. అనంతపురం నగరంలోని పలు సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టిక్కెట్ల రేట్లతో పాటు లైసెన్స్‌లను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. థియేటర్ల ముందు ధరలకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయాలంటూ థియేటర్ యాజమాన్యాలకు సూచించారు.
సినిమా టికెట్ల అంశంతో పాటు థియోటర్ల సీజ్ పై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సీరియస్ గా స్పందించారు. సినీ హీరోలను దెబ్బ తీయడం, ఇండస్ట్రీని నాశనం చేయడమే జగన్ లక్ష్యమని అన్నారు. సినిమా వారి నుంచి కమీషన్లు రావడం లేదనే జగన్ వారిపై కక్ష కట్టారని చెప్పారు. థియేటర్లపై దండయాత్ర చేసేందుకు అధికారులను పంపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే పట్టించుకోని జగన్... సినిమా టికెట్ల అంశానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు.