వివేకా హత్య కేసు.. దోషులెవరు? నిర్దోషులెవరు?.. సునీత పోరాటం తేల్చేసిందా?
గత నాలుగేళ్లుగా వైఎస్ వివేకా హత్య కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. హత్య జరిగిన వెంటనే ఆరోపణలు గుప్పించిన వాళ్లే ఇప్పుడు నిందితులుగా, అనుమానితులుగా బోనులో నిలబడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు. అసలు వివేకా హత్య కేసు నాలుగేళ్లుగా ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు ఎందుకు ఎదుర్కొందన్నది కూడా ఇప్పుడు సందేహాలకు తావు లేకుండా తేలిపోయింది. హత్య జరిగిన సమయంలో విపక్ష నేతగా ఉన్న జగన్ అప్పడు సీబీఐ విచారణకు డిమాండ్ చేసి.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సీబీఐ విచారణే వద్దనీ, కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన సీబీఐకి ముందుకు సాగకుండా అడ్డంకులు ఎదురౌతున్నా కిమ్మనకుండా చోద్యం చూడడానికీ కారణమేమిటన్నది కూడా ఇప్పుడిప్పుడే మబ్బులు విడిపోయినట్లు విడిపోతోంది. తెలుగుదేశం నెత్తిన ఇప్పటి వరకూ ఉన్న నిందా భారం ఒక్క సారిగా తొలగిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ వివేకా హత్య మోటో ఏమిటి? చేసిందెవరు? చేయించిందెవరు? అన్నవిషయంలో ఉన్న సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. దీనికంతటికీ కారణం ఒకే ఒక్క వ్యక్తి. ఆమె దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.
తన తండ్రి హత్యకు కారణమైన హంతకులు, ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ చేసిన న్యాయ పోరాటం నిజంగా నిస్సందేహంగా తెలుగుదేశం నెత్తిన పాలు పోసిందనే చెప్పాలి. ఆమె అలుపెరుగని పోరాటం ఫలితమే నేడు వివేకా హత్య కేసు ఒక లాజికల్ ఎండ్ కు వస్తున్నదనడంలో సందేహం లేదు. అమె పట్టుబట్టి తన తండ్రి హత్య సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది వెలుగులోకి వచ్చే దిశగా కేసు దర్యాప్తు సాగుతోంది. ఒక మహిళగా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, న్యాయం కోసం సునీత చేసిన, చేస్తునన పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే.
సోదరుడు సీఎంగా ఉన్నందున, తండ్రిని హత్యచేసిన వారెవరన్నది సులభంగా తేలిపోతుందని తొలుత ఆమె భావించారు. వివేకా హత్య జరిగిన సమయంలో విపక్ష నేతగా ఉన్న సోదరుడు జగన్ వివేకా హత్య కేసు దర్యాప్తునకు హత్య జరిగిన వెంటనే వివేకా గుండెపోటుతో మరణించారని మీడియా ముందు చెప్పిన జగన్, ఆయన అనుయాయులూ ఆ తర్వాత గొడ్డలి పోటని, ఆ పోటు వెనుక నారాసుర రక్త చరిత్ర ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. సరే ఆ తరువాత జరిగిన ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి.. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఇక తండ్రిహత్య కేసు సత్వరమే పరిష్కారమై పాత్రధారులు, సూత్రధారులకు శిక్ష పడుతుందని ఆశించారు. అయితే జగన్ అనూహ్యంగా వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని.. కోర్టుకు తెలిపింది. దీంతో వివేకా కుమార్తె సునీత కంగుతిన్నారు. ఆ తర్వాత కూడా కేసు నెలలపాటు నత్త నడకన సాగడంతో సునీత తన తండ్రి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. సాధించారు.
అయితే సీబీఐ దర్యాప్తు చేపట్టిన తరువాత కూడా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులే అడ్డుపడుతుండటం వివేకా హత్యలో సునీత-ఆమె భర్త హస్తం ఉందన్న రీతిలో ఒక వర్గం మీడియాలో కథనాలు రావడంతో ఆమెకు తన తండ్రి హత్య వెనుక ఉన్న శక్తులెవరన్న విషయంలో ఒక స్పష్టత వచ్చింది. అందుకే జగన్ సీఎంగా ఉన్న ఏపీలో కేసు ముందుకు సాగదని నిర్ధారణకు వచ్చి ఈ కేసు విచారణ మరో రాష్ట్రానికి అప్పగించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదలీ చేసింది. అక్కడ నుంచే వివేకా హత్య కేసు విచారణ వేగం పుంజుకుంది.
