వైఎస్ రచ్చబండ.. జగన్ ఒంటరి ప్రార్థన...
posted on Dec 24, 2021 @ 2:12PM
క్రిస్‌మస్ వచ్చిందంటే చాలు.. వైఎస్ కుటుంబానికి పండగే పండగ. ఎందుకోగానీ ఈ మధ్య జగన్ గుళ్లుగోపురాలు గట్రా పోతున్నారు కానీ.. తాను వంద శాతం క్రిష్టియన్ అని ఆయన గర్వంగా చెప్పుకుంటారు. రాత్రిళ్లు జీసస్‌తోనూ మాట్లాడుతుంటారని అంటుంటారు. డిసెంబర్ 25 వచ్చిందంటే.. ఇడుపులపాయ ఎస్టేట్, పులివెందుల హౌజ్.. పండగ వాతావరణంతో వెలుగిపోతుంటుంది. వైఎస్సార్ ఉన్నప్పటి నుంచీ కుటుంబ సమేతంగా ఘనంగా క్రిస్‌మస్ జరుపుకునేవారు. ఆయన పోయారు. ఈయన వచ్చారు. వైఎస్సార్‌లానే జగనూ సీఎం అయ్యారు. ఇప్పుడు మరోసారి క్రిస్మస్ వచ్చింది. కానీ, వైఎస్ కుటుంబం మునుపటిలా లేదు. మొత్తం చీలిపోయింది. జగన్‌కు అంతా దూరమయ్యారు. ఎవరికి వారే.. వైఎస్ ఘాట్ దగ్గర ఒంటరి నివాళే.
ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ దగ్గర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అయితే జగన్, షర్మిళ, విజయమ్మ ఎవరికి వారుగా వేర్వేరుగా నివాళులు అర్పించారు. గురువారం రాత్రి జగన్ వచ్చి.. తండ్రికి నివాళులు అర్పించి వెళ్లిపోయారు. అనంతరం విజయమ్మ, షర్మిల వేరేగా వచ్చి వైఎస్ ఘాట్ దగ్గర కాసేపు గడిపారు. అటు.. ఇడుపులపాయ చర్చిలో కూడా ఇదే సీన్. జగన్, విజయమ్మలు వేర్వేరుగా ప్రార్ధనలు నిర్వహించారు. వైఎస్ కుటుంబానికి ముఖ్యమైన క్రిస్మస్ పండుగ.. ఇలా వారి కుటుంబ విభేదాలకు వేదికైంది. తల్లిని దూరం పెట్టిన కొడుకుగా.. చెల్లిని దూరం చేసుకున్న అన్నగా.. జగన్‌రెడ్డి వైఎస్ కుటుంబంలో మచ్చగా మిగిలిపోతారని అంటున్నారు.
ఇప్పటికే బాబాయ్ వివేకానందరెడ్డి హత్య విషయంలో జగన్ ఆడుతున్న రాజకీయం అందరికీ తెలిసిందే. వివేకా కూతురు సునీత.. జగన్‌పై గుర్రుగా ఉన్నారు. నిందితులను కఠినంగా శిక్షించకుండా.. ఏళ్ల తరబడి ఆలస్యం చేయడమే కాకుండా.. పార్టీ ప్రయోజనాల కోసం ప్రధాన నిందితులను రక్షిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బాబాయ్ హత్యతోనూ రాజకీయాలు చేయాలని చూస్తున్న జగన్‌పై.. మిగతా వైఎస్ కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు.
మిగతా వారి విషయం వదిలేసినా.. కన్న తల్లి.. సొంత చెల్లిలతోనూ జగన్ వైరం పెట్టుకోవడం మరీ దారుణమంటున్నారు. కొడుకు కోసం ఊరూరా తిరిగింది తల్లి విజయమ్మ. అన్న కోసం రాష్ట్రమంతా కాళ్లు అరిగిపోయేలా తిరుగుతూ.. గొంతు చించుకునేలా ప్రసంగిస్తూ.. జగన్ తరఫున బలమైన వాయిస్ వినిపించారు షర్మిల. అలాంటి తల్లిని.. ఇలాంటి చెల్లిని.. అందలమెక్కాక పక్కనపెట్టేశారు జగన్. అధికారం కోసం సొంతవారినే వదిలించుకున్నారు. చెల్లి అన్నపై ఆగ్రహంతో ఇల్లు వదిలిపెట్టేసి.. మెట్టింటికి వెళ్లిపోయింది. తల్లి సైతం కూతురు వెంటే. ఇక మిగిలింది జగన్ ఒక్కరే. తాడేపల్లి ప్యాలెస్‌లో ఒంటరి జీవితం. ఇడుపులపాయకు ఎప్పుడు వచ్చినా అదే దైన్యం. వైఎస్ జయంతి, వర్థంతిలే కాదు.. క్రిస్‌మస్‌కూ వైఎస్ కుటుంబ కల్లోలాలు, కలహాలు.. బహిర్గతమయ్యేలా.. వైఎస్ ఘాట్.. రచ్చబండగా మారిందంటున్నారు.