కాపు ఓటు చీలిక కోసం కమలదళం కుట్రలు?
posted on Feb 15, 2023 @ 11:22AM
బీజేపీకి తెలుసు. అవును ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు కాదు, ఎప్పటికీ అధికారం అందని ద్రాక్షగానే మిగిలి పోతుందని బీజేపీ నాయకత్వానికి తెలుసు. అధికారం సంగతి సరే, ఒంటరిగా పోటీ చేసి ఒకటి రెండు సీట్లు గెలుచుకోవడం కూడా కమల దళానికి సమీప భవిష్యత్ లోనే కాదు, సుదీర్ఘ భవిష్యత్ లో కూడా అయ్యే పని కాదు. అంత వరకు ఎందుకు, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్టంలో ఒక శాతానికి మించి ఓట్లు తెచ్చుకోవడం కూడా అంత ఈజీ వ్యవహారం కాదని, మోడీ షా తో సహా బీజేపీ పెద్దలు అందరికీ తెలుసు.
అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా వైసీపీ అనుకూల వర్గం మాత్రం లేస్తే మనిషిని కాదన్నరీతిలో ఎగిరెగిరి పడుతోంది.తెలుగు దేశం, జనసేన పొత్తును చెడగొట్టేందుకు,తద్వారా కాపు ఓటును చీల్చి, వైసీపీకి మేలు చేసేందుకు బీజేపీలోని ఒక వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు దేశం, జనసేన పార్టీలు చేతులు కలిపితే, కాపు ఓటు గుంపగుత్తగా టీడీపీ, జేనసేన కూటమికి పడతాయని రాజకీయ విశ్లేషకులే కాదు రాజకీయాలతో సంబంధం లేని వారికీ కూడా తెలుసు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడిగా పోటీచేయడంవల్ల వైసీపీ 50 నుంచి 55 నియోజకవర్గాల్లో స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించింది. అంతే కాదు, 2019 ఎన్నికల్లో ప్రభుత్వ అనుకూల ఓటు చీలిపోవడం వల్లనే వైసీపీ అధికారంలోకి వచ్చింది. అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు.
అప్పటి నుంచి జనసేనకు వైసీపీకి మధ్య పోరు హోరాహోరీగా నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ నేతలు తమకు జనసేనతో పొత్తు ఉందని చెబుతున్నారు. మరోవంక, టీడీపీతో పొత్తు వద్దంటున్నారు. అఫ్కోర్స్ ఇంతవరకు పొత్తులకు సంబంధించి బీజేపీ సహా ఏ పార్టీ కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖరారు అయినట్లే అని ఉభయ పార్టీలతో పాటు రాజకీయ విశ్లేషకులు నిర్ణయానికి వచ్చారు.
అయితే, ఇక్కడ విశేషం ఏమంటే, వైసీపీ అనుకూల బీజీపీ వర్గం కాపు ఓటును చీల్చేందుకు ఓ వంక టీడీపీ, జనసేన మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ.. మరో వంక ప్రస్తుత రాజకీయ, కుల సమీకరణలో కీలకంగా మారిన కాపు ఓటును మూడు ముక్కలు చేసేందుకు పావులు కదుపుతోందని అంటున్నారు. ఇందులో భాగంగానే, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కాపు కార్డు ఎత్తుకున్నారని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఓబీసీ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అంశానికి సంబంధించి రాజ్యసభలో ప్రస్తావించిన జీవిఎల్ ఇప్పుడు తాజాగా గన్నవరం విమానశ్రయానికి రంగా పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నిజానికి, కాపుల కోటా విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో కాపులు జీవీఎల్ కు సన్మానం కూడా చేశారు. ఇక ఇప్పడు గన్నవరం విమానశ్రయానికి రంగా పేరు పెట్డడం అన్నది కేంద్ర ప్రభుత్వం తలచు కుంటే పెద్ద విషయం కాదు. నిముషాల్లో పని. అయితే రాష్ట్రంలో 22 శాతానికి పైగా ఉన్న కాపు ఓటును ముక్కలు చేసి పరోక్షంగా వైసీపీ మేలు చేసందుకు రాష్ట్ర నాయకులు చేస్తున్న కుట్రకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమోదం ఉందా? లేదా? అన్నది తేలవలసి వుందని అంటున్నారు.
నిజానికి బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఎప్పటికైనా రాష్ట్రంలో పట్టు సాధించాలంటే కాపులను తమ వైపుకు తిప్పుకోవడం ఒక్కటే మార్గమనే నిర్ణయానికి వచ్చాయి. అందుకే ప్రధానమంత్రి భీమవరం పర్యటనకు చిరంజీవిని ఆహ్వానించడం, పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా తమవైపే ఉండేలా ఒత్తిడి తెస్తుండటంతో పాటు కాపు వర్గానికి చెందిన సోము వీర్రాజునే మరోసారి అధ్యక్ష పదవిలో కొనసాగిస్తోందని అంటున్నారు. తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీ నష్టపోతుందని, సాధ్యమైన మేరకు కాపుల ఓట్లలో చీలిక తీసుకురావడంద్వారా ఈ పొత్తుకు గండి కొట్టాలని అధికార పార్టీ యోచిస్తోంది. బీజేపీ చేస్తున్న రాజకీయం కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. చివరకు, ఏమి జరుగుతుందో ఏమో కానీ, కాపు ఓటు చుట్టూ రాష్ట్ర రాజకీయం నడుస్తోందని, అంటున్నారు.