మళ్ళీ సాగు చట్టాలు? మంత్రి వ్యాఖ్యలతో మొదటి కొచ్చిన చర్చ!

కేంద్ర ప్రభుత్వం,  రైతుల ఆందోళనకు తలొగ్గి మూడు వివాదస్పద సాగు చట్టాలను రద్దు చేసింది.  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సాగు చట్టాల రద్దు బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. అలాగే, వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సుమారు ఏడాదికి పైగా దేశ రాజదాని ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేసిన రైతు సంఘాల సమన్వయ సమితి ఆందోళన విరమించుకుంది. ఉద్యమానికి నాయకత్వం వహించిన రైతు నాయకులు, రైతులు ఢిల్లీ వదిలి వెళ్లారు.  అక్కడితో, ఆ వివాదం ముగిసినట్లే అనుకున్నారు.  అయితే కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి, నరేంద్ర సింగ్‌ తోమర్‌ తేనె తుట్టెను మళ్ళీ కదిల్చారు. ఉద్దేశపూర్వకంగా ఆన్నారో, యాదృచ్చికంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారో గానీ, నాగపూర్’లో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు వివదస్పదం అవుతున్నాయి.   నాగ్‌పుర్‌లో జరిగిన అగ్రో విజన్‌ ఎక్స్’పో  కార్యక్రమంలో పాల్గొన్న తోమర్, మాట్లాడుతూ.. "స్వాతంత్ర్యం వచ్చిన 70ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అతిపెద్ద సంస్కరణ జరిగింది. వ్యవసాయానికి సంబంధించిన చట్టాలను సవరించి కొత్త చట్టాలను తీసుకొచ్చాం. అయితే విపక్షాలకు, కొందరు రైతు నాయకులకు ఈ సంస్కరణలు నచ్చలేదు. అందుకే నల్ల చట్టాలుగా ప్రచారం చేసి వాటిని రద్దు చేయించారు. కానీ ప్రభుత్వం ఏం అసంతృప్తి చెందడం లేదు. మేం ఒక అడుగు వెనక్కి వేశాం. కానీ తప్పకుండా మళ్లీ ముందడుగు వేస్తాం. ఎందుకంటే రైతులే ఈ దేశానికి వెన్నెముక" అని  అన్నారు.  మరోమారు రైతుల ఆందోళన, రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని  దిగొచ్చి నూతన సాగు చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. వాటిని మళ్లీ తీసుకురానుందా? అనే చర్చ మళ్ళీ తెర మీదకు వచ్చింది. నిజానికి, చట్టాల రద్దు ప్రకటన చేసిన సందర్భంలోనే, ప్రధానమంత్రి చట్టాలలో లొసుగులు ఉన్నాయని ఉపసంహరించుకుంటున్నామని చెప్పలేదు. చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని సమాధాన పరచడంలో విఫలమయ్యామని, రైతులకు మేలుచేసే చట్టాలను అమలు చేయలేకపోతున్నందుకు క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు కేంద్ర మంత్రి అదే విషయాన్ని మరో కోణంలో విప్పి చెప్పారు. దీంతో సాగు చట్టాలను మళ్లీ తీసుకొచ్చే అవకాశాలున్నాయనే  చర్చ మొదలైంది. అయితే దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి, అనేది చూడవలసి వుంది.

సీజేఐతో సీఎం.. తలా తోక లేని పాలన.. ఆంక్షలు షురూ.. సాగు వర్రీ.. టాప్ న్యూస్@7PM

ఏపీ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ సీఎం జగన్ కలిశారు. తన భార్య భారతితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల కడప జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్... తన పర్యటనను ముగించుకుని ఈ మధ్యాహ్నం విజయవాడకు చేరుకున్నారు.తర్వాత నేరుగా నొవోటెల్ హోటల్ కు వెళ్లిన జగన్... అక్కడ భారత ప్రధాన న్యాయమూర్తిని కలిశారు -------- ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లొసుగుల కారణంగానే కేంద్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఏదీ అడగలేకపోతోందని చెప్పారు. తలా తోక లేని పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని అన్నారు. రానున్న 30 నెలల్లో బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామని చెప్పారు. వైసీపీలో ఆ పార్టీ నేతలే ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ------ జగన్,  చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. వీరిద్దరూ మాటలతో జనాలను మోసం చేశారని అన్నారు. రాష్ట్రంలో ఏయే అభివృద్ధి పనులు చేశారో వీరిద్దరూ చెప్పాలని డిమాండ్ చేశారు. వీరు పనులు చేయరు, చేసే వారిని అడ్డుకుంటారని చెప్పారు. వీరికి ఏపీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. గత సీఎం గ్రాఫిక్స్ తో మాయ చేస్తే... ప్రస్తుతం సీఎం  మాటలతో మోసం చేస్తున్నారని అన్నారు.  -------- ప్రతి వ్యవస్థను, ప్రతి రంగాన్ని భయపెట్టి గుప్పిట్లో పెట్టుకునేందుకు ఏపీలోని వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలోని పరిశ్రమలను బెదిరించి వెళ్లగొట్టారని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వారిని భయపెట్టారని అన్నారు. ఇప్పుడు సినీ పరిశ్రమపై పడ్డారని దుయ్యబట్టారు. వైసీపీ అవినీతి పాలనతో ఏపీ అభివృద్ధి పడిపోయిందని అన్నారు.  -- నూతన సంవత్సర వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వేడుకలు నిర్వహించుకునే ప్రదేశంలో భౌతికదూరం పాటించాలని ఆదేశించింది. మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు. జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈరోజు నుంచే ఆంక్షలు అమల్లోకి వస్తాయని చెప్పింది. ------  ప్రభుత్వాలైనా ప్రజల కోసమే పని చేయాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులను రోడ్డు మీద పడేసిందని విమర్శించారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల కోసం మంత్రులు ఢిల్లీకి వెళ్తే... ఢిల్లీ పెద్దలు అవమానించారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని అన్నారు. ------ ఇందిరా శోభన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సామాన్యుల పార్టీ అని.. అందుకే తాను ఆ పార్టీలో చేరానన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ ముఖచిత్రం మారిపోయిందన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని... బీజేపీ, టీఆర్ఎస్ ఒకే గొడుగు కింద పని చేస్తున్నాయన్నారు. కేంద్రంలో బడా మోదీ, రాష్ట్రంలో చోట మోదీ కేసీఆర్ అంటూ ఇందిరా శోభన్ సెటైర్ వేశారు --------- కరోనాకు మందు తయారు చేసిసంచలనం రేకెత్తించిన ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య ఒమిక్రాన్ కు కూడా మందును తయారు చేశారు. ఒమిక్రాన్ సోకకుండా ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ మాదిరి ఈ మందును వేసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సుమారు 22 రకాల దినుసులతో ఐదు రకాల మందులు తయారు చేసినట్టు చెప్పారు. ఈ మందును ఒకే రోజు రెండు పూటలా తీసుకుంటే సరిపోతుందని తెలిపారు.  ---- ఇటీవల రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ తెస్తామంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సంచలన ప్రకటన చేశారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో తోమర్ మాట్లాడుతూ.. రైతుల మేలు కోసం ఒక్క అడుగు వెనక్కి వేశామని, భవిష్యత్తులో మళ్లీ ముందుకు వెళ్తామని తెలిపారు. వ్యవసాయ చట్టాలను స్వల్ప మార్పులతో మళ్లీ తెస్తామని ప్రకటించారు.  ------ పంజాబ్‌లోని లుథియానా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఖలిస్థాన్, గ్యాంగ్‌స్టర్లు, మాదక ద్రవ్యాల స్మగ్లర్లకు సంబంధాలు ఉన్నట్టు పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు. మనం ఉగ్రవాదం, డ్రగ్స్ నుంచి సవాళ్లు ఎదుర్కొంటున్నామని, మాదక ద్రవ్యాల వ్యవస్థీకృత నేరాలు, టెర్రరిజం ప్రమాదకరమైన కాక్‌టెయిల్ వంటివని, లుథియానా కేసు కూడా అలాంటిదేనని పేర్కొన్నారు.

కేసీఆర్ కు కృతజ్ఞతలు.. జగన్ పేరెత్తని చిరంజీవి! నెటిజన్ల సెటైర్స్..