కడప జైలులో ఉన్న నిందితులను హైదరాబాద్ చంచల్‌గూడ జైలుకు మార్చడం, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించడం, ఆ విచారణ ఆధారంగా రాబట్టిన సమాచారంతో జగన్ ఓఎస్‌డీ, భారతి పీఏలను విచారించడం, వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి సీబీఐ నోటీసులివ్వడం చకచకా జరిగిపోయాయి. అలాగే అవినాష్ రెడ్డిని రెండో సారి విచారించేందుకు కూడా సీబీఐ నిర్ణయించుకోవడం.. ఇదంతా సునీత పోరాట ఫలితమేనన్నది కాదనలేని వాస్తవం. వివేకా హత్య కేసులో ఎవరు హంతకులు? ఎవరు నిర్దోషులు? ఈ కేసులో ఎవరెవరిని అరెస్టు చేస్తారన్నది పక్కన పెడితే.. తన తండ్రి హంతకులెవరో తేల్చాలని సునీత చేసిన పోరాటం నిజంగా చారిత్రాత్మకం. ఆమె మడమ తిప్పని పోరాట ఫలితమే.. ఈ కేసు ముందుకు సాగేలా చేసింద. లేకుంటే ఎన్నటికీ పరిష్కారం కాని కేసులాగే వివేహా హత్య కేసు కూడా మిగిలిపోయి ఉండేది. అలా మిగిలిపోయి ఉంటే.. ఈ కేసులో నేరస్థులు ఆరోపణులు చేస్తూ.. నిర్దోషులు నిందలు మోస్తూ గడపాల్సి వచ్చేంది. గత ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్య.. కేసులో వివేకా దగ్గరి బంధువులు అప్పటి ప్రభుత్వంపై.. ప్రభుత్వాధినేతపై ఆరోపణలు గుప్పించారు.
ఆ ఆరోపణల కారణంగానే అప్పటి విపక్ష పార్టీకి సానుభూతి.. అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు ప్రతిఫలంగా దక్కాయి. సరే ఎన్నికల పూర్తయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. విపక్షంలో ఉండగా తెలుగుదేశంపై ఆరోపణలు గుప్పించిన జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసు ఎప్పటికీ తేలకుండా ఉండేలా అడుగులు వేశారు. విపక్షంలో ఉండగా సీబీఐ దర్యాప్తు అంటూ డిమాండ్ చేసిన ఆయన అధికారంలోకి వచ్చాకా సీబీఐ దర్యాప్తు అవసరం లేదని అన్నారు. సునీత గట్టిగా నిలబడి ఉండక పోతే ఏం జరిగేది? ఈ కేసు ఎప్పటికీ పరిష్కారమయ్యేది కాదు. వివేకా హత్య నిందను తెలుగుదేశం పార్టీ మోస్తూ ఉండాల్సి వచ్చేది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు అన్న అపనిందను దశాబ్దాలుగా చంద్రబాబు ఎలా మోశారో.. వివేకా హత్య కేసులో ఆరోపణలను సైతం అలాగే మోయాల్సి వచ్చేది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు అపనిందల భారం నుంచి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ద్వారా చంద్రబాబును తప్పించారు. అయితే అందుకు దశాబ్దాలు పట్టింది. వివేకా హత్య కేసు ఆరోపణల నుంచి సునీత పోరాటం తెలుగుదేశం పార్టీని బయట పడేసింది.
ఇప్పుడు సునీత పోరాటం వల్ల.. వివేకా హత్యలో పాత్రధారులు, సూత్రధారులెవరన్న ఒక్కో నిజం నెమ్మది నెమ్మదిగా బయటకు వస్తోంది. ఏకంగా సీబీఐ తన విచారణలో ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి పేర్లు ప్రస్తావించింది. దస్తగిరి ఆల్రెడీ అప్రూవర్‌గా మారారు. అందులో పాత్రధారులు-సూత్రధారులెవరన్నదీ స్పష్టంగా పేర్కొని, వాటిని కోర్టుకు సమర్పించింది. సీబీఐ గానీ, మరొకరు గానీ కోర్టుకు ఆధారాలు సమర్పించిన తర్వాత, అది అధికార డాక్యుమెంట్‌తో సమానమే. కోర్టు నుంచి ఎవరైనా ఆ కాపీలు తీసుకోవచ్చు. పిటిషనర్ న్యాయవాది కూడా వాటిని తీసుకోవచ్చు. ఇవన్నీ కాదు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసినది నిజాన్ని నిగ్గు తేల్చడానికి సునీత జరిపిన పోరాటం గురించి మాత్రమే.