డామిట్ .. బీఆర్ఎస్ కథ అడ్డం తిరిగింది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహరచనలో ఆరి తేరిన దిట్ట. ఎత్తుకు పైఎత్తులువేసి ప్రత్యర్ధులను చిత్తు చేయడంలో ఆయనకు ఆయనే సాటి... అయితే, ఇదంతా నిన్నటి వైభోగం. ఈ రోజు ఆయన ఏమిటో, ఏమి చేస్తున్నారో ఆయనకే అర్థమవుతున్నట్లు లేదు. ఆయన ముందులా స్థిరంగా స్థిమితంగా ఏ విషయం పైనా దృష్టి కేంద్రీకరించలేక పోతున్నారు. ఒకడుగు అటు ఒకడుగు ఇటు వేసి చివరకు ఎటు కాకుండా తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీలో క్యాడర్ లో గందరగోళం ఏర్పడుతోంది. ఇది ఎవరో పరాయి వాళ్ళో ప్రతిపక్షాలో చేస్తున్న ఆరోపణ కాదు. ముఖ్యమంతి కేసీఆర్ ఇన్నర్ సర్కిల్ లోని కీలక నేతలే ఆఫ్కోర్స్ ఆఫ్ ద రికార్డ్ అనుకోండి.. ఇలాటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇటీవల ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన ఒకటికి రెండు సార్లు తన డొల్ల తనాన్ని బయట పెట్టుకున్నారని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ముఖ్యంగా, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) బహిష్కృత నేత, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విషయంలో ఆయన తీసుకున్న యూ టర్న్, పార్టీ ఇమేజ్ ని బాగా డ్యామేజి చేసిందని అంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి కేసేఆర్ ఈటల పేరు తీసుకున్నప్పుడు, సభలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన ‘అంతరంగం’ అర్థం కాలేదు. ఆయన ఏదో సైటైరిక్ గా ఈటలపై వ్యంగ బాణాలు విసురుతున్నారని భావించారు. అందుకే ఎమ్మెల్యేలు ఒకరి వెంట ఒకరు ఫక్కున నవ్వారని అయితే ముఖ్యమంత్రి ఒకటికి పదిసార్లు ఈటలను పొగడ్తలతో ముంచెత్తిన తర్వాత గానీ, అసలు విషయం అర్థం కాలేదని అంటున్నారు. అర్థమైన తర్వాత ఈటలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సయోధ్య కోరుకుంటున్నారనే విషయం అర్థమై, విస్తు పోయామని అంటున్నారు. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హైలైట్ గా నిలిచిన ఈటల ఎపిసోడ్ విషయంలో, పార్టీ నాయకులు మీడియా ముందు చిలక పలుకులు పలుకులు పలుకుతున్నా వ్యక్తిగత చర్చల్లో మాత్రం ఈటల ఎపిసోడ్ కేసేఆర్ ఇమేజ్ ని, పార్టీ ఇమేజ్ ని గట్టిగా దెబ్బతీసిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈటల విషయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయం పర్యవసానంగానే ఈరోజు అధికారం చేజారే పరిస్థితి వచ్చిందని కొంచెం చాలా ఆలస్యంగా ముఖ్యమంత్రి గుర్తించారని అంటున్నారు.
మరోవంక ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నుంచి బహిష్కరించడం, ఆ తర్వాత కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడం కేసీఆర్ చేసిన రెండు చారిత్రక తప్పిదాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఈటలను మెడ పట్టి బయటకు గెంటిన తర్వాతనే భారాస కష్టాలు మొదలయ్యాయి. కేసేఆర్ అడుగులు తడబడడం వ్యూహాలు దెబ్బతినడం మొదలైందని, ఇక అక్కడి నుంచి తప్పు వెంట తప్పు దొర్లుతూ వస్తోందని అంటున్నారు. ఈ అన్నిటి పర్యవసానంగానే, ఈ రోజు ఒక్క కేసేఆర్ మాత్రమే కాదు, కేటీఆర్, హరీష్ రావు కూడా శాసన సభలో ఈటలను పొగిడి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయవలసి వచ్చిందని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.
అదలా ఉంటే జాతీయ రాజకీయాల విషయంలోను కేసీఆర్ చరిత్రక తప్పిదమన దగ్గ తప్పిదం చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రస్థానం ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. నిజానికి, కాంగ్రెస్ ను కాదని, జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక వేదిక ఏర్పాటు అయ్యే పని కాదు, అందుకే కేసీఆర్ ఎన్నిగడపలు తొక్కినా శరద్ పవార్ మొదలు తేజస్వీ యాదవ్ వరకు ఎందరితో మంతనాలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది.
చివరకు జాతీయ రాజకీయాల్లో మనుగడ కోసం పార్టీ పేరు మార్చుకున్నా అదీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దేశం మొత్తంలో ఎక్కడా కూడా తీసేసిన తసిల్దార్లు తప్ప సత్తా ఉన్నా నాయకుడు ఎవరూ బీఆర్ఎస్ చెంతకు రాలేదు. అందుకే, పార్టీ పేరు మార్పు వలన ఒక విధంగా రెంటికీ చెడిన రేవడిలా ఉభయ భ్రష్టత్వం నెత్తికి ఎత్తుకున్నట్లు అయిందని అంటున్నారు. అందుకే కామోసు, బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ప్రస్థానం, రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ, హత్యలుండవు, అనే నానుడిని మరో మారు రుజువు చేస్తున్నట్లుగా ఉందని అంటున్నారు.