సినిమా టికెట్ల ధరలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు ఉత్తర్వులు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సర్కార్ టికెట్ల ధరలు తగ్గేలా నిర్ణయం తీసుకోగా.. తెలంగాణ సర్కార్ మాత్రం పెంచేసింది. ఏపీలో కనిష్టంగా 5 రూపాయలు ఉండగా.. గరిష్టంగా 250 రూపాయలు టికెట్ ధర ఉంది. ఇక తెలంగాణలో కనిష్ట టికెట్ ధర 30 రూపాయలు ఉండగా.. గరిష్టంగా 300 రూపాయల వరకు ఉంది. పెద్ద చిత్రాలకు కొన్ని మినహాయింపులకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కార్.  సినిమా టికెట్లకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలపై భిన్న స్పందనలు వస్తున్నాయి. థియేటర్లలో టికెట్ రేట్ల పెంపున‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చిన‌ అనుమ‌తులు అమ‌ల్లోకి తీసుకురావ‌డంతో సినీ పరిశ్ర‌మ‌కు చెందిన వారు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ స‌ర్కారుకి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విష‌యంపై స్పందిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను ఆయ‌న ట్వీట్ చేశారు.'తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీ దారులకు, థియేటర్ల‌ యాజమాన్యానికి, అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతజ్ఞ‌తలు. సినిమా థియేటర్ల  మనుగడకు, వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది' అని చిరంజీవి పేర్కొన్నారు.  సినిమా టికెట్లపై  చిరంజీవి చేసిన ట్వీట్ ప‌ట్ల నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. చిరంజీవి తన ట్వీట్ లో తెలంగాణ సర్కార్ గురించి చెప్పారు కాని.. ఏపీ విషయాన్ని ప్రస్తావించలేదు. దీనిపైనే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించిన విష‌యంపై చిరంజీవి ఎందుకు మాట్లాడటం లేదని కొందరు ప్రశ్నించారు. సినిమా టికెట్ల విషయంలో గతంలో సీఎం జగన్ రిక్వెస్ట్ చేశారు చిరంజీవి. అయినా ఏపీ సర్కార్ మాత్రం టికెట్ల ధరలు తగ్గిస్తూనే నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ నిర్ణయంపై హీరో నాని ఘాటుగా స్పందించారు. కాని మెగా హీరోలు మాత్రం స్పందించడం లేదు. ఈ విషయంలోనే చిరంజీవిని తప్పుపడుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

తీన్మార్ మల్లన్నపై దాడి! ఎవరు చేశారు? అసలేం జరిగింది? 

ప్రముఖ జర్నలిస్ట్, బీజేపీ నేత తీన్మార్ మల్లన్నపై దాడి జరిగింది.  ఈ ఘటన బోడుప్పల్‌ పరిధిలోని లక్ష్మీనగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. క్యూ న్యూస్ ఆఫీసులోకి కొంతమంది దుండగులు వెళ్లి మల్లన్నను తిడుతూ దాడికి పాల్పడ్డారు. అక్కడున్న కంప్యూటర్లను, టీవీలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అడ్డుకోవాలనుకునే వారిని తీవ్ర పదజాలంతో తిట్టారు. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు.. బోడుప్పల్‌లోని శనార్థి తెలంగాణ పత్రికా కార్యాలయంలో ఉన్న తీన్మార్‌ మల్లన్న వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగి ఆయనపై దాడి చేశారని రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి వెల్లడించారు.  అభివృద్ది ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా.. హిమాన్షు శరీరంలోనా అనే అర్థం వచ్చేలాగా తీన్మార్ మల్లన్న ట్విటర్‌లో పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పోస్టుపై ఆగ్రహించిన వ్యక్తులు దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మల్లన్న మీడియాకు విడుదల చేశారు టీఆర్ఎస్ పార్టీ గూండాలే ఈ పని చేశారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. తన ఛానల్‌ ద్వారా నిజాలను వెల్లడిస్తున్నానని, దానిని జీర్ణించుకోలేకనే ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. వచ్చిన వారు గూండాలనుకోలేదని వారిని కూర్చోమని మర్యాదలు కూడా చేశామని చెప్పారు. తమ ఆఫీస్‌పై దుండగులు దాడిక పాల్పడుతున్నారని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని, ఇప్పటికైనా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని భౌతిక దాడులు జరిగినా భయపడేదేమి లేదని.. వెనక్కి తగ్గేది లేదని మల్లన్న ప్రకటించారు. బీజేపీలో చేరిన తీన్మార్ మల్లనకు చెందిన క్యూ న్యూస్ మీడియా ట్విట్టర్‌లో ఇటీవల ఓ పోల్‌ను నిర్వహించింది. మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై బాడీ షేమింగ్ కామెంట్‌తో చేసిన ఆ పోల్ వల్ల తీన్మార్ మల్లన్న‌పై టీఆర్ఎస్ పార్టీలో ఆగ్రహం నెలకొంది. దీంతో ఆ పార్టీకి చెందిన వ్యక్తులు ఆ పోల్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా మల్లన్నపై దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా, అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

కేటీఆర్ కు మద్దతుగా.. తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా షర్మిల ట్వీట్!

తెలంగాణలో దూకుడు రాజకీయాలు చేస్తున్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సీఎం కేసీఆర్, కేటీఆర్ పై హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ కాక రేపుతున్నారు. కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు షర్మిల. కేటీఆర్ పైనా ఇటీవల కాలంలో దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా మాత్రం మంత్రి కేటీఆర్‌కి మద్దతుగా నిలిచారు వైఎస్సార్‌టీపీ వైఎస్ షర్మిల.  బీజేపీ నేత తీన్మార్ మల్లన్న ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కుమారుడు హిమాన్షును కించపరిచేలా ట్వీట్ చేశారు. దీనిపై షర్మిల స్పందించారు. ట్విటర్ వేదికగా కేటీఆర్‌కు మద్దతుగా నిలిచారు. ‘‘పిల్లలకు ఒక తల్లిగా, రాజకీయ పార్టీ నేతగా రాజకీయాల్లోకి గుంజడాన్ని ఖండిస్తున్నా. కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలను సహించేది లేదు. మహిళలను కించపరిచినా, పిల్లలను కించపరిచినా.. మనం రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలి’’ అని షర్మిల ట్వీట్‌లో పేర్కొన్నారు. అభివృద్ధి విషయమై బీజేపీ నేత తీన్మార్ మల్లన్న ట్వీట్ చేశారు. ‘అభివృద్ది ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా.. హిమాన్షు శరీరంలోనా?’ అనే అర్థం వచ్చేలాగా ట్విట్టర్‌లో తీన్మార్ మల్లన్న పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పోస్టుపై ఆగ్రహించిన టీఆర్‌ఎస్‌ సానుభూతిపరులు తీన్మార్‌ మల్లన్నపై దాడికి పాల్పడ్డారు. బోడుప్పల్‌ పరిధిలోని లక్ష్మీనగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. శనార్థి తెలంగాణ పత్రికా కార్యాలయంలో ఉన్న తీన్మార్‌ మల్లన్న వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగి ఆయనపై దాడి చేశారని రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి వెల్లడించారు. 

భారత్ లో ఫిబ్రవరిలో థర్డ్ వేవ్ పీక్స్! ఐఐటీ పరిశోధకుల సంచలన రిపోర్ట్..

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భారత్‌లో వేగంగా విస్తరిస్తూ కలవరం రేపుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు 400కు దగ్గరలో ఉన్నాయి. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సంబరాలతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్న భావన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లో ఒమిక్రాన్ తీవ్రతపై ఐఐటీ కాన్పూర్ తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో కరోనా మూడో వేవ్ 2022 ఫిబ్రవరి మొదటి వారం నాటికి దేశంలో కరోనా మూడో వేవ్ పతాకస్థాయికి చేరుతుందని ఆ అధ్యయనంలో అంచనా వేశారు. భారత్ లో తొలి రెండు కరోనా వేవ్ ల సమయంలో నమోదైన కేసులు సంఖ్యను గసియాన్ మిశ్రమ నమూనా విధానంలో గణించిన ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు ఈ నిర్ణయానికి వచ్చారు. ప్రపంచంలో ఇప్పటికే బ్రిటన్, అమెరికా, రష్యా, జర్మనీ వంటి దేశాల్లో కరోనా థర్డ్ వేవ్ గరిష్ట స్థాయిలో నడుస్తోంది. ఈ సందర్భంగా ఆయా దేశాల కరోనా కేసుల సరళిని కూడా పరిశీలించారు. భారత్ లో తొలి రెండు వేవ్ ల సమయంలో నమోదైన కేసుల సంఖ్యతో ఆయా దేశాల కరోనా డేటాతో క్రోడీకరించారు.ఈ ఏడాది డిసెంబరు 15 నుంచి నమోదైన కేసులను కరోనా థర్డ్ వేవ్ లో భాగంగా పరిగణించారు. అయితే వ్యాక్సినేషన్ అంశాన్ని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకోలేదు. అందువల్ల ఫిబ్రవరి నాటికి ఎన్ని కేసులు వస్తాయన్నదానిపై తాజా అధ్యయనంలో వెల్లడించలేదు.  మరోవైపు దేశంలో ఒమిక్రన్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కొత్త వేరియంట్‌ విస్తరించకుండా ఆంక్షల దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తుండగా.. ఉత్తరప్రదేశ్‌లో  నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఈ జాబితాలోకి మహారాష్ట్ర చేరింది. డిసెంబర్‌25  నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు  ఉద్దవ్ థాకరే సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సినిమా థియేటర్లలోకి కూడా 50 శాతం మంది ప్రేక్షకులనే అనుమతించనుంది.పెళ్లి వేడుకలు, ఫంక్షన్లకు కేవలం 250 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. 

హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. 30 మంది ఐపీఎస్ ల బదిలీ

న్యూఇయర్ కు ముందు తెలంగాణ సర్కార్ భారీ ఎత్తున ఐపీఎస్ బదిలీలు చేపట్టింది. మొత్తంగా 30 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న అంజనీకుమార్‌ను అవినీతి నిరోధకశాఖ డీజీగా బదిలీ చేసింది. ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన సీవీ ఆనంద్‌ను ఆయన స్థానంలో హైదరాబాద్ సీపీగా నియమించింది. సిద్దిపేట, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు, 11 జిల్లాల ఎస్పీలను బదిలీ చేయగా, నారాయణపేట ఎస్పీ చేతనకు ఎలాంటి పోస్టు కేటాయించలేదు. ఒకటి రెండు రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  హైదరాబాద్ కొత్త సీపీగా నియమితులైన సీవీ ఆనంద్ ఏప్రిల్ 2018లో కేంద్ర సర్వీసులకు వెళ్లి మూడున్నర నెలల కిందట తిరిగి తెలంగాణ కేడర్‌కు బదిలీపై వచ్చారు. అంతకుముందు ఆయన సైబరాబాద్ సీపీగా పని చేశారు. సైబరాబాద్ విభజన తర్వాత.. ఆయనను హైదరాబాద్ సీపీగా నియమిస్తారనే ప్రచారం జరిగింది. కాని ఆయనకు అప్పుడు సివిల్ సప్లయ్ కమిషనర్ గా నియమించింది. తర్వాత ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లాకరు.  ఇప్పుడాయనకు హైదరాబాద్ సీపీగా కీలక బాధ్యతలు అప్పగించారు. సుదీర్ఘకాలంగా రాచకొండ కమిషనర్‌గా ఉన్న మహేశ్ భగవత్‌ను మాత్రం అక్కడే ఉంచారు.  డీసీపీలుగా ఉంటూ పనిచేస్తున్న చోటే డీఐజీలుగా పదోన్నతులు పొంది కొనసాగుతున్న ఏఆర్ శ్రీనివాస్, ఏవీ రంగనాథ్, కార్తికేయ, అవినాశ్ మహంతికి చాలా కాలం తర్వాత కొత్త పదవులు దక్కాయి. నాన్ కేడర్ ఎస్పీలుగా ఉంటూ మూడు రోజుల కిందట ఐపీఎస్‌లుగా పదోన్నతులు పొందిన కోటిరెడ్డి, కేఆర్ నాగరాజ్, ఉదయ్ కుమార్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, మనోహర్, శిల్పవల్లి వంటి అధికారులకు కీలక పోస్టులు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ స్థాయిలో బదిలీలు చేపట్టడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. 

ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులంతా పాస్‌...

విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థి సంఘాల ఆందోళనలు, విపక్షాల డిమాండ్లతో ప్రభుత్వం దిగొచ్చింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ప్రకటించారు. కొవిడ్ కారణంగా ఆన్‌లైన్ క్లాసులతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ప్రతీ ఒక్క విద్యార్థిని పాస్ చేయాల్సిందేనన్న డిమాండ్ నేపథ్యంలో విద్యాశాఖ తాజాగా సమీక్ష నిర్వహించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన విద్యాశాఖ.. విద్యార్థుల భవిష్యత్‌ మేరకు వారికి ఉపయోగపడేలా నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.ఇందులో భాగంగానే పరీక్షలు రాసిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరిని పాస్ చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.  ఇంటర్ ఫస్టియర్‌లో మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో  అందులో 2,24,012 మంది (49 శాతం) విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. ఫెయిలయ్యామనే ఆవేదనతో ఇప్పటివరకు నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు కూడా జరిగాయి. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. కొవిడ్ కారణంగా క్లాసులు జరగలేదని, అందుకే విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారనే అభిప్రాయమే అన్ని వర్గాల నుంచి వచ్చింది. అన్ని వైపుల నుంచి వస్తున్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం.. ఫెయిలైన విద్యార్థులను కూడా పాస్ చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  'కోవిడ్‌తో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంది. కోవిడ్‌ సంక్షభం కారణంగా మూడో తరగతి నుంచి పీజీ వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాం. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించాం. అన్ని అంశాలు ఆలోచించిన తర్వాతే పరీక్షలు పెట్టాం. తాజాగా ప్రకటించిన ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో 49 శాతం మంది విద్యార్థులు పాసవ్వగా..మిగిలిన 51 శాతం మంది ఫెయిలయ్యారు. అయితే ఫెయిలయిన వారిలో ఎక్కువగా ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాలలో చదివిన విద్యార్థులే ఉన్నారు. ఫస్టియర్‌ ఫలితాలపై ప్రభుత్వాన్ని, సీఎంను టార్గెట్‌ చేయడం సరికాదు. ప్రతీదీ రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు అలవాటైపోయింది' అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.  ఫలితాలపై ఇంటర్‌ బోర్డులో ఎలాంటి లోపాలు జరగలేదన్నారు మంత్రి. వాల్యుయేషన్‌ పకడ్బందీగా నిర్వహించారని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరిస్తే మంచిదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఫెయిలయిన విద్యార్థులందరికి కనీస 35 మార్కులు ఇచ్చి పాస్‌ చేస్తున్నామని సబిత చెప్పారు.  ఇంటర్ సెకండ్‌ ఇయర్‌లోనైనా విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నన్నారు. ఇలాగే ఆందోళనలు చేస్తే ఇంటర్‌ సెకండియర్‌లో కూడా ప్రభుత్వమే పాస్‌ చేస్తుందని ఆశించడం మంచి పద్దతి కాదని మంత్రి సబితా విజ్ఞప్తి చేశారు

'నేనే నాయక్'.. నిరుపించుకున్నరావత్

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం తీరుపై నేరుగా విమర్శలు చేసి సంచలనానికి తెర తీసిన రావత్ చివరాఖరుకు, ‘నేనే నాయక్’ అని నిరూపించుకున్నారు. శాసనసభ ఎన్నికల వేళ కాళ్ళు చేతులు కట్టేసి ఎన్నికల సముద్రం ఈద మంటున్నారని పార్టీ అధినాయకత్వం పై నేరుగా విమర్శలు చేసిన రావత్, పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఎన్నికల ప్రచార కమిటీకి తానే సారథ్యం వహించేలా అధిష్ఠానాన్ని ఒప్పించారు. ఈరోజు (శుక్రవారం) రాష్ట్ర నేతలతో కలిసి ఢిల్లీ  వెళ్లిన రావత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. పంజాబ్’లో నవజ్యోతి సింగ్ సిద్దూ అనుసరించిన్ ఫార్ములాను ఉపయోగించి, పార్టీని తమగుప్పిట్లోకి తెచ్చుకున్నారు.  అంతే కాదు, కలిసి పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందా’ మని, ప్రత్యర్ధి వర్గానికి పిలుపునినిస్తూనే, “నా నేతృత్వంలోనే ఉత్తరాఖండ్ ఎన్నికలు జరుగుతాయి” అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.అయితే, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తమ పేరును ప్రకటించాలని కోరుతున్న రావత్, తనలో అసంతృప్తి ఇంకా కొంత అలాగే ఉందని చెప్పడం ద్వారా అచెలంచెలుగా, అగ్రనాయకత్వం పై పోరాటం కొనసాగుతుందని చెప్పకనే చెప్పారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల గాంధీ, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా రావత్ పేరును ప్రకటించేందుకు సుముఖంగా లేరని, అందుకే అయన రావత్ పేరును ఇంకా ప్రకటించలేదని అంటున్నారు.ఈ విషయంపై విలేకరులు ప్రశ్నించగా.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవటంపై అధ్యక్షుడికి ప్రత్యేక అధికారం ఉందన్నారు.. ఎన్నికల అనంతరం శాసనసభాపక్ష సమావేశంలో  ఎమ్మెల్యేలంతా తమ నాయకుడిని ఎన్నుకోవాలనే  ప్రక్రియకు కట్టుబడి ఉంటామన్నారు. రావత్ తాజా వ్యాఖ్యలతో పార్టీ నాయకత్వంతో ఉన్న విభేదాలు సమసిపోయినట్లే కనిపిస్తున్నాయి.   డిల్లీకి వెళ్లే ముందే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాతోనూ రావత్  ఫోన్లో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీతో ఆయనకు ఉన్న సమస్యలను పరిష్కరించే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, గతంలో, పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జిగా రావత్ తమను తప్పుదోవ పట్టించారనే, అభిప్రాయంతో ఉన్న రాహుల్, ప్రియాంక తాత్కాలికంగా పార్టీ పగ్గాలు రావత్’కు అప్పగించారని, అన్నీ కలిసొచ్చి ఉత్తరాఖండ్’లో పార్టీ విజయం సాదించి అధికారంలోకి వస్తే, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే, రావత్ పైచేయి సాధించారు.

