మొక్కుబడి తంతుగా అసెంబ్లీ సమావేశాలు

ఉమ్మడి రాష్ట్రంలో శాసన సభ సమావేశాలు జరిగినన్ని రోజులూ అసెంబ్లీ కళకళ లాడుతూ ఉండేది. అర్థరాత్రి వరకు చర్చలు జరిగిన సందర్భాలలో కూడా సభ్యుల చాలావరకు సభలోనే ఉండేవారు.  అసెంబ్లీ లోపలే కాదు, బయట కూడా ప్రజా సంఘాల హడావిడి కనిపించేది. ఇందిరా పార్క్  వద్ద ‘ధర్నా చౌక్’ ఉన్నంత వరకు  అనేక ప్రజా సంఘాల ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం ఉండేది. అలాగే, సామాన్య ప్రజల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగతున్నాయంటే, అదో రకమైన ఉత్కంఠ, ఇక మీడియా సంగతి అయితే చెప్పనే అక్కర లేదు. అయితే, ఇప్పడు అదంతా గతించిన చరిత్రగా మిగిలి పోయింది.ఇప్పడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఒక మొక్కుబడి తంతుగా మారిపోయాయనే మాటే వినవస్తోంది. నిజానికి, ఆరు నెలలకు ఒకసారి తప్పక అసెంబ్లీ సమావేశం కావాలనే రాజ్యాంగ నిబంధన ఇంకా వుంది కాబట్టి  కానీ, లేదంటే ఇది కుడా ఉండేది కాదేమో అనే మాట కూడా విమర్శకుల నుంచి నిపిస్తోంది.  ఇక ఇప్పుడు జరుగతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విషయానికి వస్తే, సభ్యుల హాజరు రోజు రోజుకు పలచబడుతోంది. దీంతో అసెంబ్లీ సమావేశాల పట్ల, ప్రజా ప్రతినిథులకు ఆసక్తి లేకుండా పోతోందనే అభిప్రాయం బలపడుతోంది. నామినేటెడ్ సభ్యుడితో కలిపి తెలంగాణ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 120... అందులో 105మంది  అధికార బీఆర్ఎస్ సభ్యులు. కానీ, ఏ రోజునా కూడా సభకు హాజరైన సభ్యుల సంఖ్య మూడంకెల సంఖ్యకు చేరడం లేదు. బడ్జెట్  సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు (ఫిబ్రవరి 3) కాస్త పర్వాలేదనిపించినా, రెండో రోజు నుంచి సభ్యుల అటెండెన్స్ పడిపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేదా మంత్రి కేటీఆర్‌‌ సభలో ఉన్నప్పుడు 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు సభలో ఉంటున్నారు. ఈ ఇద్దరూ లేనప్పుడు సభ్యుల సంఖ్య 50 కూడా దాటడం లేదు. మధ్యాహ్నం సెషన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు కలిపి 30 నుంచి 40 మంది మాత్రమే ఉంటున్నారు. నిన్న (గురువారం) సాయంత్రం పద్దులపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమాధానం ఇచ్చే టైంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కలిపి 29 మందే ఉన్నారు. ఇందులో ప్రతిపక్ష సభ్యులు ఏడుగురు ఉండగా, అధికార పక్షం సభ్యులు 22 మంది ఉన్నారు.  అసెంబ్లీకి వచ్చినప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు సభలో కంటే లాబీలో, మంత్రుల చాంబర్లలో ఎక్కువగా కనిపిస్తున్నారు. అదేమని అడిగితే, నియోజక వర్గ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లేందుకే, మంత్రుల చుట్టూ తిరుగుతున్నామని చెప్పు కొస్తున్నారు. నిజానికి, శాసన సభ సమావేశాలు నిర్వహించేందే అందుకు.  ప్రశ్నోత్తరాలు, జీరో అవర్  ఇతర నిబంధనలు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఉన్నాయి..అందుకోసమే రాజ్యాంగ నిర్మాతలు ఆ నిబంధనలను పొందు పరిచారు. అయితే, సభలో మొర పెట్టుకున్న వినే నాథుడు లేక పోవడం వల్లనే మంత్రులను ప్రత్యేకంగా కలిసి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పు కొస్తున్నారు. సభలో సమస్యలు లేవనెత్తడానికి అవకాశం లేదని  అందుకే సభ బయట మంత్రులను కలుస్తున్నామంటున్నారు. ఇక సభలో ప్రజాసమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష సభ్యులు కూడా సభలో కొంత సేపు, బయట కొంతసేపు ఉంటున్నారు.ఇంకొంత మంది ఎమ్మెల్యేలైతే అటెండెన్స్ వేయించుకోవడానికే వస్తున్నాం అన్నట్లుగా. సభలో కాసేపు ఉండి వెళ్లిపోతున్నారు. నిజానికి స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పలుమార్లు హెచ్చరిస్తున్నా ఫలితం కనిపించడం లేదని అంటున్నారు. నిజానికి, ఇదే ధోరణి ఇలాగే కొనసాగితే, ప్రజాస్వామ్య ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని అంటున్నారు.

తెలంగాణ గడ్డపై పొడుస్తున్న కొత్త పొత్తులు.. టార్గెట్ బీజేపీయేనా?

తెలంగాణలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు దగ్గరవుతున్నాయా? రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు  చేతులు కలుపుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అంతే కాదు ఈ రెండు పార్టీల కలయిక వెనక బీఆర్ఎస్  పోషిస్తున్న పౌరోహిత్యం పాత్రను కూడా కొట్టి వేయలేమని రాజకీయ  పరిశీలకులు తాజా పరిస్థితులు, పరిణామాలను విశ్లేషిస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో లౌకికవాద పార్టీలన్నీ ఎన్నికలకు ముందు ఏక తాటిపైకి వచ్చినా రాక పోయినా, ఎన్నికల తర్వాత  అవసరాన్ని బట్టి  ఖాయంగా ఒకటవుతాయని అంటున్నారు. అందుకోసమే ఇప్పటి నుంచే స్కెచ్  సిద్దం చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని కలిశారని, అలాగే  అసెంబ్లీలో బీఆర్ఎస్, ఎంఐఎం జుగల్బందీకి కూడా సెక్యులర్ సంబంధాలే  కారణమని అంటున్నారు.   నిజానికి రాష్ట్రంలో బీజేపీకి అధికారంలోకి వచ్చేంత సీనుందా అంటే  లేదు. కానీ, రాష్ట్రంలో బీజేపీ చాప కింద నీరులా బలాన్ని పుజుకుంటోందనే అనుమానం అయితే బీఆర్ఎస్ సహా బీజేపీ ప్రత్యర్హ్ది పార్టీలు అన్నిటినీ వెంటాడుతోందని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో సిపిఐ, సిపిఎం పార్టీలు ఏ విధంగా అయితే, మతోన్మాద బీజేపీ ఓడించడం కోసం అంటూ బీఆర్ఎస్ తో చేతులో కలిపాయో,  రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం సహా బీజేపీ యేతర పార్టీలన్నీ లౌకికవాదం కోసం ఒకటైనా ఆశ్చర్య పోనవసరం లేదని  పరిశీలకులు భావిస్తున్నారు.  రాష్ట్రంలో బీజేపీ బలం పరిమితమే అయినా, అధికార బీఆర్ఎస్ సహా ప్రధాన పార్టీలన్నీ బీజేపీనే బూచిగా చూస్తున్నాయి. ఒక విధంగా భయపడుతున్నాయని అంటున్నారు. అందుకు ప్రధానంగా జాతీయ స్థాయిలో బీజేపీకి బలమైన నాయకత్వం ఉండడం ఒక కారణం అయితే, దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనమవడం మరొక కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు.ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో రోజు రోజుకు మరింత బలహీనమవుతోంది. మరో వంక కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలలో అధిక సంఖ్యాకులు కాళ్ళ పారాణి ఆరక ముందే అధికార పార్టీలో చేరిపోవడంతో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం బలపడుతోంది. అయినా ఇప్పటికీ బీజేపీ ప్రభావం పెద్దగా ఉండక పోవచ్చును కానీ, ముందు ముందు బీజేపీ బలం పుంజుకుంటే... అనే ఆలోచనతో బీజేపీ యేతర  పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చేదుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.   ఈ నేపథ్యంలో ఇటీవల ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారని. అంటున్నారు. అయితే, ఇది రాజకీయ భేటీ కాదని కాంగ్రెస్ నేతలు అంటున్నా, అంతకు ముందు రోజే జూనియర్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య  అసెంబ్లీలో హాట్ హాట్ గా నడిచిన పరస్పర విమర్శల నేపథ్యంలో ఈ భేటికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆలాగే, ఈ సంవాదం సందర్భంగా ఒవైసీ ఉద్దేశ పూర్వకంగా అన్నారో  వ్యూహత్మకంగానే అన్నారో గానీ, ఈసారి ఎన్నికల్లో 50 స్థానల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని, కనీసం 15 మందిని గెలిపించుకుంటుందని అన్నారు. ఆ వెంటనే 15 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఎంఐఎం మద్దతు బీఆర్ఎస్ కే ఉంటుంది అన్నారు. మరోవంక అక్బరుద్దీన్‌తో భేటీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తలోమాట మాట్లాడారు. ఎంఐఎం కూడా సెక్యూలర్ అంటుంది కాబట్టే తాము అక్బరుద్దీన్‌ను కలిశామని జగ్గారెడీ అంటే, అక్బరుద్దీన్‌తో జరిగింది రాజకీయ భేటీ కాదని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని కాంగ్రెస్ నాయకులు కొంచెం చలా స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. అదే సమయంలో ఈ భేటీలో  రాజకీయ అంశాలు చర్చకు రాలేదని భట్టి పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా తెలిసిన వ్యక్తి కావడంతో మంచి చెడు మాట్లాడుకున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ తమతో చెప్పారని తెలిపారు. పొత్తుల వ్యవహరం ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకోవసి ఉంటుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే, బీజేపీయేతర పార్టీలు సెక్యులర్ వేదికను సిద్దం చేస్తునట్లు ఉందని అంటున్నారు.

