గవర్నర్ - సర్కార్ సయోధ్య ఎండమావేనా ?

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య సయోధ్య కుదిరింది. రెండున్నరేళ్లుగా ఎడ ముఖం, పెడ ముఖంగా ఉన్న గవర్నర్  తమిళి సై, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర  హై కోర్టు ప్రమేయంతోనే అయినా  శాసన సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో రాజ్యాంగ విధులను రాజ్యాంగబద్దంగా నిర్వర్తించారు. గత సంవత్సరం తరహాలోనే ఈ సంవత్సరం కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు కానిచ్చేయాలని సర్కార్ భావించినా, బడ్జెట్ ఆమోదం కోసం కోర్టు మెట్లు ఎక్కినా ప్రయోజనం లేక పోయింది. కోర్టు సూచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఒకడుగు వెనక్కివేసి గవర్నర్  తో సయోధ్యకు సుముఖత వ్యక్త పరిచారు. ఆ విధంగా శాసన  సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ సంప్రదాయాన్ని పాటిస్తూ, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని అక్షరం పొల్లుపోకుండా చదివి వినిపించారు.  గవర్నర్ తమ రాజ్యాంగ కర్తవ్యాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసేఆర్ కూడా అనివార్యంగానే అయినా తమ రాజ్యాంగ విధులను నిర్వర్తించారు. గవర్నర్ కు ఇవ్వవలసిన గౌరవం ఇచ్చారు.  దీంతో, అనుమానాలున్నా రాజ్ భవన్ ప్రగతి భవన్ మధ్య  సయోధ్య కుదిరిందనే అభిప్రాయం ఏర్పడింది.  ఇది జరిగి వారం రోజులు అయింది. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే సయోధ్య మీద సందేహాలు మరింత బలపడుతున్నాయి. గవర్నర్ పసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై సభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి పాల్గొనలేదు. ముఖం చాటేశారు. గవర్నర్ పేరు ప్రస్తావించడం గవర్నర్ కు కృతఙ్ఞతలు చెప్పడం ఇష్టం లేకనే ముఖ్యమంత్రి ముఖం చాటేశారని అంటున్నారు. మరో వంక ముఖ్యమంత్రి బదులుగా ఆయన కుమారుడు  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఆయన అదే విధంగా చర్చలో పాల్గొన్న అధికార  బీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ ప్రసంగంలో లేని అంశాలను ప్రస్తావిస్తూ  కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మంత్రి కేసీఆర్ అయితే తమ సహజ ధోరణిలో కేంద్ర ప్రభుత్వాన్నే కాదు  ప్రధాని మోడీని, బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వ విధానాలను, అనర్గళంగా  ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ భాషలలో తిట్టి పోశారు.  సో.. సర్కార్ సైడు  నుంచి చూస్తే,  గవర్నర్ తో సయోధ్యకు ప్రభుత్వం సిద్ధంగా లేదనే విషయం స్పష్టమైంది.  మరోవంక గవర్నర్ తమిళి సై  గత శాసన సభ సమావేశాల్లో ఆమోదించిన ఆరు బిల్లులకు ఇంతవరకు ఆమోదం తెలపలేదు. నిజానికి, కోర్టు వెలుపల కుదిరిన ఒప్పందం ప్రకారం పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్ అంగీకరించారనే ప్రచారం జరిగింది. కానీ  ఇంతవరకు రాజ్ భవన్ నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. మరో వంక ఈ వారం రోజుల్లోనే గవర్నర్  రెండో సారి ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న గవర్నర్ అక్కడినుండి నేరుగా ఢిల్లీ వెళ్ళనున్నారని  తెలుస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్  కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.  ఈ పర్యటనలో గవర్నర్ తమిళి సై తెలంగాణలో తాజా పరిస్థితులను కేంద్రానికి వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వంక ఢిల్లీ లిక్కర్ స్కాం, ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేల బేర సారాల కేసు వేగంగా కదులుతున్నాయి. ఈ నేపధ్యంలో గవర్నర్ ఢిల్లీ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవంక సయోధ్య ఎండమావనే విషయం మరోమారు స్పష్టమైందని అంటున్నారు.

ఏబీకేకు రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ పరుస్కారం

సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడు ఏబీకే ప్రసాద్ కు ప్రతిష్ఠాత్మక రాజా రామ్మెహన్ రాయ్ జాతీయ పరుస్కారం లభించింది. ఈ విషయాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. జర్నలిజంలో అసమాన ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డు ఏబీకేను వరించింది. ఈ అవార్డును ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్  జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్  ఈ నెల 28న ఢిల్లీలో ఏబీకేకు అందజేయనున్నారు. ఏబీకే ప్రసాద్ జర్నలిజంలో పరిచయం అక్కర్లేని పేరు.    విశాలాంధ్రలో సబ్‌ఎడిటర్‌గా తన జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించిన ఏబీకే ప్రసాద్ అక్కడ నుంచి అంచలంచలుగా ఎదిగి తెలుగులో ఆంధ్రపత్రిక, సాక్షి వినా దాదాపు అన్ని పత్రికలలోనూ పని చేశారు. ఈనాడు, ఉదయం, వార్త పత్రికలను సంపాదకుడిగా లాంచ్ చేశారు. కొత్తగా దినపత్రిక ప్రారంభించాలనుకునే వాళ్ల తొలి ఛాయస్ ఏబీకే అనడంలో సందేహం లేదు.  అందుకే ఆయన తరచూ ఉద్యోగాలు మారే వారు. ఏది ఏమైనా తెలుగు పత్రికా రంగంలో ఏబీకేది ఎప్పటికీ చెరిగిపోని సంతకం అనడంలో సందేహం లేదు. 

మోడీ డబుల్ గేమ్... కన్ఫ్యూజన్‌లో పవన్‌కళ్యాణ్!

అసలు బీజేపీ వ్యూహం ఏమిటి?..జనసేన పార్టీతో మైత్రి వెనుక వ్యూహం ఏమిటి? మైత్రి విషయంలో కమలం పార్టీ జనసేనతో ఆడుతున్న దాగుడుమూతలు ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి. ఈ రాజకీయ క్రీడతో ఏం సాధించాలని అనుకుంటోంది. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో నలుగుతున్నచర్చ ఇదే. ఏపీలో రాజకీయ గందరగోళం అన్నది బీజేపీలోనే తప్ప ప్రజలలో కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జన సేనాని పవన్ కల్యాణ్ తన విధానమేమిటి? దారేమిటి? లక్ష్యం ఏమిటి? అన్న క్లారిటీతో ఉన్నారు. ప్రజలకు కూడా ఆ  విషయం విస్పష్టంగా చెప్పేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనీయను అనడంతోనే పవన్  కల్యాణ్ తన మససులో మాటను విస్పష్టంగా  బయటపెట్టేశారు. ఇక్కడే బీజేపీ గందరగోళంలో పడింది. పవన్ పొత్తు ఎవరితో అన్నది తేలిపోవడంతో.. బీజేపీతో మైత్రికి బీటలు వారాయా అన్న అనుమానం ఆ పార్టీలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే జనసేనను మిత్రపక్షంగా కాకుండా వైరి పక్షంగా అనుమానంతో చూస్తోంది. అయితే పూర్తిగా తెగతెంపులు చేసుకోకుండా.. జనసేనతోనే తమ పొత్తు అంటూ ప్రకటనలు గుప్పిస్తూ పవన్ ను కన్ఫ్యూజ్ చేయాలన్న వ్యూహాన్ని అనుసరిస్తోంది. కలిసి వస్తే జనసేనతోనే పొత్తు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ ఇటు ప్రజలను కూడా గందరగోళంలోకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నది. రోడ్ మ్యాప్ విషయంలో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది బీజేపీ. అయితే బీజేపీలోని ఒక వర్గం వారు మాత్రం రాష్ట్ర నాయకత్వం వ్యాఖ్యలకు, వ్యూహాలకు పార్టీ హైకమాండ్ సమయం చూసి చెక్ పెడుతుందని అంటున్నారు. అయితే  ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ విషయంలో పార్టీ కేంద్ర నాయకత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని బట్టి చూస్తే రాష్ట్ర బీజేపీలోని రెండు వర్గాలతోనూ పార్టీ హైకమాండ్ డబుల్ గేమ్ ఆడుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  జనసేనతో తెగతెంపులు అయ్యేలా, అందుకు జనసేనాని పవన్ కల్యాణే కారణం అనేలా బీజేపీ రాష్ట్ర నాయకులు వ్యవహరిస్తున్న తీరుకు ఆపార్టీ అగ్రనేతల ఆశీస్సులున్నాయా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. బీజేపీ రాష్ట్ర క్యాడర్ కూడా ఇవే సందేహాలను వ్యక్తం చేస్తోంది. కలిసి వస్తేనే జనసేన.. లేకపోతే జనంతోనే మా పొత్తు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా జనసేనానిని రెచ్చగోట్టే వ్యూహంతో చేసినవేనని అంటున్నారు. అలాగే ఇటీవల భీమవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన రాజకీయ తీర్మానంలో కూడా జనసేనతో పొత్తు ఉంటుందన్న స్పష్టత లేకపోవడం, భావసారూప్యత ఉన్న పార్టీతో పొత్తు అంటూ పేర్కొనడం కూడా బీజేపీ, జనసేనల మైత్రి ఉందా.. ఉంటుందా.. అన్న సందేహాలకు తావిచ్చింది.  ఒక వైపు మిత్ర పక్షం అంటూనే మరో వైపు  జనసేనను, ఆ పార్టీ  అధినేత పవన్  కల్యాణ్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ద్వారా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటోందన్న ప్రశ్న తలెత్తుతోంది.  అదే సమయంలో బీజేపీ హై కమాండ్ మాత్రం జనసేనతో మైత్రి విషయంలో ఎలాంటి శషభిషలూ లేకుండా సానుకూల ప్రకటనలు చేస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఎదుర్కొని విజయం సాధించాలంటే బీజేపీకి.. ఆ రాష్ట్రంలో కూడా అసంఖ్యాక అభిమాన బలం ఉన్న జనసేనాని అండ అవసరం. ఇప్పటికే జనసేనాని తెలంగాణలో జనసేన పోటీ ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు. అలాగే తెలంగాణలో ఖమ్మం సభ తరువాత తెలుగుదేశం కూడా చురుకుగా మారింది. ముందుముందు మరిన్ని సభలతో ఎన్నికల నాటికి బలీయ శక్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీకి   ఈ రెండు పార్టీల అండా లేకుండా తెలంగాణలో అధికారంలోకి రావడం అంత తేలిక కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఏపీలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం జనసేనతో పొత్తు, మైత్రి పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అధిష్ఠానం మాత్రం మౌనన్నే ఆశ్రయిస్తోందంటున్నారు. పరిస్థితులను బట్టి తెలంగాణలో బీజేపీ అవసరాలను బట్టి ఏపీలో బీజేపీ పొత్తల విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. అందుకే రాష్ట్ర నాయకుల ప్రకటనలతో సంబంధం లేకుండా  జీవీఎల్ వంటి బీజేపీ నేతలు జనసేనతో మాత్రమే తమ పార్టీ పొత్తు ఉంటుందని స్పష్టం చేస్తున్నారని అంటున్నారు.  

నియంతృత్వానికి నిలువెత్తు రూపం.. ముషార్రఫ్

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ నియంతృత్వానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పవచ్చ.  ఈ నెల 5న దుబాయ్‌లో కన్నుమూసిన ముషరఫ్‌ కొన్నేళ్ల పాటు పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా సర్వాధికారాలూ చెలాయించారు.  అయితే  చివరికి దుబాయ్‌లో ప్రవాసంలో ఒక సాధారణ వ్యక్తిలా కన్నుమూశారు. పాక్ సైన్యాధ్యక్షుడిగా 1999 అక్టోబర్‌లో అధికార పర్యటన నిమిత్తం శ్రీలంక వెళ్లారు. తనకు నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ఉద్వాసన చెప్పబోతోందని అక్కడ ఉండగా తెలుసుకున్న ముషార్రఫ్ వెంటనే  కరాచీకి బయలుదేరి వచ్చేశారు. సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించి నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని దించేశారు. వాస్తవానికి ముషార్రష్ ను  సైనిక దళాల ప్రధానాధికారిగా నియమించింది నవాజ్‌ షరీఫే. ఇద్దరు సీనియర్‌ సైనికాధికారులను పక్కన పెట్టి మరీ ముషరఫ్ ను షరీఫ్ సర్వసైన్యాధికారిని చేశారు.  అదే నవాజ్ ఫరీష్ తప్పిదమని ముషార్రఫ్ ఆయననే పదవి నుంచి దించేయడం ద్వారా రుజువు చేశాడు. సైన్యాధ్యక్షుడిగా తనకు అవకాశంఇచ్చాడన్న కృతజ్ణతా భావమో ఏమో ముషార్రఫ్ ఆయనను ప్రాణాలతో ఉండనిచ్చారని పాక్ చరిత్ర తెలిసిన వారు చెబుతుంటారు.  పాక్‌ అధ్యక్షుడుగా అధికారం చేపట్టిన తర్వాత ముషార్రఫ్‌ ఒక నియంతలా  వ్యవహరించారు. అందరి కంటే ఒక మెట్టు ఎక్కువే ఉండాలన్న తపనతో పాటు, భారత్‌ మించిపోవాలన్న తపన కూడా ఆయనకు చాలా ఎక్కువ. భారత, పాకిస్థాన్‌ దేశాల మధ్య మొదటిసారిగా 1965లో యుద్ధం జరిగినప్పుడు ముఫార్రఫ్ ఒక యువ సైన్యాధికారి. 1971లో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా ఆయన ఒక కమాండోగా ఉన్నారు. అయితే  ఆ తర్వాత కార్గిల్‌ యుద్ధానికి కూడా రూపకర్త ఆయనే. ఓ రెండు దేశాల మధ్య యుద్ధం జరగడం మామూలే. అయితే, ఈ దేశాలు అణ్యస్త్రాలను కూడా కలిగి ఉన్నప్పుడు కయ్యానికి కాలు దువ్వడం ఒక విధంగా సాహసమే అవుతుంది. నిజానికి దాదాపు ఆ సమయంలోనే అప్పటి ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్ పేయి భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. తాను స్వయంగా బస్సులో లాహోర్‌కు ప్రయాణించి వచ్చారు. లాహోర్‌ ఒప్పందం మీద సంతకాలు చేశారు. ఈ సౌహార్ద్రం ముషరఫ్‌కు ఏమాత్రం పట్టలేదు. ఒప్పందం మీద సంతకాలు పూర్తయ్యాయో లేదో ఆయన యుద్ధానికి పథక రచన చేశారు. ఈ దాడిని భారత్‌ తిప్పికొట్టడం, అమెరికా అందుకు సహాయం కూడా చేయడం ఆయనను అన్ని విధాలా దెబ్బతీసింది.  2001 జూలైలో ఆగ్రాలో శిఖరాగ్ర చర్చలు జరిగాయి. అయితే, ఈసారి కూడా శాంతి చర్చలు, పర్యవసనాలు కాగితాలకే పరిమితం అయ్యాయి.  2001 డిసెంబర్లో పార్లమెంట్‌ మీద లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు దాడులు జరిపారు. వారికి పాకిస్థాన్‌ ప్రభుత్వ అండదండలున్నాయన్న సంగతి ప్రపంచానికి వెల్లడైంది.  పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తీకర్‌ మహమ్మద్‌ చౌధురి రాజీనామాను డిమాండ్‌ చేయడం ద్వారా ముషార్రఫ్ తన పతనాన్ని తానే రాసుకున్నాడు.  ఇక పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టోకు తగినంత భద్రతను కల్పించనందువల్లే ఆమె హత్యకు గురయ్యారనీ, దీనితో ముషర్రఫ్‌కు సంబంధం ఉందని తేలడంతో ఆయన దేశం విడిచి పారిపోయాడు.  దుబాయ్ లో తలదాచుకున్నాడు.  అక్కడ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశమే లేకపోయింది. 

శిథిలాల కిందే నవజాత శిశువు.. పక్కనే తల్లిమృతదేహం

మాటలకందని మహా విషాదం.. టర్కీ భూకంపం. వేలాది మంది మృత్యువాత పడ్డారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇంకా వేల మంది కుప్పకూలిన భవన శిథిలాల కింద బతికున్నారో లేదో తెలియని స్థితి.  టర్కీ, సిరియాలను పెను భూకంపం కుదిపేసింది. వందల సంఖ్యలో భవనాలు నేలకూలాయి. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న సహాయక బృందాలు గుట్టలు గుట్టలుగా మృతదేహాలను వెలికి తీస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఆ క్రమంలోనే హృదయం ద్రవించుకుపోయే ఘటన చోటు చేసుకుంది. నిండు గర్భిణి భూకంప శిథిలాల కిందే పండంటి శిశువుకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం జరిగీ జరగగానే కన్నుమూసింది. శిథిలాల తొలగింపులో ఆ శివువును గుర్తించిన సహాయక బృందాలు ఆ శిశువును వెలికి తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వణికించే చలిలో గంటల పాటు తల్లి మృతదేహం పక్కన ఒంటిమీద నూలుపోగు లేకుండా ఉన్న ఆ నవజాత శిశువు దుస్థితికి అందరూ కంటతడి పెడుతున్నారు. ఆ శిశువు బతకాలని ప్రార్ధిస్తున్నారు.  .

జగన్ అప్పురత్న.. పవన్ సెటైర్

మహా రచయత ముళ్లపూడి వెంకటరమణ సృష్టించిన అప్పారావు పాత్ర తెలుగు సాహిత్యంలో ఎంతలా చిరస్థాయిగా నిలిచిపోయిందో మనకందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్  జగన్ ను అప్పురత్నగా చేసిన అభివర్ణన ఏపీ రాజకీయ చరిత్రలో అలాగే నిలిచిపోతుంది. పవన్ కల్యాణ్ జనసేనాని జగన్ ను అప్పురత్నగా అభివర్ణిస్తూ సామాజిక మాధ్యమంలో ఇలా కార్టూన్ పోస్టు చేశారో లేదో.. వెంటనే ట్రెండింగ్ అయిపోయింది. ఏపీ సీఎం జగన్ అప్పులపై జనసేనాని సెటైర్ క్షణాల్లో సామాజిక మాధ్యమంలో వైరల్ అయిపోయింది. అది ఎంతగా ట్రెండ్ అవుతోందంటే.. ఇక ముందు ఎవరూ జగన్ ను జగన్ గా సంబోధించే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదన్నంతగా. ఇక నుంచి జగన్ కు అప్పురత్న అన్నది పర్యాయపదంగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నంతగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ జగన్ కు అప్పురత్న బిరుదు వచ్చిందనీ, అది భారత రత్న లాంటి గొప్ప అవార్డనీ అధికారి చెబుతున్నట్లుగా ఉన్న కార్టూన్ ను సామాజిక మాధ్యమంలో షేర్ చేసీ చేయగానే వైరల్ అయిపోయింది. ఆ సెటైర్ బ్రహ్మాండంగా పేలింది. వైసీపీ సర్కార్ కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఆర్బీఐ నుంచి 55,555 కోట్ల రూపాయలు అప్పు తీసుకువచ్చిందన్నది గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దానిపైనే పవన్ ఈ కార్టూన్ ను సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. వ్యక్తిగత ఆస్తులను పెంచుకుంటూ, రాష్ట్రం, ప్రజల ఆస్తులను కుక్కలకు వదిలేశారనీ అదే సీఎం జగన్ స్పిరిట్ అంటూ వ్యాఖ్యానించారు. గతంలో కూడా అవినీతికి క్రాప్ హాలీడే అంటూ వేసిన కార్టూన్ కూడా అప్పట్లో ట్రెండింగ్ అయిన సంగతి తెలిసిందే. 