జ‌గ‌న్‌పై స్వామి ఆగ్ర‌హం.. ధాన్యంపై ధూంధాం.. టికెట్లు పెరిగాయ్‌.. టాప్‌న్యూస్‌@7pm

1. ఏపీ డీజీపీ సవాంగ్‌కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళిపై వైసీపీ గూండాల దాడిని ఖండించారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మండిపడ్డారు. మురళి ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. ఘటనపై విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డీజీపీ సవాంగ్‌ని లేఖలో కోరారు.  2. సీఎం జగన్‌రెడ్డిపై స్వామి పరిపూర్ణానంద తీవ్ర విమర్శలు చేశారు. గతంలో డెల్టా పేరుతో పండుగలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టిన ప్ర‌భుత్వం.. ఒమిక్రాన్ దృష్ట్యా క్రిస్మస్‌పై ఎందుకు ఆంక్షలు పెట్టడం లేదని ప్రశ్నించారు. హిందువుల పండుగలపైనే జగన్‌కి కరోనా గుర్తుకువస్తుందా? అని నిలదీశారు. హిందువుల పండుగలంటే జగన్‌కి చిన్నచూపన్నారు స్వామి ప‌రిపూర్ణానంద‌.  3. తెలంగాణలో ఇంకా 60లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉందని, మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఢిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు ద‌గ్గ‌ర‌ పారబోస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. ధాన్యం సేకరణపై మాట్లాడేందుకు వారం రోజుల క్రితం మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వచ్చినా కేంద్రం నుంచి సరైన స్పందన లేదన్నారు.  4. ఢిల్లీ వెళ్లిన మంత్రులు ఎంజాయ్‌ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. వానాకాలం పంట ఎంత కొంటారో చెప్పే వరకు, యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ కొంటామని కేంద్రం చెప్పే వరకు.. తెలంగాణ మంత్రులు ఢిల్లీలోనే ఆమరణ దీక్ష చేయాల‌ని స‌వాల్ చేశారు. ఏదీ తేలకుండా రాష్ట్రానికి తిరిగి రావొద్దని రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రజల్ని మభ్య పెట్టేందుకు టీఆర్ఎస్‌ నేతలు వీధినాటకాలకు తెరలేపారని మండిప‌డ్డారు.  5. రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ దీక్షలతో, ధర్నాలతో డ్రామాలు చేస్తోందని వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌ ఆరోపించారు. తెలంగాణ‌లో రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు చనిపోతున్నారని.. కనీసం ఆ కుటుంబాలను ఓదార్చాలనే సోయి కూడా ముఖ్యమంత్రికి లేదా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో రైతులు చనిపోతే ఆదుకోవడానికి లక్షలు ఇచ్చే కేసీఆర్.. మన రైతులు చనిపోతే పట్టించుకోవడానికి కనీసం టైం కూడా లేదా? అని నిలదీశారు. 6. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఎన్వీ ర‌మ‌ణ‌ తొలిసారిగా తన స్వగ్రామం.. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి విచ్చేశారు. ఆయ‌న రాక సంద‌ర్భంగా పొన్నవరంలో పండగ వాతావరణం నెలకొంది. పొన్నవరంలో దాదాపు నాలుగు గంటల పాటు ఉన్నారు. జస్టిస్ ఎన్వీ రమణకు పౌర సన్మానం చేశారు. అపూర్వ స్వాగతానికి పొన్నవరం గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఎన్వీ ర‌మ‌ణ‌. 7. నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి ఎదుట న్యాయం కోసం ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తమ ఆస్తి విషయంలో వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ అన్యాయం చేసాడంటూ పద్మాలత పురుగుల మందు తాగింది. వెంట‌నే ఆమెను నంద్యాల ప్రభుత్వసుపత్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 8. ఆనందయ్యకు ఏపీ ఆయూష్‌ శాఖ ఝలక్‌ ఇచ్చింది. ఒమైక్రాన్ మందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఒమైక్రాన్‌కు ఆయుర్వేద మందు ఇస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయూష్‌శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయుర్వేద మందు సరఫరాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపింది.  9. విశాఖలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. యూఏఈ నుంచి వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో కొద్దీ రోజుల క్రితం నుంచి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు శాంపిల్ పంపించగా.. ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది.  10. తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏసీ థియేటర్లలో కనిష్టం రూ. 50.. గరిష్టం రూ. 150 కి పెంచారు. మల్టీప్లెక్స్‌ల్లో కనిష్టం రూ.100.. గరిష్టం రూ. 250 చేశారు. మల్టీప్లెక్స్‌ల్లో రిక్లైనర్‌ సీట్లకు గరిష్టంగా రూ.300 టికెట్ నిర్ణ‌యించారు. ఈ ధరలకు జీఎస్టీ, నిర్వహణ చార్జీలు అదనం.

ఇండియాగేటు ద‌గ్గ‌ర‌ ధాన్యం పారబోస్తాం.. ఢిల్లీలో తెలంగాణ‌ ధూంధాం..

కేంద్రం వ‌ర్సెస్ తెలంగాణ‌.. బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్‌.. యాసంగి వ‌ర్సెస్ ర‌బి.. వ‌డ్లు వ‌ర్సెస్ బియ్యం.. కొన్నిరోజులుగా ధాన్యంపై ఢిల్లీలో ధూంధాం న‌డుస్తోంది. కేంద్రం, రాష్ట్రం ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో హ‌స్తిన‌లో చ‌లిమంట రాజేస్తున్నారు. తెలంగాణ మంత్రులు ఢిల్లీలోనే మ‌కాం వేయ‌డం.. కేంద్రం ఎదురుదాడి చేయ‌డం.. ఇలా ధాన్యంపై రాజ‌కీయ సెగ ర‌గులుతోంది. తాజాగా, ఢిల్లీలో ఉన్న మంత్రులు కేంద్రానికి మ‌రోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త‌గ్గేదే లే అంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. తెలంగాణలో ఇంకా 60లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉందని, మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఢిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు ద‌గ్గ‌ర‌ పారబోస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. ధాన్యం సేకరణపై మాట్లాడేందుకు వారం రోజుల క్రితం మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వచ్చినా కేంద్రం నుంచి సరైన స్పందన లేదన్నారు.  "తెలంగాణలో పండిన ధాన్యంలో 60లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని ఇండెంట్‌ ఇచ్చారు. శుక్ర‌వారంతో ఆ టార్గెట్‌ పూర్తయింది. రాబోయే 60 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యాన్ని కూడా సేకరిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు విజ్ఞప్తి చేశాం. రెండ్రోజుల సమయం ఇవ్వాలని అడిగారు. రెండ్రోజులు గడిచినా ఎలాంటి స్పందనా లేదు. అపాయింట్‌మెంట్‌ అడిగినా ఇంకా ఇవ్వలేదు. తెలంగాణ రైతుల తరఫున కేంద్రం వైఖరిని తీవ్రంగా పరిగణిస్తున్నాం." అని ప్ర‌శాంత్‌రెడ్డి అన్నారు.  "ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. బియ్యం సేకరణపై ఎఫ్‌సీఐ, కేంద్రం గోడౌన్లు పెంచలేదు. వానాకాలంలో రైతులు పండించిన 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, డబ్బులు చెల్లిస్తుంది. తెలంగాణలో వానాకాలంలో ఎంత పండితే అంత ధాన్యం తీసుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంట్‌లో మాట ఇచ్చారు. అయినా, దానిపై ఇంకా స్పష్టత ఇవ్వట్లేదు. పార్లమెంట్‌లో ఇచ్చిన మాట ప్రకారం.. లిఖితపూర్వక హమీ ఇస్తూ లేఖ ఇవ్వకపోతే  రైతుల ద‌గ్గ‌ర‌ కొనుగోలు చేసిన 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఢిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు ముందు పారబోస్తాం." అని ప్రశాంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. 

