వివేకా హత్య కేసులో ‘బుక్’ అయిపోయారుగా?!
posted on Feb 14, 2023 @ 2:09PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా... రాజకీయాలు మాత్రం రోహిణీకార్తె ఎండలను మించి సెగలు కక్కుతున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ నెల్లూరు పెద్దారెడ్ల అసమ్మతి జ్వాలతోపాటు... ఉమ్మడి కృష్ణాజిల్లా గన్నవరం, మైలవరం నియోజకవర్గాల్లోని నేతల అంతర్గత వర్గ పోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
మరోవైపు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటివల చోటు చేసుకొంటున్న వరుస పరిణామాలు ఆ పార్టీ అగ్రనేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించడం.. ఈ సందర్భంగా వివేకా హత్య జరిగిన రోజు.. ఆయన ఎవరెవరికి ఫోన్ చేసారంటూ.. కాల్ డేటాపై ఆరా తీయడం.. అందులో భాగంగా నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణి భారతి పీఏ నవీన్ ఫోన్లకు పలుమార్లు ఫోన్ చేసినట్లు అవినాష్ రెడ్డి క్లారిటీతో వెల్లడించడం.... ఆ క్రమంలో అటు జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి, భారతి పీఏ నవీన్‌కి విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేయడం... వారిద్దరు ఈ విచారణకు హాజరుకావడం .. ఒకదాని వెంట ఒకటి చక చకా జరిగిపోయాయి. కాగా వివేకా హత్య కేసుపై తెలుగుదేశం పార్టీ... జగనాసుర రక్త చరిత్ర బహిరంగం.. పేరిట తాజాగా ఓ పుస్తకాన్ని విడుదల చేసింది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు సీఎం జగన్ ప్యాలెస్‌లోనే పథక రచన జరిగిందని ఆ పుస్తకంలో ఆరోపించింది. సీబీఐ విచారణలో వేళ్లన్నీ సీఎం జగన్, ఆయన భార్య భారతి వైపే చూపిస్తున్నందున ముఖ్యమంత్రి తన పదవికి జగన్ రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. వివేకా హత్య జరిగిన తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలను ఈ పుస్తకంలో క్రానలాజికల్ గా పొందుపరిచారు.
అలాగే జగన్ రెడ్డి దంపతులతో భారతి రెడ్డి పీఏ నవీన్ దిగిన ఫోటోతోపాటు ముఖ్యమంత్రి వై జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఫోటోను సైతం ఈ పుస్తకంలో ప్రచురించారు. ఇక వివేకాను గంటకుపైగా చిత్రహింసలు పెట్టి.. అతి క్రూరంగా గొడ్డలితో నరికి చంపిన తీరుతో పాటు వివేకా కుమార్తె, అల్లుడు సునీత, ఎన్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతంఈ పుస్తకంలో పొందుపరిచారు. అలాగే ఒకటి నుంచి 31 పాయింట్లగా ఈ హత్య కేసులో పలు కీలక వివరాలను వివరించారు. ఈ కేసులో అత్యంత కీలకంగా వ్యవహరించిన పలువురు వ్యక్తులు ఆనుమానాస్పదస్థితిలో మరణించడం... అలాగే వైయస్ వివేకా హత్య జరిగిన తర్వాత.. నాటి ప్రతిపక్ష నేత సొంత మీడియా వివేకానందరెడ్డిది గుండెపోటు అంటూ ప్రసారం చేసిన టీవీ క్లిప్లింగ్స్ తాలుకా స్క్రీన్ షాట్లు సైతం ఈ పుస్తకంలో పొందు పరిచారు.
అలాగే వైయస్ వివేకానందరెడ్డి హత్యను నాటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు అంట కడుతూ... నాడు విపక్ష నేతగా జగన్ చేసిన వ్యాఖ్యలు... అలాగే పులివెందుల పోలీసుల ప్రెస్ నోట్.. కుటుంబ సభ్యుల వాంగ్మూలం.. హత్యలు చేయడం, ఎదుటి వారికి అంటగట్టడం జగన్ రెడ్డి నైజమంటూ నాడు జగన్ సొంత మీడియాలో ప్రచురించిన వార్తను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. అలాగే హత్యను డ్రైవర్ ప్రసాద్‌పై నెట్టే కుట్ర చేసిన నరహంతకులు.. అదేవిధంగా అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో హత్య ఆనవాళ్లు చెరిపివేశారు.. సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్ పిటిషన్... వివేకా హత్య కేసులో 40 కోట్ల రూపాయిల సుపారీపై సీబీఐ చార్జీ షీట్.. సీబీఐ కౌంటర్ అఫిడవిట్... కడప సీటు కోసమే వివేకా హత్య అంటూ వైయస్ షర్మిల ఒప్పుకోలు.. సిట్ చీఫ్‌గా అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్న వ్యక్తిని ప్రభుత్వం మారాక ఎస్పీ స్థాయికి మార్పు చేయడాన్ని తన హైకోర్టు అఫిడవిట్‌లో ప్రశ్నించిన సునీత రెడ్డి.. హత్య సాక్ష్యాధారాలు చేరిపివేతపై సునీత అఫిడవిట్... డాక్టర్ సునీతరెడ్డిని జగన్ రెడ్డి ఎందుకు బ్లాక్ మెయిల్ చేశాడు.. వేళ్లన్నీ జగన్ రెడ్డి, భారతీరెడ్డి కుటుంబం వైపే... తదితర అంశాలను 24 పేజీలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకం.. పీడీఎఫ్ రూపంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంకోవైపు నాటి ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత జగన్ అండ్ కో.. తన రాజకీయ పరమపద సోపనాపటంలో అధికారం అనే అందలం ఎక్కడం కోసం.. సొంత చిన్నాన్నకు స్కెచ్ వేశారని.. ఆ పాప పంకిలాన్ని నారాసుర రక్తచరిత్ర అంటూ నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అంటించడం.. తద్వారా జగన్.. నూటికి నూరు శాతం విజయవంతం అయ్యారనడానికి గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి వచ్చిన బంపర్ మెజార్టీనే ఓ ఉదాహరణ అని నెటిజన్లు.. సోషల్ మీడియోలో కామెంట్స్ చేస్తున్నారు.