జగన్ సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్నారా?

జగన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? అన్నది ఆయనకైనా తెలుసా అన్న అనుమానాలను ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. అసలు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్నారా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సెక్యూరిటీని తగ్గించడాన్ని ఆయన ప్రశ్నించారు. నిజమే కోటంరెడ్డి తనపై నమ్మకం లేని పార్టీలో ఉండలేనంటూ ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే ఆయనకు టు ప్లస్ టు సెక్యూరిటీని వన్ ప్లస్ వన్ కు కుదించిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించిన కోటంరెడ్డికి వైసీపీతో అనధికారిక పొత్తు పెట్టుకున్న రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ అంకుశం సినిమాలోలా వీధుల్లో కొట్టుకుంటూ, బండికి కట్టుకుని తీసుకుపోతానని   బెదిరించారు. అటువంటి పరిస్థితుల్లో కోటం రెడ్డికి సెక్యూరిటీని తగ్గించడం అంటే జగన్ ప్రజలకు ఏం సంకేతం ఇచ్చినట్లు. ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి తనకు ఇష్టం లేని ఎమ్మెల్యేలకు సెక్యూరిటీని తగ్గించడం, లేదా ఉపసంహరించుకోవడం వంటి చర్యలకే పరిమితమవ్వడం ఏం పాలన? గతంలో తనకు, ఆ తరువాత ఆనం రామనారాయణ రెడ్డికి, ఇప్పుడు కోటం రెడ్డికి భద్రత తగ్గించడం జగన్ లోని దుర్మార్గ మనస్థత్వానికి సూచనగా రఘురామకృష్ణం రాజు అభివర్ణించారు. ఇది ఇక్కడితో ఆగదనీ, ముందు ముందు అంటే రానున్న రోజులలో ఆయన సెక్యూరిటీ తగ్గించాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య బాగా పెరుగుతుందని జోస్యం చెప్పారు. ఇప్పుడిప్పుడే నివురు తొలగి అసమ్మతి నిప్పు బయటపడుతోందని, ఇది మరింత రాజుకునే రోజులు తొందర్లోనే ఉన్నాయనీ జోస్యం చెప్పారు. రానున్న రోజులలో పార్టీనీ, అధినేతనూ ధిక్కరించే ఎమ్మెల్యేల సంఖ్య బాగా పెరుగుతుందన్నారు.   కోటం రెడ్డి బాటలో మరింత మంది నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు నెల్లూరు నగర మేయర్, పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు  కోటంరెడ్డితో కలిసి పార్టీ వీడడానికి సిద్ధమయ్యారనీ, దీనిని బట్టే వైసీపీలో అసంతృప్తి ఎంతగా వేళ్లూనుకుందో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు.  కోటంరెడ్డి లాంటి నాయకుడిని దూరం చేసుకున్న  జగన్మోహన్ రెడ్డి దూరదృష్టవంతుడని, జగన్మోహన్ రెడ్డి లాంటి అధినేతను కాదనుకున్న కోటంరెడ్డి అదృష్టవంతుడని రఘురామ వ్యాఖ్యానించారు. 

పేర్ని నాని సీన్ అయిపోయిందా.. జగన్ దూరం పెట్టేశారా?

బందరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ కి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోతోందా? ఆ క్రమంలో జగన్ నుంచి పేర్ని నానికి  మద్దతు కరవౌతోందా? అంటే.. అవుననే  అంటున్నాయి వైసీపీ శ్రేణులు.  మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతోపాటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించేందుకు అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మీడియా సమావేశాలు పెట్టి మరీ.. పేర్ని నాని ఎంత గొంతు చించుకొన్నా కూడా... వాటిని పార్టీ అధినేత జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదని కూడా అంటున్నారు. అందుకు గతంలో బందరు లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి.. స్థానికంగా పర్యటిస్తున్న సమయంలో... పేర్ని నాని కుమారుడు కిట్టు, అతడి స్నేహితుడు, కార్పొరేటర్ అస్గర్ అలీ.. అడ్డుకొని... నానా యాగీ చేయడం.. ఈ పంచాయతీ కాస్తా...  తాడేపల్లి ప్యాలెస్ చేరి రచ్చ రచ్చ కావడంతో అప్పటి నుంచీ  పేర్ని నానితో సీఎం   జగన్   అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారని అంటున్నారు.  అదే సమయంలో  సీఎం జగన్   లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరితో గతంలో ఉన్న స్నేహాన్ని కొనసాగిస్తున్నారని.. అలాగే పార్టీ అధినేత జగన్ ఫుల్ సపోర్ట్ సైతం బాలశౌరికి ఉందని వారు చెబుతున్నారు. అందుకు కారణాలను సైతం వారు సోదాహరణగా పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.  ప్రతి చిన్న అంశంపై స్పందించే పేర్ని నాని లాగా.. వల్లభనేని బాలశౌలి ఎప్పుడూ స్పందించరని..  ఓ వేళ బాలశౌరి మీడియా ముందుకు వచ్చినా.. ఎవరిపైనా విమర్శలు గట్రా చేయరని..  అలాగని పార్టీ తనకు ఎంపీ సీటు ఇచ్చిందని.. ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకు బాకాలు ఊదరు, భజనలు  చేయరని..  ఓ వేళ ఏప్పుడైనా ఎంపీగా బాలశౌరి  మీడియా ముందుకు వచ్చినా.. ఎంపీ నిధులు వల్ల బందరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై మాత్రమే మాట్లాడతారని.. అంతేకాదు.. ఎప్పుడు ఎవరినీ టార్గెట్ చేసి మాట్లాడిందే లేదని బందర్ వైసీపీ శ్రేణులు  ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి.   అలాగే ఢిల్లీలో ఎంపీ వల్లభనేని బాలశౌరికి మంచి పరిచయాలు ఉన్నాయని.. వాటి వల్ల సాక్షాత్తూ పార్టీ అధినేత  జగన్‌కు సైతం అప్పుడో .. ఎప్పోడో.. ఒకప్పడు లబ్ది చేకూరుస్తున్నయని కూడా వారు చెబుతున్నారు. అందుకే ఎంపీ బాలశౌరి పైచేయి సాధించాలంటూ ఎమ్మెల్యే పేర్ని నాని చేస్తున్న ప్రయత్నాలు..  వర్కౌట్ కావడం లేదని బందరు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

తప్పులో కాలేసిన వైసీపీ భాష్య కారుడు విజయసాయి!

అధికార వైసీపీ కీలక నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవల పేర్కొన్న పలు అంశాల పట్ల తెలుగు ప్రజలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి.. ఇటీవల బెంగుళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్నను పరామర్శించారు. ఈ సందర్బంగా అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులను విజయసాయిరెడ్డి ఆరా తీశారు.  అనంతరం తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి.. అంటే... జనవరి 27వ తేదీన తారకరత్న కుప్పంలో కుప్పకూలిన నాటి నుంచి ఆయన్ని పరామర్శించే రోజు వరకు ఉన్న ప్రతీది అప్‌డేట్‌గా విజయసాయిరెడ్డి చెప్పారని.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఇంత క్లారిటీగా అటు నందమూరి ఫ్యామిలీలోని వారు కానీ... ఇటు నారా ఫ్యామిలీలోని వారు కానీ ఇలా చెప్పలేదని.. కానీ విజయసాయిరెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ప్రతి చిన్న అంశాన్ని సైతం.. అరటి పండు తొలు వలచి నోట్లు పెట్టినట్లుగా ఉందని ఈ సందర్భంగా తెలుగు ప్రజులు పేర్కొంటున్నారని తెలుస్తోంది.  మరోవైపు వృత్తి పరంగా చార్టెడ్ అకౌంట్ అయినా విజయసాయిరెడ్డి.. విదేశాల్లో ఎఫ్ఆర్సీఎస్ పూర్తి చేసి.. భారత్ తిరిగి వచ్చిన వైద్యుడిలాగా నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి చాలా చాలా బాగా చెప్పారంటూ తెలుగు ప్రజలు విజయసాయిరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అలాగే జగన్ పార్టీలో సైతం ఈ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పుతోన్నారంటూ.. ఆయన ప్రతిభా పాటవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొంటున్నారు.  గతంలో చార్టెడ్ అకౌంటెంట్‌గా.. ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా.. చక్రం తిప్పుతోన్న విజయసాయిరెడ్డి.. వైద్య రంగంలో కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉందని.. తారక రత్న ఆరోగ్య పరిస్థితిని వివరించినప్పుడే తామందరికీ అర్థమైందని వారు వివరిస్తున్నారు.  ఇంత వరకు అంతే ఓకే కానీ.. మాజీ మంత్రి, నాటి ప్రతిపక్ష నేత. ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి 2019 మార్చిలో దారుణం హత్యకు గురయ్యారని.. అయితే వైయస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారంటూ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి ఈ విజయసాయిరెడ్డే  ప్రకటించారని.. దీంతో ఇదే విషయం.. మీడియాలో సైతం తెగ వైరల్ అయిందని.. కానీ ఆ తర్వాత.. వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారని.. ఆయన్ని గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపారంటూ.. మీడియాలో వార్తలు వెల్లువెత్తాయని ఈ సందర్భంగా తెలుగు ప్రజలు సోదాహరణంగా విపులీకరిస్తున్నారు.  మరి ఇన్ని రంగాల్లో ఇంత నాలెడ్జ్ ఉన్న ఈ విజయసాయి రెడ్డి.. ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్ సొంత బాబాయి వైయస్ వివేకా మరణించిన విషయంలో అది గుండెపోటా.. అది గొడ్డలి పోటా అనే విషయం ఎందుకు తెలియలేదని.. తెలుగు ప్రజలు తీవ్ర విస్మయంతో సందేహం వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ కు పాల్ షాక్.. కొత్త సచివాలయంపై హై కోర్టులో పిల్

కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఓ పొలిటికల్ జోకర్ గా విపరీతంగా గుర్తింపు పొందిన నాయకుడు. ఆయనను సామాన్య ప్రజలే కాదు, రాజకీయ నాయకులు పార్టీలూ కూడా పెద్ద సీరియస్ గా తీసుకోరు. ప్రజాశాంతి పార్టీ అధినేతగా కేఏపాల్ ను ఎప్పుడూ ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఆయనా పెద్దగా పట్టించుకోలేదు. నవ్వి పోదురుగాక నాకేటి అన్నట్లుగా ఆయన తాను చేయదలచుకున్నది చేసేస్తూ, చెప్పదలచుకున్నది చెప్పేస్తూ ముందుకు సాగుతుంటారు. మీడియా కూడా ఆయన ప్రెస్ మీట్లను, ప్రకటనలను ఒక రిలీఫ్ మ్యాటర్ గానే ఎంచి అందుకు తగ్గ ప్రయారిటీయే ఇస్తూ ఉంటుంది. అలాంటి పాల్ ఒక సీరియస్ ఎలిగేషన్ చేశారు. కోర్టుకు ఎక్కారు. తెలంగా కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదంపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలను ఎప్పటిలాగే జోక్ గా కొట్టి పారేద్దామనుకున్న అందుకు వీలు లేకుండా భారాస సర్కార్ వ్యవహరించింది. అగ్ని ప్రమాదం అనంతర పరిస్థితిని పరిశీలించడానికి వెళ్లిన విపక్ష కాంగ్రెస్ నేతలను అనుమతించలేదు. దీంతో కొత్త సచివాలయం.. ఇంకా ప్రారంభానికి నోచుకోకుండానే అగ్ని ప్రమాదం బారిన పడటం వెనుక ఏదో ఉన్నదన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యేలా కేసీఆర్ సర్కార్ వ్యవహరించింది. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకుని కేఏ పాల్ కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్ భారాస సర్కార్ కు దిమ్మతిరిగేలా చేసింది. ఇంకా ప్రారంభానికి నోచుకోని తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదంపై పిల్ వేశారు. అందులోనే సచివాలయం ప్రారంభానికి కేసీఆర్ నిర్ణయించిన ముహూర్తాన్ని కూడా సవాల్ చేశారు. అంబేడ్కర్ పేరుమీద నిర్మించిన ఆ సచివాలయ ప్రరంభాన్ని కేసీఆర్ తన పుట్టిన రోజు నాడు ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ జన్మదినం అయిన ఏప్రిల్ 14న దీనిని ప్రారంభించేలా అదేశాలు ఇవ్వాలని ఆ పిల్ లో కోరారు. అంతేనా.. పాత సచివాలయాన్ని వాస్తు పేరుతో కూల్చివేసి వందల కోట్ల ప్రజాధనంతో కొత్త భవనాన్ని నిర్మించి, తన పుట్టిన రోజున దానిని ప్రారంభించడం ద్వారా వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాకులాడుతున్నారని పాల్ ఆ పిల్ లో ఆరోపించారు.   ఆయన అక్కడితో ఆగలేదు. తన పిల్ ను విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారంటూ.. చీఫ్ జస్టిస్ బెంచ్ కు నివేదించారు. దీంతో పాల్ పిల్ కు నంబరింగ్ ఇవ్వాలని రిజిస్ట్రార్ కు కోర్టు ఆదేశాలు జారి చేసింది. దీంతో కేఏ పాల్ పిల్ మంగళవారం ( ఫిబ్రవరి 7) విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ పిల్ ను విచారించి కోర్టు ఏ వ్యాఖ్యలు చేస్తుంది, ఏ ఉత్తర్వ్యులు జారీ చేస్తుంది అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.  ఇంత కాలం జోకర్ గా అభివర్ణిస్తూ.. ఆయన చేసే ప్రతి పనినీ, మాట్లాడే ప్రతి మాటనూ ఓ జోక్ గా తీసుకుని నవ్వుకుంటున్న వారందరికీ ఈ పిల్ ద్వారా పాల్ తనలో ఉన్న ఒక సీనియస్ నాయకుడిని చూపారన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. 

ఎన్నికల వేళ.. బీబీసీ డాక్యుమెంటరీ రచ్చ!

ఎన్నికల ఏడాది.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకీ బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ (బీబీసీ) గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఏడాది తొమ్మది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే వచ్చే ఏడాది మేలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. దీంతో విపక్షాలన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై విమర్శల దాడికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే అనుకోకుండా వాటికి బీబీసీ డాక్యుమెంట్ రూపంలో బ్రహ్మాస్త్రం లభ్యమైంది. అసలు సాధారణంగా దేశంలో ఎన్నికల సమయంలో మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా తమదైన సైడ్ తీసుకోవడం ఇటీవలి కాలంలో బాగా ఎక్కువగా కనిపిస్తోంది. అధికార పక్షం వైపో విపక్షాల వైపో మీడియా కూడా తమ ప్రచురణలు, ప్రసారాలను చేస్తున్నది. అయితే అనూహ్యంగా బీబీసీ రూపొందించిన ఒక డాక్యుమెంటరీ మాత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. 2002 నాటి  గుజరాత్‌ అల్లర్లపై బ్రిటిష్‌  బ్రాడ్ కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ) రూపొందించిన ఒక డాక్యుమెంటరీ మొదటి భాగం గత నెల 17న ప్రసారమైంది. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విపక్షాలకు ఒక బ్రహ్మాస్త్రంగా దొరికిందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేంద్రం వెంటనే అప్రమత్తమై ఈ డాక్యముంటరీ ప్రసారంపై నిధేధం విధించింది.    రెండు భాగాల ఈ డాక్యుమెంటరీ పేరు ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’   మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్ సమయంలో జరిగిన మత ఘర్షణలపై నాటి ప్రభుత్వం స్పందన కు సంబంధించిన  ఈ డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని చూసిన వారు మాత్రం మోడీ టార్గెట్ గా ఉందని అంటున్నారు.  గుజరాత్ అల్లర్ల విషయంలో అప్పటి మోదీ ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరించిందని బ్రిటిష్‌ పార్లమెంట్‌ సభ్యుడు ఇమ్రాన్‌ హుసేన్‌ విమర్శించారు. అయితే, బ్రిటన్‌ ప్రధానమంత్రి రుషి సునాక్‌ దీనిని  ఇమ్రాన్‌ హుసేన్‌ పాకిస్థాన్‌ సంతతికి చెందిన బ్రిటిష్‌ పౌరుడు.  అలాగే రుషి సునాక్ భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు. ఇద్దరి అభిప్రాయాలూ వారి వారి మూలాలకు అనుగుణంగానే ఉన్నాయి. అందుకే వాస్తవంగా ఈ డాక్యుమెంటరీలో ఏముందన్న విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ డాక్యుమెంటరీ  ని కేంద్రం నిషేధించడాన్ని విపక్షాలు  తప్పుపడుతున్నాయి.   అప్పట్లో రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నా మోదీ సర్కార్ పట్టనట్టు వ్యవహరించిందని ఏమాత్రం పట్టించుకోకపోవ డం దురదృష్టకరమని బ్రిటిష్‌ పార్లమెంట్‌ సభ్యుడు ఇమ్రాన్‌ హుసేన్‌ అన్నారు. రాష్ట్రంలో ఒక వర్గాన్నిపూర్తిగా తుడిచిపేట్టే కుట్ర జరిగిందని, అప్పటి మోడీ సర్కార్ ఉదాశీనత ఆ కుట్రకు ఊతం ఇచ్చేలా ఉందన్నది ఆయన విమర్శల సారాంశం. ఇక బీబీసీ డాక్యుమెంటరీ మొదటి భాగం చూసిన వారు అది ఉద్దేశపూర్వకంగా పూర్తిగా ఏకపక్షంగా రూపొందించారని విమర్శిస్తున్నారు. ఒక దారుణానికి ప్రతిఘటనగా గుజరాత్ అల్లర్లు జరిగిన విషయాన్ని డాక్యుమెంటరీలో ఎక్కడా కనీసం ప్రస్తావన కూడా లేకపోవడాన్ని బీజేపీ తప్పుపడుతోంది.  అయితే డాక్యుమెంటరీపై బ్రిటిష్ ప్రధాని ఆ దేశ పార్లమెంటులో    బ్రిటిష్‌ ప్రభుత్వం మారణ హెూమాలను ప్రోత్సహించదని స్పష్టం చేశారు. అలాగే  బీబీసీ గుజరాత్‌ అల్లర్లను చిత్రీకరించిన విధానం  మోదీని దోషిగా నిలబెట్టడానికి ఏకపక్షంగా చేసిన ప్రయత్నంలా ఉందని భావిస్తున్నమని పేర్కొన్నారు.  ఈ అభిప్రాయం ఒక్క రిషి సునాక్ మాత్రమే కాదు.. బ్రిటిష్‌ పౌరులలో కూడా ఎక్కువ మందికూడా వ్యక్తం చేశారు.   ఈ డాక్యుమెంటరీలో అప్పటి హింసా విధ్వంస కాండలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ఈ హింసాకాండలో ముగ్గురు బ్రిటిష్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్  మాజీ మంత్రి హరేన్‌ పాండ్యా కూడా  హత్యకు గురయ్యారు.  ఈ హింసాకాండ తర్వాత బ్రిటన్‌ ప్రభుత్వం ఈ సంఘటనలపై దర్యాప్తుకు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యులు గుజరాత్‌ వచ్చి దర్యాప్తు  జరిపి ఒక సమగ్ర నివేదికను అంద జేసిందని, దాని ప్రకారం ఇక్కడ అల్లర్లు జరుగుతున్నప్పుడు మోదీ ప్రభుత్వం చూసీచూడనట్లు  వ్యవహరించిందనే విషయం తేటతెల్లమయిందని డాక్యుమెంటరీలో పేర్కొన్నట్లు చెబుతున్నారు.  అల్పసంఖ్యాక వర్గాలే లక్ష్యంగా ఇక్కడ హింసాకాండ ప్రారంభమైనందనడంలో ఎటువంటి సందేహమూ లేదని కూడా ఆ డాక్యుమెంటరీ నిర్ధారించిందని దానిని చూసిన వారు చెబుతున్నారు.   అయితే ఈ అల్లర్ల వెనుక కుట్ర ఏమీ లేదని సుప్రీం కోర్టు విస్పష్టంగా తేల్చి చెప్పింది. అప్పటి అల్లర్ల వ్యవహారంలో అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ, ఆయన ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని సిట్‌ ఇచ్చిన నివేదికను జకియా జాఫ్రీ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.  దానిపై సుప్రీంకోర్టు ఈ అల్లర్లు అప్పటికప్పుడు పెట్రేగిపోయాయని, వీటి వెనుక కుట్రేమీ లేదని స్పష్టచేసింది. ఇప్పుడు గత జనవరి 17న బీబీసీ ఈ డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని ప్రసారం చేయడం వెనుక ఏదో దురుద్దేశం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.  

హరీష్ బడ్జెట్ నిరాశపరిచింది!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సాదాసీదాగా ఉంది. ఎన్నికల సంవత్సరం కావడంతో సంక్షేమానికి పెద్ద పీట వేసినా ఎవరినీ పెద్దగా మెప్పించలేకపోయింది. కొన్ని పథకాలకు కేటాయింపులు పెంచినా, గత బడ్జెట్ కంటే సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించినా.. హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై పెదవి విరుపులే ఎక్కువగా విపినిస్తున్నాయి.  దళితబంధు, రైతుబంధు, రైతుబీమా స్కీమ్‌లకుఈ సారి కేటాయింపులు పెంచలేదు. గతంలో సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించినా వాటిని విడుదల చేయకపోవడాన్ని ఎత్తి చూపుతే ఈ సారి కేటాయింపులపై నమ్మకం లేదన్న భావన సామాన్యులలో కూడా వ్యక్తమౌతోంది. ఈ ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పథకాల ప్రకటన, వాటికి కేటాయింపులు ఉంటాయని అంతా ఆశించారు. అయతే హరీష్ రావు కొత్త పథకాల ఊసే తన బడ్జెట్ లో ఎత్తలేదు.   . ఇటీవల ముఖ్యమంత్రి ఎక్కడ పర్యటనకు వెళ్ళినా మున్సిపాలిటీలకు, మండలాలకు, నియోజకవర్గాలకు హామీలు గుప్పిస్తున్నరు. అందుకు అనుగుణంగా  బడ్జెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌కు ఏకంగా  రూ.8,348 కోట్లు ఎక్కువగా కేటాయించారు.  అందువల్ల రాష్ట్రంలో పార్టీ బలహీనంగా ఉన్న చోట నిధులను గుమ్మరించి అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం లభించింది. నిరుద్యోగ భృతి, గిరిజనబంధు వంటి పథకాల ఊసే బడ్జెట్ లో కనిపించలేదు. ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను ఏదో ఒక మేర తగ్గించాలన్న ఉద్దేశంతో కొత్త ఉద్యోగాలకు వెయ్యి కోట్లు కేటాయించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్లు గత బడ్జెట్‌ సందర్భంగా సీఎం అసెంబ్లీ వేదికగానే హామీ ఇచ్చినా ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఇప్పుడు అదే హామీని మరో సారి ఇచ్చారు. ఇక కేంద్ర తో విభేదాల కారణంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇక్కట్లు బడ్జెట్ లో ప్రతిఫలించాయి.  ఆదాయ వనరుల కోత కారణంగా బడ్జెట్ లో కొత్త సంక్షేమ పథకాలకు అవకాశం లేకుండా పోయింది.   దళితబంధుకు గతేడాది రూ. 17,700 కోట్లు కేటాయించినా ఒక్క పైసా కూడా విడుదల కాకపోవడానికి కూడా నిధుల కొరతే కారణం.  ఈసారి కూడా దళిత బంధుకు అంతే నిధులు కేటాయించినా విడుదలపై అనుమానాలు ఉన్నాయి.   మొత్తంమీద 2023-24 బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. ఇది విపక్షాల మాటే కాదు. ఆర్థిక రంగ నిపుణుల విశ్లేషణ కూడా. స్వయంగా భారాస శ్రేణులలోనూ ఒకింత అసంతృప్తి వ్యక్తంఅవుతోంది. 

అలీ.. ఈ సారి టికెట్ పై ఆశలు.. జగన్ కరుణించేనా?

ఎన్నాళ్లో వేచిన ఉదయం అలీకి ఎదురవ్వబోతోందా? అంటే ఆ రోజు త్వరలో వస్తుందని వైసీపీ వర్గాలలో వినిపిస్తోంది. మూడేళ్ల  పాటు ఎదురు చూపులే యదను నిండగా , అన్నట్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు అలీ. వక్ఫ్ బోర్డు చైర్మన్, లేదా రాజ్యసభ సభ్యత్వం వస్తుందని ఆశపడ్డారు. శుభ వార్త చెబుతాను అంటూ.. ముఖ్యమంత్రి జగన్ కూడా ఆయనను ఊరించారు. చివరికి ఓ సలహాదారు పోస్టు ఇచ్చి సరిపెట్టేశారు. ఊరించి ఊరించి ఉసూరుమనిపించారు జగన్ అని అలీ అభిమానులే కాదు.. స్వయంగా అలీ కూడా అనుకునే ఉంటారు. ఎందుకంటే.. ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేని వారికి మాత్రమే జగన్ సలహాదారు పదవులో.. ఇంకోటో ఇచ్చి సరిపెట్టేశారని వైసీపీ శ్రేణుల్లో ఒక భావన ఉంది. అయితే.. ఒక్క అలీ విషయంలో మాత్రం ఆ భావనకు చిన్న మినహాయింపు. గత ఎన్నికలలోనే పోటీ చేయాలని జగన్ ఆశపడ్డారు. ఈ పార్టీ, ఆ పార్టీ అని లేకుండా అన్ని పార్టీల చుట్టూ ప్రదక్షణల చేశారు. చివరికి సినీ రంగంలో దశాబ్దాలుగా స్నేహబంధం ఉన్న పవన్ కల్యాణ్ ను కాదనీ, ఆయన పార్టీ జనసేనకు జెల్ల కొట్టి మరీ జగన్ పంచన చేరారు. అయితే జగన్ గత ఎన్నికలలో అలీకి పోటీ చేసే చాన్స్ ఇవ్వలేదు. అందుకు బదులుగా సగౌరవంగా మంచి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరేందుకు మూడేళ్లు పట్టింది. అప్పుడూ సగౌరవంగా ఇవ్వాల్సిన పదవి ఇవ్వలేదు. వందల మంది సలహాదారులలో ఒకరిగా ఆయనను సరిపెట్టేశారు. సర్దేశారు. అలీ కంటే పోసానికి ఒకింత మెరుగైన పదవి ఇచ్చారని అప్పట్లోనే వైసీపీ శ్రేణుల్లో పెద్ద చర్చ కూడా జరిగింది.  ఎందుకంటే పోసానికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఇచ్చారు. తనకు దక్కిన సలహాదారు పదవి విషయంలో అలీ కూడా అసంతృప్తి చెందే ఉంటారు. కానీ బయటపడలేదు.  అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లు మూడేళ్ల నిరీక్షణ తరువాతైనా అలీకి ఒక పోస్టు దక్కింది. ఎందుకంటే అలీయే కాదు.. గత ఎన్నికలలో మోహన్ బాబు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ ఇలా చాలా మంది సినీ జీవులు జగన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. వీరందరిలో అందరి కంటే ముందుగా పదవి దక్కింది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ కు మాత్రమే. అయితే ఆయనకు ఆ పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎస్వీబీసీ టీవీ చానల్ చైర్మన్  పదవి దక్కించుకున్న పృధ్వీరాజ్ ను ఆరోపణల నెపంతో పక్కన పెట్టేశారు. ఆ తరువాత ఆయన ముఖం కూడా చూడలేదు. ఇక మోహన్ బాబు విషయానికి వస్తే.. ఆయన అసలు పార్టీకి పని చేశారన్న విషయాన్ని కూడా జగన్ గుర్తించిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో ఆయన క్రమంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి పార్టీ తరఫున పని చేసిన అలీ.. తనకు తగిన పదవి దక్కకపోతుందా అని ఎంతగానో ఎదురు చూశారు. చివరకు పదవి దక్కినా తన స్థాయికి, తన ఎదురు చూపులకు సరైన గుర్తింపు, గౌరవం దక్కలేదని ఆయన అనుకున్నా లేకున్నా.. ఆయనను అభిమానించే వారంతా బాధపడ్డారు. ఇప్పుడు మళ్లీ అలీలో ఆశల మొలకలు మొలిచే వార్త ఒకటి వైసీపీ సర్కిల్స్ లో జోరుగా ట్రెండ్ అవుతోంది. అదేమిటంటే.. సలహాదారు పదవితో సరిపెట్టేయకుండా జగన్ అలీకి వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ వార్తే వైసీపీ శ్రేణుల్లో హల్ చల్ చేస్తోంది. అలీ కూడా సీఎం జగన్ తనకు వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇస్తారన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తన స్వస్థలమైన రాజమండ్రి నుంచి ఈ సారి అలీ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే అలీ ఇటీవల తరచూ రాజమండ్రి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. చిన్నా పెద్దా అన్నతేడా లేకుండా ఎవరు పిలిచినా వెళుతున్నారు. చివరాఖరికి చిన్న చిన్న క్రికెట్ టోర్నీల ప్రారంభోత్సవాలకు కూడా అలీ రాజమండ్రిలో వాలిపోతున్నారు. అలాంటి సందర్భాలలో మీడియాతో మాట్లాడిన ప్రతి సారీ.. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేస్తానని ధీమాగా చెబుతున్నారు. అయితే రాజమండ్రి నుంచే పోటీ చేస్తానని మాత్రం చెప్పడం లేదు. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ పోటీ చేస్తానని చెబుతున్నారు. అయితే అలీ గురించి తెలిసిన వారు ఆయన లోక్ సభ నియోజకవర్గానికి కాకుండా అసెంబ్లీకి పోటీలో దిగాలని భావిస్తున్నారని చెబుతున్నారు. జగన్ ఆదేశిస్తే పవన్ కల్యాణ్ పై పోటీ చేయడానికి కూడా సిద్ధమని అలీ గతంలో ప్రకటించిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అలీ ఇలా వైసీపీ అధినేత జగన్ ను మెప్పించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారనీ, ఎక్కువగా ప్రజలలో తిరుగుతూ, మీడియాతో మాట్లాడే సందర్భంగా పోటీ పట్ల తన ఆసక్తిని ఆయనకు తెలిసేలా చేస్తున్నారని అంటున్నారు. అయితే అలీ ఆశపడుతున్న విధంగా వచ్చే ఎన్నికలలో ఆయన పోటీ చేసే అవకాశం జగన్ ఇస్తారా? అన్న ప్రశ్నకు మాత్రం ఇప్పటి వరకూ జగన్ నుంచి అటువంటి స్పష్టమైన హామీ ఏదీ రాలేదనే సమాధానమే వస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను నియమించిన జగన్ ఆయా నియోజకవర్గాలలో పార్టీ టికెట్ మీకే పని చేసుకోండని భుజం తట్టి మరీ ప్రోత్సహించారు. కానీ అలీకి మాత్రం ఇప్పటి వరకూ అటువంటి హామీ కానీ ప్రోత్సాహం కానీ లభించిన దాఖలాలు కనిపించడం లేదు.  