ఢిల్లీలో మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారు.. అక్క‌డే ఆమ‌ర‌ణ దీక్ష చేయాల‌న్న రేవంత్‌

రేవంత్‌రెడ్డి మాట్లాడితే బుల్లెట్ దింపినట్టు ఉంటుందంటారు. రోజుల త‌ర‌బ‌డి ఢిల్లీలో మకాం వేసిన మంత్రుల‌ను ఉద్దేశించి తాజాగా ఆయన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇటు టీఆర్ఎస్‌ను, అటు బీజేపీని.. రెండు పార్టీల‌నూ టార్గెట్ చేస్తూ తూటాల్లాంటి డైలాగ్స్ పేల్చారు. ఇంత‌కీ రేవంత్ ఏమ‌న్నారంటే... "ఢిల్లీలో కాదు గల్లీలో తేలుస్తామని ఎంపీలు రాష్ట్రానికి వచ్చారు. గల్లీలో కాదు ఢిల్లీలో తేలుస్తామని మంత్రులు హ‌స్తిన‌కు వెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆరు రోజుల్లో.. మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డిలు ఏం తేల్చారు? అదనంగా ఎంత ధాన్యం ఇస్తారో కేంద్రానికి మీరు ఏం నివేదిక ఇచ్చారో చెప్పండి. రాష్ట్రం, కేంద్రం మధ్య జరిగిన వ్యవహారం బయటపెట్టండి. అదనపు ధాన్యం ఎంత ఇస్తారో చెప్పకుండా.. కొంటారా? లేదా? అని మంత్రులు మాటలు చెబుతున్నారని రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు. వానాకాలం పంట ఎంత కొంటారో చెప్పే వరకు, యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ కొంటామని కేంద్రం చెప్పే వరకు.. తెలంగాణ మంత్రులు ఢిల్లీలోనే ఆమరణ దీక్ష చేయండి. ఏదీ తేలకుండా తిరిగి రావొద్దని రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రజల్ని మభ్య పెట్టేందుకు టీఆర్ఎస్‌ నేతలు వీధినాటకాలకు తెరలేపారు. రైతులు ఎవరూ చనిపోవద్దు, కాంగ్రెస్‌ అండగా ఉంటుంది. డిసెంబరు 27న ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహిస్తాం.. అని రేవంత్‌రెడ్డి తెలిపారు.   ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై పోరాటంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు విమర్శించారు. రైతుల జీవితాలను మోదీ ద‌గ్గ‌ర‌ కేసీఆర్‌ తాకట్టు పెట్టారని మండిప‌డ్డారు. టీఆర్ఎస్‌, బీజేపీ తోడు దొంగలుగా మారి రైతులకు ద్రోహం చేస్తున్నాయని.. యాసంగి పంట కొనబోమని కేంద్రం ముందే చెప్పినా.. ఆ విష‌యం రాష్ట్ర ప్ర‌భుత్వం ఎందుకు చెప్పలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.  

కొత్త అల్లుడిలా తీసుకువచ్చి.. పంపించేశారా?

అధికారంలో మన పార్టీ ఉంటే.. మనం ఏమైనా చేయొచ్చు.. ఎలాంటి పనైనా చేయొచ్చు. ఎవరినైనా తిట్ట వచ్చు.. ఎవరినైనా ఇరగ్గొటైయోచ్చు. అందుకు సాక్ష్యాలు కళ్ల ముందు కనబడుతున్నా... తూతూ మంత్రంగా ఇలా కేసు బుక్ చేసి.. అలా అరెస్ట్ చేసి.. ఆ వెంటనే బెయిల్ ఇచ్చి.. పెళ్లైన కొత్తలో అత్తగారింటికీ అలా కొత్త అల్లుడిని తీసుకు వచ్చి.. ఇలా సాగనంపినట్లు సాగనంపేయవచ్చు.   ఇది జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతల అనుచరుల చేస్తున్న హల్‌చల్‌పై పోలీసులు వ్యవహారిస్తున్న తీరును రాజకీయ పండితులు ఈ తరహాలో ఎండగడుతున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్బారావు గుప్తా కామెంట్లు.. ఆ క్రమంలో సదరు గుప్తాపై మంత్రి బాలినేని వాసన్నకు కుడి భుజం,ఆ పార్టీ మైనారిటీ నాయకుడు, రౌడీ షీటర్ సుబానీ బండ బూతులు తిడుతూ.. దాడి చేయడం.. బాధితుడిని మోకాళ్ల మీద కూర్చో బెట్టి మరీ మంత్రి వాసన్నకు సారీ చెప్పిండం..ఈ మొత్తం వ్యవహారంలో సుభానీ ఎక్కడ తగ్గేదే లే అన్నట్లు వ్యవహరించిన తీరు ప్రపంచమంతా చూసింది.. చూస్తోంది.  కానీ ఇంత చేసిన రౌడీ షీటర్, మంత్రి బాలినేని అనుచరుడు సుభానీని అరెస్ట్ చేయడానికి పోలీసులు సైతం వెనకడుగు వేశారని..ఆ క్రమంలో గుప్తాపై దాడి కారణంగా ఆర్య వైశ్య సంఘం నేతలు ఆందోళనకు దిగి.. సుభానీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం... దాంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అప్పటికప్పుడు.. రౌడీ షీటర్ సుభానీని బతిమాలి.. బామాలి పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి.. అరెస్ట్ చేసి.. ఆయనపై ఐపీసీ 448, 427, 32, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే సుబ్బారావు గుప్తాకు సుభానీ ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చాడో వీడియో సాక్ష్యం ఉన్నా... సుభానీపై అటెమ్ట్ టూ మడ్డర్ కేసు నమోదు చేయకుండా .. స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు నమోదు చేయడం ఏమిటని పోలీసులను రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు.  గతంలో అంటే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో గుంటూరు జిల్లా మాచర్లలో ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే స్థాయి ప్రజా ప్రతినిధిలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అత్యంత దారుణంగా దాడి చేస్తే.. అతడిపై కూడా స్టేషన్ బెయిల్ కేసు నమోదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రాజకీయ పండితులు గుర్తు చేస్తున్నారు. సామాన్యులు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. అర్థరాత్రి అపరాత్రి అన్న తేడా లేకుండా ఇళ్లపై దాడి చేసి.. సదరు వ్యక్తులను అరెస్ట్ చేసే ఈ పోలీసులు.. ఇంత దారుణంగా వ్యవహరించిన వారిపై స్టేషన్ బెయిల్ కేసులు నమోదు చేయడం ఏమిటని పోలీసుల తీరును రాజకీయ పండితులు బహిరంగంగా నిలదీస్తున్నారు.  అంటే అదికార పార్టీలో ఉన్న వారికి ఓ విధమైన కేసులు.. ప్రతిపక్షంలో ఉన్న వారిపైన ఓ రకమైన కేసులు నమోదు చేయడం ఆంధ్రప్రదేశ్ పోలీసులకే చెల్లిందనే టాక్ సోషల్ మీడియా సాక్షిగా వైరల్ అవుతున్న విషయాన్ని రాజకీయ పండితులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీసుల తీరును ప్రజలు సైతం ఏవగించుకుంటున్నారంటూ నెట్ జన్లు .. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు. నిజాయితీ, వృత్తి పట్ల నిబద్ధత.. ఎంత ఉంది అనేది ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే బయటపడతాయని పోలీసులకు రాజకీయ పండితులు సూచిస్తున్నారు. కానీ ఏపీ పోలీసులు మాత్రం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా పని చేయడం తరహా పద్దతిని ఎప్పుటికి మార్చుకుంటారోనని నెట్‌జన్లు వెయ్యి కళ్లతో  ఆశగా ఎదురు చూస్తున్నారు.  

ఆర్కే వర్సెస్ లోకేశ్.. మంగళగిరి గ్రౌండ్ రియాలిటీ..

రాజకీయ నాయకులకు ఉండవలసిన ఉత్తమ లక్షణాలలో మొదటి లక్షణం విశ్వాసం. రెండవది విశ్వసనీయత. తమపై తమకు విశ్వాసం ఉండడంతో పాటు ప్రజలపై విశ్వాసంతో ముందుకు సాగితే, జనంలో విశ్వసనీయత బలపడుతుంది. ఇక అప్పుడు వద్దన్నా విజయం వరిస్తుంది. ఇది అనేక సందర్భాలలో రుజువైన నిజం. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్’లో ఇప్పుడు ఈ లక్షణం  పుష్కలంగా కనిపిస్తోంది. రేపటి ఎన్నికల్లో విజయం తధ్యం అన్న ధీమా ఆయన మాటల్లో ప్రతిధ్వనిస్తోంది.  లోకేష్, మొదటి సారిగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేశారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓడి పోయారు. వైసీపీ అభ్యర్ధి  ఆళ్ళ రామకృష్ణా రెడ్డి-ఆర్కే ఐదు వేల స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించారు. అయితే లోకేష్ ఓటమితో కృంగి పోలేదు. ఓటమిని సవాలుగా తీసుకున్నారు. ఎక్కడ పారేసుకున్నారో అక్కడే వెతుక్కోవడం ప్రారంభించారు, మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి, ఎమ్మెల్యే ఆర్కే కంటే, ఎక్కువగా ప్రలతో కలిసి పోరాటం చేస్తున్నారు. నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అమరావతి ఉద్యమం కూడా కలిసి రావడంతో తరచుగా ఇక్కడ పర్యటనలు చేస్తున్నారు. టీడీపీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ వారిలో నైతిక స్ధైర్యం నింపుతున్నారు. ఈ నేపధ్యంలోనే వరసగా మూడు రోజులు నియోజక వర్గంలో పర్యటించిన లోకేష్, 2024 ఎన్నికల్లో మంగళగిరిలో తమ గెలుపు పైనే కాదు రాష్ట్రంలో  తెలుగు దేశం పార్టీ విజయం పై కూడా  సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. ఇందుకు సంబందించి విలేకరులు అడిగిన ప్రశ్నకు లోకేష్, ఒక్క నిముషం  ఆలోచించకుండా, ‘ఎనీ డౌట్’ .. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరుతుందని విశ్వాసం వ్యక్త పరిచారు.  అదలా ఉంటే మంగళగిరిలో నియోజకవర్గంలో మారిన పరిస్ధితులు పూర్తిగా కలిసొస్తున్నాయి. ముఖ్యంగా అమరావతి నుంచి రాజధానిని విశాఖకు మార్చేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, వాటికి సహకరిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే తీరు లోకేష్’కు వరంగా మారుతున్నాయి. ఒకప్పుడు ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్నఆర్కే, రాజధాని విషయంలో జగన్ రెడ్డికి వంత పాడడంతో ఆయన పలుకుబడి పలచబడిపోయింది . అందుకు తోడు నియోజక వర్గంలో ఎక్కడా అభివృద్ధి అన్నది లేక పోవడం, మరోవంక ఓటీఎస్, ఇళ్ళ కూల్చివేతలు ఆర్కే’ ఓటమిని  ముందుగానే ఖరారు చేస్తున్నాయని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం పట్ల రాష్ట్ర మంతటా వ్యతిరేకత ఉన్నా మంగళగిరి నియోజక వర్గంలో అది మరీమరీ ఎక్కువగా ఉందని అంటున్నారు.   ఈవిధంగా మంగళగిరి నియోజక వర్గంలో మారుతున్న పరిస్ధితుల్ని లోకేష్ చక్కాగా తమకు అనుకూలంగా మలచు కుంటున్నారు. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దీంతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అర్కేకు ఇప్పటి నుంచే  చుక్కలు కనిపిస్తున్నాయని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో రాజధాని ఎక్కడికి పోదు ఇక్కడే ఉటుందని నమ్మబలికి ఓట్లు వేయించుకున్న ఆర్కే, ఇప్పడు ముఖ్యమంత్రి కుట్రలో భాగస్వామి అవుతున్నారని, అందుకే  నియోజక వర్గం ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కిమ్మనడం లేదని  ప్రజలు ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. అలాగే, గతంలో ఆర్కే అమరావతి రైతుల్ని, ఉద్యమాన్ని చులకన చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో మరింత ఆగ్రహం తెప్పించాయి. చివరకు సమస్యలు  చెప్పుకునేందుకు వచ్చిన రైతులకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే తమను అవమానపరుస్తున్నారని జనం మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ఆర్కేపై పెరుగుతున్న వ్యతిరేకతతో పాటు మూడు రాజధానులపై జగన్ సర్కార్ దూకుడు తనకు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కలిసొస్తుందని లోకేష్ ధీమాగా కనిపిస్తున్నారు.

యూపీ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా?

కొత్త సంవత్సరం (2022) ప్రారంభంలో జరగవలసిన ఉత్తర ప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం వుందా? కోవిడ్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో  ఎన్నికలను వాయిదా వేసే అలోచనాలో కేంద్ర ప్రభుత్వం వుందా? అంటే ఉందనే అంటున్నారు, బీజేపీ రాజ్య సభ సభ్యుడు, డాక్టర్ సుబ్రమణ్య స్వామి. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలను 2022 సెప్టెంబర్ వరకు వాయిదా వేసే అవకాశం ఉందని ఆ మేరకు తన  వద్ద సామాచారం ఉందని , స్వామి ఈరోజు (శుక్రవారం) తెల్లవారుఝామున 4:22 నిమిషాలకు ట్వీట్ చేశారు. ఈ సమయంలో ఆయన ఈ ట్వీట్ చేయడంతో పలువురు, పలు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.  అదలా ఉంటే, స్వామి జోస్యానికి బలం చేకూరుస్తూ  అలహాబాద్‌ హైకోర్టు కుడా ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా యూపీతో సహా ఐదు రాష్ట్రాల్లో మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. అంతేగాక, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న ఎన్నికల ప్రచార ర్యాలీలపై నిషేధం విధించాలని సూచించింది.  మరో వంక ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం రేపు (డిసెంబర్ 25) నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేయనుంది. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఈ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.అలాగే వివాహాలు, వేడుకలకు 200 మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాకుండా పాల్గొన్న వారంతా తప్పకుండా కొవిడ్ నిబంధలను పాటించాలని స్పష్టం చేసింది. అంటే, రాష్ట్ర ప్రభుత్వం అంక్షల వైపుగా అడుగులు వేస్తోందనే విషయం స్పష్టమైంది.  ఈనేపధ్యలో ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్రాపుల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే విషయం ఎలా ఉన్నా ఇప్పటికే జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారానికి మాత్రం బ్రేక్ పడుతుందని అంటున్నారు. నిజానికి, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలల సమయముంది. అయితే, ఎప్పుడోనే ప్రారంభమైన ఎన్నికల ప్రచారం ఇప్పుడు మహా జోరుగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి రెండు రోజులకు ఒక సారి యూపీలో పర్యటిస్తునారు. వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.అలాగే యూపీతో పాటుగా పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో కూడా ఇప్పటికే ప్రచార వేడెక్కింది. అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపధ్యంలో నిజంగానే, సుబ్రమణ్య స్వామి, ఉహిస్తున్న విధంగా వచ్చే సెప్టెంబర్ వరకు ఎన్నికలు వాయిదా పడే పక్షంలో, యూపీ, పంజాబ్’తో పాటుగా అన్ని రాష్ట్రాలలోనూ రాష్ట్రపతి పాలన అనివార్య మవుతుందని, రాజ్యాంగ  నిపుణులు అంటున్నారు. అయితే, అంతవరకు వస్తుందా... లేక  గడువుకు కొంచెం అటూ ఇటుగా ఎన్నికలు జరుగుతయ్యా .. అనేది కరోనా కొత్త వేరియంట్ విస్తరణ , ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, గత అనుభవాలా దృష్ట్యా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ఎన్నికల సంఘం కానీ,తొందరపడి నిర్ణయాలు తీసుకోవని, మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చని అంటున్నారు.

జ‌గ‌న్‌కి హిందువుల పండుగలంటే చిన్నచూపా?

హిందూ పండుగ‌ల‌కు క‌రోనా ఆంక్ష‌లు. మ‌రి, క్రిష్మ‌స్‌కు ఎందుకు లేవు? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఒమిక్రాన్ వ‌ర్రీ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్నా.. ఏపీలో ఇప్ప‌టికే మూడు ఒమిక్రాన్ కేసులు న‌మోదైనా.. ప్ర‌భుత్వం త‌గు చ‌ర్చ‌లు ఎందుకు తీసుకోవ‌డం లేదు? ఇప్ప‌టికే యూపీలో రాత్రి క‌ర్ఫ్యూ విధించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల‌తో క‌ఠిన నిబంధ‌న‌ల దిశ‌గా కేసీఆర్ స‌ర్కారు ఆలోచ‌న చేస్తోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం ఒమిక్రాన్‌పై ఎలాంటి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోవ‌డాన్ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. క్రిస్మ‌స్ వేళ సామూహిక ప్రార్థ‌న‌లు చేస్తే.. ఒమిక్రాన్ వ్యాపించే ప్ర‌మాదం ఎక్కువ‌వుతుంద‌ని అంటున్నారు. న్యూఇయ‌ర్ టైమ్‌లో పార్టీలని వేడుక‌లు చేసుకుంటే.. మ‌రింత ముప్పు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.   తాజాగా, సీఎం జగన్‌రెడ్డిపై స్వామి పరిపూర్ణానంద తీవ్ర విమర్శలు చేశారు. గతంలో డెల్టా పేరుతో పండుగలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందని.. ఒమైక్రాన్ దృష్ట్యా క్రిస్మస్‌పై ఎందుకు ఆంక్షలు పెట్టడం లేదని ప్రశ్నించారు. హిందువుల పండుగలపైనే జగన్‌కి కరోనా గుర్తుకు వస్తుందా అని నిలదీశారు. హిందువుల పండుగలంటే జగన్‌కి చిన్నచూపని అన్నారు.  ఏపీలో పథకం ప్రకారం ఆలయాలపై దాడులు చేశారని స్వామి ప‌రిపూర్ణానంద‌ మండిపడ్డారు. అంతర్వేది ఘటన నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదని త‌ప్పుబ‌ట్టారు. పింక్ డైమండ్ అని ఎన్నికల ముందు అభూత కల్పన సృష్టించారని విమ‌ర్శించారు. నిజంగా పింక్ డైమండ్ ఉందా? లేదా? తేల్చాలని నిల‌దీశారు.   టీటీడీకి నిధులు కావాలంటే వేరే మార్గాలు ఎంచుకోవాలని.. స్వామి వారి మీద ప్రయోగాలు చేయడం తగదన్నారు. దేవుడి సేవలు అని చెప్పి డబ్బు సంపాదించడం మానేయాలని హితవు పలికారు. టీటీడీ లక్ష్యం వేదాన్ని రక్షించడమేనని పరిపూర్ణానంద తెలిపారు. 

