కేటీఆర్ కు మద్దతుగా.. తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా షర్మిల ట్వీట్!
posted on Dec 25, 2021 @ 9:34AM
తెలంగాణలో దూకుడు రాజకీయాలు చేస్తున్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సీఎం కేసీఆర్, కేటీఆర్ పై హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ కాక రేపుతున్నారు. కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు షర్మిల. కేటీఆర్ పైనా ఇటీవల కాలంలో దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా మాత్రం మంత్రి కేటీఆర్‌కి మద్దతుగా నిలిచారు వైఎస్సార్‌టీపీ వైఎస్ షర్మిల.
బీజేపీ నేత తీన్మార్ మల్లన్న ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కుమారుడు హిమాన్షును కించపరిచేలా ట్వీట్ చేశారు. దీనిపై షర్మిల స్పందించారు. ట్విటర్ వేదికగా కేటీఆర్‌కు మద్దతుగా నిలిచారు. ‘‘పిల్లలకు ఒక తల్లిగా, రాజకీయ పార్టీ నేతగా రాజకీయాల్లోకి గుంజడాన్ని ఖండిస్తున్నా. కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలను సహించేది లేదు. మహిళలను కించపరిచినా, పిల్లలను కించపరిచినా.. మనం రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలి’’ అని షర్మిల ట్వీట్‌లో పేర్కొన్నారు.
అభివృద్ధి విషయమై బీజేపీ నేత తీన్మార్ మల్లన్న ట్వీట్ చేశారు. ‘అభివృద్ది ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా.. హిమాన్షు శరీరంలోనా?’ అనే అర్థం వచ్చేలాగా ట్విట్టర్‌లో తీన్మార్ మల్లన్న పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పోస్టుపై ఆగ్రహించిన టీఆర్‌ఎస్ సానుభూతిపరులు తీన్మార్ మల్లన్నపై దాడికి పాల్పడ్డారు.
బోడుప్పల్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో శుక్రవారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. శనార్థి తెలంగాణ పత్రికా కార్యాలయంలో ఉన్న తీన్మార్ మల్లన్న వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగి ఆయనపై దాడి చేశారని రాజ్‌కుమార్ అనే వ్యక్తి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి వెల్లడించారు.