కోమటి రెడ్డి పై వేటు ?
posted on Feb 15, 2023 @ 10:48AM
బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం మినహా మరో మార్గం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల్ ఇన్‌ఛార్జి మాణిక్ రావు ఠాక్రే తెర దించారు. రాష్ట్రంలో 3 రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన, శంషాబాద్ విమానాశ్రయంలో కాలు పెడుతూనే, బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. నిజానికి, విమానాశ్రయంలోనే, ఆయన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావీద్, బోసురాజు, వేణుగోపాల్ తదితరులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కోమటి రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ 60కి మించి సీట్లు రావు.ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్ కలవక తప్పదు అంటూ పొత్తులపై తాను చేసిన వ్యాఖ్యలపై ఠాక్రేకు వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో సర్వేలు చూసి హంగ్ వస్తుందని చెప్పానని కోమటిరెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఠాక్రే కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారో నేను చూడలేదు. వీడియోలు చూశాక మాట్లాడతా. ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నాం. వరంగల్‌లో రాహుల్ చెప్పిన విషయాలకు పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పారు. మరోవంక కోమటి రెడ్డికి ‘బయటి’ దారి చూపించేందుకు తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్న, పీసీసీ చీఫ్ రేవత్ రెడ్డి వర్గం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కత్తులు దూశారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డిని పార్టీ నుంచి .. అని బహిరంగ వేదిక నుంచి తీవ్ర పదజాలంతో దూషించిన అద్దంకి దయాకర్, మరికొందరు నాయకులతో పాటుగా రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు కూడా కోమటిరెడ్డిని తప్పు పడుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగానే వ్యాఖ్యలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ తో కలవాల్సిన పరిస్థితి రాదని.. కోమటిరెడ్డివి వ్యక్తిగత వ్యాఖ్యలన్న వాదన వినిపిస్తున్నారు. శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి నేరుగానే తమ అభిప్రాయం చెప్పారు. ఇతర నేతలు గుంభనంగా ఉంటున్నారు.
ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం వరంగల్ లో నిర్వహించిన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టమైన ప్రకటన చేశారు. ఇప్పడు కోమటి రెడ్డి అందుకు విరుద్ధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అంటూ బీజేపే చేస్తున్న ప్రచారానికి వంతపాడే వంతపాడే విధంగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ తీసుకుందని అంటున్నారు. నిజానికి మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ కోరుతూ కాంగ్రెస్ క్రమ శిక్షణా సంఘం ఆయనకు షో కాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీ కమిటీల్లో ఎక్కడా ఆయనకు స్థానం కలిపించలేదు. ఇక ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం మినహా మరో మార్గం లేదని అంటున్నారు.
అయితే, అదే జరిగితే రోగి కోరింది ... వైద్యుడు ఇచ్చింది ఒకటే ... అన్నట్లుగా అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ కావాలనే కోమటి రెడ్డి పార్టీ క్రమ శిక్షణ తప్పి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అనుమానాలు కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నాయి. అందుకే, పార్టీ అధిష్టానం తటపటాయిస్తోందని అంటున్నారు.