జగన్‌పై స్వామి ఆగ్రహం.. ధాన్యంపై ధూంధాం.. టికెట్లు పెరిగాయ్.. టాప్‌న్యూస్@7pm
posted on Dec 24, 2021 @ 5:44PM
1. ఏపీ డీజీపీ సవాంగ్‌కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళిపై వైసీపీ గూండాల దాడిని ఖండించారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మండిపడ్డారు. మురళి ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. ఘటనపై విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డీజీపీ సవాంగ్‌ని లేఖలో కోరారు.
2. సీఎం జగన్‌రెడ్డిపై స్వామి పరిపూర్ణానంద తీవ్ర విమర్శలు చేశారు. గతంలో డెల్టా పేరుతో పండుగలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం.. ఒమిక్రాన్ దృష్ట్యా క్రిస్మస్‌పై ఎందుకు ఆంక్షలు పెట్టడం లేదని ప్రశ్నించారు. హిందువుల పండుగలపైనే జగన్‌కి కరోనా గుర్తుకువస్తుందా? అని నిలదీశారు. హిందువుల పండుగలంటే జగన్‌కి చిన్నచూపన్నారు స్వామి పరిపూర్ణానంద.
3. తెలంగాణలో ఇంకా 60లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉందని, మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఢిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు దగ్గర పారబోస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధాన్యం సేకరణపై మాట్లాడేందుకు వారం రోజుల క్రితం మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వచ్చినా కేంద్రం నుంచి సరైన స్పందన లేదన్నారు.
4. ఢిల్లీ వెళ్లిన మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. వానాకాలం పంట ఎంత కొంటారో చెప్పే వరకు, యాసంగిలో బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్రం చెప్పే వరకు.. తెలంగాణ మంత్రులు ఢిల్లీలోనే ఆమరణ దీక్ష చేయాలని సవాల్ చేశారు. ఏదీ తేలకుండా రాష్ట్రానికి తిరిగి రావొద్దని రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రజల్ని మభ్య పెట్టేందుకు టీఆర్ఎస్ నేతలు వీధినాటకాలకు తెరలేపారని మండిపడ్డారు.
5. రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ దీక్షలతో, ధర్నాలతో డ్రామాలు చేస్తోందని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ఆరోపించారు. తెలంగాణలో రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు చనిపోతున్నారని.. కనీసం ఆ కుటుంబాలను ఓదార్చాలనే సోయి కూడా ముఖ్యమంత్రికి లేదా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో రైతులు చనిపోతే ఆదుకోవడానికి లక్షలు ఇచ్చే కేసీఆర్.. మన రైతులు చనిపోతే పట్టించుకోవడానికి కనీసం టైం కూడా లేదా? అని నిలదీశారు.
6. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఎన్వీ రమణ తొలిసారిగా తన స్వగ్రామం.. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి విచ్చేశారు. ఆయన రాక సందర్భంగా పొన్నవరంలో పండగ వాతావరణం నెలకొంది. పొన్నవరంలో దాదాపు నాలుగు గంటల పాటు ఉన్నారు. జస్టిస్ ఎన్వీ రమణకు పౌర సన్మానం చేశారు. అపూర్వ స్వాగతానికి పొన్నవరం గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఎన్వీ రమణ.
7. నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి ఎదుట న్యాయం కోసం ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తమ ఆస్తి విషయంలో వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ అన్యాయం చేసాడంటూ పద్మాలత పురుగుల మందు తాగింది. వెంటనే ఆమెను నంద్యాల ప్రభుత్వసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
8. ఆనందయ్యకు ఏపీ ఆయూష్ శాఖ ఝలక్ ఇచ్చింది. ఒమైక్రాన్ మందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఒమైక్రాన్‌కు ఆయుర్వేద మందు ఇస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయూష్‌శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయుర్వేద మందు సరఫరాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపింది.
9. విశాఖలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. యూఏఈ నుంచి వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో కొద్దీ రోజుల క్రితం నుంచి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు శాంపిల్ పంపించగా.. ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది.
10. తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏసీ థియేటర్లలో కనిష్టం రూ. 50.. గరిష్టం రూ. 150 కి పెంచారు. మల్టీప్లెక్స్‌ల్లో కనిష్టం రూ.100.. గరిష్టం రూ. 250 చేశారు. మల్టీప్లెక్స్‌ల్లో రిక్లైనర్ సీట్లకు గరిష్టంగా రూ.300 టికెట్ నిర్ణయించారు. ఈ ధరలకు జీఎస్టీ, నిర్వహణ చార్జీలు అదనం.