వైఎస్ ర‌చ్చ‌బండ‌.. జ‌గ‌న్ ఒంట‌రి ప్రార్థ‌న‌...

క్రిస్‌మ‌స్ వ‌చ్చిందంటే చాలు.. వైఎస్ కుటుంబానికి పండ‌గే పండ‌గ‌. ఎందుకోగానీ ఈ మ‌ధ్య జ‌గ‌న్ గుళ్లుగోపురాలు గ‌ట్రా పోతున్నారు కానీ.. తాను వంద శాతం క్రిష్టియ‌న్ అని ఆయ‌న గ‌ర్వంగా చెప్పుకుంటారు. రాత్రిళ్లు జీస‌స్‌తోనూ మాట్లాడుతుంటార‌ని అంటుంటారు. డిసెంబ‌ర్ 25 వ‌చ్చిందంటే.. ఇడుపులపాయ ఎస్టేట్‌, పులివెందుల హౌజ్‌.. పండ‌గ వాతావ‌ర‌ణంతో వెలుగిపోతుంటుంది. వైఎస్సార్ ఉన్న‌ప్ప‌టి నుంచీ కుటుంబ స‌మేతంగా ఘ‌నంగా క్రిస్‌మ‌స్ జ‌రుపుకునేవారు. ఆయ‌న పోయారు. ఈయ‌న వ‌చ్చారు. వైఎస్సార్‌లానే జ‌గ‌నూ సీఎం అయ్యారు. ఇప్పుడు మ‌రోసారి క్రిస్మ‌స్ వ‌చ్చింది. కానీ, వైఎస్ కుటుంబం మునుప‌టిలా లేదు. మొత్తం చీలిపోయింది. జ‌గ‌న్‌కు అంతా దూర‌మ‌య్యారు. ఎవ‌రికి వారే.. వైఎస్ ఘాట్ ద‌గ్గ‌ర ఒంట‌రి నివాళే.  ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ ద‌గ్గ‌ర‌ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అయితే జగన్, షర్మిళ, విజయమ్మ ఎవరికి వారుగా వేర్వేరుగా నివాళులు అర్పించారు. గురువారం రాత్రి జ‌గ‌న్ వ‌చ్చి.. తండ్రికి నివాళులు అర్పించి వెళ్లిపోయారు. అనంత‌రం విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల వేరేగా వ‌చ్చి వైఎస్ ఘాట్ ద‌గ్గ‌ర కాసేపు గ‌డిపారు. అటు.. ఇడుపులపాయ చర్చిలో కూడా ఇదే సీన్‌. జగన్, విజయమ్మలు వేర్వేరుగా ప్రార్ధనలు నిర్వహించారు. వైఎస్ కుటుంబానికి ముఖ్య‌మైన క్రిస్మ‌స్ పండుగ.. ఇలా వారి కుటుంబ విభేదాల‌కు వేదికైంది. త‌ల్లిని దూరం పెట్టిన కొడుకుగా.. చెల్లిని దూరం చేసుకున్న అన్న‌గా.. జ‌గ‌న్‌రెడ్డి వైఎస్ కుటుంబంలో మ‌చ్చ‌గా మిగిలిపోతార‌ని అంటున్నారు.  ఇప్ప‌టికే బాబాయ్ వివేకానంద‌రెడ్డి హ‌త్య విష‌యంలో జ‌గ‌న్ ఆడుతున్న రాజ‌కీయం అంద‌రికీ తెలిసిందే. వివేకా కూతురు సునీత‌.. జ‌గ‌న్‌పై గుర్రుగా ఉన్నారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించ‌కుండా.. ఏళ్ల త‌ర‌బ‌డి ఆల‌స్యం చేయ‌డ‌మే కాకుండా.. పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌ధాన నిందితుల‌ను ర‌క్షిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. బాబాయ్ హ‌త్య‌తోనూ రాజ‌కీయాలు చేయాల‌ని చూస్తున్న జ‌గ‌న్‌పై.. మిగ‌తా వైఎస్ కుటుంబ స‌భ్యులు తీవ్ర అసంతృప్తితో, అస‌హ‌నంతో ఉన్నారు.  మిగ‌తా వారి విష‌యం వ‌దిలేసినా.. క‌న్న‌ త‌ల్లి.. సొంత చెల్లిలతోనూ జ‌గ‌న్ వైరం పెట్టుకోవ‌డం మ‌రీ దారుణ‌మంటున్నారు. కొడుకు కోసం ఊరూరా తిరిగింది త‌ల్లి విజ‌య‌మ్మ‌. అన్న కోసం రాష్ట్ర‌మంతా కాళ్లు అరిగిపోయేలా తిరుగుతూ.. గొంతు చించుకునేలా ప్ర‌సంగిస్తూ.. జ‌గ‌న్ త‌ర‌ఫున బ‌ల‌మైన వాయిస్ వినిపించారు ష‌ర్మిల‌. అలాంటి త‌ల్లిని.. ఇలాంటి చెల్లిని.. అంద‌ల‌మెక్కాక పక్క‌న‌పెట్టేశారు జ‌గ‌న్‌. అధికారం కోసం సొంత‌వారినే వ‌దిలించుకున్నారు. చెల్లి అన్న‌పై ఆగ్ర‌హంతో ఇల్లు వ‌దిలిపెట్టేసి.. మెట్టింటికి వెళ్లిపోయింది. త‌ల్లి సైతం కూతురు వెంటే. ఇక మిగిలింది జ‌గ‌న్ ఒక్క‌రే. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ఒంట‌రి జీవితం. ఇడుపులపాయ‌కు ఎప్పుడు వ‌చ్చినా అదే దైన్యం. వైఎస్ జ‌యంతి, వ‌ర్థంతిలే కాదు.. క్రిస్‌మ‌స్‌కూ వైఎస్ కుటుంబ క‌ల్లోలాలు, క‌ల‌హాలు.. బ‌హిర్గ‌త‌మ‌య్యేలా.. వైఎస్ ఘాట్.. ర‌చ్చ‌బండగా మారిందంటున్నారు.   

