కేఏ పాల్ చేసిన ఆరు గొప్ప పనులు.. అవేంటో తెలుసా...
posted on Dec 23, 2021 @ 5:29PM
కేఏ పాల్. ఎవరికీ అర్థంకాని పీస్. ప్రపంచ గతినే మార్చేస్తానంటారు. ప్రముఖులనే శాసిస్తానని చెబుతారు. మనకు తెలీదు గానీ.. తాను చేసిన, చేస్తున్న ఘనకార్యాలు చాలానే ఉంటాయని బాకా మోగిస్తుంటారు. ఎవరి వల్లా కాని పనులు.. తన వల్లే సాధ్యం అంటారు. చూట్టానికి, వినటానికి కామెడీగా ఉన్నా.. పబ్లిక్‌కు ఫుల్ టైంపాస్. టీవీ ఛానెల్స్‌కి ఫుల్ రేటింగ్ పాయింట్. ఎవరికీ కనిపించరు.. ఎక్కడ ఉంటారో తెలీదు.. సడెన్‌గా ఊడిపడతారు. టీవీ షోల్లో ప్రత్యక్షమవుతుంటారు. లేటెస్ట్‌గా ఓ టీవీ చానల్లో మాట్లాడారు. నిజమో కాదో తెలీదు కానీ.. ఇటీవల కాలంలో తాను చేసిన కొన్ని గొప్ప పనుల గురించి చెప్పారు. అవేంటో కేఏ పాల్ మాటల్లోనే....
1. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్నిఎత్తేయించా. దేశంలో 70 శాతం మంది రైతులు ఉన్నారు. వారి శ్రేయస్సు కోసం ఏ పార్టీ ముందుకు రాకపోతే.. నేను ఓపెన్ గా రంగంలోకి దిగి.. ఢిల్లీ వచ్చి పెద్ద వాళ్లను కలిశా. కేంద్ర వ్యసాయ మంత్రి రూపాలాగారు ఢిల్లీ సింగ్రిల్లా హోటల్ లో నా దగ్గరకు వచ్చారు. మూడు చట్టాలు వెనక్కి తీసుకునేలా చేశా.
2. ఫేస్ బుక్, ట్విటర్ ను బ్యాన్ చేస్తానని కేంద్రం నోటీసులు ఇస్తే.. సుప్రీంకోర్టుకు వెళ్లి ఫైట్ చేశా. కపిల్ సిబల్ ను లాయర్ గా పెట్టుకొని న్యాయం కోసం పోరాడా. ఫేస్ బుక్.. ట్విటర్.. వాట్సాప్ లేకుంటే మొత్తం దేశానికి ఇబ్బంది అని ఫైట్ చేశా.
3. మూడున్నర లక్షల కోట్లు విలువైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను మూడున్నర వేల కోట్లకు అమ్మేస్తున్నారంటే.. నా సొంత స్టీల్ ప్లాంట్ లా ఫీల్ అయ్యా. నేను పుట్టిన విశాఖకు అన్యాయం జరుగుతుందని భావించా. కోర్టుకు వెళ్లి కేసు పెట్టా. మా వాళ్లను పంపించా. అప్పట్లో శివాజీ మాట్లాడుతూ.. కేఏ పాల్ మాత్రమే దీన్ని అపగలరన్నారు.
4. పది, ఇంటర్ పరీక్షలు ఎవరైనా కరోనా వేళలో పెడతారా? ఈ ఏపీ ముఖ్యమంత్రి తప్పించి. వయసులో పదేళ్లు చిన్నోడు అయినప్పటికీ ఆయన్ను కలవటానికి వెళ్లా. కానీ.. ఆయన కలవనన్నారు. పరీక్షలు నిర్వహించకూడదని నిరాహార దీక్ష చేశా. 20-30 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు జరగకుండా చేశా. పరీక్షలు జరిగితే కరోనా కేసులు ఎంత భారీగా పెరిగేవి? నా కారణంగా ఆంధ్రులకు మేలు కలిగేలా చేశా.
5. 2019 ఎన్నికలు అయ్యాక ఒక డైరెక్టర్ ఓ పిచ్చి సినిమా తీశాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టటానికి. ఇంత మంది ఉన్నారు ఎవరైనా కోర్టుకు వెళ్లారా? ఫైట్ చేశారా? నెల రోజుల్లో ఫైట్ చేసి.. 16 ఎడిట్లు చేయించి.. టైటిల్ మార్పించా. ఆ సినిమా తీసినోడి మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చేశా.
6. కరోనా టైంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వందలాది స్వచ్చంద సంస్థల్ని మూసేశాయి. పలు క్రిస్టియన్ సంస్థలు ఉన్నాయి. అమిత్ షాతో ఫైట్ చేసి..రూపాలాతో మాట్లాడి.. 30 వేల ఎన్జీవో సంస్థల మీద పెట్టిన పరిమితుల్ని ఎత్తేయించా. దాని కారణంగా ఐదు కోట్ల మంది సిబ్బందికి ఉపాధిని కల్పించిన వాడినయ్యా.
ఇలా.. ఇటీవల కాలంలో తాను చేసిన గొప్ప పనుల ఇవేనంటూ కేఏ పాల్ చెప్పుకొచ్చారు. వినేవాళ్లు ఉంటే.. కేఏ పాల్ ఎన్నైనా చెబుతారు అని అందుకే అంటారు.