కరవమనలేదు.. విడవమనలేదు.. ఎమ్మెల్యేలతో భేటీలో మారిన జగన్ స్వరం
posted on Feb 14, 2023 @ 11:04AM
ఎమ్మెల్యేలూ మీ తీరు మారాల్సిందే.. నాతో కలిసి పనిచేయాల్సిందే.. లేదంటే కష్టం, ఇందులో ఏం మొహమాటాల్లేవు అంటూ ఎమ్మెల్యేలకు జగన్ ఇప్పటికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదే పని మరో సారి చేశారు. పని తీరు బాగాలేదంటూ ఈ సారి 30 మంది ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు ఆయన తన వద్ద ఉన్న సర్వేలు, నివేదికలను చూపించారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసుందుకు పార్టీ టికెట్ దక్కాలంటే పని తీరు మెరుగుపరచుకోవడం వినా మరో దారి లేదని హెచ్చరించారు.
ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సోమవారం (ఫిబ్రవరి 13) భేటీ అయ్యారు. ససాక్ష్యంగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో ఓ 30 మంది ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడపగడపకు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని జగన్ వాళ్లకు క్లాస్ పీకారు. అయితే గతంలో నిర్వహించిన సమావేశంలో గడపగడపకు కార్యక్రమాన్ని నిర్లక్స్యం చేసిన వారి సంఖ్య 45 అని చెప్పిన జగన్ ఈ సమావేశంలో దానిని 30కి కుదించారు. ఇందుకు కారణం ఆ 15 మంది తన వార్నింగ్ తరువాత పద్ధతి మార్చుకుని దారిలో పడ్డారా? లేక ఇటీవలి కాలంలో పార్టీ ఎమ్మెల్యేలలో కనిపిస్తున్న తిరుగుబాటు ధోరణికి జంకి ఆ సంఖ్య తగ్గించేశారా? అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు జగన్ పరిస్థితి కరవమంటే కప్పకు కోసం.. విడవ మంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది. ప్రతి నియోజకవర్గంలోనూ సిట్టింగ్ కు పోటీగా సమన్వయకర్తలు, ఇన్ చార్జిలు అంటూ నియామకాలు జరపడంతో.. ఎమ్మెల్యేకు అనుకూలంగా మాట్లాడితే ఇన్ చార్జిలకు, ఇన్ చార్జిలకు అనుకూలంగా మాట్లాడితే ఎమ్మెల్యేలకు కోపం వచ్చి మొదటికే మోసం వచ్చే పరిస్థితి పలు నియోజకవర్గాలలో ఉంది.
అంతే కాకుండా పని తీరు పేరు చెప్పి చర్యలు తీసుకుంటే పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. గత సమావేశంతో పోలిస్తే, తాజా సమావేశంలో జగన్ స్వరం మారింది. గళం మారింది. బుజ్జగింపు ధోరణే కనిపించింది. ఎమ్మెల్యేలకు ఊరట కలిగించడానికా అన్నట్లు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా కలిసి వచ్చింది. దీంతో గడపగడపకూ కార్యక్రమానికి బ్రేక్ వచ్చింది. దాని స్థానంలో ఈ నెల 20న జరిగే మా భవిష్యత్ నువ్వే జగన్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యేలను జగన్ ఆదేశించారు. ఆదేశించారు అనే కంటే అభ్యర్థించారు అనడం బెటర్ అనిపించేలా ఆయన ధోరణి ఉందని ఆ సమావేశానికి హాజరైన కొందరు ఎమ్మెల్యేలు జోకులు వేయడమే కాదు.. ఆఫ్ ది రికార్డ్ అంటూ మీడియాకు కూడా లీకులిచ్చారు. అదే గతంలో గడపగడపకు సమీక్షా సమావేశంలో జగన్ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే టికెట్లు ఇచ్చేది లేదంటూ ఖరాఖండీగా చెప్పేశారు.
రెండు నెలలే గడువు ఇచ్చారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందే ఎమ్మెల్యేల ప్రొగ్రస్ రిపోర్టును బట్టి ఎవరెవరికి టికెట్లు ఇస్తానన్న విషయాన్ని ప్రకటించేస్తానని చెప్పేశారు. వారంలో నాలుగు రోజుల చొప్పున, నెలకు 16 రోజులు కూడా తిరగకపోతే ఎలా, రోజుకు గంటో రెండు గంటలో కాదనీ, ఏడు నుంచి ఎనిమిది గంటలు గ్రామాల్లో తిరగాలని దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు సమస్యలు చెబుదామన్నా వినడానికి ఇసుమంతైనా ఇష్టపడలేదు. అదే తాజా సమావేశం దగ్గరకు వచ్చే సరికి ఆగ్రహం, హెచ్చరికా షరా మామూలే అయినా స్వరంలో తీవ్రత లేదు. మాటల్లో పదును లేదు. ఎలాగోలా సమావేశం ముగించి.. వారిని పార్టీకే అంటిపెట్టుకుని ఉండేలా చేస్తే చాలన్న తాపత్రయమే కనిపించింది. గత ఏడాది సెప్టెంబర్ లో జరిగిన సమావేశానికీ.. ఇప్పుడు సోమవారం (ఫిబ్రవరి 13) జరిగిన సమావేశానికీ మధ్య ఏం జరిగిందని జగన్ ఇలా జావకారిపోయారు,
అన్న ప్రశ్నకు పార్టీ శ్రేణులలో.. ప్రజలలో వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తుండటమే కారణమని బదులిస్తున్నారు. అప్పట్లో వచ్చే ఎన్నికలలో వైనాట్ 175 అంటూ వచ్చే ఏన్నికలలో 175కు 175 అసెంబ్లీ స్థానాలలోనూ విజయం సాధించాలన్న పగటి కలను సాకారం చేసుకోవడానికి జగన్ నేల విడిచి సాము చేశారు? పార్టీ ఎమ్మెల్యేల సహనాన్ని తెగేదాకా లాగారు. ఇంకే ముంది గట్టు తెగింది. అసమ్మతి, అసంతృప్తి, ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నాయి. నెల్లూరు జిల్లాతో మొదలైన తిరుగుబాటు పవనాలు రాష్ట్ర మంతటా వ్యాపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ స్థితిలో జగన్ తాజాగా పార్టీ నేతలతో నిర్వహించిన కీలక భేటీని మరో సారి అధికారంలోకి వస్తే చాలు అన్న టోన్ లో ఎమ్మెల్యేలను బుజ్జగించడానికే సరిపెట్టేశారు. ఇంత కాలం తాను ముఖం చాటేసి ఎమ్మెల్యేలను గడపగడపకూ పంపిన జగన్ ఇక తాను కూడా ప్రజల మధ్యకు వెళ్లి తన ప్రభుత్వం చేసిన మంచిని వివరించడానికి రెడీ అయ్యారు. ఎమ్మెల్యేలతో తాజా భేటీలో ఇదే విషయం చెప్పారు.