స్వగ్రామంలో జస్టిస్ ఎన్వీ రమణ.. పులకించిన పొన్నవరం..
posted on Dec 24, 2021 @ 1:36PM
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడమంటే అంత ఆషా మాషీ కాదు. కృషి, పట్టుదల, అపార జ్జానం, రాజ్యాంగంపై గౌరవం, న్యాయవ్యవస్థపై నమ్మకం, న్యాయ వ్యవస్థ విధి విధానాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంటేనే కానీ ఆ పీఠాన్ని అధిరోహించ లేరు. అవన్ని పుష్కలంగా ఉన్న మన తెలుగు బిడ్డ జస్టిస్ ఎన్వీ రమణ.. తెలుగు నేలపై.. అదీ సొంత గడ్డపై అడుగుపెడుతోంటే.. ఆ ప్రాంత వాసుల్లో ఆనందం వెల్లి విరిసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఎన్వీ రమణ తొలిసారిగా తన స్వగ్రామం.. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి విచ్చేశారు. ఆయన రాక సందర్భంగా పొన్నవరంలో పండగ వాతావరణం నెలకొంది. పొన్నవరంలో దాదాపు నాలుగు గంటల పాటు ఉన్నారు. జస్టిస్ ఎన్వీ రమణకు పౌర సన్మానం చేశారు.
తమ గ్రామంలొ సామాన్య కుటుంబంలో పుట్టిన జస్టిస్ ఎన్వీ రమణ.. భారతదేశ అత్యున్నత స్థాయి పదవికీ ఎదగడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ బాల్యంలో కంచికచర్ల పాఠశాలలో విద్యాబ్యాసం చేశారని.. ఆయన కుటుంబానికి స్థానికంగా పొలాలు కూడా ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. రెండేళ్ల క్రితం జస్టిస్ ఎన్వీ రమణ ... పొన్నవరానికి విచ్చేశారని.. అప్పుడు మూడు రోజుల పాటు ఉన్నారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు.
అపూర్వ స్వాగతానికి పొన్నవరం గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఎన్వీ రమణ. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. "పొన్నవరం చాలా చైతన్యం ఉన్న ఊరు. ఈ పల్లె ప్రజల ఆశీర్వచనాల కోసం వచ్చాను. నేను ఎక్కడకు వెళ్లినా నా ఊరు ఇదే అని మర్చిపోలేదు. నా చిన్నతనంలో ఏ రకంగా ఇబ్బంది పడలేదు. మా ఊరులో రాజు మాస్టర్ వీధి బడి ఉండేది. రాజు, మార్కండేయులు మాస్టర్లు ఏ నాడు దండించలేదు. మా ఊరులో ఏ రోజూ ఏ ఘర్షణ ఉండదు. కులమత తారతమ్యాలు ఇక్కడ ఉండవు. పుట్టిన ఊరుని, కన్నతల్లిని మరచిపోకూడదు."
"నాకు పదేళ్లు వచ్చే సరికే మా ఊర్లో మూడు ప్రధాన రాజకీయపార్టీలు ఉండేవి. మా తండ్రి కమ్యూనిస్ట్ భావజాలంతో ఉంటే నేను స్వాతంత్య్ర పార్టీకి మద్దతిచ్చా. చిన్నతనంలో ఎన్జీరంగా మీటింగ్‌లకు వెళ్లా. అప్పట్లో ఈ ప్రాంతం దుర్భిక్ష మెట్టప్రాంతంగానే ఉంది. నేటికి మా ప్రాంతం అనుకున్న అభివృద్ధి సాధించకపోవడం ఆవేదన కలిగిస్తోంది. ఢిల్లీలో తెలుగువాడినని చెపితే అక్కడివారు తమ ప్రాంతంలో పలు ప్రాజెక్ట్‌లు కట్టారని చెపుతారు. ఆఫ్గానిస్తాన్ లాంటి ప్రాంతంలో సైతం పార్లమెంట్‌ను నిర్మించిన ఘనత మన తెలుగు వాళ్లకు దక్కుతుంది. రైతులకు కనీస మద్దతు ధర, భూవివాదాలు వంటి ఇబ్బందులు అలాగే ఉన్నాయి."
"దేశం అన్ని రంగాలలోనూ ముందుకెళ్తోంది. సమస్యలను అధిగమించాలంటే అందరూ కలిసి పనిచేయాలి. తెలుగుజాతి గొప్పతనం తెలిపేలా, గర్వించదగిన విధంగా ప్రవర్తించాలి. ఢిల్లీలో చాలా సభల్లో తెలుగువాడి గొప్పతనం గురించి మాట్లాడుకుంటారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ కూడా తెలుగు వారైనందుకు గర్వపడాలి" అని సీజేఐ ఎన్వీ రమణ పొన్నవరం గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.