అవనిగడ్డ... టీడీపీ గ్రౌండ్ రియాల్టీ..
posted on Dec 23, 2021 @ 2:28PM
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితిని బేరీజు వేయడానికి శాంపిల్‌గా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గాన్ని తీసుకుని విశ్లేషిస్తే అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. అవనిగడ్డ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలో రెండుసార్లు మాత్రమే టీడీపీ ఓడిపోయింది. వంగవీటి రంగా వేవ్ ఉన్న 1989లోనూ, వైఎస్సార్ వేవ్ వచ్చిన 2009లోనూ అవనిగడ్డలో టీడీపీదే గెలుపు. 1999, 2004లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గట్టెక్కింది. అది కూడా తెలుగుదేశం పార్టీలో నెలకొన్న లుకలుకల వల్లే. సింహాద్రి సత్యనారాయణ, సైకం అర్జునరావుల వర్గ పోరుతో ఆ సమయంలో పార్టీ తీవ్రంగా నష్టపోయింది. పార్టీ పరిస్థితులపై సమాచారం ఉన్నా హైకమాండ్ పట్టించుకోకపోవడంతో.. ఆ రెండు సార్లు చేతులారా అవనిగడ్డ స్థానాన్ని కాంగ్రెస్ కు కట్టబెట్టినట్లైంది. 2004లో ఓటమి తర్వాత హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగింది. రెండు గ్రూపులు కలిసి పనిచేసేలా చేయడంతో పాటు మూడో వ్యక్తిని బరిలోకి దింపింది. దీంతో 2009లో రాష్ట్రమంతా వైఎస్సార్ హవా వీచినా.. అవనిగడ్డలో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. నాయకత్వం సమిష్టిగా పని చేస్తే అవనిగడ్డలో టీడీపీని ఓడించడం అసాధ్యమని 2009 ఎన్నికలతో రుజువైంది.
అయితే 2014లో అవనిగడ్డలో మరో చారిత్రాత్మక తప్పిదం చేసింది టీడీపీ అధినాయకత్వం. దశాబ్దాల పాటు టీడీపీకి వ్యతిరేకంగా పని చేసిన మండలి బుద్ద ప్రసాద్ ను పార్టీలోకి తీసుకుంది. ఇది 2014 ఎన్నికల్లో కొంత లాభించినా.. ఆయన చేరిక ఎంత తప్పిదమో ఆ తర్వాత తెలిసొచ్చింది. పార్టీకి తీరని నష్టం కలిగించింది. 2014లో చంద్రబాబు వేవ్ లో గెలుపొందిన మండలి బుద్దప్రసాద్.. పార్టీ పుట్టిని ముంచేశారు. గ్రూప్ రాజకీయాలతో కోలుకోలేని దెబ్బ తీశారు. బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచాకా అవనిగడ్డలో టీడీపీ ముక్కలైపోయింది. స్థానిక నేతలను పట్టించుకోకపోవడంతో నియోజకవర్గంలో ఎక్కడికక్కడ గ్రూపులు తయారయ్యాయి. నియోజకవర్గ వ్యాపంగా టీడీపీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో గ్రూపులు తయారయ్యాయి. గ్రామాల్లోనూ విచ్చిన్నకర రాజకీయాలే.
అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం పని చేయాల్సిన మండలి బుద్ద ప్రసాద్.. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించిన కంఠమనేని రవిశంకర్ ను అణగదొక్కడంపైనే ఫోకస్ పెట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తలను పట్టించుకోకుండా రవిశంకర్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా పని చేశారు. దీంతో 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రవిశంకర్ పోటీ చేయడంతో టీడీపీకి బాగా డ్యామేజ్ జరిగింది. వైసీపీ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. బుద్ధ ప్రసాద్‌కు కాకుండా.. మిస్టర్ క్లీన్‌గా ముద్రున్న.. సోషల్ సర్వీస్‌లో ముందున్న రవిశంకర్‌కు టీడీపీ టికెట్ ఇచ్చుంటే.. 2019 ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ ఈజీగా విజయం సాధించేదని స్థానికుల మాట. టీడీపీలో బుద్ధ ప్రసాద్ ఆధిపత్య రాజకీయాలే తమకు కలిసి వచ్చిందని వైసీపీ కూడా భావిస్తోంది. మండలి కాకుండా, రవిశంకర్ టీడీపీ నుంచి పోటీ చేసుంటే తాము ఓడిపోయి ఉండేవారమని వైసీపీ నేతలు ఇప్పటికీ అంటుంటారు. ఇలా, అవనిగడ్డ సీటు వైసీపీ ఖాతాలో పడటానికి మండలి బుద్దప్రసాద్ వ్యవహార శైలితో పాటు టీడీపీ అధినాయకత్వం తీరే కారణమనేది తమ్ముళ్ల భావన.
ఇక, 2019 ఎన్నికల తర్వాత మండలి బుద్దప్రసాద్ కనిపించకుండా పోయారు. ఆయన ఎక్కడున్నారో పార్టీ నేతలకు కూడా తెలియని పరిస్థితి. తెలుగు మహాసభలు, కవులు, కళాకారుల కార్యక్రమాల్లో తప్ప రాజకీయ వేదికల్లో ఎక్కడా అడ్రస్ లేకుండా పోయారు. టీడీపీ కార్యకర్తలను కనీసం పట్టించుకోవట్లేదు. చివరకు పార్టీ అధినేత సతీమణిని అసెంబ్లీలో ఘోరంగా అవమానించినా కనీసం స్పందించలేదు. నిజానికి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలే చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని నీచంగా టార్గెట్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లాకు చెందిన నేతలు తీవ్రంగా స్పందించాలి. తెలుగు భాష అంటూ గొప్పలకు పోయే బుద్ధ ప్రసాద్‌లాంటి వాళ్లు భువనేశ్వరి ఎపిసోడ్‌లాంటి సున్నిత అంశంలో స్పందించకపోవడం దారుణం. నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉన్నా.. కార్యకర్తలను సమీకరించి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడంలో మండలి బుద్దప్రసాద్ పూర్తిగా విఫలమయ్యారు.
పలు అంశాల్లో, జగన్ ఆగడాలపై ఎప్పటికప్పుడు స్పందించాల్సిన అవనిగడ్డ నేతలు.. ఎప్పుడూ సైలెంటుగా ఉండిపోతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి. యరపతినేని అధికారంలో లేకపోయినా డైనమిక్‌గా పాలిటిక్స్ చేస్తూ.. వైసీపీకి చెక్ పెడుతున్నారు. మరి, అవనిగడ్డలో మండలి ఏం చేస్తున్నారు? పక్క జిల్లాలో వేలాది మందితో ఆందోళన చేస్తే.. అవనిగడ్డలో కనీసం పది మంది కార్యకర్తలను కూడా సమీకరించలేని చేతగానితనం మండలి బుద్దప్రసాద్‌ది. ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవని ఇప్పటికే తేలిపోయింది. నలుగురు డబ్బా కొట్టేవాళ్లను పక్కన పెట్టుకుని, కార్యకర్తలను పట్టించుకోకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయని.. ఆయన తీరు టీడీపీకి ఏమాత్రం పనికిరాదని అంటున్నారు. పార్టీ నేతలందరిని ఒకేతాటిపై నడిపించడం, కార్యకర్తలకు అండగా నిలబడితేనే పార్టీకి ప్రయోజనం. మండలి లాంటి వాళ్లు టీడీపీకి ఏమాత్రం ఉపయోగం లేదని స్థానికంగా పెదవి విరుస్తున్నారు.
అవనిగడ్డ లాంటి పార్టీకి గట్టి పట్టున నియోజకవర్గంలో పరిస్థితులు చేజారిపోతున్నా అధినాయకత్వం పట్టించుకోకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా, రాష్ట్ర నాయకత్వాలు మేల్కోని నియోజకవర్గంలో ఎవరితో పార్టీకి నష్టం? ఎవరి వల్ల ఉపయోగం? అన్న నిజాలు తెలుసుకోవాలని టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు. ఎవరికి టికెట్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందో అంచనా వేసి.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే పార్టీకి మరోసారి భంగపాటు తప్పదని అవనిగడ్డ తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ అధినాయకత్వం అప్రమత్తమై.. అవనిగడ్డలో సరైన నేతను ప్రోత్సహించాలని.. గతంలో చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని.. ఈసారి గెలుపు గుర్రాన్నే బరిలో దించాలని.. నియోజకవర్గ ప్రజలు సూచిస్తున్నారు. మార్పు మంచికే అంటున్నారు.
'మెగా' షాక్!.. దిగ్గజానికే దిక్కులేదా? జగనన్నా మజాకా!