ఫిబ్రవరి17న సంచలన ప్రకటన?.. ముందస్తా?.. కేటీఆర్ పదోన్నతా?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయో లేదో కానీ, ముందస్తు ఎండలు, ముందస్తు విద్యుత్ కోతలు అయితే వచ్చేశాయి. అలాగే ముందస్తు ఎన్నిక వాతావరణ కూడా ముందుగానే తలుపులు తడుతోంది. ఓ వంక ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలు, పబ్లిక్ మీటింగ్స్ తో ప్రజల మధ్యకు వెళుతుంటే, అధికార బీఆర్ఎస్ అసెంబ్లీని వేదిక చేసుకుని ఎన్నికల ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఐటీ మంత్రి కేటీఆర్  తన వాగ్దాటితో విపక్షాలను గుక్క తిప్పుకోకుండా ఏకి పారేస్తున్నారు. చివరకు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా మాజీ మిత్రుని వాగ్ధటిని మెచ్చుకున్నారంటే  కేటీఆర్ ఏ స్థాయిలో దూకుడు పెంచారో వేరే చెప్పనక్కరలేదు. ఒక విధంగా అసెంబ్లీలో డీఫ్యాక్టో ముఖ్యమంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నకేటీఆర్  అటు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ఇటు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను ఒకే రీతిన ఏకి పారేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేస్తూ కేటీఆర్ చేస్తున్న విమర్శలు ఎన్నికల ప్రసంగాల హీటును దాటేశాయి. అందుకే మంత్రి కేటీఆర్ దూకుడు చూస్తే ముందస్తు ఎన్నికలకు సంకేతమా అనే అనుమానాలకు తావిచ్చేలా ఉందని అంటున్నారు. ముందస్తుకు రంగం సిద్డంవుతుందా, లేక కేటీఆర్ పదోన్నతికి సన్నాహాలు జరుగ్తున్నాయా అనే అనుమానాలు సైతం వ్యక్త్రమవుతున్నాయి. అసెంబ్లీ లోపలే కాదు, బయట కూడా ఇటు ప్రభుత్వ, అటు పార్టీ వ్యవహరాలలోనూ కేటీఆర్ దూకుడు పెంచారు. ఒక విధంగా ఆయన ‘కొత్త చెప్పుల్లో’ కాలుపెట్టేందుకు సిద్డం అవుతున్నారా అనే అనుమనాలు కూడా  వ్యక్తమౌతున్నాయి.  ఈనెల 17న సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న సభకు భారీ జనసమీకరణ చేయాలని గ్రేటర్‌ నేతలకు మంత్రి కేటీ రామారావు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10వేల మంది హాజరయ్యేలా చూడాలని నేతలకు సూచించారు. నిజానికి, సచివాలయం ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమం, కానీ, సచివాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, బీఆర్ఎస్ సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ భారీ సభ ను విజయ వంతం చేసే బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారు.   హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేసమయ్యారు. ఈనెల (ఫిబ్రవరి) 17న సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న సభకు భారీ జనసమీకరణ చేయాలని గ్రేటర్‌ నేతలకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈనెల 13న గ్రేటర్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఇతర జిల్లాలకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్‌ఛార్జిలుగా నియమించనున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. ఈనెల 13 నుంచి 17వరకు ఇన్‌ఛార్జిలు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్‌ సూచించారు. సచివాలయం ప్రారంభోత్సవం, పరేడ్‌గ్రౌండ్‌ సభను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  అదలా ఉంటే, కేటీఆర్  లో కనిపిస్తున్న కొత్త ఉత్సాహం దేనికి సంకేతం అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే అదేమిటనే విషయంలో మాత్రం క్లారిటీ లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులు ఫిబ్రవరి 17  సంచలన ప్రకటన ఉంటుందని అంటున్నారు.

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ తొలి రోజు.. టీమ్ ఇండియాదే ఆధిపత్యం

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఈ రోజు నాగ్ పూర్ వేదికగా ఆరంభమైన తొలి టెస్టు తొలి రోజు టీమ్ ఇండియా పూర్తి ఆధిపత్యం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రీలియాను  ముందు టీమ్ ఇండియా పేసర్లు మహ్మద్ షమీ, సిరాజ్ లు, ఆ తరువాత స్పిన్నర్లు జడేజా, అశ్విన్ లు తేరుకోనీయ లేదు. టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. ఇక షమీ, సిరాజ్ లు చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. స్కిప్పర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. రాహుల్ 20 పరుగులు చేసి మర్ఫీ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నైట్ వాచ్ మన్ గా వచ్చిన అశ్విన్ ఇంకా ఖాతా ప్రారంభించలేదు. రోహిత్ శర్మ 56 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ప్రస్తుతం టీమ్ ఇండియా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే 100 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో ఇంకా 9 వికెట్ల ఉండటంతో టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యత సాధించే అవకాశం ఉంది. 

రేవంత్ పాదయాత్రలో సీనియర్లేరీ?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు జనం ఆదరణ కనిపిస్తోంది. రోజు రోజుకూ ఆ ఆదరణ పెరుగుతున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ జనాదరణ వచ్చే ఎన్నికలలో ఓట్లుగా మారుతుందా? అంటే మాత్రం సానుకూల సమాధానం రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. ఆయన పాదయాత్రలో కాగడా పెట్టి వెతికినా పార్టీ సీనియర్లు ఎవరూ కనిపించకపోవడమే. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి సహా సీనియర్లందరూ రేవంత్ పాదయాత్రకు దూరంగా ఉంటున్నారు. యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పై చేసిన వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ నేతలు  విమర్శలతో ఆయనపై మూకుమ్మడి దాడి చేస్తుంటే.. పార్టీ సీనియర్లెవరూ ఆయనకు మద్దతుగా గళం విప్పడం లేదు. రేవంత్ రెడ్డి- పార్టీ సీనియర్ల మధ్య అగాధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా ఠాక్రే వచ్చి సమస్య పరిష్కరించినట్లుగా చెబుతున్నా.. విభేదాలు సమసిపోలేదనీ, అగాధం అలాగే ఉందనీ పరిశీలకులు అంటున్నారు. అందుకు ఉదాహరణగా రేవంత్ పాదయాత్రనే చూపుతున్నారు. కనీసం పార్టీ కోసమైనా రేవంత్ పాదయాత్ర ప్రారంభం రోజున ఆయనతో అడుగు కలపడానికి కూడా సీనియర్లెవరూ రాలేదు. పీసీసీ సారథ్య బాధ్యతలు రేవంత్ చేపట్టిన నాటి నుంచీ కూడా రేవంత్ రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం చేస్తున్నది ఒంటరి పోరాటమే. ఎంత ఒంటరి పోరు సాగించినా.. సీనియర్ల సహాయ నిరాకరణతో ఆయన పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి ఎలా తీసుకురాగలుగుతారన్న సందేహం రాజకీయ వర్గాలలోనే కాదు, సామాన్య ప్రజలలోనూ కలుగుతోంది. ఆ కారణంగానే ఆయన యాత్రకు ఆదరణ లభిస్తున్నా.. అది ఎన్నికల విజయానికి దోహదపడుతుందా అంటే మాత్రం ఔననే జవాబు రావడం లేదని పరిశీలకులు సైతం చెబుతున్నారు. మరో వైపు రాష్ట్రంలో అధికార భారాసా పై ఉన్న ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమష్టిగా పని చేయడమే కాదు.. జాతీయ నాయకత్వం కూడా సంపూర్ణ సహకారం అందిస్తోంది. బండి సంజయ్ రాష్ట్రంలో విడతల వారీగా చేసిన పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర నాయకులు సంపూర్ణంగా సహకారం అందిస్తే.. అన్ని విడతల ప్రారంభ, ముగింపు సభలకు పార్టీ మాజీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రస్తుత అధ్యక్షుడు నడ్డా వంటి నాయకులు వచ్చి మద్దతు తెలిపారు. అటువంటి సహకారం రేవంత్ రెడ్డికి ఇక్కడి రాష్ట్ర నాయకుల నుంచీ, అటు పార్టీ హైకమాండ్ నుంచీ కూడా కరవైంది. 

