యూపీ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా?
posted on Dec 24, 2021 @ 3:19PM
కొత్త సంవత్సరం (2022) ప్రారంభంలో జరగవలసిన ఉత్తర ప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం వుందా? కోవిడ్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ఎన్నికలను వాయిదా వేసే అలోచనాలో కేంద్ర ప్రభుత్వం వుందా? అంటే ఉందనే అంటున్నారు, బీజేపీ రాజ్య సభ సభ్యుడు, డాక్టర్ సుబ్రమణ్య స్వామి. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలను 2022 సెప్టెంబర్ వరకు వాయిదా వేసే అవకాశం ఉందని ఆ మేరకు తన వద్ద సామాచారం ఉందని , స్వామి ఈరోజు (శుక్రవారం) తెల్లవారుఝామున 4:22 నిమిషాలకు ట్వీట్ చేశారు. ఈ సమయంలో ఆయన ఈ ట్వీట్ చేయడంతో పలువురు, పలు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.
అదలా ఉంటే, స్వామి జోస్యానికి బలం చేకూరుస్తూ అలహాబాద్ హైకోర్టు కుడా ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. వైరస్ ఉద్ధృతి దృష్ట్యా యూపీతో సహా ఐదు రాష్ట్రాల్లో మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. అంతేగాక, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న ఎన్నికల ప్రచార ర్యాలీలపై నిషేధం విధించాలని సూచించింది.
మరో వంక ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం రేపు (డిసెంబర్ 25) నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేయనుంది. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఈ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.అలాగే వివాహాలు, వేడుకలకు 200 మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాకుండా పాల్గొన్న వారంతా తప్పకుండా కొవిడ్ నిబంధలను పాటించాలని స్పష్టం చేసింది. అంటే, రాష్ట్ర ప్రభుత్వం అంక్షల వైపుగా అడుగులు వేస్తోందనే విషయం స్పష్టమైంది. ఈనేపధ్యలో ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్రాపుల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే విషయం ఎలా ఉన్నా ఇప్పటికే జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారానికి మాత్రం బ్రేక్ పడుతుందని అంటున్నారు. నిజానికి, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలల సమయముంది. అయితే, ఎప్పుడోనే ప్రారంభమైన ఎన్నికల ప్రచారం ఇప్పుడు మహా జోరుగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి రెండు రోజులకు ఒక సారి యూపీలో పర్యటిస్తునారు. వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.అలాగే యూపీతో పాటుగా పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో కూడా ఇప్పటికే ప్రచార వేడెక్కింది. అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
ఈ నేపధ్యంలో నిజంగానే, సుబ్రమణ్య స్వామి, ఉహిస్తున్న విధంగా వచ్చే సెప్టెంబర్ వరకు ఎన్నికలు వాయిదా పడే పక్షంలో, యూపీ, పంజాబ్’తో పాటుగా అన్ని రాష్ట్రాలలోనూ రాష్ట్రపతి పాలన అనివార్య మవుతుందని, రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. అయితే, అంతవరకు వస్తుందా... లేక గడువుకు కొంచెం అటూ ఇటుగా ఎన్నికలు జరుగుతయ్యా .. అనేది కరోనా కొత్త వేరియంట్ విస్తరణ , ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, గత అనుభవాలా దృష్ట్యా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ఎన్నికల సంఘం కానీ,తొందరపడి నిర్ణయాలు తీసుకోవని, మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చని అంటున్నారు.