తూచ్.. మూడు రాజధానులు కాదు.. విశాఖ ఒక్కటే!
posted on Feb 15, 2023 @ 10:01AM
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారీ తెన్నూ లేకుండా పోయినట్లు తయారైంది. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, పారిశ్రామికంగా అధోగతికి చేరింది. ఉద్యోగుల వేతనాలకే లాటరీ కొట్టాల్సిన పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. దీంతో ఈ పూట గడిస్తే చాలు అన్నట్లుగా జగన్ ప్రభుత్వం దినదిన గండంగా రోజులు గడుపుతోంది. అందుకే ఒక విధానం అంటూ లేకుండా.. గంటకో మాట.. పూటకో విధానం అన్నట్లుగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. రంగులు మార్చడంలో ఊసరవెల్లి ఎలాగో మాటలు మార్చడంలో జగన్ సర్కార్ అలా అన్నట్లుగా తయారైంది పరిస్దితి. ఊసరవెల్లే సిగ్గుపడే విధంగా ఏపీ సర్కార్ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ప్రధాన విపక్షంగా ఉన్న వైసీపీ ఏపీ రాజధానిగా అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అసెంబ్లీ సాక్షిగా అప్పటి విపక్ష నేత జగన్ అమరావతే రాజధాని అని విస్పష్టంగా ప్రకటించారు.
తీరా గెలిచి అధికారం చేపట్టిన తరువాత మాట మార్చి మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరతీశారు. ఇప్పుడు నాలుగేళ్ల పాటు మూడు రాజధానులంటూ చేసిన జపానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. ఏపీకి రాజథాని ఒక్కటే అనీ, అయితే అది అమరావతి కాదు, విశాఖ అంటూ ప్లేట్ ఫిరాయించారు. కర్నూలు న్యాయ రాజథాని, అమరావతి శాసన రాజధాని, విశాఖ పాలనా రాజధాని అంటూ తమ ప్రభుత్వం ఇంత కాలం చెబుతూ వచ్చిన దంతా సమాచార లోపమంటూ విత్త మంత్రి బుగ్గన గారు ముక్తాయించేశారు. పాలనా వికేంద్రీకరణా లేదు ఏం లేదు అని ప్రకటించేశారు. అసలు రాజధాని అంశం కోర్టులో ఉండగా.. ఈప్రకటనలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయన్న విషయాన్నే సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదు. విశాఖలో వచ్చే నెల 3, 4 తేదీలలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు జరగనుంది. ఇందుకు సన్నాహకంగా ఇటీవల ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఏపీ రాజధాని విశాఖేననీ, త్వరలోనే అక్కడ నుంచి తాను పాలన ప్రారంభిస్తాననీ ప్రకటించారు. ఇప్పుడు తాజాగా బెంగళూరులో మంగళవారం ( ఫిబ్రబరి 14)న ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విశాఖే ఏపీ రాజధాని అని చెప్పేశారు. అంతే కాకుండా కర్నూలులో ఏర్పాటు చేసేది హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమేననీ, అదేమీ న్యాయ రాజధాని కాదని కుండబద్దలు కొట్టేశారు.
రాజకీయ ప్రయోజనాలు, లబ్ధే పరమావధిగా ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ పబ్బం గడుపుకోవడానికే జగన్ సర్కార్ పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ ఏపీకి రాజధాని అమరావతే. లీగల్ గా విశాఖను రాజధాని చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే సుప్రీం కోర్టులో ఉన్న కేసు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే తప్ప ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదు. కోర్టు తీర్పు వెలువడలేదు. అయినా ప్రభుత్వం ఇలా ప్రకటనలు చేయడం ఇన్వెస్టర్లను మోసం చేయడమే తప్ప మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు.