సోము వీర్రాజుపై భూ కబ్జా ఆరోపణలు!
posted on Feb 15, 2023 @ 1:37PM
ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న బీజేపీకి అడుగడుగునా అడ్డంకులూ, అవాంతరాలే ఎదురౌతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపై పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. సోము వీర్రాజు వైఖరిని నిరసన వ్యక్తం చేస్తూ ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
నేడో, రేపో ఆయన బీజేపీకి రాజీనామా చేస్తారని కూడా ఆయన సన్నిహితులు అంటున్నారు. మరో వైపు సోము వీర్రాజు పార్టీ జిల్లా అధ్యక్షులను మారుస్తూ తీసుకున్న నిర్ణయం కూడా వివాదాస్పదంగా మారింది. ఇవన్నీ అలా ఉంచితే.. ఏపీ బీజేపీలో సోము వీర్రాజు వర్గం రాష్ట్రంలో అధికార వైసీపీతో అంటకాగుతోందన్న విమర్శలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్త మౌతున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షమైన జనసేనతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ.. జగన్ కు వీర్రాజు సన్నిహితంగా మెలుగుతూ అధికార పార్టీకి ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పలు సందర్భాలలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా సోము వీర్రాజు తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. అలాగే తనకు రాష్ట్ర నాయకత్వంతో పని లేదనీ, ఏదైనా బీజేపీ అగ్రనాయకత్వంతోనే తేల్చుకుంటాననీ పవన్ ఒక సందర్బంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజకీయంగా సోము వీర్రాజుకు పార్టీలోనూ, మిత్రపక్షం నుంచే కాకుండా బయట నంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తమ భూములను సోము వీర్రాజు కబ్జా చేశారంటూ దళిత సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా బుధవారం ( ఫిబ్రవరి 15) ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా దళితులు ఆందోళనకు దిగారు. సోము వీర్రాజు దళితుల భూములను కబ్జా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డికి సోముకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో కిషన్ రెడ్డి కారును అడ్డుకుని సోముకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో విజయవాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయమేమిటంటే.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ నాయకుడు లక్ష్మీపతి రాజా, వల్లభనేని సుధాకర్ లు మంగళగిరి ఎన్ఆర్ఐ కాలేజీకి సమీపంలో దళితులకు చెందిన ఆరు ఎకరాల భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సమతా సైనిక్ దళ్ (ఎస్ఎస్ డి)ఆరోపిస్తోంది.
వరప్రసాద్ అనే దళితుడి భూమిని కబ్జా చేసేందుకు సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. సోము వీర్రాజు కు వ్యతిరేకంగా ఈ నెల 18న ఏపీ బీజేపీ కార్యాలయ ముట్టడికి దళిత సంఘాలు పిలుపు ఇచ్చాయి. ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో నెలకొన్న గ్రూపు తగాదాల నేపథ్యంలో సోము వీర్రాజుకు వ్యతిరేకంగా దళితుల నిరసనలు, ఆందోళనలూ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.