ఖాళీల భర్తీకి ఆదేశాలు.. ముందస్తు తొందరేనా?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ పరిస్థితి ముందు చూస్తే గొయ్యి, వెనుక చూస్తే నుయ్యి అన్నట్లుగా తయారైంది. ఎన్నికలకు ఇంకా ఏడాది పైగా సమయమున్నా.. జగన్ సర్కార్ ఇప్పడో.. ఇహనో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలని నిర్ణయం తీసేసుకుందా అన్నట్లుగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. అదే సమయంలో ముందస్తుకు వెళితే కొండ నాలుక్కి మందు వేస్తే ఉన్న నాలుక కూడా ఊడినట్లు అన్న చందంగా ముందుగానే అధికారం కోల్పోవలసి వస్తుందా అన్న సందేహమూ వైసీపీ ప్రభుత్వాన్నీ, పార్టీ ముఖ్యులనూ వెంటాడుతోంది. అందుకే ఎటూ తేల్చుకోలేని స్థితిలో జగన్ పరిస్థితి తయారైంది.  మహా కవి, శ్రీ శ్రీ సంధ్యా సమస్యలు,( ఆ సాయంత్రం...ఇటు చూస్తే అప్పులవాళ్లూ..అటు చూస్తే బిడ్డల ఆకలి.. ఉరిపోసుకు చనిపోవడమో..సముద్రమున పడిపోవడమో-..సమస్యగా ఘనీభవించిందొక సంసారికి) కవితను గుర్తు చేస్తున్నారు.  ఇప్పుడు జగన్ ప్రభుత్వం  కూడా సరిగ్గా అటువంటి సంకట స్థితినే ఎదుర్కొంటోంది. ముందస్తుకు వెళ్లకుంటే ఇప్పటికే దిగజారిన ప్రభుత్వ ప్రతిష్ట మరో ఏడాది కాలంలో అధమ స్థాయికి పడిపోయేలా ఉంది. అలాగని ముందస్తుకే వెళితే.. ఏప్పుడో ఏడాది తరువాత చేజారాల్సిన అధికారం అంతకంటే ముందే చేయి జారిపోతుంది. ఇప్పుడు ఏపీ సర్కార్ పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది.  ముందస్తుకు వెళ్లుటయా? మానుటయా అన్న సందిగ్ధంతో పడి కొట్టుమిట్టాడుతోంది. అందుకే..  ఒక వైపు ముందస్తుకు రెడీ అయిపోతూనే.. మరో వైపు వేచి చేద్దాం అన్నట్లుగా వ్యవమరిస్తోంది. అందుకే  చూస్తే కదులుతున్న అధికార పీఠం.. ఇటు చూస్తే కమ్ముకొస్తున్న ప్రజా వ్యతిరేకత.. అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లడమా? వ్యతిరేకతను పట్టించుకోకుండా అధికారాన్నిపట్టుకు వేలాడుతూ మిగిలిన ఏడాది గడిపేయడమా? అన్నది జగన్ సర్కార్ కు ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితిని తీసుకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో మండల, డివిజన్ స్థాయిలో ఉన్న ఖాళీలన్నిటినీ వెంటనే భర్తీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశిస్తూ.. సీఎంవో కార్యాలయం నుంచి ఆదేశాలుజారీ అయ్యాయి. దీంతో జగన్ ముందస్తుకే మొగ్గు చూపుతున్నారని అంతా భావిస్తున్నారు.  నిజానికి ముందస్తుకు వెళ్లినా, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగినా ఓటమి తథ్యమన్న భావనకు ఇప్పటికే వైసీపీ నేతలు వచ్చేశారనీ, అందుకే.. ముందస్తుకు వెళ్లడమా? షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చే వరకూ ఆగటమా? అన్న సంశయంలో పడ్డారనీ అంటున్నారు.   మరో ఏడాదిన్నర ప్రభుత్వాన్ని నడపడం, అంటే షో రన్ చేయడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుండటంతో ముఖ్యమంత్రి ముందస్తుకే మొగ్గు చూపుతున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల అయితే.. జగన్ ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఎన్నికలు జరుగుతాయని ముందస్తు విషయంలో బంతి జగన్ కోర్టులో ఉందని తేల్చేశారు. ముందస్తు ఎన్నికలకు  పోతే ముందుగానే ఇంటికి పోతామని సొంత పార్టీ ఎమ్మెల్యేలే హెచ్చరిస్తున్నారు. అలాగని షెడ్యూల్ దాకా అగుదామంటే..మొదటికే మోసం వచ్చేలా వుంది. అందుకే అధికార పార్టీ నేతలు ముందస్తు ఎన్నికల విషయంలో ఓ రోజు ఔననీ, మరో రోజు కాదనీ ఆల్ మోస్ట్ నిర్ణయం తీసుకోవడానికి రోజు హెడ్ అండ్ టెయిల్ వేసుకుని ఆ మేరకు రోజుకో విధంగా మాట్లాడుతోంది.  వాస్తవానికి ముందస్తు ఎన్నికల మాట ముందుగా వచ్చింది అధికార పార్టీ నేతల నుంచే. ఒక సారి కాదు ఒకటికి పది సార్లు  జగన్ సర్కార్ లో సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న  పలు మార్లు ముందస్తు ప్రస్తావన తీసుకు వచ్చారు.  నిజానికి, ప్రతిపక్ష పార్టీలు, ముందస్తు ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వ్యూహాత్మకంగా తీసుకు వస్తున్న ముందస్తు చర్చను విపక్షాలే కాదు.. ప్రజలు కూడా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.  ముందస్తా  కాదా అన్న విషయం పక్కన పెడితే  ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని విపక్షాలతో పాటు జనం కూడా ఎదురు చూస్తున్నారు.  ఈ విషయం స్పష్టంగా తెలిసినా వైసీపీ అగ్రనేతలు, ప్రభుత్వ పెద్దలూ మాత్రం తమను తాము మభ్యపెట్టుకోవడమే కాకుండా.. ప్రజలను కూడా మభ్య పెడదామని, పెట్టగలమని భావిస్తున్నారు. .అయితే,  ఒకసారి ప్రజలు నిర్ణయానికి వచ్చిన తర్వాత  ముందస్తు అయినా, కాకపోయినా ఫలితంలో పెద్ద తేడా ఉండదని పరిశీలకులు అంటున్నారు. అయినా ఇప్పుడు బంతి వైసీపీ కోర్టులోనే ఉందనీ, ముందస్తు అయినా కాకపోయినా  ఫలితం ఏమిటన్నది ఇప్పటికే ఆ పార్టీకి అర్ధమైపోయందనీ అంటున్నారు. 

పతనం అంచున పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితి!