ఏపీలో ముందస్తు తథ్యమేనా?

నిన్న మొన్నటి దాకా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మోనార్క్ ... అధికార వైసీపీలో ఆయన మాటకు ఎదురు చెప్పే ధైర్యం  ఉన్న మగాడు మరొకరు లేరు  అనుకున్నారు.  అయితే, గదిలో వేసి కొడితే  పిల్లి అయినా పులిలా తిరగబడుతుంది. ఇప్పుడు వైసీపీలో అదే జరుగుతోందని అంటున్నారు. అంతేకాకుండా  ఇంత కాలం పిల్లి మేడలో గంట కట్టేది ఎవరు అని ఎదురుచూసిన వైసీపీ అసమ్మతి నేతలకు, కడప నేతలు దారి చూపితే, నెల్లూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు  ఆనం రామనారాయణ రెడ్డి,  కోటం రెడ్డి, మేకపాటి  ఒకే సారి గంట కొట్టడంతో  ఇప్పుడు వైసీపీలో అస్మతి గంటలు గణగణ మోగుతున్నాయి. నిజానికి ఇంతవరకు పైకి వినిపించిన అసమ్మతి గొంతులు కొన్నే అయినా, సగం మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు లోపల లోపల కుతకుత ఉడికి పోతున్నారు. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.  మరో వంక ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 నుంచి దిగివచ్చి, అత్తెసరుతో అయినా గట్టీక్కితే చాలానే నిర్ణయానికి వచ్చారని, అయన సన్నిహిత వర్గాల సమాచారంగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి  నిన్న మొన్నటి వరకు తమకు టికెట్ వస్తుందో రాదో అనే ఆందోళనతో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు ఇప్పడు టికెట్ వస్తుందేమో  మళ్ళీ పోటీ చేయక తప్పదేమో అని భయపడుతున్నట్లు ఎమ్మెల్యేల ముఖ్య అనుచరులు గుసగుసలు పోతున్నారు.  ఇదలా ఉంటే  తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ఎమ్మెల్యేల గుండెల్లో మరో బాంబు పేల్చారు. అసమ్మతికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చేస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. అయితే  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కునేందుకు టీడీపీ సిద్ధంగా ఉందనీ,  టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో ఈ అంశాలపై చర్చించామన్నారు. ముందస్తు ఎన్నికల అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. టీడీపీ వ్యూహకమిటీ సమావేశంలో కూడా ఎన్నికలకు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాగే  ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు.. ప్రజల్లో ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తి, ప్రతిపక్షానికి వస్తున్న ప్రజాదరణ, పవన్‌ బస్సు యాత్రతో భయం మొదలైందన్నారు. అందుకే జగన్‌ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు.  ప్రజల్లో తన గ్రాఫ్ పడిపోయిందనే  ముఖ్యమంత్రి పల్లె నిద్రలు, బస్సు యాత్రల పేరుతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారన్నారు.  టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్‌‌సీపీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందన్నారు. ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్న జగన్ ఉద్దేశానికి అనుగుణంగానే టీడీపీ ముందుకు వెళ్లనుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేని స్థితికి ప్రభుత్వం వచ్చేసిందన్నారు. మార్చి బడ్జెట్ ఇచ్చే వెసులు బాటుతో 3, 4నెలలు కాలయాపన చేశాక జూలై నాటికి ప్రభుత్వం చేతులెత్తేయడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆగస్ట్ , సెప్టెంబర్లో ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని వ్యాఖ్యానించారు. అలానే జగన్ గ్రాఫ్ చాలా వేగంగా పడిపోయిందని.. ఇటీవలే కొన్ని సర్వేలు కూడా వచ్చాయన్నారు. తన గ్రాఫ్ పూర్తిగా సున్నాకు పడిపోక ముందే ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు చెప్పారు. పోలీసులతో లోకేష్ పాదయాత్రను, చంద్రబాబుని అడ్డుకోవాలని చూస్తున్నా.. వారిసభలు, సమావేశాలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారన్నారు. మరోవైపు జనాన్ని బలవంతంగా తరలించినా, అంగన్ వాడీ డ్వాక్రా సిబ్బందితో ప్రజల్ని భయపెట్టి తీసుకొచ్చినా ముఖ్యమంత్రి సభలు వెలవెలబోతున్నాయన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే...  టీడీపీ అన్ని స్థానాల్లో గెలవడం ఖాయమన్నారు. టీడీపీ తరుపున క్రియాశీలంగా పనిచేసే క్లస్టర్ ఇన్ ఛార్జ్ లు, మండల నేతలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో ప్రజల్ని పోలింగ్ బూత్‌ల దగ్గరకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించబోతున్నామన్నారు. జగన్ ఇచ్చే సొమ్ము కోసం ఆశపడి ఎన్నికల్లో నిలవడానికి ముందుకొచ్చేవారుంటారు తప్ప..  కచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో వచ్చేవారు ఉండరన్నారు. ముఖ్యమంత్రి పల్లెనిద్రలతో పల్లెలు మేల్కొని, ప్రజలంతా ఆయన్ని నిలదీసి, నిగ్గదీసి  తరిమితరిమి కొట్టడం ఖాయమన్నారు. అయితే ముందస్తుకు వెళ్ళినా ఓటమి తధ్యమని తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి ముందస్తుకు ఎందుకు వెళతారని కొందరు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. కానీ, ముందస్తుకు వెళితే కొంత గౌరవప్రదమైన ఓటమితో సరిపెట్టుకోవచ్చని, చివరి వరకు ఆగి ఎన్నికలకు వెళితే చివరకు మిగిలేది .. సున్నా.. అని సర్వేలు స్పష్టం చేయడంతో ముఖ్యమంత్రి ముందస్తు వైపు మొగ్గు చూపుతున్నట్లు చెపుతున్నారు.

తెలంగాణలో ఎలక్షన్ టైమ్.. షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది.  హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం (ఫిబ్రవరి 9) ఎన్నికల షెడ్యుల్ ప్రకటించింది.  ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 16న నోటిఫికేషన్, మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ జరగనుందని ఎన్నికల సంఘం పేర్కొంది. సయ్యద్ అస్సాన్ జాఫ్రి ఎమ్మెల్సీ పదవి కాలం త్వరలో ముగియనుండగా మహబూబ్​నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి పదవీకాలం 2023 మార్చి 29న ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకూ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాదే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు రెండు  ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు ఎనలేని ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  

ఎవరా నలుగురు?.. బండి హస్తిన యాత్రపై ఐఏఎస్ లలో టెన్షన్!

