దేశంలో డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో 100కుపైగా ఒమిక్రాన్ కేసులు..
posted on Dec 24, 2021 @ 10:38AM
రావడం లేటేమో కానీ.. వచ్చాక తగ్గేదే లే అంటోంది ఒమిక్రాన్. వరుస పెట్టి కేసులు పెంచేస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. గురువారం ఉదయానికి 236గా ఉన్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య.. శుక్రవారానికి 358కి పెరిగింది. అంటే, ఒక్క రోజులోనే 100కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది.
కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలో అత్యధికంగా 88 మందికి ఒమిక్రాన్ సోకగా.. 67 మందితో ఢిల్లీ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఇక తెలుగు స్టేట్ తెలంగాణ 38 కేసులతో దేశంలోనే టాప్ 3 లో నిలిచింది. ఏపీ మూడు కేసులతో 13వ స్థానంలో ఉంది. మొత్తం 358 మంది ఒమిక్రాన్ బాధితులకు గాను.. 114 మంది కోలుకున్నారు. మిగతా వారు ఐసోలేషన్‌లో ఉన్నారు.
మరోవైపు, దేశవ్యాప్తంగా 11లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 6,650 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసులు 3.47 కోట్లు దాటగా.. రికవరీలు 3.42 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 77,516గా ఉంది. క్రియాశీల రేటు 0.22 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.40 శాతానికి మెరుగైంది. 24 గంటల వ్యవధిలో 374 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 4.79 లక్షలకు చేరింది.