పాకిస్థాన్ తీవ్రాతి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అసలు మొదటి నుంచీ కూడా పాకిస్థాన్ దేశ ఆర్థిక ప్రగతిపై దృష్టి సారించలేదు. ఆ దేశం సైన్యం, ప్రభుత్వాలూ అన్నీ భారత్ పై ఆధిపత్యం సాధించడమెలా అన్న విషయంపైనే ఇప్పటి వరకూ తమ దృష్టిని కేంద్రీకరించాయి. ఈ కారణంగానే ఆ దేశం తేరుకోలేని విధంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దూరదృష్టి లేని విధానాల ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తోంది.   ప్రస్తుతం పాకిస్థాన్‌ అనేకానేక సంక్షోభాల్లో కూరుకుపోయి ఉంది. ఒకదాని తర్వాత ఒకటిగా   కాదు. సంక్షోభాలన్నీ ఒక్కసారే చుట్టుముట్టి  దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజం పాకిస్థాన్ ఇప్పుడు సంక్షోభ నివారణకు కూడా చర్యలు తీసుకునే దారి కనిపించక దైన్యంగా  మిగిలిపోయింది.  ఆ దేశఆర్థిక పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ంత మేలు. ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే.. శ్రీలంకే పాక్ కంటే ఎన్నో రెట్లు నయం అనిపించక మానదు. ఇప్పడు ఈ ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్థాన్ బయటపడాలంటే.. ఆ దేశానికి బయట నుంచి భారీగా సాయం అందాల్సిందే.  ఆదుకోవాల్సిందిగా కోరుతూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్‌) సంస్థకు పాక్ విజ్ణప్తులు పరంపరగా కొనసాగిస్తోంది. ఎంఐఎఫ్ బృందం పాక్ లో పర్యటిస్తోంది. ఆ దేశానికి ఆర్ధిక సహకారం అందించే విషయంలో ఎంఐఎఫ్ ప్రతినిథి బృందం  ఎంత వరకూ పాకిస్థాన్ కు సహకారం అందిస్తుందన్నది స్పష్ట లేకపోయినా. ఆర్థిక సహాయం అందించేందుకు ఆ సంస్థ విధిస్తున్న షరతులు మాత్రం    పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మెడకు ఉరితాళ్లుగా పరిణ మించాయి.   ఆర్థిక సహాయం చేయాలంటే తాము సూచించే పొదుపు సూత్రాలను, ఆంక్షలను పాక్‌ తప్పని సరిగా పాటించాల్సి ఉంటుందని  ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రతినిధుల బృందం స్పష్టం చేసింది.  ఐ.ఎం.ఎఫ్‌ సూచించిన నియమ నిబంధనలను పాటించడానికి అంగీకరిస్తే.. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు దేశంలో ఇసుమంతైనా విలువ ఉండదనడంలో సందేహం లేదు.     గత ఏడాది చివర్లో పాకిస్థాన్లోని అనేక ప్రాంతాలను భీకర వరదలు, తుఫానులు చుట్టుముట్టి అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం దేశంలో గోధుమలకు కనీవినీ ఎరుగని కొరత ఏర్పడింది. నిత్యావసర వస్తువులకు   కొరతే. చివరికి విద్యుత్ ఉత్పత్తి కూడా సరిపడినంతగా లేదు.  దేశంలోని పలు  రాష్ట్రాలలో  విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుదుత్పత్తి సంస్థల  ఇంధనం కొనడానికి నిధులు నిండుకున్నాయి. విదేశీ మారక నిల్వలు   అడుగంటిపోయాయి.   అనివార్య పరిస్థితుల్లో  ప్రభుత్వం గతవారం పెట్రోల్‌ డీజిల్‌ ధరలను పెంచాల్సి వచ్చింది.  దీంతో పెద్ద ఎత్తున  నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల అతికష్టం మీద యు.ఎ.ఇ నుంచి 300 కోట్ల డాలర్ల సహాయ ప్యాకేజీని పొందగలిగింది. అయితే, ఇందులో 200 కోట్ల డాలర్లను వస్తు రూపేణా చెల్లించడం జరుగుతుంది. దాంతో పాకిస్థాన్‌ కొద్దిగా తెరిపిన పడింది. కానీ, ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే.  గతంలో 2019 ప్రాంతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం ఐ.ఎం.ఐ నుంచి 6.5 వందల కోట్ల డాలర్ల సహాయం పొందగలిగింది. ఈ మొత్తాన్ని ఐ.ఎం.ఎఫ్‌ విడతలవారీగా చెల్లించడం ప్రారంభించింది. అయితే, తాము పెట్టిన నియమ నిబంధనలను పాకిస్థాన్‌ మధ్యలో గాలికి వదిలే సరికి ఆ సంస్థ ఈ రుణ సహాయాన్ని మధ్యలోనే ఆపేసింది. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని పదవి నుంచి దిగిపోయి, షరీఫ్‌ అధికారం చేపట్టిన తర్వాత ఈ రుణ సహాయాన్ని కొనసాగించడానికి ఐ.ఎం.ఎఫ్‌ ముందుకు వచ్చింది. కానీ  ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  అయితే పాకిస్థాన్ లో ప్రస్తుతం నెలకొన్న ఈ దుర్భర పరిస్థితికి సైన్యానిదే సింహభాగం బాధ్యతగా చెప్పుకోవాల్సి ఉంటుంది.   ఒక పక్క ఆర్థిక సమస్యలు, సంక్షోభాలతో దేశం అతలాకుతలం అవుతుండగా మరో పక్క పాకిస్థాన్‌ సైన్యం దేశంలోని ఉగ్రవాదులకు శిక్షణను, ఆర్థిక సహాయాన్ని నిరాకంటకంగా కొనసాగిస్తోంది. సుశిక్షితులైన ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించడానికి అది మార్గాలు వెతుకుతూనే ఉంది. అందుకే భారత్‌ సహాయంతో ఆర్థిక పరిస్థితిని కొంతవరకైనా చక్క బెట్టుకోవాలని షరీఫ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా సైన్యం తీరు కారణంగా ఆ ప్రయత్నాలు సఫలం కావడం లేదు.  పాకిస్థాన్లో ఏ ప్రభుత్వం ఏర్పడినా ఆర్థికాభివృద్ధి మీద కాకుండా, ఉగ్రవాద పోషణ మీద దృష్టి పెట్టే పరిస్థితికి కారణం పాక్ సైన్యమేననడంలో సందేహం లేదు.  భారత్ తో స్నేహ సంబంధాలు వృద్ధి చెంది ఉంటే పాక్‌ ఇంత అధ్వాన స్థితిలో ఉండేది కాదని ఇమ్రాన్‌ ఖాన్‌, షరీఫ్ లు స్వయంగా అంగీకరించడమే ఇందుకు నిదర్శనం.

సమావేశాల తర్వాత సంచలన నిర్ణయం ?

భారత రాష్ట్ర సమితి, బీఆర్ఎస్’లో ఏమి జరుగుతోంది? ఇటు అసెంబ్లీలో అటు బయట జరుగతున్న పరిణామాలను గమనిస్తే... అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే కీలక, సంచలన నిర్ణయాలు వెలువడే  అవకాశాలున్నాయని గులాబీ పార్టీలో వినిపిస్తున్న గుసగుసలను బట్టి తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పడం సంప్రదాయం. అయితే, ఈసారి  గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగిన సందర్భంలో ముఖ్యమంత్రి అసలు సభకు రాలేదు. ముఖ్యమంత్రికి బదులుగా, మంత్రివర్గంలో రెండవ స్థానంలో ఉన్న హోం మంత్రి లేదా ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఆర్థిక మంత్రి ఆయన కాదంటే శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రి సమాధానం చెప్పడం సంప్రదాయం. కానీ, ఈ అందరినీ కాదని, మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి,కే. తారక రామారావు, సమాధానం ఇచ్చారు. ఇది దేనికి సంకేతం? నిజమే. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా,ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్. అందులో అనుమానం  లేదు. కొద్ది కాలం క్రితం వరకు ఎవరికైనా కొద్ది పాటి అనుమానాలు, ఆశలు ఉంటే ఉన్నాయేమో కానీ, ఈటలకు ఉద్వాసన పలికిన తర్వాత వేగంగా సీన్ మారిపోయిందని తెలంగాణ భవాన్ క్యారిడార్లలో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఆ లెక్కన, నెంబర్లతో సంబంధం లేకుండా, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వాడు కేటీఆర్... అందులో అనుమానం లేదు.అందుకే కావచ్చును, లోలోపల ఏమనుకున్నారో ఏమో కానీ, హరీష్ రావు సహా మంత్రులు ఎవరు, కేటీఆర్ అనధికార పదోన్నతిపై బయటకు ఒక్క మాట అయినా మాట్లాడలేదు. అదీగాక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై జరిగిన చర్చకు ఎవరు ప్రభుత్వం తరపున ఎవరు సమాధానం చెప్పాలనే విషయంలో సంప్రదాయమే కానీ, ప్రత్యేక నిబంధన ఏదీ ఉన్నట్లు లేదు. అందుకే, కేటీఆర్ ట్రయిల్ రన్ సాఫీగా సాగిపోయిందని అంటున్నారు. నిజానికి, ఒక్క కేసీఆర్ మినహా మిగిలిన మంత్రులు, పార్టీ నాయకులు అందరూ కేటీఆర్ ‘బాస్’ గా అంగీరించేందుకు మానసికంగా సిద్ధమయ్యారు అంటున్నారు.   అయితే, రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది దేనికి సంకేతం? అనే చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఓ వంక  ముఖ్యమంత్రి కేసేఆర్ ఇక జాతీయ రాజకీయాలపైనే దృష్టిని కేంద్రీకరిస్తారనే వార్తలు వస్తుంటే మరోవంక  కొద్ది రోజుల క్రితం వరకు, జాతీయ రాజకీయాల పై అంతగా ఆసక్తి చూపని, బీఆర్ఎస్ కార్యకలాపాలకు కొంత దూరంగా ఉంటూ వస్తున్న కేటీఆర్, హటాత్తుగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రోల్ మోడల్ గా కనబడుతున్నారని  గంభీర ప్రకటనలు చేయడం, అలాగే, శాసన సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల సహా ప్రతిపక్ష సభ్యులతో మింగిల్ అవుతున్న తీరు చూస్తే ఏవేవో అనుమానాలు, ఎవేవో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక మార్లు ముహూర్తం దాకా వచ్చి వాయిదా పడుతూ వచ్చిన కేటీఆర్ పట్టాభిషేకానికి నిజ ముహూర్త సమయం సమీపించిందా? అనే అనుమానాలు జోరుగా వినవస్తున్నాయి.  అలాగే, ఇదీ అని స్పష్టంగా లేకున్నా బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత కీలక నిర్ణయాలు ఉంటాయనే చర్చ, రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రముఖంగా వినవస్తోంది. అయితే అది కేటీఆర్ పట్టాభిషేకమా? అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలా? అదీ ఇదీ రెండునా అనే విషయంలో మాత్రం ఎవరూ క్లారిటీ ఇవ్వలేక పోతున్నారు. ఫిబ్రవరి 17, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు .. అదే రోజున నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం ... అదే రోజున ... ఇంకేమైనా (కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం)...కూడా ఉంటుందా ... అంటే, కేటీఆర్ లో పొంగిపొరలుతున్న ఉత్సాహం ఉండవచ్చునని అంటోందని అంటున్నారు. చూడాలి మరి..ఏమవుతుందో ...