రాష్ట్రంలోని అవినీతి అధికారుల భరతం పడతామంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఆయన ఓ నలుగురు కలెక్టర్ల అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలున్నాయనీ, వాటితో ఆ నలుగురిపై   డీవోపీటీ ఫిర్యాదు చేస్తానంటూ హస్తిన బయలుదేరారు. దీంతో రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. అదే సమయంలో ఆ నలుగురు కెలక్టర్లు ఎవరా అన్న చర్చ కూడా ప్రారంభమైంది.   నలుగురు ఐఏఎస్‌లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని  బండి సంజయ్ ఇటీవల సంచలన  వ్యాఖ్యలు చేసిన విషయం విదతమే.  అన్ని ఆధారాలూ ఉన్నాయన్న ఆయన వారి పేర్లు అయితే బయటపెట్టలేదు.  అయితే ఆయన నలుగురు ఐఏఎస్ ల అవినీతి అన్న క్షణం నుంచే వారెవరా అన్న చర్చ రాష్ట్ర బ్యూరోక్రాట్లలో మొదలైంది.  ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబీకులతో సన్నిహితులుగా మెలిగే అధికారులే లక్ష్యంగా బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అలాగే   ధరణి పేరిట అక్రమాలకుపాల్పడిన వారి జాబితాతో బండి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఆ పోర్టల్ ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసిన వారిపైనే గత కొద్ది  రోజులుగా బీజేపీ దృష్టి సారించిందనీ, ఆ విషయంపై ఆ పార్టీ ఆరోపణలు కూడా గుప్పించిందనీ అంటున్నారు. బండి ఐఏఎస్ అధికారుల అవినీతిపై  మాట్లాడినప్పటి నుంచీ, బండి వద్ద ఉన్న జాబితాలో ఉన్నవారెవరన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.  ఆయన చెప్పిన నలుగురు ఎవరై ఉంటారా అన్న ఉత్కంఠ, ఆందోళన రాష్ట్రంలోని అధికారులలో వ్యక్తమౌతోంది. ముఖ్యంగా కేసీఆర్ తో, ఆయన కుటుంబీకులతో సత్సంబంధాలు ఉన్న వారిలో ఆ గుబులు మరింత ఎక్కువగా ఉందని అంటున్నారు.  అయితే బండి వద్ద ఐఏస్ ల అవినీతి బాగోతం ఆధారాలు నిజంగా ఉన్నాయా? ఉంటే అవి ఆయనకు ఎలా లభించి ఉంటాయన్న కోణంలోనూ అధికార వర్గాలలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. కొందరైతే అధికారుల అవినీతి వాస్తవమేననీ అంటున్నారు. ఆ వివరాలు, అధికారుల అవినీతి నచ్చని వారి ద్వారానే అంది ఉంటుందన్న మాట కూడా వినిపిస్తోంది.  అవినీతి అధికారుల బండారం బయటపెడతానంటూ బండి సంజయ్ బుధవారం (ఫిబ్రవరి 8) హస్తిన విమానం ఎక్కారు. నేడో రేపో ఆ అవినీతి అధికారులపై సాక్ష్యధారాలతో డీవోపీటికి ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పారు.  దీంతో బాబూస్ లో తెలంగాణలోని అధికారులలో వారెవరై ఉంటారు. బండి చెబుతున్న అవినీతి అధికారులలో తమ పేరు ఉందా? అన్న టెన్షన్ క్షణక్షణానికీ పెరిగిపోతోంది.

అదానీ సంక్షోభం వెనక అజీమ్ ప్రేమ్ జీ ?

నిజం గడప దాటే సరికి, అబద్ధం పపంచాన్ని చుట్టి వస్తుందని అంటారు. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, కార్పొరేట్ దిగ్గజం అదానీ మహా పతనం వెనక మరో కార్పొరేట్ దిగ్గజం విప్రో అధినేత  అజీమ్ ప్రేమ్ జీ హస్తం ఉందనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. నిజానికి  అదానీ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి అసలేం జరిగింది  అనే విషయంలో ఆరోపణలు, ప్రత్యరోపణలతో పాటుగా అనేక ఊహగానాలు, వ్యూహాగానాలు వినిపిస్తున్నాయి. పట్టుమని పది మంది ఉద్యోగులు లేని  అమెరికా స్థావరంగా పనిచేస్తున్న షార్ట్ సెల్లర్  స్టాక్ బ్రోకర్ సంస్థ  హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌  నివేదిక ఆధారంగా జరుగతున్న చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంతలోనే రాజకీయ జొరబడి పార్లమెంట్ వేదికగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఆదానీకి అటూ ఇటూ నిలవడంతో కార్పొరేట్  రాజకీయ అక్రమ సంబంధాలపై పాత, కొత్త చర్చ తెరమీదకు వచ్చింది.  హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌  నివేదిక ఆధారంగా జరుగతున్న చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంతలో ఒక్క సారిగా కుప్పకూలిన అదానీ మార్కెట్ విలువ మెల్లిమెల్లిగా పెరుగుతున్న వార్తలు వస్తున్నాయి. మరోవంక  2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించి  ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నట్లు అనుమానిస్తున్న కుట్రలో భాగంగా అదానీని టార్గెట్ చేశారనే అనుమనాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అదానీ వ్యవహారంలో అంటీ ముట్టనట్లు ఉన్నట్లు ఉంటూనే లోగుట్టును వెలికి తీసేందుకు గట్టిగా నడుం బిగించినట్లు తెలుస్తోంది.  అందులో భాగంగానే అదానీ వ్యవహారంలో కుట్ర కోణాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్న భారత దర్యాప్తు సంస్థలు విప్రో కంపెనీ యజమాని  పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్‌లో వచ్చిన కథనం ఆ అనుమానాలను మరింతగా బలపరిచే విధంగా ఉందని అంటున్నారు. హిండెన్‌బర్గ్ వెనుక ఒక కమ్యూనిస్ట్ నాయకుని సతీమణి, జర్నలిస్ట్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా పేరున నడిచే ఒక స్వస్ఛంద సంస్థ, వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేసే ఒక వెబ్‌సైట్ ఉందని, వీటన్నింటికీ అజీమ్ ప్రేమ్‌జీ నడిపే స్వచ్చంద సంస్థ  ఐపీఎస్ఎంఎఫ్ నిధులు సమకూరుస్తోందని ఆర్గనైజర్‌ కథనంలో పేర్కొంది.  ఆర్గనైజర్‌ కథనం ప్రకారం, ఆస్ట్రేలియాలో పర్యావరణ పరిరక్షణ ముస్గులో పనిచేస్తున్న బాబ్ బ్రౌన్ ఫౌండేషన్ (బీబీఎఫ్) అనే స్వచ్చంద సంస్థ,  Adaniwatch.org అనే వెబ్‌సైట్‌ను నడుపుతోంది. అదానీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఉద్దేశించిన ఈ వెబ్‌సైట్‌కు అజీమ్ ప్రేమ్‌జీ నిర్వహించే సోరోస్, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్‌ఫెల్లర్, ఒమిడ్యార్, బిల్ గేట్స్‌లు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు.  హిండెన్‌బర్గ్ కేవలం బంటు. అసలు సూత్రధారి అజీమ్ ప్రేమ్‌జీ అతని కోసం పనిచేస్తున్న వామపక్ష భావజాల సంస్థలు, వ్యక్తులు  అని ఆర్గనైజర్‌ పేర్కొంది. అలాగే  ది వైర్ ఎడిటర్ సీమా చిస్తీ ( సిపిఎం నేత సీతారం ఏచూరి భార్య) కూడా అదానీ వ్యతిరేక కుట్రలో భాగస్వామిగా ఉన్నారని ఆస్ట్రేలియాలో అదానీ కాల్ ప్రాజెక్ట్స్ కు వ్యతిరేకంగా 2017లోనే  ది వైర్ కథనాలు రాసిందని ఆర్గనైజర్‌ పేర్కొంది. అదానీ ఒక సాకు మాత్రమే  అజీమ్ ప్రేమ్‌జీ లక్ష్యం మోడీ. అందుకే ఆల్ట్‌న్యూస్, ది వైర్, ది కారవాన్, ది న్యూస్ మినిట్ వంటి మోదీ వ్యతిరేక వెబ్‌సైట్‌లన్నింటికీ ప్రేమ్ జీ  భారీ మొత్తంలో డబ్బు ఇస్తున్నారని ఆర్గనైజర్‌ ఆరోపించింది. అయితే ఎంతకాదన్నా నిప్పు లేనిదే పోగారాడు. అలాగే ఎవరు ఎన్ని  ఆరోపణలు చేసినా ఎవరు ఎంతగా ఎదురు దాడి చేసినా, నిజం నిలకడ మీద తెలుస్తుంది. అయితే ఈ లోగా పుణ్య కాలం పూర్తయి పోతుంది. ఏమి జరిగిన ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అంతా గప్ చిప్.. అందుకే, నిజం ఎంతో నిగ్గు తేల్చేందుకు ప్రతిపక్షాలు కోరుతున్నా జేపీసీ కాకున్నా  సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణ జరగవ వలసిన అవసరం అయితే ఉందని అంటున్నారు.

