బండి సంజయ్ వల్లే టీఆర్ఎస్ గెలిచిందా?
posted on Dec 23, 2021 @ 4:00PM
ఇటీవల జరిగిన కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు హాట్ హాట్ గా జరిగాయి. టీఆర్ఎస్ కు పోటీగా ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి బరిలో నిలిచారు కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డైరెక్షన్ లోనే రవీందర్ సింగ్ పోటీ చేశారని.. ఆయనకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చాయనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీని రవీందర్ సింగ్ ఓడించబోతున్నారని ఈటల పదే పదే చెప్పడంతో... ఆయన గెలుపు కోసం ఈటల తెరవెనుక గట్టిగానే ప్రయత్నాలు చేశారని భావించారు. బీజేపీ, కాంగ్రెస్ కు దాదాపు 380 ఓట్లు ఉండటంతో రవీందర్ సింగ్ గెలవొచ్చనే అంచనాలు వచ్చాయి.
కాని ఫలితాల రోజు సీన్ మారిపోయింది. కరీంనగర్ జిల్లాలోని రెండు సీట్లను అధికార పార్టీ గెలుచుకోవడంతో పాటు.. వాళ్లకు ఉన్న బలం కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. కారు పార్టీకి అఫిషయల్ గా 980 ఓట్లు ఉండగా.. కొందరు ఈటలతో కలిసి బీజేపీలో చేరారు. దీంతో దాదాపు 906 ఓట్లు టీఆర్ఎస్ కు ఉన్నాయని లెక్క కట్టగా... ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీ అభ్యర్థులకు ఏకంగా 1061 ఓట్లు వచ్చాయి. ఇదే సంచలనమైంది. అధికార పార్టీకి క్రాస్ ఓటింగ్ జరిగి ఒక అభ్యర్థి ఓడిపోతారనే ప్రచారం జరిగితే.. ఏకంగా వంద ఓట్లు ఎక్కువ రావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
కారుకు పడిన అదనపు ఓట్లు ఎవరివి?కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ కు జై కొట్టారా? లేక బీజేపీ ఓటర్లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారా? అన్న చర్చలు సాగుతున్నాయి. తమ అభ్యర్థి లేకున్నా కాంగ్రెస్ పార్టీ క్యాంపు నిర్వహించింది. దీంతో కాంగ్రెస్ క్యాంపులో ఉన్న ఓటర్లు కారుకు ఓటేశారని భావించారు. అయితే మంత్రి గంగుల కమలాకర్ మాత్రం బీజేపీ ప్రతినిధులు తమకు మద్దతు ఇచ్చారంటూ బాంబు పేల్చారు. కమలాకర్ వ్యాఖ్యలపై కమలం పార్టీ నేతలు స్పందించలేదు. అంతేకాదు ఎక్స్ అఫిషియో ఓటరుగా ఉన్నా బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటేయలేదు. దీంతో బండి వర్గం ఏదో తేడా చేసిందనే ప్రచారం కరీంనగర్ జిల్లా బీజేపీలో జరిగింది. రవీందర్ సింగ్ ను ఈటల రాజేందర్ నిలబెట్టాడు కాబట్టి... ఆయనకు సంజయ్ వర్గం సహకరించలేదనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈటలకు చెక్ పెట్టడానికే రవీందర్ సింగ్ ఓడిపోయేలా బీజేపీలోని ఓ వర్గం ప్రయత్నించిందనే చర్చ జరిగింది.
తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన సర్దార్ రవీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసి మరింత కాక రాజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు ఓటు వెయ్యలేదని రవీందర్ సింగ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ కాంప్‌లకు బీజేపీ కార్పొరేటర్లు వెళ్తే చర్యలు తీసుకున్నారా అని నిలదీశారు. బీజేపీ నుంచి ఆరు ఓట్లు టీఆర్‌ఎస్‌కు వస్తాయని గంగుల కమలాకర్ చెప్తే.. బండి సంజయ్ ఖండించలేదన్నారు. స్మార్ట్ సిటీ అవకతవకలపై ఎంపీ బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు పార్టీని కాపాడుకో సంజయ్ అంటూ రవీందర్ సింగ్ హితవుపలికారు. బండి సంజయ్ ను ఉద్దేశించి రవీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో సెగలు రేపుతున్నాయి. ప్రచారం జరుగుతున్నట్లుగానే బండి సంజయ్ వర్గం రవీందర్ సింగ్ కు సహకరించలేదా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
మరోవైపు బీజేపీలో చేరాలని భావించిన సర్దార్ రవీందర్ సింగ్ మనసు మార్చుకున్నారని.. అందుకే ఆయన బండి సంజయ్ ను టార్గెట్ చేశారని అంటున్నారు. కరీంనగర్ నగరానికి చెందిన రవీందర్ సింగ్ చేరికను సంజయ్ అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఆ కోపంతోనే రవీందర్ సింగ్ అతన్ని టార్గెట్ చేశారని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలతో రవీందర్ సింగ్ చర్చలు జరుపుతున్నారని కూడా అంటున్నారు. అయితే ఈటల రాజేందర్ మద్దతుదారుడిగా రవీందర్ సింగ్ బీజేపీలో చేరుతారా.. లేక బండి సంజయ్ తో తనకు సరిపోదని కాంగ్రెస్ కు జై కొడతారా అన్నది చూడాలి మరీ..