ఒకటి కాదు రెండు.. జగన్‌పై పరిటాల డబుల్ బ్యారెల్ గన్..
posted on Dec 23, 2021 @ 7:23PM
పరిటాల. ఈ పేరు వింటేనే అనంతపురంలో కొందరికి పూనకం వస్తుందంటారు. అక్కడ అనేక గ్రామాల్లో రవీంద్ర అభిమానులు ఉంటారు. ఇప్పటికీ పలు ఊళ్లు వాళ్ల ఏలుబడిలోనే ఉన్నాయంటారు. అవన్నీ టీడీపీకి పట్టున్న ప్రాంతాలే. పరిటాల కుటుంబానికి పెట్టని కోటలే. కానీ.. జగన్ వేవ్‌లో గత ఎన్నికల్లో రాప్తాడులో పరిటాల వారసుడు శ్రీరాం ఓడిపోవడం షాకింగ్ పరిణామమే. ఏళ్లుగా ఒకే పార్టీ, ఒకే కుటుంబం అధికారంలో ఉండటమో.. వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇద్దామని అనుకోవడమో.. కారణం ఏదైనా రాప్తాడులో టీడీపీ-పరిటాల ఓడిపోవడం సంచలనమే. అయితే, ఓటమి ఒక్కసారికే పరిమితం చేయాలని పరిటాల కుటుంబం గట్టిగా డిసైడ్ అయినట్టుంది. ఈసారి ఒక్క సీటు ఓడినందుకు.. వచ్చేసారి రెండు స్థానాలు కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టే.. నియోజకవర్గాల పంపకాలు జరిగిపోయాయి. తమకు పోటీగా ఎవరూ రాకుండా వార్నింగులు గట్రా వచ్చేశాయి.
రాప్తాడు నుంచి శ్రీరాం ప్లేస్‌లో సునీత పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ధర్మవరానికి పరిటాల శ్రీరాం షిఫ్ట్ కానున్నారు. ధర్మవరం నాదే.. ఎవరు వచ్చినా వదిలేదే లే.. అంటూ శ్రీరాం బహిరంగ హెచ్చరిక చేసేశారు. ప్రస్తుతం ఆయన ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిన సూర్యనారాయణ ఆ తర్వాత బీజేపీలో చేరడంతో శ్రీరాంకు ధర్మవరం పార్టీ బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. రెండేళ్లుగా పరిటాల వారసుడు ధర్మవరంలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే, పార్టీని వీడిన సూర్యనారాయణ మళ్లీ టీడీపీలో చేరి 2024లో పోటీ చేస్తారంటూ స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అది తెలిసి.. ఆలస్యం చేయకుండా ఆ ప్రచారానికి, సూర్యనారాయణకి చెక్ పెట్టేలా.. పరిటాల శ్రీరాం తనదైన స్టైల్‌లో పొలిటికల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
2024లో ధర్మవరంలో టీడీపీ నుంచి పోటీ చేసేది తానేనని.. ఒకవేళ అలా జరగకపోతే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడం కలకలం రేపింది. ఎవరో వస్తారు.. పోటీ చేస్తారు అంటూ జరిగే ప్రచారాన్ని నమ్మొద్దంటూ శ్రీరాం అల్టిమేటం జారీ చేశారు. ఈ ఒక్క ప్రకటనతో ధర్మవరం సీటు తనదేనని తేల్చేశారు. ఇటు మళ్లీ టీడీపీలో చేరాలనుకున్న సూర్యనారాయణతో పాటు.. అటు పరోక్షంగా చంద్రబాబుకు సైతం ధర్మవరం టికెట్ తనకే ఇవ్వాలనే మెసేజ్ ఇచ్చారని అంటున్నారు. పార్టీలోకి ఎవరైనా రావొచ్చు.. అందరికీ ఆహ్వానం.. కానీ ధర్మవరం టికెట్ మాత్రం ఆశించొద్దు అనేలా శ్రీరాం శాసనం చేసినట్టేనని చెబుతున్నారు. ఇలా, రాప్తాడులో పరిటాల సునీత.. ధర్మవరంలో పరిటాల శ్రీరాం.. టీడీపీ తరఫున బరిలో నిలిచేందుకు.. ఎలాగైనా గెలిచి తీరేందుకు.. సై అంటే సై అంటున్నారు. ఒకటి ఓడినందుకు.. రెండు గెలిచి చూపించి.. జగన్‌పై రాజకీయంగా డబుల్ బ్యారెల్ గన్ ఎక్కుపెట్టేందుకు రెడీ అవుతోంది పరిటాల ఫ్యామిలీ. పరిటాల వారసుడిగా శ్రీరాం ధర్మవరం ఎంట్రీ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.