సర్కార్ మెడకు ఫాం హౌస్ కేసు?

ఫాం హౌస్ కేసు తెలంగాణ సర్కార్ మెడకు చుట్టుకున్నట్లే కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఈ కేసు దర్యాప్తు సీబీఐ ప్రారంభించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సుప్రీం కోర్టులో వాదనల సమయంలో తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది ఈ కేసులో ఫైల్స్ సీబీఐ చేతికి వెళితే ఇక మిగిలేదేం ఉండదని చేసిన వ్యాఖ్యే ఫాం హౌస్ కేసులో సీబీఐ దర్యాప్తు అంటే  కేసీఆర్ సర్కార్ ఎంతగా ఆందోళన పడుతోందో అర్ధమౌతుంది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూరాష్ట్ర హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించినా భారాస సర్కార్ కు ఊరట లభించలేదు.  సుప్రీం ఈ కేసు విచారణకు ఫిబ్రవరి 17న చేపట్టనుంది. అంత వరకూ స్టేటస్ కో ఉత్తర్వ్యులు ఇవ్వాలన్నరాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. దీంతో ఏ క్షణంలోనైనా సీబీఐ ఫాం హౌస్ కేసు దర్యాప్తును ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.   కేసుకు సంబంధించి వివరాలు, ఆడియో, వీడియో, డాక్యుమెంట్లు  అందజేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ ఐదు లేఖలు రాసింది.  సుప్రీంకోర్టులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్ దొరక లేదు.  సీబీఐ ఇప్పటికే ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఒక బృందం దర్యాప్తును ఎక్కడ నుంచి ప్రారంభించాలన్న విషయంపై కసరత్తు ప్రారంభించిందన్న ప్రచారం జరుగుతోంది. సీబీఐ దర్యాప్తు.. తమను కోనుగోలు చేయడానికి బీజేపీ భారీ ఆఫర్ చేసిందంటూ భారాసా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు నుంచి సీబీఐ ప్రారంభమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు.  ఆడియా, వీడియో లీక్ నుంచి మొదలైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మొత్తం మీద సీబీఐ ఇహనో ఇప్పుడో దర్యాప్తు ప్రారంభించడం తథ్యమనే విషయంలో మాత్రం అందరిలోనూ ఏకాభిప్రాయమే వ్యక్తంఅవుతోంది.  అయితే ఈ కేసు విషయంలో సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించే విషయంలో మాత్రం రాజకీయ వర్గాలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని విధాలుగా అడ్డంకులు సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఫాం హౌస్ కేసు దర్యాప్తు విషయంలో సీబీఐకి అడుగడుగునా అడ్డంకులు సృష్టించే వ్యూహాన్నే అనుసరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, డాక్యుమెంట్లను ఇవ్వడం లేదని సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు మొరపెట్టుకున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ నుంచి స్పష్టమైన తీర్పు వెలువడిన తర్వాత కూడా ఇదే తరహా ఇబ్బంది ఎదురవుతున్నదని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.  ఐదుసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో మళ్లీ హైకోర్టును ఆశ్రయించాలని సీబీఐ భావిస్తోంది.  

కౌ హగ్ డే ..వాలంటైన్స్ డే కేంద్రం కొత్త థీమ్!

ఆవులను ప్రేమించాలి. గోమాతకు రక్షణ కల్పించాలి. గోవధకు వ్యతిరేకంగా దేశంలో ఎన్నో ఉద్యామాలు జరిగిన చరిత్ర ఉంది. దేశంలో గో రక్షణ కోసం జరుగుతున్న ప్రయత్నాలు మోడీ సారథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత జోరందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వాలంటైన్స్ డేకు కొత్త థీమ్ ను ప్రతిపాదించింది. వాలంటైన్స్ డేను హగ్ ఏ కౌ థీమ్ తో నిర్వహించుకోవాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ పేర్కొంది. ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారన్నసంగతి విదితమే. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవాన్ని భారతీయ సంస్కృతిలో విడదీయరాని బంధం ఉన్న గోవులకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్వహించుకోవాలని ప్రజలకు కేంద్ర పశుసంవర్ధక శాఖ కోరింది. ప్రేమికుల దినోత్సవం రోజున ప్రతి వారూ ఒక గోవును హగ్ చేసుకుని దేశ సంస్కృతికి పెద్ద పీట వేయాలని కోరింది. గోమాతను పూజిస్తే శుభం జరుగుతుందన్న భారత సంస్కృతికి అద్దంపట్టేలా ఈ ఏడు వాలంటైన్స్ డేను కౌ హగ్ డేగా పాటించాలని కోరింది.

మహీ మహిమ.. రైతు అవతారంలో అభిమానుల హృదయాలు దోచాడు

మహేంద్రసింగ్ ధోనీ.. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్. తన సారథ్యంలో దేశానికి మూడు ప్రపంచ కప్ లు సాధించి పెట్టాడు. ఐపీఎల్ లో కూడా చెన్నై సారథిగా తనదైన కెప్టెన్సీతో అత్యధిక సార్లు టైటిల్ విజేతగా జట్టును నిలిపాడు. మైదానంలో అయినా, బయట అయినా ధోనీ స్టైల్ సెపరేట్ అన్నట్లుగా అతని తీరు ఉంటుంది. బైక్ లు అంటే అమితంగా ఇష్టపడతాడు. ధోనీకి ఉన్నన్ని బైక్ లు మరెవరికీ ఉండవంటే అతివయోక్తి కాదు. ఇవన్నీ కాకుండా క్రికెట్ లోని మూడు  ఫార్మట్లలోనూ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కు సారథిగా ఉన్న ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తరువాత తీరిక వేళల్లో వ్యవసాయం చేస్తున్నాడు. మిస్టర్ కూల్ గా అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ధోనీ.. విరామంలో వ్యవసాయదారుడిగా మారి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా ట్రాక్టర్ తో ధోనీ పొలంలో దుక్కిదున్నుతున్న ఫోటో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. ఆయన ఈ ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల మంది లైక్ చేశారు. వేల మంది షేర్ చేశారు.  

అదానీ.. మోడీ ఏమిటీ మిస్టరీ?

ప్రధాని నరేంద్ర మోడీకి పార్లమెంటైనా, బహిరంగ సభ అయినా, మన్ కీబాత్ అయినా, పరీక్షా పే చర్చా అయినా ఒకటే.. తనపై విమర్శకులను దేశ ద్రోహులు, అభివృద్ధినిరోధకులూ అంటూ ఎదురు దాడి చేయడం.. గత పాలకుల తప్పిదాలను పదే పదే ఎత్తి చూపడం.. ఔను ఆయన పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రం వాడతారు. అదే విషయాన్ని లోక్ సభ సాక్షిగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ఇచ్చిన సమాధానంలో మరోసారి తేటతెల్లమైంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ లోక్ సభ వేదికగా నేరుగా ప్రధానికి పలు ప్రశ్నలు సంధించారు. వ్యాపారవేత్త అదానీతో ఆయనకు ఉన్న పరిచయాలు సంబంధాలపై సూటి ప్రశ్నలు సంధించారు.  ఇటీవలే దేశం అంతటా పాదయాత్ర చేసి వచ్చిన రాహుల్ గాంధీ.. ఆ సందర్భంగా ప్రజలు తనతో మొరపెట్టుకున్న సమస్యలనూ ప్రస్తావించారు. ఆయన ప్రసంగం ఆద్యంతమూ అలరించింది. సభ్యులు శ్రద్ధగా విన్నారు. అదానీ, మోడీ సంబంధాలపై ఇంత కాలం కేవలం ఆరోపణలుగానే ఉన్న అంశాలను రాహుల్  పార్లమెంట్‌లో  మంగళవారం చేసిన ప్రసంగంలో సాక్ష్యాలతో అవి వాస్తవాలే అని నిర్ధారించారు.   రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని  ఇచ్చే సమాధానంలో తన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెబుతారని రాహుల్ గాంధీయే కాదు అందరూ ఆశించారు.  అయితే మోడీ సమాధానం ఇచ్చారు. కానీ రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఏ అంశాన్నీ ఆయన స్పృశించలేదు.  అదానీతో తన సంబంధాల గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను అసలు పట్టించుకోనే లేదు. పోనీ జనంలో అదానీ, మోడీ సంబంధాలపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఇసుమంతైనా ప్రయత్నించలేదు. సందేహాలను నివృత్తి చేసేలా ఆయన ప్రసంగంలో ఒక్కటంటే ఒక్క మాట కూడా లేదు.  విపక్షాలు.. దేశం అభివృద్ధి చెందుతూంటే.. అసూయ పడుతున్నారని ఎదురు దాడి చేశారు. తనకు వస్తున్న అశేష ప్రజాదరణను విపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. అభివృద్ధికి ఆటంకాలు సృష్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. వాటికి దేశ అభివృద్ధి, దేశ రక్షణపై చిత్తశుద్ధి లేదన్నారు. కశ్మీర్ లో ఇప్పుడున్న స్వేచ్ఛ తన పుణ్యమేనని చెప్పుకున్నారు. తన ఎనిమిదేళ్ల పాలనలో  దేశం ఎన్నో విజయాలు సాధించిందని చెప్పుకున్నారు. విపక్షాలను ఎద్దేవా చేశారు. ఎగతాళి చేశారు. ఇంకా లోక్ సభలో తన ప్రసంగంలో మోడీ ఎన్నో ఎన్నెన్నో గొప్పలు చెప్పుకున్నారు. విపక్షాలను ఏకి పారేశారు. ఇన్ని చేసిన, ఇంత చెప్పిన మోడీ అదానీ తో తనకున్న సంబంధాలపై వస్తున్న ఆరోపణల గురించి కానీ, విమర్శల గురించి కానీ నోరు మెదపలేదు. అసలవి తన చెవికి చేరలేదన్నట్లుగా మోడీ ప్రసంగం ఉంది. రాహుల్ గాంధీ అంత స్పష్టంగా, అంత నేరుగా మోడీని ఉద్దేశించి అదానీతో మీ అనుబంధం ఏమిటి? అని నిలదీసినా మోడీ పట్టించుకోలేదు. ఈ విషయంలో మోడీ ప్రదర్శిస్తున్న మౌనం ఆయనపై ఆరోపణల సీరియస్ నెస్ ను తగ్గించజాలవు సరికదా మరింత పెరిగేందుకు కారణమౌతాయి. ఆ లాజిక్ ను కూడా మోడీ పట్టించుకోలేదు.  అదానీ వ్యాపార అక్రమాలే ఇప్పుడు దేశం.. దేశం అనేమిటి అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మోడీ సిఫారసుతో ఆయనకు అనుక దేశాలలో వ్యాపార విస్తరణకు అవకాశం అభించిందన్న ఆరోపణలు ఉన్నాయి.   అన్నిటికీ మించి అదానీ సంస్థల్లో లక్షల కోట్ల ప్రజాధనం ఉంది. ఆ సంస్థ వద్ద ప్రజాధనం లక్ష కోట్లకుపైగానే ఉంది. ఆ కంపెనీల్లో షేర్లు కొన్న లక్షల మంది తీవ్రాతి తీవ్రంగా నష్టపోయారు.  మోడీ, కేంద్ర సర్కార్ మద్దతు కారణంగానే అదానీ అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్న ఆరోపణలకు వెల్లువెత్తుతున్నాయి. వీటికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మోడీపై ఉంది. ఔను ఒక్క మోడీపైనే ఉంది. అయినా అదానీ మోడీ మౌనం వహించడం ఒక అంతుపట్టని మిస్టరీగా మారింది.  

ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం.. ఆగ్రహిస్తారా.. బుజ్జగిస్తారా?

ఎమ్మెల్యేలూ మీ తీరు మారాల్సిందే.. నాతో కలిసి పనిచేయాల్సిందే.. లేదంటే కష్టమ్స్, నో మొఖమాటమ్స్  అంటూ ఎమ్మెల్యేలకు జగన్ ఇప్పటికే  స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పని తీరు బాగాలేదని కొందరు ఎమ్మెల్యేలను పేరుపెట్టి మరీ హెచ్చరించారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’పై తాడేపల్లిలో గతంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ మంత్రులు , పార్టీ సమన్వయకర్తల సమావేశంలో  సీఎం జగన్  పనితీరు మార్చుకోకపోతే టికెట్లు ఇచ్చేది లేదంటూ ఖరాఖండీగా చెప్పేశారు. రెండు నెలలే గడువిస్తున్నాననీ హెచ్చరించారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందే సీటు ఇవ్వని వారి పేర్లు ప్రకటిస్తానని జగన్ అప్పుడే విస్పష్టంగా చెప్పేశారు.  ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకుని, సత్వర పరిష్కారం చేయాల్సిన ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయొద్దని జగన్ అప్పుడు పార్టీ ఎమ్మెల్యేలను గట్టిగా హెచ్చరించారు. వారంలో నాలుగు రోజుల చొప్పున, నెలకు 16 రోజులు కూడా తిరగకపోతే ఎలా అని  ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు గంటో రెండు గంటలో కాదనీ, ఏడు నుంచి ఎనిమిది గంటలు గ్రామాల్లో తిరగాలన్నారు. అదే గ్రామంలో పార్టీ నేతల ఇళ్లల్లో భోజనాలు చేయాలని, ప్రతి గడపకూ కచ్చితంగా సమయం కేటాయించాలని కూడా జగన్ ఆదేశించారు.   సమస్యల్ని గుర్తించి తక్షణమే పరిష్కరించాలని  ఆదేశించారు.   పనితీరు సరిగ్గా లేని వారిపై వేటు తప్పదని పార్టీ అధినేత జగన్ చేసిన హెచ్చరికలు అప్పట్లో ఎమ్మెల్యేల్లో కలవరం రేపాయి. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ సమావేశం జరిగింది. ఆ తరువాత కూడా జగన్ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికలలో వైనాట్ 175 అంటూ వచ్చే ఏన్నికలలో 175కు 175 అసెంబ్లీ స్థానాలలోనూ విజయం సాధించాలన్న పగటి కలను సాకారం చేసుకోవడానికి జగన్ నేల విడిచి సాము చేశారు? పార్టీ ఎమ్మెల్యేల సహనాన్ని తెగేదాకా లాగారు. ఇంకే ముంది గట్టు తెగింది. అసమ్మతి, అసంతృప్తి, ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నాయి. నెల్లూరు జిల్లాతో మొదలైన తిరుగుబాటు పవనాలు రాష్ట్ర మంతటా వ్యాపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో జగన్ మరో సారి   పార్టీ నేతలతో కీలక భేటీకి సిద్ధమయ్యారు. అన్ని వైపుల నుంచీ ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబుకుతున్న వేళ, ఆర్థిక అష్టదిగ్బంధనంలో సర్కార్ చిక్కుకుపోయి.. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి సైతం అప్పుపుట్టని స్థితిలో ఆయన ఇప్పుడు పార్టీపై దృష్టి పెట్టారు. ఎలా నడుచుకోవాలో, ప్రజాభిమానాన్ని ఎలా కూడగట్టుకోవాలో దిశా నిర్దేశం చేయడానికి సిద్ధమౌతున్నారు. అంతే కాదు.. ముఖ్యమంత్రిగా ఇంత వరకూ  ప్రతి పర్యటనా పరదాల మాటున చేసిన జగన్ ఇప్పుడు జనం ముందుకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇంత కాలం తాను ముఖం చాటేసి ఎమ్మెల్యేలను గడపగడపకూ పంపిన జగన్ ఇక తాను కూడా  ప్రజల మధ్యకు వెళ్లి తన ప్రభుత్వం చేసిన మంచిని వివరించడానికి రెడీ అవుతున్నారు. ఇందు కోసమే ఆయన మరో సారి పార్టీ ఎమ్మెల్యేలతో భేటీకి సిద్ధమౌతున్నారు. అందు కోసం పార్టీ కీలక నేతలతో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు రెడీ చేశారు. వీటికి తోడు ఐప్యాక్ సర్వేలు, అవి కాకుండా తాను సొంతంగా చేయించుకున్న మరో రెండు సర్వే రిపోర్టులతో ఎమ్మెల్యేలకు క్లాస్ పీకేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గ సమన్వయ కర్తలతో ఆయన భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీశారు. నెల్లూరు జిల్లా పరిణామాల నేపథ్యంలో ఈ సారి అయన ఎమ్మెల్యేలతో భేటీలో ఏం మాట్లడతారన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే గతంలోలా కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ లకు దిగితే మొదటికే మోసం వచ్చే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని, ఇప్పటి వరకూ అంతర్గతంగా ఉన్న అసంతృప్తి భగ్గుమంటుందన్న ఆందోళన పార్టీ కీలక నేతల్లో వ్యక్తం అవుతోంది. ఒకింత అనునయంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు. అయితే పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? అన్నట్లు ఆ విషయాన్ని జగన్ కు చెప్పడానికి మాత్రం ఎవరూ సాహసించడం లేదు. మరో వైపు ఆనం, కోటం రెడ్డిల ఎపిసోడ్ తో జగన్ రగిలిపోతున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. పని తీరు బాగాలేని, గడపగడపకు కార్యక్రమంలో సీరియస్ గా పాల్గొనని వారిపై జగన్ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. అలాగే ప్రజలలో ఎమ్మెల్యేలకు ఉన్న ఆదరణ, వారి పనితీరు ఆధారంగా తాను స్వయంగా తెప్పించుకున్న నివేదికలు, సర్వేల ఆధారంగా ప్రోగ్రస్ రిపోర్టు కూడా రూపొందించుకున్నారనీ, దాని ఆధారంగా ఎమ్మెల్యేలకు కర్తవ్యబోధ, దిశానిర్దేశం చేయడానికి జగన్  సిద్ధమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో అంటే ఈ నెల 13న పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో భేటీకి జగన్ ముహూర్తం ఫిక్స్ చేశారు.    పని తీరు మెరుగుపరుచుకోని ఎమ్మెల్యేలకు మరోసారి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా?  లేక సర్దుకోండని చెబుతారా అన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. ఎందుకంటే విజయమే ప్రాదిపదికగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఇప్పటికే జగన్ పలుమార్లు స్పష్టం చేశారు.   అలాగే ఇక క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠత, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంకు తానే స్వయంగా నడుంబిగించడం ద్వారా ఎమ్మెల్యేలు, మంత్రులలో కూడా చురుకుపుట్టించేందుకు వ్యూహాత్మకంగా సీఎం పర్యటనలకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం తాను, తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రజలలోనే ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెబుతున్నారు.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తరువాత ఇక సీఎం తో పాటుగా ఎమ్మెల్యేలంతా ప్రజల్లోనే ఉండేలా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలకు సీట్లు..ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చే గుర్తింపు పైన సంకేతాలు ఇస్తున్నారు. దీంతో.. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఏం ప్రకటన చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి అయితే వైసీపీలో ఆల్ ఈజ్ వెల్ పరిస్థితి లేదనీ, ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తే అదే స్థాయిలో అసమ్మతి కూడా పెల్లుబుకే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరో నాలుగు రోజులలో ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లోనే కాదు, రాజకీయ వర్గాలలోనూ వ్యక్తమౌతోంది. 

