కట్టలకు కట్టలు.. అవినీతి నోట్ల గుట్టలు.. లెక్కిస్తే 150 కోట్లు..
posted on Dec 24, 2021 @ 11:42AM
ఓ వ్యాపారి ఇంట్లో ఐటీ రైడ్స్. తనిఖీలు కామనే అయినా.. అక్కడ కనిపించిన సీన్ మాత్రం అస్సలు కామన్ కానే కాదు. బ్లాక్‌మనీని ఎవరైనా బినామీల పేరు మీదగానో.. ప్రాపర్టీ.. బంగారం.. ఇళ్లు.. రూపంలోనో దాచుకుంటారు. కానీ, ఆ వ్యాపారి మాత్రం అంతా క్యాష్‌లోనే దాచేసుకున్నాడు. అది కూడా తన ఇంట్లోనో. ఓకే.. ఏదో దాచుకున్నాడే అనుకుందాం.. సినిమాల్లో చూపించినట్టు ఏ రహస్య గదిలోనే, సీలింగ్‌లోనో, డ్రైనేజ్ పైపుల్లోనో దాచుకోవాలి కానీ.. ఎంచక్కా.. రెండు బీరువాల్లో బట్టలు సర్దినట్టు.. నోట్ల కట్టలను సర్దేసి.. నీట్‌గా ప్యాక్ చేసి.. ఇంట్లోనే పెట్టుకున్నాడు. తన ఇంటిపై ఐటీ రైడ్స్ జరగవనే ధీమానో.. మరేంటో కానీ.. కాన్పూర్‌కు చెందిన పర్ఫ్యూమ్ తయారీ సంస్థ యజమాని, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అయిన పీయూష్ జైన్ ఇంట్లో జరిగిన ఐటీ రైడ్స్‌లో ఏకంగా 150 కోట్లు నగదు రూపంలో బయటపడింది. పెద్ద నోట్లు రద్దు చేసి.. మరింత పెద్ద నోట్లు తీసుకొచ్చింది ఇలాంటి వారి కోసమే కాబోలు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హెటిరో డ్రగ్స్ సంస్థల్లో ఐటీ దాడుల సమయంలోనూ ఇలానే బీరువాల్లో వందల కోట్ల నోట్ల కట్టలు బయటపడ్డాయి. సేమ్ టూ సేమ్ అలానే.. యూపీ ఎలక్షన్స్‌కు ముందు కాన్పూర్‌లో ఎస్పీ లీడర్ పీయూష్ జైన్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఆయనకు చెందిన పర్ఫ్యూమ్ తయారీ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ సంస్థ యజమాని పీయూష్ జైన్ ఇంటికి ఐటీ అధికారులు వెళ్లారు. ఇంట్లో సోదాలు జరుపుతూ అనుమానస్పదంగా కన్పించిన రెండు అల్మారాలను తెరిచి చూడగా.. వాటి నిండా నీట్‌గా ప్యాక్ చేసిన కరెన్సీ నోట్ల కట్టలు కన్పించాయి. అధికారులు వెంటనే బ్యాంక్ అధికారులను పిలిపించి నోట్లను లెక్కించారు. గురువారం సాయంత్రం నుంచి క్యాష్ కౌంటింగ్ కొనసాగగా.. శుక్రవారం ఉదయానికి రూ.150 కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న జీఎస్‌టీ అధికారులు కూడా ఆయన నివాసానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆ సొమ్మంతా నకిలీ ఇన్‌వాయిస్‌లు, ఈవే బిల్లులు లేకుండా రవాణా చేసిన సరకుకు సంబంధించినదిగా అధికారులు గుర్తించారు. సూట్‌కేస్ కంపెనీల ద్వారా నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించి జీఎస్‌టీ, పన్ను చెల్లింపులు ఎగ్గొట్టినట్లు దర్యాప్తులో తేలింది. పీయూష్ ఇంటితో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌లలోని ఆయన కార్యాలయాలు, గోదాముల్లోనూ ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి.
వ్యాపారి పీయూష్ జైన్.. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ పేరుతో పీయూష్ ఓ ప్రత్యేక పర్ఫ్యూమ్‌ను కూడా రిలీజ్ చేశారు. నోట్ల కట్టలను అధికారులు లెక్కిస్తున్న ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘ఎస్పీ అవినీతి వాసన’ ఇది అంటూ వైరల్ చేస్తోంది.