ఆర్కే వర్సెస్ లోకేశ్.. మంగళగిరి గ్రౌండ్ రియాలిటీ..
posted on Dec 24, 2021 @ 3:31PM
రాజకీయ నాయకులకు ఉండవలసిన ఉత్తమ లక్షణాలలో మొదటి లక్షణం విశ్వాసం. రెండవది విశ్వసనీయత. తమపై తమకు విశ్వాసం ఉండడంతో పాటు ప్రజలపై విశ్వాసంతో ముందుకు సాగితే, జనంలో విశ్వసనీయత బలపడుతుంది. ఇక అప్పుడు వద్దన్నా విజయం వరిస్తుంది. ఇది అనేక సందర్భాలలో రుజువైన నిజం. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్’లో ఇప్పుడు ఈ లక్షణం పుష్కలంగా కనిపిస్తోంది. రేపటి ఎన్నికల్లో విజయం తధ్యం అన్న ధీమా ఆయన మాటల్లో ప్రతిధ్వనిస్తోంది.
లోకేష్, మొదటి సారిగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేశారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓడి పోయారు. వైసీపీ అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి-ఆర్కే ఐదు వేల స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించారు. అయితే లోకేష్ ఓటమితో కృంగి పోలేదు. ఓటమిని సవాలుగా తీసుకున్నారు. ఎక్కడ పారేసుకున్నారో అక్కడే వెతుక్కోవడం ప్రారంభించారు, మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి, ఎమ్మెల్యే ఆర్కే కంటే, ఎక్కువగా ప్రలతో కలిసి పోరాటం చేస్తున్నారు. నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అమరావతి ఉద్యమం కూడా కలిసి రావడంతో తరచుగా ఇక్కడ పర్యటనలు చేస్తున్నారు. టీడీపీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ వారిలో నైతిక స్ధైర్యం నింపుతున్నారు. ఈ నేపధ్యంలోనే వరసగా మూడు రోజులు నియోజక వర్గంలో పర్యటించిన లోకేష్, 2024 ఎన్నికల్లో మంగళగిరిలో తమ గెలుపు పైనే కాదు రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ విజయం పై కూడా సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. ఇందుకు సంబందించి విలేకరులు అడిగిన ప్రశ్నకు లోకేష్, ఒక్క నిముషం ఆలోచించకుండా, ‘ఎనీ డౌట్’ .. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరుతుందని విశ్వాసం వ్యక్త పరిచారు.
అదలా ఉంటే మంగళగిరిలో నియోజకవర్గంలో మారిన పరిస్ధితులు పూర్తిగా కలిసొస్తున్నాయి. ముఖ్యంగా అమరావతి నుంచి రాజధానిని విశాఖకు మార్చేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, వాటికి సహకరిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే తీరు లోకేష్’కు వరంగా మారుతున్నాయి. ఒకప్పుడు ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్నఆర్కే, రాజధాని విషయంలో జగన్ రెడ్డికి వంత పాడడంతో ఆయన పలుకుబడి పలచబడిపోయింది . అందుకు తోడు నియోజక వర్గంలో ఎక్కడా అభివృద్ధి అన్నది లేక పోవడం, మరోవంక ఓటీఎస్, ఇళ్ళ కూల్చివేతలు ఆర్కే’ ఓటమిని ముందుగానే ఖరారు చేస్తున్నాయని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం పట్ల రాష్ట్ర మంతటా వ్యతిరేకత ఉన్నా మంగళగిరి నియోజక వర్గంలో అది మరీమరీ ఎక్కువగా ఉందని అంటున్నారు.
ఈవిధంగా మంగళగిరి నియోజక వర్గంలో మారుతున్న పరిస్ధితుల్ని లోకేష్ చక్కాగా తమకు అనుకూలంగా మలచు కుంటున్నారు. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దీంతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అర్కేకు ఇప్పటి నుంచే చుక్కలు కనిపిస్తున్నాయని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో రాజధాని ఎక్కడికి పోదు ఇక్కడే ఉటుందని నమ్మబలికి ఓట్లు వేయించుకున్న ఆర్కే, ఇప్పడు ముఖ్యమంత్రి కుట్రలో భాగస్వామి అవుతున్నారని, అందుకే నియోజక వర్గం ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కిమ్మనడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. అలాగే, గతంలో ఆర్కే అమరావతి రైతుల్ని, ఉద్యమాన్ని చులకన చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో మరింత ఆగ్రహం తెప్పించాయి. చివరకు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన రైతులకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే తమను అవమానపరుస్తున్నారని జనం మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ఆర్కేపై పెరుగుతున్న వ్యతిరేకతతో పాటు మూడు రాజధానులపై జగన్ సర్కార్ దూకుడు తనకు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కలిసొస్తుందని లోకేష్ ధీమాగా కనిపిస్తున్నారు.