అమరావతే ఏకైక రాజధాని.. విస్పష్టంగా తేల్చేసిన కేంద్రం

జగన్ సర్కార్ కు దింపుడు కళ్లెం ఆశ కూడా అడుగంటి పోయింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జగన్ మూడు ముక్కలాటకు కేంద్రం విస్పష్ట ప్రకటనతో ఫుల్ స్టాప్ పెట్టేసింది,  పార్లమెంటు సాక్షిగా ఏపీ రాజధానిగా అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం 2015నే నోటిఫై చేసిందని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం ప్రకటన అమరావతి విషయంలో హై కోర్టు తీర్పును కేంద్రం సమర్ధించినట్లైంది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఏపీ విభజన చట్టం ప్రకారమే అమరావతి రాజధానిగా  నిర్ణయించడం జరిగిందనీ, దానినే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2015లో నోటిఫై చేసిందని పేర్కొన్నారు. పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ఆధారంగానే అమరావతి రాజధానిగా ఏర్పాటైందని ఆయన ఆ సమాధానంలో స్పష్టం చేశారు. మూడు రాజధానుల పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలతో తమకు సంబంధం లేదని కూడా స్పష్టం చేసింది. అలాగే మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ తమను సంప్రదించలేదని కూడా స్పష్టం చేశారు. రాజధాని మార్పు విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఏపీ ప్రభుత్వానికి లేదని కూడా ఆయన తన సమాధానంలో స్పష్టం చేశారు. దీంతో కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మార్చాలంటే కేంద్రం అనుమతి ఉండటమే కాకుండా, పార్లమెంటులో చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని కేంద్ర విస్పష్టంగా తేల్చి చెప్పినట్లు అయ్యింది.   సుప్రీం కోర్టులో ఈ నెల 23న రాజధానుల అంశం కోర్టుకు రానున్న నేపథ్యంలో కేంద్రం రాజ్యసభ వేదికగా ఇచ్చిన ఈ సమాధానం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ కేసు విషయంలో సుప్రీం కేంద్రాన్ని అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇదే విషయాన్ని అంటే విభజన చట్టం ప్రకారం అమరావతే రాజధాని అని తన అఫిడవిట్ లో పొందుపరిస్తే రాష్ట్ర ప్రభుత్వ వాదన వీగిపోతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా త్వరలో అంటే వచ్చే నెలలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తానంటూ ఇటీవల జగన్ చేసిన ప్రకటన కూడా ఎందుకూ కొరగానిదిగా మారిపోయిందని చెప్పవచ్చు.  విజభన చట్టం ప్రకారమే ఏపీ ఏకైక రాజధానిగా ఏర్పాటయ్యిందని తేటతెల్లమైపోయింది.  ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5,6 లతో రాజధాని అమరావతిని ఏర్పడిందని, దీనిని మార్చే  అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని విస్పష్టంగా తేల్చేసింది.   

ఫామ్ హౌస్ కేసు.. సుప్రీంలోనూ కేసీఆర్ సర్కార్ కు దక్కని ఊరట

ఫామ్ హౌమ్ కేసు లో బీఆర్ఎస్ ప్రభుత్వం పీకల్లోతు ఇరుక్కుందా? ఫాం హౌస్ కేసులో ఫైళ్లు సీబీఐ చేతికి ఇస్తే ప్రభుత్వానికి చిక్కులు తప్పవా? అలా ఇవ్వకుండా మొండి కేస్తే కోర్టు ధిక్కరణ నేరాన్ని ఎదుర్కొన వలసి ఉంటుందా? ఇప్పుడు కేసీఆర్ సర్కార్ ఎదుట నిలిచిన చిక్కు ప్రశ్నలివే.  ఈ కేసులో సిట్ కు దర్యాప్తును అప్పగించడం నుంచి బీఆర్ఎస్ సర్కార్ వేసినవన్నీ తప్పటడుగులేనని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేయడం.. మళ్లీ డివిజన్ బెంచ్ సూచన మేరకు సింగిల్ బెంచ్ కు వెళ్లడం.. అక్కడితో ఆగకుండా సుప్రీంను ఆశ్రయించడంతో ఈ కేసు విషయం ఇక ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని తేలిపోయింది. సింగిల్ బెంచ్ సుప్రీం కోర్టులోనే తేల్చుకోండని చెప్పేసినా.. సుప్రీం కోర్టు ప్రభుత్వం కోరిన విధంగా వెంటనే అత్యవసరంగా ఈ కేసు విచారణకు స్వీకరించడానికి సుప్రీం కోర్టు నిరాకరరించింది. ఈ నెల 17న విచారిస్తామని స్పష్టం చేసింది. అప్పటి వరకూ స్టేటస్ కో ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కూడా సుప్రీం కోర్టు పట్టించుకోలేదు.  దీంతో విచారణకు పదిహేడో తేదీ వరకూ ప్రభుత్వం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ లోగా సీబీఐ విచారణ ప్రారంభించేస్తుందన్న ఆందోళన కేసీఆర్ సర్కార్ లో కనిపిస్తోంది.  ఈ కేసుకు సంబంధించిన ఫైళ్ల కోసం సీబీఐ ఇప్పటికే సీఎస్ కు మూడు సార్లు లేఖల ద్వారా కోరింది. అయితే అటు నుంచి ఎటువంటి స్పందనా కానరాలేదు. ఇప్పుడు తాజాగా సీబీఐ మరో లేఖ రాసింది. ఈ లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.  మొదటి నుంచీ ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేల ఎర కేసులో ‘సిట్’ ఏర్పాటు విషయంలో  మొదటి నంచి అనుమనాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో ఏర్పాటు చేసిన  సిట్  కూర్పు, విషయంలో అనుమనాలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాగే, సిట్  అధికార పరిధిని దాటి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పద  మయ్యాయి. న్యాయ స్థానాలు సైతం సిట్  గీత దాటిందని పేర్కొన్నాయి.  కీలక కేసుల్లో సిట్‌ ఏర్పాటు సాధారణమే అయినా.. డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని నియమించడం మాత్రం ఇదే తొలిసారి కావడంతో ఆ అనుమానాలు మరింతగా బలపడ్డాయి.  ఈ నేపధ్యంలోనే, విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగట్లేదన్న పిటిషర్ల వాదనతో ఏకీభవించింది. ఈ కేసులో సిట్‌ను విచారణను తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ.. సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.  ఈ తీర్పునే ఇప్పుడు డివిజన్ బెంచ్ సమర్ధించింది. సుప్రీంను రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయిస్తే.. అత్యవసర విచారణ అవసరం లేదంటూ 17న విచారణకు స్వీకరిస్తామని పేర్కొంది. ఆలోగా సీబీఐ దర్యాప్తు ప్రారంభించకుండా స్టేటస్ కో ఇవ్వడానికి కూడా సుప్రీం నిరాకరించింది. దీంతో ఇక ఈ కేసు విషయంలో సుప్రీం వేగం పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.  రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ రాష్ట్రంలో కాలు పెట్టకుండా అడ్డుకునేందుకు  జనరల్  కన్సెంట్ రద్దు చేసినా,  కోర్టు తీర్పుతో ఆ కన్సెంట్ ఎందుకూ కొరగాకుండా పోయింది.   

తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?

నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై గత నాలుగు రోజులుగా ఎలాంటి అప్ డేట్స్ బయటకు రావడం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందనీ, మరింత మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయనను విదేశాలకు తరలించే అవకాశం ఉందని కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. అంతే ఆ తరువాత ఆయన ఆరోగ్యం గురించిన ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు.  గత నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్వి నారా లోకేష్ ప్  పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నగుండెపోటుకు గురైన సంగతి విదితమే.   తార‌క‌ర‌త్న ప్ర‌స్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల నుంచి ఆయ‌న హెల్ట్ అప్ డేట్ బయటకు రాలేదు.  తారకరత్న ఆరోగ్యం మెరుగుపడింది, పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. మెదడు రికవరీ చికిత్స చేస్తున్నట్లు కొన్ని రోజుల కిందట వెల్లడించారు. అప్పడే ఆయన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తున్నాయనీ తెలిపారు.   

కానరాని ఫెడరల్ స్ఫూర్తి!

ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన నివేదికే వార్షిక బడ్జెట్. దానిని అందరికీ ఆమోదయోగ్యంగా (అందరికీ అంటే.. బీజేపీ అగ్రనాయకత్వానికి, దేశంలోని సంపన్నవర్గాలకీ) రూపొందించడంలో కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ అరితేరారు. సామాన్యులకు లోటుపాట్లే కాదు.. ప్రయోజనాలు ఏమిటన్నది కూడా అంతు చిక్కకుండా అంకెలగారడీ చేయడంలో ఆమె సిద్ధహస్తులయ్యారు. అందుకే  ఆమె కేంద్ర విత్తమంత్రిగా సుస్థిరంగా కొనసాగుతున్నారు. కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న స్థితి నుంచి ఆమె తన స్థానాన్ని పదిలపరుచుకోవడమే కాకుండా.. మోడీ కేబినెట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.  ఆమె తన తాజా బడ్జెట్ లో తనకు మాత్రమే సాధ్యమైన ఈ అంకెల గారడీని ఆమె మరొకసారి విజయవంతంగా లోక్ సభకు ప్రదర్శించారు.  ఈ బడ్జెట్  అంతా అంకెల మయం.. అయితే జనాలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమిటి? వాటికి కేటాయింపులు ఎంత అంటే ఆర్థిక నిపుణులు కూడా నోరెళ్ల బెట్టాల్సిన పరిస్థితి.   గతంలో కరోనా సమయంలో కేంద్ర విత్త మంత్రి ఆత్మ నిర్భర్ భారత్ అంటూ సీరియల్ లా చూపిన గణాంక పరిజ్ణానం పామరులకు ఎంత దివ్యంగా అర్ధమైందో.. ఆమె లోక్ సభలో  తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అంతే అర్ధమౌతుందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. అయినా ఎన్నికల సంవత్సరం కనుక కర్నాటక వంటి బీజేపీకి కీలకమైన రాష్ట్రాల కేటాయింపుల విషయం మాత్రం ఒకింత సరళంగా వివరించారు. అది మినహాయిస్తే..  ఎన్నికల సమయంలో కూడా  జనాకర్షణ పథకాలకు పెద్ద పీట వేయకుండా.. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపైనే దృష్టి పెట్టినట్లుగా కనిపించవచ్చు. దీంతో రాజకీయ లబ్ధి కోసం కాకుండా దేశాభివృద్ధిపై దృష్టి పెట్టిన విత్తమంత్రిగా ఆమె ప్రతిష్ట, అలాగే మోడీ ప్రభుత్వ ప్రతిష్ట ఇనుమడించిందన్న భావన కలిగితే కలగవచ్చు... కానీ  ఈ అంకెల గారడీతో ప్రజలకు  ఒరిగిందేమిటంటే శూన్యమే అని చెప్పాలి.    గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేటాయింపులు   అమలయ్యాయా? అరచేతిలో వైకుంఠం చూపినట్లుగా బడ్జెట్‌ లో  వాగ్ధానాలు ఏ మేరకు నెరవేరాయి?  బడ్జెట్‌ ఫలితాలు లేదా కేటాయింపుల ఫలితాలు ఆశించిన స్థాయిలో నెరవేరి ఉంటే ఇప్పుడు కేంద్రం అదే పనిగా బడ్జెట్ పై సెమినార్లు అంటూ ఊరూరా ప్రచార బాకా ఊదుకోవలసిన అవసరమే ఉండేది కాదు.   ఒక వంక ద్రవ్యలోటు.. మరో పక్క రుణభారం భారత ఆర్థిక సుస్థిరతపై అనుమానాలు రేకెత్తిస్తోంది.   అన్నిటికీ మించి కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ కేవలం కేంద్రానికి చెందిన అంశంగా.. రాష్ట్రాలకు ఇందులో ఇసుమంతైనా ప్రమేయం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నదన్న భావన ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో బలంగా ఉంది. ముందుగా ఆ భావనను పోగొట్టకుండా.. ఫెడరల్ స్ఫూర్తితో కేంద్రం వ్యవహరిస్తున్నదన్న భావన కలగదు.  వివిధ రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న ఒక ప్రజాస్వామ్య దేశంలో రాష్ట్రాలు, వాటి ఆర్థిక వనరులు, విధానాలు కూడా ప్రాధాన్యం వహిస్తాయన్నవిషయాన్ని కేంద్రం పట్టించుకోకపోవడం నిజంగా దారుణం. 

లిక్కర్ స్కాంలో బుచ్చిబాబు అరెస్టు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చిక్కులు తప్పవా?

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం చోటు చేసుకుంది.  ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సీబీఐ తాజాగా . తాజాగా  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసింది. మంగళవారం ఢిల్లీలో గోరంట్ల బుచ్చిబాబును విచారించిన సీబీఐ బుధవారం ఆయనను అరెస్టు చేసినట్లు ప్రకటించింది.  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో సీఏ గోరంట్ల పాత్ర ఉందని సీబీఐ భావిస్తోంది.  ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జిషీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించటం తెలిసిందే. ఈ సౌత్ గ్రూప్ విజయ్ నాయర్ కల్వకుంట్ల కవిత మాగుంట శ్రీనివాసరెడ్డి శరత్ చంద్రలు భాగమని చెప్పటం తెలిసిందే. ఈ కేసు విచారణ ఈ మధ్యన కాస్తంత మందగించినట్లుగా అనిపించినా..  తాజా పరిణామాలు బట్టి చూస్తే.. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు ఖాయమని చెప్పవచ్చు.  దేశ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా అటు దేశ రాజధని ఢిల్లీ, ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లలో రాజకీయ  ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం  ఇప్పటికే చాలా మలుపులు తిరిగింది.  తాజా అరెస్టుతో ఎమ్మెల్సీ కవితకు ముందు ముందు మరిన్ని చిక్కులు తప్పవని పరిశీలకులు అంటున్నారు. తొలుత దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖుల పేర్లను చేర్చిన ఈడీ.. ఇటీవల సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేర్లను చేర్చింది. ఇక ఇప్పుడు కవిత మాజీ సీఎ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు అరెస్టు చేసింది.