కోమటిరెడ్డి వ్యాఖ్యల్లో కొత్తేముంది ?
posted on Feb 15, 2023 8:57AM
కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో ఏమో కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చెప్పిన జోస్యం నిజమై నిజంగానే హంగ్ వస్తే, ఆయన చెప్పినట్లుగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. అందులో అనుమానం లేదు. నిజానికి, రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ బీఆర్ఎస్ సహా బీజేపీని ఓడించి, మోడీని గద్దెదించాలని శ్రమిస్తున్న బీజేపీ/మోదీ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ తో చేతులు కలపడం మినహా మరో మార్గం లేదు. అదే విషయాన్ని కోమటిరెడ్డి చెప్పారు. కోమటి రెడ్డి వ్యాఖ్యలను ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తే విమర్శించ వచ్చు కానీ, రాష్ట్రపతి ఎన్నికల్లో ఏం జరిగిందనే విషయాన్ని గుర్తుచేసుకుంటే అప్పుడు ఢిల్లీలో జరిగిందే రేపు హైదరాబాద్ లో జరుగుతుందని ఎవరైనా భావిస్తే, అందులో తప్పు ఇసుమంతైనా లేదు.
రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో కలిసి వెళ్ళేది లేదని కేసీఆర్ కుండ బద్దలు కొట్టారు. కానీ చివరకు కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా కు బీఆర్ఎస్ ( అప్పుడు టీఆర్ఎస్) మద్దతు ఇచ్చింది. మద్దతు ఇవ్వడమే కాదు కీసీఆర్ ఆయన్ని నెత్తికెత్తుకుని ప్రచారం కూడా చేశారు. యశ్వంత్ సిన్హా ను హైదరాబాద్ కు ఆహ్వానించి ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రపతి అభ్యర్ధిని వీధుల్లో ఉరేగించారు. బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అంతే కాదు యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో బీఆరేస్ తరపున మంత్రి కేటీఆర్, మరి కొందరు మంత్రులు పార్టీ ఎంపీలు స్వయంగా పాల్గొన్నారు. కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి కూర్చున్నారు. ఇద్దరు ముఖ్య నాయకులూ మాట్లాడుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనే కాదు, ఉప రాష్ట్ర పతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్ధి మార్గరెట్ ఆల్వా కు మద్దతు ఇచ్చారు.
నిజమే రాష్ట్రపతి ఎన్నికల్లో అయినా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అయినా కేసీఆర్ ముందు మరో మార్గం లేదు. సో ... ఆయన తీసుకున్న నిరయాన్ని ప్రశ్నించ లేం. కానీ, రేపు తెలంగాణలో హంగ్ వస్తే లేదా కేంద్రంలో 2014కు ముందున్న పరిస్థితి వస్తే కేసీఆర్ అనివార్యంగా కాంగ్రెస్ తో చేతులు కలపక తప్పదు. కోమటి రెడ్డి చెప్పింది కూడా అదే ... అందులో తప్పు పట్టవసింది ఏమీ లేదు. నిజానికి గతంలో (2018)లో కర్ణాటకలో హంగ్ వచ్చినప్పుడు జేడీఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్ మిత్ర పక్షం) లౌకికవాద పరిరక్షణ కోసం కాంగ్రెస్ తో చేతులు కలిపింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారానికి ఐదారు సీట్లు దూరంగా ఆగిపోయిన బీజేపీని కాదని, కాంగ్రస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్న కుమార స్వామి ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి గతంలోకి వెళ్లి చూస్తే ఇలా బీజేపీకి వ్యతిరేకంగా లౌకికవాద పార్టీలు ఎన్నికల తర్వాత చేతులు కలిపిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి.
సరే .. ఆ విషయాన్ని అలా ఉంచి మళ్ళీ కోమటి రెడ్డి విషయానికి వస్తే ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు అన్నది పక్కన పెట్టి ఆలోచిస్తే ముఖ్యంగా సమయ సందర్భాలను బట్టి చూస్తే, కోమటిరెడ్డి వ్యుహత్మకంగానే బాంబు పేల్చారని అనుమానించ వలసి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసేఆర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను మెచ్చుకోవడం, పరోక్షంగానే అయినా కాంగ్రెస్ విధానాలను సమర్ధించడం అంతకు ముందు మంత్రి కేటీఆర్.. ఒక్క రేవంత్ రెడ్డి మినహా మిగిలిన కాంగ్రెస్ నాయకులు అందరూ బంగారు కొండలని కితాబు నీయడం, ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ వంటి పరిణామాల నేపద్యంలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించు కున్నాయి.కోమటిరెడ్డి ఢిల్లీలో ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్లు రావు. ఆ పరిస్థితిలో కాంగ్రెస్‌తో కలవడం ఒక్కటే బీఆర్‌ఎస్‌కు ఉన్న ఏకైక మార్గం. అందుకే వచ్చే ఎన్నికల ముందు ఎలాంటి పొత్తులు లేకపోయినా ఫలితాల తర్వాత మాత్రం కచ్చితంగా పొత్తులతో హంగ్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పడం వెనక ఏదో వ్యూహం ఉండకపోదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.