గడప గడపకు దారిలోనే ఇంటింటికి స్టిక్కర్!
posted on Feb 14, 2023 @ 1:42PM
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలనే సమయం వుంది. అయినా అధికార పార్టీలో హడావిడి చూస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాడి తన్నేసేందుకు సిద్ధమైపోయారనే అభిప్రాయం బలపడుతోంది. అవును అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తర్వాత ఎప్పుడైనా ముఖ్యమంత్రి అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం తధ్యమని విపక్షాలే కాదు అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెవులు కొరుక్కుంటున్నారు.
అలాగే తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ముందస్తు తథ్యమనే మాట చెపుతూనే ఉన్నారు. ‘యువ గళం’ పాద యాత్రతో సర్కార్ కు చలి పుట్టిస్తున్న యువ తార నారా లోకేష్ కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతులు ఎత్తేయడం ఖాయమని అంటున్నారు. రాజకీయ వ్యాఖ్యలు విమర్శలు ఎలా ఉన్నా దినదినాభివృద్దిగా దిగజారుతున్నరాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పోటీ పడి అంతకంట్ వేగంగా దిగజారుతున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇమేజ్ గ్రాఫ్ ను పరిశీలిస్తే ముందస్తుకు వెళ్ళడం వినా మరో మార్గం ఏదీ కనిపించడం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు మీటలు నొక్కటం ఒక్కటే పనిగా పెట్టుకున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే చాలు, ఇక అధికారం శాశ్వతం అనే భ్రమల్లో అదొక్కటే పనిగా మీటలు నొక్కుతూ ఖజానా ఖాళీ చేశారు. ఖజానా ఖాళీ ఆయినా మీటలు నొక్కడం ఆపలేదు పుట్టిన కాడికి అప్పులు చేశారు. ఇక ఇప్పడు అప్పులు పుట్టని పరిస్థితి వచ్చింది. ప్రస్తుత పరిస్థితినే తీసుకుంటే, ఏ నెలకా నెల అప్పులు చేసుకుంటాం ..అనుమతివ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
ఎంతైనా జగన్ రెడ్డి ప్రధాని మోదీకి దత్త పుత్రుడు కంటే కొంచెం ఎక్కువే కాబట్టి కేంద్రం జనవరిలో రూ.4557 కోట్ల రుణాలకు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత వారానికే ... అధికారులు ఢిల్లీ వెళ్లారు. మళ్ళీ అప్పుకు అనుమతి ప్లీజ్ అంటూ చేతులు చాచారు. అది కూడా ఒకసారి కాదు గత నెల రోజుల్లోనో నాలుగైదు సార్లు అధికారులు, మధ్యలో ఒకటి రెండు సార్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఢిల్లీ వెళ్లి దేహీ అన్నట్లు వార్తలొచ్చాయి. మరో వంక తెచ్చిన అప్పులో కనీసం 60 శాతం పెట్టుబడి వ్యయం (అభివృద్ధి కోసంచేసే ఖర్చు) కోసం వాడాలని కేంద్రం స్పష్టం చేసింది. కానీ... జగన్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ( 2022-23) తొలి పదినెలల్లో చేసిన అప్పుల్లో 12 శాతం మాత్రమే పెట్టుబడి వ్యయం కింద ఖర్చు చేసింది. మిగిలినదంతా ఇష్టారీతిగా వాడేసింది. దీంతో ఇక కొత్త అప్పుకు అనుమతి ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పేసింది.
అయినా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ ఢిల్లీలోని తిష్ట వేసి కూడా కేంద్ర అధికారులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి వరకు బండి లాగించేందుకు కనీసం మరో రూ.10,000 కోట్ల కొత్త రుణానికి అనుమతివ్వాలంటూ ఆర్థిక శాఖ అధికారులు కేంద్ర అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం ఇంతవరకూ రాష్ట్రానికి అప్పులకు అనుమతివ్వలేదు. తాము ఆశిస్తున్నట్లుగా పదివేల కోట్లు కాకున్నా... కనీసం 5 వేల కోట్ల కొత్త అప్పులకు అనుమతి లభిస్తుందని రాష్ట్ర అధికారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. లేని పక్షంలో ఫిబ్రవరి నెల గడవడం అసాధ్యమని పేర్కొంటున్నారు. మరోవైపు... కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి జనవరి వరకు జగన్ ప్రభుత్వం రూ.81,857 కోట్లు అప్పు చేసింది. వీటికి పెండింగ్‌లో ఉన్న రూ.45,000 కోట్ల బిల్లులు అదనం. కాగ్ నివేదిక ప్రకారం డిసెంబరు వరకు అంటే 9 నెలల్లో ప్రభుత్వం రూ.55,500 కోట్ల అప్పు చేసింది.
కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం చేస్తున్న అప్పులను కాగ్ తన నివేదికలో పేర్కొన్న అప్పుల్లో కలపలేదు. అందుకే వాస్తవం కంటే అప్పులు తక్కువగా ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం తెస్తున్న అప్పులు మొత్తాన్ని పెట్టుబడి వ్యయం కింద మాత్రమే ప్రభుత్వాలు వాడాలి. కానీ, రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు తెస్తున్న అప్పుల్లో 60 శాతం అప్పులను పెట్టుబడి వ్యయం కింద వాడాలని గత ఏడాది కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. కానీ కాగ్ నివేదిక ప్రకారం డిసెంబరు వరకు జగన్ సర్కారు రూ.55,500 కోట్ల అప్పు తెచ్చి పెట్టుబడి వ్యయం కింద రూ.6,800 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మిగతా డబ్బులన్నీ అంతకుముందు తెచ్చిన అప్పులు, వడ్డీలు కట్టడానికి వాడింది. మరో వంక ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు, పెన్షన్లను ప్రభు త్వం ఇంకా పూర్తిగా చెల్లించలేదు. 12వ తేదీ నాటికి అతి కష్టమ్మీద జీతాలు ఇచ్చాం అనిపించినా... పెన్షన్లు ఇంకా పూర్తి స్థాయిలో పడలేదు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, బడ్జెట్ వరకు ఎదో విధంగా పంటి బిగువున బండి లాగించి, అ వెంటనే అసెంబ్లీ రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చేస్తున్నారని, అందుకే, ఇప్పడు హడావిడి చేస్తున్నాని అంటున్నారు. అందులో భాగంగానే, ఇంటింటికీ ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్ల ప్రచారం మొదలు పెడుతున్నారు. అయితే, గడప గడపకు ..లానే ఇంటింటికి కూడా .. బూమ్ రాంగ్ అవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.