తెలంగాణ బడ్జెట్ 2023-24.. వ్యవసాయం, ఇరిగేషన్ కు పెద్ద పీట

ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను   ప్రవేశ పెట్టారు. శాసనమండలిలో ఆర్‌ అండ్‌ బీ, శాసనసభ వ్యవహారాలశాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశట్టారు. మొత్తం రూ.2,90,395 కోట్లతో హరీష్ రావు   బడ్జెట్ రూపొందించారు. రూ. ఇందులో రెవెన్యూ వ్య‌యం రూ. 2,11,685 కోట్లు. పెట్టుబ‌డి వ్య‌యం రూ. 37,525 కోట్లు. తన బడ్జెట్ లో హరీష్ రావు వ్యవసాయానికి సింహభాగం కేటాయించారు. వ్యవసాయ రంగానికిఆయన 26,931 కోట్ల రూపాయలు కేటాయించగా, నీటి పారుదల శాకకు 26,886 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే విద్యుత్ రంగానికి 12,727 కోట్లరూపాయలు. ఆసరా పెన్షన్ల కోసం 12 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక దళిత బంధు కోసం 17, 700 కోట్లు, ఎస్సీ ప్రత్యేక నిథి కోసం 36, 750 కోట్ల రూపాయలూ కేటాయించారు. ఇక ఎస్టీ ప్రత్యేక నిథికోసం 15, 233 కోట్ల రూపాయలు కేటాయించారు. బీసీ సంక్షేమం కోసం6,229 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 2, 131 కోట్లు కేటాయించారు. ఇక వివిధ అంశాల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.   ఫారెస్ట్‌ కాలేజీకి రూ. 100 కోట్లు,  కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ కు రూ. 200 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌నాన్‌వెజ్‌ మార్కెట్లకు రూ. 400 కోట్లు,  ఆలయాల కోసం రూ. 250 కోట్లు,  మిషన్‌ భగీరథకు రూ. 600 కోట్లు మిషన్ భగీరథ అర్భన్‌ రూ. 900 కోట్లు, వడ్డీ లేని రుణాల కోసం రూ. 1500 కోట్లు, ఎప్లాయిమెంట్‌ హెల్త్‌ స్కీమ్‌ కోసం రూ. 362 కోట్లు, ఆరోగ్య శ్రీ కోసం రూ. 1,101 కోట్లు, కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌ కోసం రూ. 750 కోట్లు కేటాయించారు. అలాగే  సుంకేశుల ఇన్‌టెక్‌ ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు కేటాయించిన హరీష్ రావు  యాదాద్రి డెవలప్‌మెంట్‌ అథారిటీ కోసం రూ. 200 కోట్లు, టీఎస్ ఆర్టీసీ   అభివృద్ధికి రూ. 1500 కోట్లు మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయించారు. ఇక  మహిళా వర్సిటీకి రూ. 100 కోట్లు కేటాయించారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖకు భారీగా 31, 426 కోట్ల రూపాయలు కేటాయించారు.  ఓల్డ్ సిటీ మెట్రో రైలు కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి కార్ఫస్ ఫండ్ కోసం వంద కోట్ల రూపాయలు కేటాయించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకానికి రూ. 3,210 కోట్లు కేటాయించగా, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం కోసం 12,000 కోట్లు  కేటాయించారు.  

ఫామ్‌హౌస్‌ కేసు విచారణ సీబీఐకే.. తేల్చి చెప్పిన హైకోర్టు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్.. సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో తెలంగాణ సర్కార్ కు ఇక ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయమే అంతటా వ్యక్తమౌతోంది.  ఇటు భారతీయ జనతా పార్టీ, (బీజేపీ) అటు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రెండు పార్టీల మధ్య, ఇంచుమించుగా సంవత్సరానికి పైగా సాగుతున్న రాజకీయ పోరాటంలో బీఆర్ఎస్ కష్టాలు ఎదుర్కొనక తప్పదు.  ఎమ్మెల్యేల బేరసారాల కేసులో రాష్ట్ర హై కోర్టు సిగిల్ జడ్జి బెంచ్  గతంలో  కేసీఆర్ ప్రభుత్వానికి షాకిస్తూ కేసు విచారణను సిబిఐకి అప్పగించిన సంగతి విదితమే. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సర్కార్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఇప్పుడు డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ తీర్పును సమర్ధిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను కొట్టివేయడంతో.. ఇక ఫార్మ్ హౌస్ కేసు సబీఐ దర్యాప్తు ప్రారంభించడం అనివార్యమని తేలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ రాష్ట్రంలో కాలు పెట్టకుండా అడ్డుకునేందుకు  జనరల్  కన్సెంట్ రద్దు చేసినా, హై కోర్టు తీర్పుతో ఇప్పుడు సిబిఐ రాష్ట్రంలో ఎంటర్ అవుతుంది. ఇలా రెండు విధాలా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం ( సిట్) విచారణ పై విశ్వాసం లేదని, విచారణ పారదర్శకంగా జరగట్లేదని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కేసులో నిందితులుగా ఉన్న నంద కుమార్, అనుమానితుడిగా ఉన్న అడ్వకేట్ శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన రాష్ట్ర హై కోర్టు,. కేసును సీబీఐకి అప్పగిస్తూ సంచలన తీర్పు నిచ్చింది. దానిని సవాల్ చేసిన ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.  అధికార టీఆర్‌ఎస్‌/బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన యత్నాన్ని సైబరాబాద్‌ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.  ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ఎమ్మెల్యేలు దీనిపై తమకు ఫిర్యాదు చేశారని.. తమకు డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఎర చూపించి పార్టీ మారాలని బలవంతం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకు పక్కా ప్రణాళిక ప్రకారం వల పన్ని ఈ ఆపరేషన్‌ నిర్వహించా మంటూ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించిన సంగతి విదితమే. ఫరీదాబాద్‌ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈకేసు విచారణకు ఏర్పాటు చేసిన ‘సిట్’ ఏర్పాటు విషయంలో  మొదటి నంచి అనుమనాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో ఏర్పాటు సెహ్సిన  సిట్  కూర్పు, విషయంలో అనుమనాలు వ్యక్తమయ్యాయి. అలాగే, సిట్  అధికార పరిధిని దాటి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పద  మయ్యాయి. న్యాయ స్థానాలు సైతం సిట్  గీత దాటిందని పేర్కొన్నాయి. కీలక కేసుల్లో సిట్‌ ఏర్పాటు సాధారణమే అయినా.. డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని నియమించడం మాత్రం ఇదే తొలిసారి కావడంతో అనుమానాలు మరింతగా బలపడ్డాయి.  ఈ నేపధ్యంలోనే, విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగట్లేదన్న పిటిషర్ల వాదనతో ఏకీభవించింది. ఈ కేసులో సిట్‌ను విచారణను తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ.. సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.  ఈ తీర్పునే ఇప్పుడు డివిజన్ బెంచ్ సమర్ధించింది. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో సీబీఐ దర్యాప్తు సాగనుంది. 

లోకేష్ పాదయాత్రకు రోజు రోజుకూ పెరుగుతున్న ఆదరణ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. యువగళం పేరిట చేపట్టిన పాదయాత్ర  సోమవారం 11వ రోజుకు చేరుకుంది. రోజు రోజుకూ పెరుగుతున్న జనాదరణతో  లోకేష్ పాదయాత్ర ఓ ప్రభంజనంలా సాగుతోంది.  నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 100 కిలోమీటర్లును పూర్తి చేసుకొంది. జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని  కుప్పం నుంచి ప్రారంభమైన నారా లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతోన్నారు. అలాగే  జగన్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను లోకేష్ ఈ పాదయాత్రలో ఎండగడుతున్నారు. విపక్ష  న నేతగా ఉండగా జగన్ చేసిన పాదయాత్రలో నాడు ప్రజలకు ఇచ్చిన హామీలు..  గద్దెనెక్కిన ఈ మూడున్నరేళ్లలో వాటిని విస్మరించిన తీరును ప్రజలకు కళ్లకు గట్టేలా వివరిస్తున్నారు.  అదే విధంగా జగన్ తీరు కారణంగా   ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలనే కాదు.. ఎస్సీ, ఎస్టీలపై అక్రమంగా నమోదవుతున్న   కేసులతోపాటు వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై   జగన్ సర్కార్ దెబ్బకొట్టిన  విధానాన్ని లోకేష్ తన పాదయాత్రలో ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. అలాగే దళితలను హత్య చేసి.. మృతదేహాలను సైతం డోర్ డెలివరి చేసే సౌకర్యం కూడా జగన్ సర్కార్ కల్పించిందంటూ సెటైర్లు గుప్పించారు.   జగన్  పాలన అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సైతం లోకేష్ జనాలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక లోకేష్ ను కలిసి తమ కష్ట సుఖాలు చెప్పుకునేందుకు జనం పోటీలు పడుతున్నారు. యువత ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. దారిపొడవునా మహిళలు హారతులు పడుతున్నారు.  ఇలా అన్ని వర్గాల ప్రజలూ లోకేష్ పాదయాత్రకు నీరాజనాలు పలుకుతున్నారు. అదే విధంగా దారిపొడవునా కలిసిన అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకుంటూ, భవిష్యత్ పై వారికి బరోసా కల్సిస్తూ ముందుకు నడుస్తున్నారు. ఒక వైపు లోకేష్ కు జనం బ్రహ్మరథం పడుతుంటే.. మరో వైపు పోలీసులు అడుగడుగునా అవరోధాలు కల్పిస్తున్నారు. అనుమతులు లేవంటూ సభలను అడ్డుకోవడం, ప్రచార వాహనాన్ని సీజ్ చేసేందుకు ప్రయత్నించడం, నోటీసులు ఇవ్వడం వంటి చర్యలతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పై జనంల ఆగ్రహం వ్యక్తమౌతోంది.