రెంటికీ చెడ్డ రేవడి.. గులాం నబీ ఆజాద్!
posted on Feb 14, 2023 @ 11:41AM
కాంగ్రెస్ ను వీడి సొంత కుంపటి పెట్టుకున్న గులాం నబీ ఆజాద్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది. కాంగ్రెస్ అధిష్ఠానంతో విభేదించి బయటకు వచ్చిన సమయంలో గులాం నబీ ఆజాద్ కు తోడుగా 19 మంది సీనియర్ నేతలు సైతం హస్తం పార్టీని విడిచి ఆజాద్ చేయిపట్టుకు నడిచారు. అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించారో.. అప్పుడే ఆజాద్ వినా ఆయనతో పాటుగా కాంగ్రెస్ ను వీడి బయటకు వచ్చిన వారు ఒక్కరొక్కరుగా సొంత గూటికి చేరారు. ఇటీవల ఢిల్లీలోకి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆజాద్ వెంట వెళ్లిన 19 మందిలో 17 మంది మళ్లీ హస్తం గూటికి చేరిపోయారు. మిగిలిన ఇద్దరూ కూడా అదే దారిన నడుస్తున్నారు.
ఒకప్పుడు కాంగ్రీస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన గులాం నబీ ఆజాద్, 2019 ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ అధిష్టానంపై తిర్గుబాటు జెండా ఎగరేసిన జీ 23లో కీలక భూమిక పోషించారు. ఇంచుమించు జి23 గ్రూపునకు నాయకత్వం వహించారు. రెండేళ్లకు పైగా పార్టీలో ఉంటూనే గాంధీ కుటుంబ పెత్తనంపై అసమ్మతి గళం వినిపించిన ఆజాద్, ఆ తరువాత కాంగ్రెస్ ను వీడి తన స్వంత రాష్ట్రం జమ్మూ కశ్మీర్ లో ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ(డీఏపీ) పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు.
ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే, మాజీ మంత్రులు, మరి కొందరు ముఖ్య నేతలు ఆయన వెంట కాంగ్రెస్ కు గుడ్బై చెప్పారు. డీఏపీలో చేరారు. అయితే, గులాం నబీ వెంట వెళ్ళిన నేతలందరు గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా మళ్లీ హస్తం పంచన చేరారు. అలా వచ్చి చేరిన వారిలో జమ్మూ కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పిర్జాదీ సయీద్ కూడా ఉన్నారు. ఆజాద్ తో కలిసి కాంగ్రెస్ ను వీడి వెళ్లిన నాయకులు వెంటనే తిరిగి సొంతగూటికి చేరడానికి ప్రధాన కారణం మాత్రం రాహుల్ భారత్ జోడో యాత్రేనని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల జయాపజయాలతో సంబంధం లేకుండా రాహుల్ పాదయాత్రకు వచ్చిన స్పందన ఆ నేతలలో పునరాలోచనకు కారణమైంది.
కేవలం రెండంటే రెండు నెలలు మాత్రమే డీఏపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్లు, కీలక నేతలూ కాంగ్రెస్ కు దూరంగా ఉన్నారు. ఈ రెండు నెలలలోనూ తాము కాంగ్రెస్ ను వీడడానికి చెప్పిన కారణాలలో డొల్లతనం అర్ధం కావడమే. అన్నిటికీ మించి రాహుల్ భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్ లో ప్రవేశించడానికి రోజుల ముందు ఈ చేరికలు సొంత రాష్ట్రంలో ఆజాద్ కు ఉన్న పట్టును ఎత్తి చూపాయి. ఇప్పడు జమ్మూ కాశ్మీర్ లో ఆజాద్ ఒంటరి. బీజేపీ ఉచ్చులో పడి ఆయన సొంత పార్టీకి దూరమయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఉన్న సమయంలోనే ఆయన బీజేపీకి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు ఆయనను పార్టీ నేతలకే కాదు.. క్యాడర్ కు సైతం దూరం చేశాయి. కాంగ్రెస్ ను బలహీనం చేయాలన్న బీజేపీ వ్యూహంలో ఆయన చిక్కుకున్నారు. అయితే అందుకు ఆయన పద్మ పురస్కారం మాత్రం దక్కింది. అలాగే గులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యత్వం ముగిసిన సందర్బంగా ప్రధాని మోడీ ఆయనపై కురిపించిన ప్రశంసల వర్షం ఆయన కమలానికి చేరువ అవుతున్నారా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి. ఆజాద్ కూడా అందుకు సుముఖంగా ఉన్నప్పటికీ.. అవసరం తీరాకా బోడి మల్లయ్య అన్న చందంగా బీజేపీ ఆజాద్ పట్ల వ్యవహరించడంతో ఆయన అనివార్యంగా సొంత కుంపటి పెట్టుకుని నామమాత్రపు రాజకీయ నేతగా మిగిలిపోవాల్సి వచ్చింది.
అదే కాంగ్రెస్ లో ఆయన ఉన్న సమయంలో పార్టీలో చాలా కీలక బాధ్యతలు నిర్వహించారు. పార్టీలో సంక్షేభం, సమస్య ఏదైనా తలెత్తితే ట్రబుల్ షూటర్ గా ఆయనే రంగంలోకి దిగాల్సి వచ్చేది. కాంగ్రెస్ ఆయనకు ఆ గుర్తింపు ఇచ్చింది. అయితే చేజేతులా ఆయన పార్టీలో ప్రాముఖ్యతను కాదనుకుని వేరు కుంపటి పెట్టుకుని రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోయారు.