సినిమా టికెట్ ధరలు పెరిగాయ్..
posted on Dec 24, 2021 7:54AM
సినిమా టికెట్లు భారీగా పెరగనున్నాయి. ఇందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకుంది. ఏసీ థియేటర్లలో కనిష్ఠం 50 రూపాయలు ఉండనుండగా.. గరిష్ఠం 150 రూపాయలు ఉండనుంది. మల్టీప్లెక్స్‌ల్లో కనిష్ఠం రూ.100.. గరిష్ఠం రూ.250గా వసూల్ చేసుకోవచ్చు. మల్టీప్లెక్స్‌ల్లో రిక్లైనర్ సీట్లకు గరిష్ఠంగా రూ.300గా నిర్దారించారు. టికెట్ ధరలకు జీఎస్టీ, నిర్వహణ చార్జీలు అదనం.
ఏపీలోని జగనన్న ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను భారీగా తగ్గిస్టే.. తెలంగాణ సర్కార్ మాత్రం సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. టికెట్ ధరలకు అదనంగా జీఎస్టీ, నిర్వహణ చార్జీలను కూడా వసూలు చేసుకునే అవకాశం కల్పించడంతో ప్రేక్షకులపై భారీగా భారం పడబోతోంది. టికెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరుతూ థియేటర్ల యజమానులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. థియేటర్లలో టికెట్ ధరల ఖరారుకు తెలంగాణ ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. సినీరంగ ప్రముఖులతో పలుదఫాలు చర్చలు జరిపిన అధికారుల కమిటీ చేసిన సిఫారసుల మేరకుప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.
అయితే, టికెట్లపై జీఎస్టీ, నిర్వహణ చార్జీలు, ఆన్‌లైన్ చార్జీలకు సంబంధించిన వివరాలను వేర్వేరుగా ప్రింట్ చేయాలని సూచించింది. నిర్వహణ చార్జీల కింద ఏసీ థియేటర్లలో టికెట్ పై రూ.5, నాన్-ఏసీలో టికెట్‌పై రూ.3 వసూలు చేసుకునేందుకు అనుమతించింది. ఉదాహరణకు.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న టికెట్లకు జీఎస్టీ అదనంగా వసూలు చేయట్లేదు. టికెట్ ధర రూ.200గా ఉంటే, ఆన్‌లైన్‌లో దానికి అదనంగా కన్వీనియెన్స్ ఫీ కింద రూ.25.31 వసూలు చేస్తున్నారు. కొత్త చార్జీలు అమల్లోకి వస్తే మల్టీప్లెక్స్‌ల్లో గరిష్ఠ ధర రూ.250కి అదనంగా జీఎస్టీ, ఆన్‌లైన్ టికెటింగ్ వసూలు చేసే కన్వీనియెన్స్ రుసుము, నిర్వహణ చార్జీలు కలుస్తాయి. దీంతో టికెట్ ధర భారీగా పెరిగిపోతుంది. నేరుగా థియేటర్లలో టికెట్ కొంటే కన్వీనియెన్స్ రుసుము తగ్గుతుందిగానీ.. జీఎస్టీ, నిర్వహణ చార్జీల భారం అలాగే ఉంటుంది.