ఢిల్లీలో మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారు.. అక్కడే ఆమరణ దీక్ష చేయాలన్న రేవంత్
posted on Dec 24, 2021 @ 4:44PM
రేవంత్‌రెడ్డి మాట్లాడితే బుల్లెట్ దింపినట్టు ఉంటుందంటారు. రోజుల తరబడి ఢిల్లీలో మకాం వేసిన మంత్రులను ఉద్దేశించి తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటు టీఆర్ఎస్‌ను, అటు బీజేపీని.. రెండు పార్టీలనూ టార్గెట్ చేస్తూ తూటాల్లాంటి డైలాగ్స్ పేల్చారు. ఇంతకీ రేవంత్ ఏమన్నారంటే...
"ఢిల్లీలో కాదు గల్లీలో తేలుస్తామని ఎంపీలు రాష్ట్రానికి వచ్చారు. గల్లీలో కాదు ఢిల్లీలో తేలుస్తామని మంత్రులు హస్తినకు వెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారు. ఆరు రోజుల్లో.. మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డిలు ఏం తేల్చారు? అదనంగా ఎంత ధాన్యం ఇస్తారో కేంద్రానికి మీరు ఏం నివేదిక ఇచ్చారో చెప్పండి. రాష్ట్రం, కేంద్రం మధ్య జరిగిన వ్యవహారం బయటపెట్టండి. అదనపు ధాన్యం ఎంత ఇస్తారో చెప్పకుండా.. కొంటారా? లేదా? అని మంత్రులు మాటలు చెబుతున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
వానాకాలం పంట ఎంత కొంటారో చెప్పే వరకు, యాసంగిలో బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్రం చెప్పే వరకు.. తెలంగాణ మంత్రులు ఢిల్లీలోనే ఆమరణ దీక్ష చేయండి. ఏదీ తేలకుండా తిరిగి రావొద్దని రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రజల్ని మభ్య పెట్టేందుకు టీఆర్ఎస్ నేతలు వీధినాటకాలకు తెరలేపారు. రైతులు ఎవరూ చనిపోవద్దు, కాంగ్రెస్ అండగా ఉంటుంది. డిసెంబరు 27న ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహిస్తాం.. అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై పోరాటంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు విమర్శించారు. రైతుల జీవితాలను మోదీ దగ్గర కేసీఆర్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలుగా మారి రైతులకు ద్రోహం చేస్తున్నాయని.. యాసంగి పంట కొనబోమని కేంద్రం ముందే చెప్పినా.. ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.