భారత్ లో ఫిబ్రవరిలో థర్డ్ వేవ్ పీక్స్! ఐఐటీ పరిశోధకుల సంచలన రిపోర్ట్..
posted on Dec 25, 2021 8:44AM
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో వేగంగా విస్తరిస్తూ కలవరం రేపుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 400కు దగ్గరలో ఉన్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సంబరాలతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్న భావన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లో ఒమిక్రాన్ తీవ్రతపై ఐఐటీ కాన్పూర్ తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో కరోనా మూడో వేవ్ 2022 ఫిబ్రవరి మొదటి వారం నాటికి దేశంలో కరోనా మూడో వేవ్ పతాకస్థాయికి చేరుతుందని ఆ అధ్యయనంలో అంచనా వేశారు. భారత్ లో తొలి రెండు కరోనా వేవ్ ల సమయంలో నమోదైన కేసులు సంఖ్యను గసియాన్ మిశ్రమ నమూనా విధానంలో గణించిన ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు ఈ నిర్ణయానికి వచ్చారు.
ప్రపంచంలో ఇప్పటికే బ్రిటన్, అమెరికా, రష్యా, జర్మనీ వంటి దేశాల్లో కరోనా థర్డ్ వేవ్ గరిష్ట స్థాయిలో నడుస్తోంది. ఈ సందర్భంగా ఆయా దేశాల కరోనా కేసుల సరళిని కూడా పరిశీలించారు. భారత్ లో తొలి రెండు వేవ్ ల సమయంలో నమోదైన కేసుల సంఖ్యతో ఆయా దేశాల కరోనా డేటాతో క్రోడీకరించారు.ఈ ఏడాది డిసెంబరు 15 నుంచి నమోదైన కేసులను కరోనా థర్డ్ వేవ్ లో భాగంగా పరిగణించారు. అయితే వ్యాక్సినేషన్ అంశాన్ని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకోలేదు. అందువల్ల ఫిబ్రవరి నాటికి ఎన్ని కేసులు వస్తాయన్నదానిపై తాజా అధ్యయనంలో వెల్లడించలేదు.
మరోవైపు దేశంలో ఒమిక్రన్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కొత్త వేరియంట్ విస్తరించకుండా ఆంక్షల దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తుండగా.. ఉత్తరప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఈ జాబితాలోకి మహారాష్ట్ర చేరింది. డిసెంబర్25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఉద్దవ్ థాకరే సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సినిమా థియేటర్లలోకి కూడా 50 శాతం మంది ప్రేక్షకులనే అనుమతించనుంది.పెళ్లి వేడుకలు, ఫంక్షన్లకు కేవలం 250 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.