అత్మవంచన పరనింద!
నిజమే కావచ్చు... ప్రజల జ్ఞాపక శక్తి తక్కువే కావచ్చును, కానీ, నడుస్తున్న చరిత్రను, పడుతున్న కష్టాలను కూడా ప్రజలు మరిచి పోతారు, నాకే జై కొడతారని ఎవరైనా అనుకుంటే, అలాంటివారు అయితే మంద బుద్దులో, మరొకటో అవుతారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రెంటిలో ఏ కోవలోకి వస్తారో ఏమో కానీ, ‘నువ్వే మా నమ్మకం’ అని ఆయనకు ఆయనే ప్రచారం చేసుకోవడం, ఇంటింకీ వెళ్లి స్టిక్కర్లు అంటించడం చూస్తుంటే, ఆయన కళ్ళకు గంతలు కట్టుకున్నారా? ఇంకేమైనా కారణంగా ఆయన తన ముందు జరుగుతున్న నిర్వాకాన్ని చూడలేకపోతున్నారా? అంటే సమాధానం చెప్పడం కష్టమే కానీ, జగన్ రెడ్డి భ్రమల్లో బతుకుతున్నారని మాత్రం నిస్సందేహంగా చెప్ప వచ్చునని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు.
నిజానికి రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పటికే పతాక స్థాయికి చేరింది. గడప గడపకు.. ప్రచారంలోనే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన చేతికి మట్టి అంటకుండా గడప గడప వ్యతిరేకతను ఎమ్మెల్యేల ఖాతాలో చేర్చి వారిని బలిపశువులను చేసేందుకు... గడపగడప నివేదికలను సిద్ధం చేసుకున్నారు. నిజమే ఎమ్మెల్యేల పట్ల స్థానికంగా వ్యతిరేక ఉన్నమాట నిజం. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం దిగమింగే దౌర్భాగులు ఎమ్మెల్యేలు అయినా, మంత్రులు అయినా మరొకరు అయినా సహజంగానే అలాంటి వారిని ప్రజలు అసహ్యించుకుంటారు. వైసీపీ ఎమ్మెల్యేలు చాలా వరకు ఇసుక మాఫియా, మరో మాఫియాలో మునిగి తెలుతున్నవారే అనే ఆరోపణలు వస్తున్నపుడు.. ఎమ్మెల్యేల పై స్థానికంగా వ్యతిరేకత భగ్గుమంటుంది. అందులో సందేహం లేదు. ఆ కోణంలో చూసినప్పడు, ముఖ్యమంత్రి పాయింటవుట్ చేసిన 40 మందో 50 మందో ఎమ్మెల్యేల పై మాత్రమే కాదు, అధికార పార్టీ పార్టి ఎమ్మెల్యే ఎదో ఒక అవినీతి కుంభకోణంలో ఇరుకుని ప్రజాగ్రహాన్ని ఎదుర్కుంటున్న వారే అయితే కావచ్చు
కానీ, వాస్తవంలో ఎమ్మెల్యేల పట్ల ఎంత వ్యతిరేకత వుందో అంతకు రెట్టింపు స్థాయిలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రజాగ్రహం పెల్లుబుకుతోందని అనేక సర్వేలు చెపుతున్నాయి. నిజానికి, ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలు నేరుగా ముఖ్యమంత్రి ఖాతాలో పడుతున్నాయి. వాస్తవం ఇలా ఉంటే, ముఖ్యమంత్రి మరోమారు భజన బృందాలను సిద్దం చేసి, నువ్వే మా నమ్మకమని బలవంగా అనిపించేందుకు, స్టిక్కర్ల దండును సిద్దం చేస్తున్నారు. వాలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు అంతా కట్ట కట్టుకుని ఇళ్లు, వాకిళ్ళ మీద స్టిక్కర్లు అంటించే ఆత్మానంద కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.
నిజమే అధికారంలో ఉన్న పార్టీ నాయకులు వచ్చి ఇంటికి స్టిక్కర్ అంటిస్తామంటే సహజంగా ప్రజలు ఇష్టం ఉన్నా లేకున్నా కాదనరు. కావాలంటే, ఇంటికి, ఫోన్ కే కాదు ముఖాలకు అంటిస్తామన్నా సమాన్య ప్రజలు వద్దనే సాహసం చేయరు. అలాగని, రేపటి ఎన్నికల్లో స్టిక్కర్లు ఓట్లుగా మారతాయని అనుకుంటే మాత్రం అది పొరపాటే అవుతుంది. జగన్ రెడ్డికి ఈ ‘చక్కటి’ సలహా ఎవరు ఇచ్చారో కానీ ఇది ఆత్మవంచన, పరనిందకు పరాకాష్టగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లో ఈ రెండు లక్షణాలు కొంచం చాలా ఎక్కువనే అంటారు. ఇప్పడు, ఆ స్టిక్కర్ స్కీంతో అది పరాకాష్టకు చేరుకుందని, అంటున్నారు.