స్వగ్రామంలో జస్టిస్ ఎన్వీ రమణ.. పుల‌కించిన పొన్న‌వ‌రం..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడమంటే అంత ఆషా మాషీ కాదు. కృషి, పట్టుదల, అపార జ్జానం, రాజ్యాంగంపై గౌరవం, న్యాయవ్యవస్థపై నమ్మకం, న్యాయ వ్యవస్థ విధి విధానాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంటేనే కానీ ఆ పీఠాన్ని అధిరోహించ లేరు. అవన్ని పుష్కలంగా ఉన్న మన తెలుగు బిడ్డ జస్టిస్ ఎన్వీ రమణ.. తెలుగు నేలపై.. అదీ సొంత గడ్డపై అడుగుపెడుతోంటే.. ఆ ప్రాంత వాసుల్లో ఆనందం వెల్లి విరిసింది.   సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఎన్వీ ర‌మ‌ణ‌ తొలిసారిగా తన స్వగ్రామం.. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి విచ్చేశారు. ఆయ‌న రాక సంద‌ర్భంగా పొన్నవరంలో పండగ వాతావరణం నెలకొంది. పొన్నవరంలో దాదాపు నాలుగు గంటల పాటు ఉన్నారు. జస్టిస్ ఎన్వీ రమణకు పౌర సన్మానం చేశారు.  తమ గ్రామంలొ సామాన్య కుటుంబంలో పుట్టిన జస్టిస్ ఎన్వీ రమణ.. భారతదేశ అత్యున్నత స్థాయి పదవికీ ఎదగడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. జస్టిస్‌ ఎన్వీ రమణ బాల్యంలో కంచికచర్ల  పాఠశాలలో విద్యాబ్యాసం చేశారని.. ఆయన కుటుంబానికి స్థానికంగా పొలాలు కూడా ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. రెండేళ్ల క్రితం జస్టిస్ ఎన్వీ రమణ ... పొన్నవరానికి విచ్చేశారని.. అప్పుడు మూడు రోజుల పాటు ఉన్నార‌ని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అపూర్వ స్వాగతానికి పొన్నవరం గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఎన్వీ ర‌మ‌ణ‌. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అంటూ త‌న‌ ఉపన్యాసాన్ని ప్రారంభించారు. "పొన్నవరం చాలా చైతన్యం ఉన్న ఊరు. ఈ పల్లె ప్రజల ఆశీర్వచనాల కోసం వచ్చాను. నేను ఎక్కడకు వెళ్లినా నా ఊరు ఇదే అని మర్చిపోలేదు. నా చిన్నతనంలో ఏ రకంగా ఇబ్బంది పడలేదు. మా ఊరులో రాజు మాస్టర్ వీధి బడి ఉండేది. రాజు, మార్కండేయులు మాస్టర్లు ఏ నాడు దండించలేదు. మా ఊరులో ఏ రోజూ ఏ ఘర్షణ ఉండదు. కులమత తారతమ్యాలు ఇక్కడ ఉండవు. పుట్టిన ఊరుని, కన్నతల్లిని మరచిపోకూడదు."  "నాకు పదేళ్లు వచ్చే సరికే మా ఊర్లో మూడు ప్రధాన రాజకీయపార్టీలు ఉండేవి. మా తండ్రి కమ్యూనిస్ట్ భావజాలంతో ఉంటే నేను స్వాతంత్య్ర పార్టీకి మద్దతిచ్చా. చిన్నతనంలో ఎన్జీరంగా మీటింగ్‌లకు వెళ్లా. అప్పట్లో ఈ ప్రాంతం దుర్భిక్ష మెట్టప్రాంతంగానే ఉంది. నేటికి మా ప్రాంతం అనుకున్న అభివృద్ధి సాధించకపోవడం ఆవేదన కలిగిస్తోంది. ఢిల్లీలో తెలుగువాడినని చెపితే అక్కడివారు తమ ప్రాంతంలో పలు ప్రాజెక్ట్‌లు కట్టారని చెపుతారు. ఆఫ్గానిస్తాన్ లాంటి ప్రాంతంలో సైతం పార్లమెంట్‌ను నిర్మించిన ఘనత మన తెలుగు వాళ్లకు దక్కుతుంది. రైతులకు కనీస మద్దతు ధర, భూవివాదాలు వంటి ఇబ్బందులు అలాగే ఉన్నాయి." "దేశం అన్ని రంగాలలోనూ ముందుకెళ్తోంది. సమస్యలను అధిగమించాలంటే అందరూ కలిసి పనిచేయాలి. తెలుగుజాతి గొప్పతనం తెలిపేలా, గర్వించదగిన విధంగా ప్రవర్తించాలి. ఢిల్లీలో చాలా సభల్లో తెలుగువాడి గొప్పతనం గురించి మాట్లాడుకుంటారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ కూడా తెలుగు వారైనందుకు గర్వపడాలి" అని సీజేఐ ఎన్వీ రమణ పొన్న‌వ‌రం గ్రామ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. 

ఒమిక్రాన్ కంటే డెల్టానే డేంజర్.. భ‌యం వ‌ద్దు.. జాగ్ర‌త్త మ‌ర‌వ‌ద్దు..

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ భయాలు నెలకొన్నవేళ  ప్రపంచ ... ఒక శుభ వార్త.  ప్రపంచ పత్రికలు అన్నీ మోసుకొచ్చిన తీపి కబురు. కొవిడ్ 19 కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్‌’ భయ పెట్టినంత భయంకరం కాదు. అంతగా బాధించదు. అవును, డెల్టా వేరియంట్’తో పోలిస్తే ‘ఒమిక్రాన్‌’ అంతగా ప్రాణాంతకం కాదు. ఆసుపత్రి చికిత్స అవసరం లేకుండానే ‘ఒమిక్రాన్’ నుంచి బయట పడవచ్చును. ‘ఒమిక్రాన్‌’ ఎంత వేగంగా వ్యాప్తి చెందినా, అంతే వేగంగా నిర్వీర్యమై పోతుంది. ఒకే రోజున ‘ఒమిక్రాన్‌’ ప్రభావం అధికంగా ఉన్న విదేశీ పత్రికలో వచ్చిన వార్తలను గమనిస్తే, ఒమిక్రాన్, భయపెట్టినంతగా బాధించదు కోవిడ్ మహమ్మారి కాలం చేసే సమయం ఆసన్నమైందని పిస్తుంది. ‘ది గార్డియన్’ ,’న్యూ యార్క్ టైమ్స్’, వాల్ స్ట్రీట్ జర్నల్’, ‘ది వాషింగ్టన్ పోస్ట్’ ,ఇంకా అనేక  పత్రికలు ఏ పత్రిక చూసినా, కొవిడ్ ‘మహామ్మరి కథ ముగింపుకు వచ్చిందన్న సంకేతాలనే  ఇస్తున్నాయి. ముఖ్యంగా కొవిడ్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ విషయంగా అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్ట మవుతోంది.  ‘Risk of hospital stay is 40 % lower with Omicron variant, data shows’  రోజుకు లక్ష ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న యూకేలో నిర్వహించిన అధ్యయనంలో తేలిన సత్యమిది. ఈ నివేదికను, ‘ది గార్డియన్’  పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం, డెల్టా వేరియంట్’తో పోలిస్తే ‘ఒమిక్రాన్’ 20 నుంచి 25 శాతం తక్కువ ప్రభావం చూపుతుంది. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందవలసిన అవసరం డెల్టాతో పోలిస్తే 40 శాతం తక్కువగా ఉంటుంది. ఆసుపత్రి  చికిత్స అవసరం అయినా, అవుట్ పేషంట్’గానే కాని, ఆసుపత్రిలో చేరి రోజుల తరబడి చికిత్స తీసుకోవలసిన అవసరం అయితే ఉండదని  అధ్యయనంలో తేలిందని  నిపుణులు నిర్ధారించారు. అదే కథనాన్ని, ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ..’Omicron found  to pose lower illness risks’ అనే మకుటంతోప్రచురించింది. మకుటం ఏదైనా విషయం మాత్రం ఒకటే.. ఒమిక్రాన్’ అంత ప్రమాదకరం కాదు.  ‘అదొక్కటే కాదు, ‘ఒమిక్రాన్‌’ పుట్టిల్లు దక్షిణ అఫ్రికా’ లో ఒమిక్రాన్ కేసులు ఎంత వేగంగా పిపైకి పరుగులు తీశాయో.. అంత కంటే వేగంగా కిందికి దిగివచ్చాయి. దక్షిణాఫ్రికాలో  ఓమిక్రాన్ కదలికలపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయే విధంగా కొత్తగా నమోదవుతున్న కేసులు దిగి వస్తున్నాయి. గత గురువారం, 27 వేల  కొత్త కేసులు నమోదైతే, నాలుగు రోజుల్లో  కొత్త కేసులు 15వేలకు దిగివచ్చాయి .. అక్కడి నుంచి ఇప్పుడు ఉన్నాయంటే ఉన్నాయి అనే స్థాయికి దిగివచ్చాయి. అంటే ఒక వారం రోజుల్లోనే ఒమిక్రాన్  వచ్చినంత వేగంగా వెళ్ళిపోయిందని, శాస్త్ర వేత్తలు సంతోషం వ్యక్తరుస్తున్నారు. అంతేకాదు, ‘ఒమిక్రాన్‌’ వలన మరణాలు అంతగా సంభవించలేదు. ఆసుపత్రులలో చేరిన వారి సఖ్య కూడా చాలా స్వల్పంగానే ఉందని, శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్త పరుస్తున్నారు.   అదలా ఉంటే, అనేక వేరియంట్లుగా ప్రపంచాన్ని కబళించిన కరోనా మహమ్మారి కథ ముగింపుకు వచ్చిదా అంటే, అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఫైజర్ సంస్థ 'పాక్స్లోవిడ్' పేరుతో తయారు చేసిన మాత్ర కోవిడ్’ను యిట్టె పారదోలుతుందని అంటున్నారు. ఆమెరికా ఎఫ్డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్) ఈ మాత్రను అధికారికంగా ఆమోదించింది.కొవిడ్ బారినపడిన రోగులు ఈ మాత్రను తీసుకుంటే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం 90 శాతం తగ్గుతుంది. మరణం ముప్పు దాదాపు ఉండదు. ఇంతటి కీలక ఔషధాన్ని అమెరికావ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రోజుకు 2 లక్షలకుపైగా కేసులు వెలుగు చూస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితిలో ఫైజర్ మాత్ర గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తోంది.మరో వంక ఫైజర్ మాత్రతో పాటు మెర్క్ అభివృద్ధి చేస్తున్న కొవిడ్ మాత్ర కూడా ఒమిక్రాన్పై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏమీ కాదులే అనే భరోసా పనికి రాదని, భయం వదిలి జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.