హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. 30 మంది ఐపీఎస్ ల బదిలీ
posted on Dec 25, 2021 8:29AM
న్యూఇయర్ కు ముందు తెలంగాణ సర్కార్ భారీ ఎత్తున ఐపీఎస్ బదిలీలు చేపట్టింది. మొత్తంగా 30 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న అంజనీకుమార్‌ను అవినీతి నిరోధకశాఖ డీజీగా బదిలీ చేసింది. ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన సీవీ ఆనంద్‌ను ఆయన స్థానంలో హైదరాబాద్ సీపీగా నియమించింది. సిద్దిపేట, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు, 11 జిల్లాల ఎస్పీలను బదిలీ చేయగా, నారాయణపేట ఎస్పీ చేతనకు ఎలాంటి పోస్టు కేటాయించలేదు. ఒకటి రెండు రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ కొత్త సీపీగా నియమితులైన సీవీ ఆనంద్ ఏప్రిల్ 2018లో కేంద్ర సర్వీసులకు వెళ్లి మూడున్నర నెలల కిందట తిరిగి తెలంగాణ కేడర్‌కు బదిలీపై వచ్చారు. అంతకుముందు ఆయన సైబరాబాద్ సీపీగా పని చేశారు. సైబరాబాద్ విభజన తర్వాత.. ఆయనను హైదరాబాద్ సీపీగా నియమిస్తారనే ప్రచారం జరిగింది. కాని ఆయనకు అప్పుడు సివిల్ సప్లయ్ కమిషనర్ గా నియమించింది. తర్వాత ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లాకరు.
ఇప్పుడాయనకు హైదరాబాద్ సీపీగా కీలక బాధ్యతలు అప్పగించారు. సుదీర్ఘకాలంగా రాచకొండ కమిషనర్‌గా ఉన్న మహేశ్ భగవత్‌ను మాత్రం అక్కడే ఉంచారు.
డీసీపీలుగా ఉంటూ పనిచేస్తున్న చోటే డీఐజీలుగా పదోన్నతులు పొంది కొనసాగుతున్న ఏఆర్ శ్రీనివాస్, ఏవీ రంగనాథ్, కార్తికేయ, అవినాశ్ మహంతికి చాలా కాలం తర్వాత కొత్త పదవులు దక్కాయి. నాన్ కేడర్ ఎస్పీలుగా ఉంటూ మూడు రోజుల కిందట ఐపీఎస్‌లుగా పదోన్నతులు పొందిన కోటిరెడ్డి, కేఆర్ నాగరాజ్, ఉదయ్ కుమార్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, మనోహర్, శిల్పవల్లి వంటి అధికారులకు కీలక పోస్టులు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ స్థాయిలో బదిలీలు చేపట్టడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి.