అదానీ మహా పతనం వెనుక కుట్ర?
అదానీ వ్యాపార సామ్రాజ్యం వేగంగా పతనం కావడం వెనుక మోడీ వ్యతిరేక శక్తుల కుట్ర ఉందా? ఈ కుట్రకు మరో వ్యాపార దిగ్గజం విప్రో ప్రేమ్ జీ ఆర్ధిక అండదండలున్నాయా? అన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్ ఎస్ ఎస్ మౌత్ పీస్ ఆర్గనైజర్ కథనం ఈ అనుమానాలను వ్యాప్తి చేస్తోంది. వాస్తవానికి ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ స్థానం వేగంగా పతనమౌతున్నది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడడానికి ముందు వరకూ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ.. ఆ తరువాత నెల రోజులు కూడా గడవక ముందే 26వ స్థానానికి పడిపోయారు. అదానీ గ్రూప్ షేర్ల విలువ సగానికి పైగా పడిపోయింది. ఆ పతనం ఇంకా కొనసాగుతోంది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గత నెల 25న అదానీ గ్రూప్‌పై నివేదిక వెలువరించిన సంగతి విదితమే. ఆ నివేదికలో అదానీపై ఎక్కౌంటింగ్ ఫ్రాడ్, కృత్రిమంగా షేర్ విలువలు పెంచడం, అవినీతి, మనీ లాండరింగ్ ఆరోపణలు చేసింది.
ఆ నివేదిక బహిర్గతమయ్యే నాటికి ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ 3 వ స్థానంలో ఉన్నారు. సంపదనలో ముకేష్ అంబానీని ఎప్పుడో దాటేశారు. అయితే ఆ నివేదిక వెలువడిన తరువాత అదానీ షేర్ల పతనం మొదలైంది. ఇప్పుడు అదానీ కంపెనీ సంపద విలువ 47.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే కేవలం 28 రోజుల వ్యవధిలో ఏకంగా 11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అ అదానీ గ్రూప్ స్టాక్స్ మార్కెట్ విలువ 57 శాతం పడిపోయింది. జనవరి 25వ తేదీన అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 19.2 లక్షల కోట్లుగా ఉంది. బుధవారం (ఫిబ్రవరి 22) నాటికి అది 8.2 లక్షల కోట్లకు తగ్గిపోయింది. అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీ షేర్లు బుధవారం 5 శాతం నష్టాన్ని చవిచూశాయి. తన కంపెనీల విలువను కాపాడుకోవడానికి, సంపద ఆవిరైపోకుండా ఉండేందుకు అదానీ చేపట్టిన, చేపడుతున్న దిద్దుబాటు చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు.
కమ్ బ్యాక్ ప్లాన్‌లో భాగంగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ బకాయి 1500 కోట్లను చెల్లించామని.. మార్చ్‌లో మరో 1000 కోట్లు చెల్లిస్తామని అదానీ పోర్ట్స్ ప్రకటించినా.. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో చెల్లించాల్సిన 5000 కోట్ల రుణాన్ని సైతం ముందుగానే చెల్లించామని..మార్చ్ నెలలో గ్రూప్ 500 మిలియన్ డాలర్ల బ్రిడ్జి లోన్ కూడా చెల్లించేస్తామని కంపెనీ పేర్కొన్నా మదుపర్లు విశ్వాసం చూపడం లేదు. రుణాల పునాదులపై వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన అదానీ గ్రూపులు వేగంగా పతనం దిశగా పయనిస్తున్నాయి.
కార్పొరేట్ దిగ్గజం అదానీ మహా పతనం వెనక మరో కార్పొరేట్ దిగ్గజం విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ, హస్తం ఉందనే ప్రచారం ఒకటి జోరుగా సాగుతోంది. నిజానికి, అదానీ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి, అసలేం జరిగింది అనే విషయంలో, ఆరోపణలు, ప్రత్యరోపణలతో పాటుగా అనేక ఊహగానాలు, వ్యూహాగానాలు వినిపిస్తున్నాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న, షార్ట్ సెల్లర్ స్టాక్ బ్రోకర్ సంస్థ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ నివేదిక ఆధారంగా జరుగతున్న చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది.
