ఇండియాగేటు దగ్గర ధాన్యం పారబోస్తాం.. ఢిల్లీలో తెలంగాణ ధూంధాం..
posted on Dec 24, 2021 @ 5:13PM
కేంద్రం వర్సెస్ తెలంగాణ.. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్.. యాసంగి వర్సెస్ రబి.. వడ్లు వర్సెస్ బియ్యం.. కొన్నిరోజులుగా ధాన్యంపై ఢిల్లీలో ధూంధాం నడుస్తోంది. కేంద్రం, రాష్ట్రం పరస్పర విమర్శలు, ఆరోపణలతో హస్తినలో చలిమంట రాజేస్తున్నారు. తెలంగాణ మంత్రులు ఢిల్లీలోనే మకాం వేయడం.. కేంద్రం ఎదురుదాడి చేయడం.. ఇలా ధాన్యంపై రాజకీయ సెగ రగులుతోంది. తాజాగా, ఢిల్లీలో ఉన్న మంత్రులు కేంద్రానికి మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తగ్గేదే లే అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో ఇంకా 60లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉందని, మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఢిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు దగ్గర పారబోస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధాన్యం సేకరణపై మాట్లాడేందుకు వారం రోజుల క్రితం మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వచ్చినా కేంద్రం నుంచి సరైన స్పందన లేదన్నారు.
"తెలంగాణలో పండిన ధాన్యంలో 60లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని ఇండెంట్ ఇచ్చారు. శుక్రవారంతో ఆ టార్గెట్ పూర్తయింది. రాబోయే 60 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని కూడా సేకరిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేశాం. రెండ్రోజుల సమయం ఇవ్వాలని అడిగారు. రెండ్రోజులు గడిచినా ఎలాంటి స్పందనా లేదు. అపాయింట్‌మెంట్ అడిగినా ఇంకా ఇవ్వలేదు. తెలంగాణ రైతుల తరఫున కేంద్రం వైఖరిని తీవ్రంగా పరిగణిస్తున్నాం." అని ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
"ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. బియ్యం సేకరణపై ఎఫ్‌సీఐ, కేంద్రం గోడౌన్లు పెంచలేదు. వానాకాలంలో రైతులు పండించిన 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, డబ్బులు చెల్లిస్తుంది. తెలంగాణలో వానాకాలంలో ఎంత పండితే అంత ధాన్యం తీసుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో మాట ఇచ్చారు. అయినా, దానిపై ఇంకా స్పష్టత ఇవ్వట్లేదు. పార్లమెంట్‌లో ఇచ్చిన మాట ప్రకారం.. లిఖితపూర్వక హమీ ఇస్తూ లేఖ ఇవ్వకపోతే రైతుల దగ్గర కొనుగోలు చేసిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఢిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు ముందు పారబోస్తాం." అని ప్రశాంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.