రాజ్యాంగ బద్ధ పదవుల్లో రాజకీయ నియామకాలా?
posted on Feb 15, 2023 @ 2:29PM
దేశంలో గవర్నర్లను నియామకం అయితే సంచలనమైనా అవుతోంది.. లేకపోతే వివాదాస్ప దమైనాఅవుతోంది. రాజకీయమే ఇందుకు కారణమనడంలో సందేహంలేదు.ఏ రాష్ట్రానికైనా కొత్తగా గవర్నర్ నియామకం జరిగిన వెంటనే గవర్నర్ల వ్యవస్థ అవసరంపై చర్చ అనివార్యంగా తెరపైకి వస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలలో తమ ప్రయోజనాల పరిరక్షణ కోసం గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ విషయమే తీసుకుంటే.. తమిళిసై రాజ్ భవన్ ను బీజేపీ కార్యాలయంగా మార్చేశారని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. తమిళనాడులో అయితే ఏకంగా అసెంబ్లీ సాక్షిగానే గవర్నర్ వైఖరిని అక్కడి స్టాలిన్ ప్రభుత్వం తప్పుపడితే.. గవర్నర్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలోనే గత ఆదివారం కేంద్ర ప్రభుత్వం 13 రాష్ట్రాలలో గవర్నర్లను నియామకం మార్పు చేసినప్పుడు మరో సారి దేశ వ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థపై చర్చకు తెరలేచింది. గవర్నర్ల నియామకంలో ప్రథమ ప్రాథాన్యత రాజకీయ ప్రయోజనాలకే ఇవ్వడం వల్లనే ఇలా జరుగుతోంది. ఇది కేంద్రంలో బీజేపీ కొలువుతీరిన తరువాత ప్రారంభం కాలేదు... ఇక్కడితో అగుతుందన్న నమ్మకమూ లేదు.
రాజకీయ ప్రాధాన్యత ఆధారంగానే గవర్నర్లను నియమించడం అన్నది గతంలోనే అంటే ఇందిరా గాంధీ హయాం నుంచే ఆరంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్న సమయంలో గవర్నర్ గా ఉన్న రామ్ లాల్ వ్యవహరించిన తీరు ఎంత వివాదాస్పదం అయ్యిందో తెలియంది కాదు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా కుముద్ బెన్ జోషి ఉన్న సమయంలో కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా రాజ్ భవన్ ఉండేదని రాజకీయ పండితులు ఇప్పటికీ చెబుతుంటారు. అప్పట్లో ఇలా ఒకటి రెండు ఉదాహరణలే ఉండేవి. అప్పట్లో కూడా గవర్నర్ల వ్యవస్థ అవసరమా అన్న చర్చ పెద్ద స్థాయిలోనే జరిగింది. గవర్నర్ వ్యవస్థ అనవసరం అన్న చర్చకు అప్పట్లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చాలా బలంగా తెరమీదకు తీసుకువచ్చారు.
ఇక ఇటీవలి కాలంలో అయితే చాలా వరకూ గవర్నర్లు పూర్తిగా రాజకీయ పాత్రల పోషణకే పరిమితమైపోయారన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో గవర్లర్లు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. అందుకే రాజకీయ పునరావాసంగా గవర్నర్లను నియమిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. కేంద్రం లో ఉన్న ప్రభుత్వాలు తమ పార్టీకి చెందిన సీనియర్లకు, పదవుల అవకాశం లభించని వారికీ రాజకీయ పునరావాసం కింద గవర్నర్ పదవులలో నియమిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేని కీలక పదవులలో పని చేసి రిటైర్ అయిన వారిని గవర్నర్లుగా నియమించడానికి ప్రాధాన్యత ఇస్తున్నది.
అయితే ఆ నియామకాలు కూడా వివాదాస్పదంగానే మారడం గమనార్హం. ఉదాహరణకు ఏపీ గవర్నర్ గా కేంద్రం ఇటీవల నియమించిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం విషయంలో వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న చర్చనే చెప్పుకోవచ్చు. రాజకీయ రంగం నుంచి వచ్చిన వారి కంటే న్యాయ వ్యవస్థ, సైనిక వ్యవస్థల నుంచి వచ్చిన వారు రాజ్యాంగానికే కట్టుబడి ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం ఉంది.
అయితే కేంద్రం ఇటీవలి నియామకాలను గమనిస్తే.. విధి నిర్వహణలో తమకు అనుకూలంగా వ్యవహరించిన వారిని పదవులతో కేంద్రం సత్కరిస్తోందా అన్న అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద గవర్నర్ల వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తడానికీ, ఆ నియామకాలు వివాదాస్పదంగా మారడానికీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాల వైఖరే కారణమనడంలో సందేహం లేదు.