పార్లమెంట్ వేదికగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఆదానీకి మద్దతుగా, వ్యతిరేకంగా మోహరించడంతో కార్పొరేట్, రాజకీయ నెక్సస్ పై చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది. ఆ చర్చ సంగతి పక్కన పెడితే 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించి, ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న కుట్రలో భాగంగా అదానీని టార్గెట్ చేశారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అదానీ వ్యవహారంలో అంటీ ముట్టనట్లు ఉన్నట్లు ఉంటూనే, లోగుట్టును వెలికి తీసేందుకు గట్టిగా నడుం బిగించినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే అదానీ వ్యవహారంలో కుట్ర కోణాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్న భారత దర్యాప్తు సంస్థలు విప్రో యజమాని, పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్‌లో వచ్చిన కథనమే తార్కానం అంటున్నారు. హిండెన్‌బర్గ్ వెనుక ఒక కమ్యూనిస్ట్ నాయకుడి సతీమణి, జర్నలిస్ట్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా పేరున నడిచే ఒక స్వస్చంద సంస్థ, వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేసే ఒక వెబ్‌సైట్ ఉన్నాయనీ, వీటన్నింటికీ అజీమ్ ప్రేమ్‌జీ నడిపే స్వచ్చంద సంస్థ ఐపీఎస్ఎంఎఫ్ నిధులు సమకూరుస్తుందని ఆర్గనైజర్ కథనం పేర్కొంది.
ఆర్గనైజర్ కథనం ప్రకారం, ఆస్ట్రేలియాలో పర్యావరణ పరిరక్ష ముస్గులో పనిచేస్తున్న బాబ్ బ్రౌన్ ఫౌండేషన్ (బీబీఎఫ్) అనే స్వచ్చంద సంస్థ, అదానీవాచ్ డాట్ ఓఆర్ జి (Adaniwatch.org) అనే వెబ్‌సైట్‌ను నడుపుతోంది. అదానీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఉద్దేశించిన ఈ వెబ్‌సైట్‌కు అజీమ్ ప్రేమ్‌జీ నిర్వహించే సోరోస్, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్‌ఫెల్లర్, ఒమిడ్యార్, బిల్ గేట్స్‌లు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు. హిండెన్‌బర్గ్ కేవలం బంటు. అసలు సూత్రధారి అజీమ్ ప్రేమ్‌జీ, అతని కోసం పనిచేస్తున్న వామపక్ష భావజాల సంస్థలు, వ్యక్తులు అని ఆర్గనైజర్ కథనం పేర్కొంది. అలాగే, ది వైర్ ఎడిటర్ సీమా చిస్తీ ( సిపిఎం నేత సీతారాం ఏచూరి భార్య) కూడా అదానీ వ్యతిరేక కుట్రలో భాగస్వామిగా ఉన్నారని, ఆస్ట్రేలియాలో అదానీ కాల్ ప్రాజెక్ట్స్ కు వ్యతిరేకంగా 2017లోనే ది వైర్ కథనాలు రాసిందని ఆర్గనైజర్ పేర్కొంది. అదానీ ఒక సాకు మాత్రమే, అజీమ్ ప్రేమ్‌జీ లక్ష్యం మోడీ. అందుకే ఆల్ట్‌న్యూస్, ది వైర్, ది కారవాన్, ది న్యూస్ మినిట్ వంటి మోదీ వ్యతిరేక వెబ్‌సైట్‌లన్నింటికీ ప్రేమ్ జీ భారీ మొత్తంలో డబ్బు ఇస్తున్నారని, ఆర్గనైజర్ ఆరోపించింది.
అయితే, ఎంత కాదన్నా నిప్పు లేనిదే పోగారాదు. అలాగే, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరు ఎంతగా ఎదురు దడి చేసినా, నిజం నిలకడ మీద తెలుస్తుంది. అయితే ఈ లోగా పుణ్య కాలం కాస్తా గడిచి పోతుంది. ఏమి జరిగిన ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అంతా గప్ చిప్.. అందుకే నిజం ఎంతో నిగ్గు తేల్చేందుకు ప్రతిపక్షాలు కోరుతున్నా జేపీసీ కాకున్నా, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణ జరగవ వలసిన అవసరం అయితే ఉందని అంటున్నారు.