ఉత్తరాఖండ్ లో రావత్ హ్యాండ్సప్.. మరి, తెలంగాణ రేవంత్?
posted on Dec 23, 2021 @ 1:20PM
మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలిందా? మరో పెద్ద కష్టం వచ్చి పడిందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. వచ్చే సంవత్సరం (2022) ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఉత్తరాఖండ్ ఒక్కటే. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని పుష్కలంగా మూట కట్టుకుంది. ఐదు నెలల్లో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చినా ఫలితం లేకుండా పోయింది. అదీకాక, ఉత్తరాఖండ్’ లో బీజేపీ కాదంటే కాంగ్రెస్ తప్ప మరో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అయితే, కాంగ్రెస్ పార్టీలో సయోధ్యత ఏక పోవడంతో ఈ అవకాశాన్ని కూడా హస్తం చేజార్చుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎన్నికల ప్రచార సారధి, హరీష్ రావత్ చేతులెత్తేశారు. సంస్థాగత సహకారం లేకుండా ప్రచార బాధ్యతలు నిర్వర్తించడం తనవల్ల కాదని స్పష్టం చేశారు. పార్టీ సహాకారం లేక ఎన్నికల మహా సముద్రాన్ని ఈదడం తన వల్ల కావడం లేదని ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్త పరిచారు. గాంధీల కుటుంబానికి అత్యంత నమ్మకస్థుడు, పార్టీలో ట్రబుల్‌షూటర్‌గా పేరున్న సీనియర్ నాయకుడు హరీశ్ రావత్ తొలి సారిగా కాంగ్రెస్ అధిష్ఠానంపై బహిరంగంగానే అసంతృప్తి గళం వినిపించారు. హై కమాండ్ నుంచి తనకు సరైన సహకారం లభించడం లేదంటూ వరుస ట్వీట్లలో ఆరోపించారు. తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి, అన్నట్లుగా పార్టీ వదిలేసిందని ఆయన అవేదన వ్యక్తపరిచారు. ఇంతవరకు చేసింది చాలు ఇక విశ్రాంతి తీసుకోమని అంతరాత్మ ప్రభోదిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. అంటే, పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాననికొంచెం కష్టంగానే మనసులోని బాధను,భావాన్ని ట్వీట్ ద్వారా వ్యక్తపరిచారు. హరీష్ రావత్ ట్వీట్ చేసింది, ఉత్తరాఖండ్ గురించే అయినా, తెలంగాణ సహా కాంగ్రెస్ పార్టీ పునర్జీవనానికి ఇంకా అవకాశం ఉన్న చాలా వరకు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సరైన సమయంలో పార్టీ అధిష్టానం సరిగా స్పందించక పోవడం వల్లనే, పార్టీ నాయకులు ప్రత్యాన్మాయం వైపు చూస్తున్నారని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ పనితీరుపట్ల రావత్, చేసిన ట్వీట్ అలోచింప చేసేలా వుందని అంటున్నారు. రావత్ హిందీలో చేసిన ట్వీట్ లో ‘‘ఇది వింతగా అనిపిస్తోంది కదూ..! ఎన్నికలనే మహా సముద్రంలో నేను ఈదుతున్నాను. ఇలాంటి సమయంలో సంస్థ(పార్టీ అధిష్ఠానాన్ని ఉద్దేశించి) నాకు అండగా ఉండాల్సింది మాని.. ప్రతికూల పాత్ర పోషిస్తోంది. అధికారంతో కొందరు ఇక్కడ మొనళ్లను(మోసగాళ్లను) వదిలిపెట్టారు. పెద్దల ఆదేశాలతో నేను ఈ సముద్రంలో ఈదుతుంటే, వాళ్ల నామినీలు మాత్రం నా కాళ్లు, చేతులు కట్టేయాలని చూస్తున్నారు. ఇదంతా చూస్తూ నా మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. హరీశ్ రావత్ ఇక చాలు..! చాలా కాలం నుంచి ఈదుతున్నావ్.. ఇక విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది.. అని నా అంతరాత్మ చెబుతున్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం నేను ఇదే డైలమాలో ఉన్నాను. కొత్త సంవత్సరం నాకో కొత్త మార్గం చూపిస్తుందని ఆశిస్తున్నా’’ అని రావత్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు పరోక్షంగా ప్రకటించారు.అంటే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని చెప్పకనే చెప్పారు.
ఉత్తరాఖండ్ కాంగ్రెస్‌లో రావత్ అత్యంత కీలక నేత. గతంలో 2014 నుంచి 2017 వరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అంతుకుముందు ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్రమంత్రిగానూ వ్యవహరించారు. కాబట్టి రావత్ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బగానే పరిశీలకులు భావిస్తున్నారు. రావత్ కేవలం బాధ్యతల నుంచి తప్పు కుంటారా, రాజకీయ సన్యాసమే స్వీకరిస్తారా? ఇంకో పార్టీలో చేరి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా అన్నది పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఒక్క రావత్ నే కాదు, రేవంత్ వంటి సత్తా ఉన్న నాయకుల కాళ్ళు చేతులు కట్టేస్తున్న సో కాల్డ్ సీనియర్స్,ను కట్టడి చేయకుండా వదిలేసి, వారిని నిర్వేదానికి గురి చేస్తోంది. ఈరోజు రావత్ అయితే రేపు రేవంత్ కావచ్చును, కానీ చివరకు నష్ట పోయేది మాత్రం కాంగ్రెస్ పార్టీనే అంటున్నారు విశ్లేషకులు.