పొత్తు పొడుపు.. తెలుగుదేశం, జనసేన సీట్ల పంపకం ఎలా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల సంగతి ఎలా ఉన్నా రాజకీయాలలో మాత్రం రాణించ లేక పోతున్నారు. ఆయన స్వయంగా తన నోటితోనే ఆ విషయాన్ని చెప్పారు. రాజకీయాల్లో తాను ‘ఫెయిల్’ అయ్యానని, అయినా, రాజకీయాలను వదిలి వెళ్లనని, పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. సరే అయన ఫెయిల్డ్ పొలిటీషియన్ అయినా.. ఎన్నికలలో ఆయన, ఆయన పార్టీ ప్రభావాన్ని మాత్రం తక్కువ చేసి చూడటానికి ఇసుమంతైనా అవకాశం లేదు. అయితే ముందుగా ఆయన రాజకీయాలలో ఎందుకు రాణించలేకపోతున్నారన్న విషయానికి వస్తే.. అందరూ చెప్పే ఒకే ఒక ప్రధాన కారణం ఆయన చేస్తున్న జోడు పడవల ప్రయాణం.
ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో ఇటో కాలు అటో కాలు అన్నట్లు ప్రయాణం చేయడం వలన సామాన్య జనం ఆయన్ని సినిమా స్టార్ గా గుర్తించినంతగా పొలిటికల్ స్టార్ గా గుర్తించడం లేదు. అందుకే ఆయన మీటింగులకు జనం వచ్చినా, ఆయన ప్రసంగాలకు చప్పట్లు కొట్టి జయజయ ధ్వనాలు పలికినా అందంతా ఓ సినిమా హీరోకు వచ్చిన జన నీరాజనంగానే అంతా భావిస్తున్నారు తప్ప.. ఒక కంప్లీట్ పొలిటీషియన్ గా మాత్రం ఆయనకు ఇప్పటికీ జనంలో పూర్తి స్థాయి గుర్తింపు వచ్చిందని మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. అదే ఆయన పొలిటికల్ ఫెయిల్యూర్ కు కారణంగా రాజకీయ పండితులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. 2014 ఎన్నికలలో ఆయన అప్పటి తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికలలో ఆయన మద్దతు ఇచ్చిన కూటమి విజయం సాధించింది. 2019 ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఆయన ఒంటరిగా రంగంలోకి దిగారు. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఆ ఎన్నికలలో త్రిముఖ పోరుకు కారణమయ్యారు.
సరే ఆ ఎన్నికలలో జనసేన పార్టీ ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. జనసేనాని స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పరాజయం పాలయ్యారు. కానీ.. జనసేన ఒంటరి పోరు ఎన్నికల ఫలితంపై మాత్రం స్పష్టమైన ప్రభావం చూపింది. కేవలం జనసేన రంగంలో ఉండటం వల్లనే వైసీపీ విజయం సాధించిందని ఎన్నికల ఫలితాల తరువాత తేలింది. సరే అది పక్కన పెడితే.. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కూటమితో బీజేపీ కలుస్తుందా? కలవదా? అన్నది అప్రస్తుతం. ఆ పార్టీ కలిసినా, కలవకున్నా రాష్ట్ర రాజకీయాలపై కానీ, ఎన్నికలపై కానీ ఏ మాత్రం ప్రభావం పడదు.
ఎందుకంటే ఏపీలో బీజేపీకి ఉన్న స్టేక్ అలాంటిది. కేవలం ఒక్క శాతం ఓటు బ్యాంకుతో రాష్ట్ర రాజకీయాలను శాసించాలని బీజేపీ కలలు కంటే కనవచ్చు కానీ.. ఆ కలలకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అడుగులు వేస్తాయనుకోవడం మాత్రం భ్రమే అవుతుంది. జనసేన విషయానికి వస్తే.. ఆయనకున్న హీరో ఇమేజే, రాజకీయాల్లో ఆయన ఫెయిల్యూర్ కి కారణం అవుతోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే సినిమాలు వదులు కునేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేరు. సినిమాలు వదులు కుంటే పార్టీ నడవదు. రాజకీయాలు వదులుకునేందుకు, పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేరు. ప్రజా సేవ పట్ల ఆయనకు ఉన్న తపన అలాంటిది.
అదలా ఉంటే, ఓ వంక ఏపీలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఎన్నికల కురుక్షేత్రానికి సిద్దమవుతున్నాయి.అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జిల్లాల పర్యటనలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. మరో వైపు లోకేష్ పాదయాత్ర కూడా ప్రజా మద్దతుతో సాగుతోంది. జనసేనాని కూడా వారాహిలో బస్సు యాత్రకు సిద్ధమౌతున్నారు. నిజానికి జనసేన ప్రచార రధాలు ఎప్పుడో సిద్ధమైనా ప్రచారం మాత్రం ఇంకా పట్టాలు ఎక్కలేదు. ఇక పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర కు సమాయత్తమౌతున్నారు అయితే ఇప్పటికే ఒకటికి రెండు సార్లు వాయిదా పడిన పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ఎప్పుడు మొదలవుతుంది? మొదలైనా, నిరాటంకంగా జరుగుతుందా, షూటింగుల మధ్యలో, ‘గ్యాప్’ యాత్రలు చేస్తారా అన్నదానిపై జనసేన శ్రేణుల్లోనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశంతో పొత్తు, సీట్ల పంపకాలు విషయంలో జనసేన పట్టుదలకు పోకుండా పట్టు విడుపులు ప్రదర్శిస్తేనే ఇరు పార్టీల మధ్య స్నేహ బంధం గట్టిగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమైపోయిందనీ, బీజేపీ కలిసినా కలవకపోయినా తెలుగుదేశం జనసేనలు కలిసే వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో పోటీ చేస్తాయనీ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వంటి అంశాల విషయంలో ప్రాథమికంగా అవగాహన కుదిరిందని కూడా ప్రచారంలో ఉంది. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో జనసేన బలం పెరిగిందన్న విషయాన్ని ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. హీరోగా, పొలిటీషియన్ గా జనసేనాని పవన్ కల్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలోనే ప్రజలు ఆయన సభలకు హాజరౌతున్నారు. తెలుగు రాష్ట్రాలలో అత్యంత జనాకర్షణ సామర్థ్యం ఉన్న వారిలో పవన్ కల్యాణ్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. అయితే ఈ జనాకర్షణ ఎన్నికలలో విజయానికి దోహదపడుతుందా అంటే మాత్రం కచ్చితంగా ఔనన్న సమాధానం రాదు. గత ఎన్నికలలో 130కి పైగా స్థానాలలో పోటీ చేసిన జనసేన కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించింది. ప్రస్తుతం కూడా ఆ పార్టీకి జనాదరణ పెరిగినా ఒంటరిగా ఎన్నికల సమరాంగణంలో గెలిచే సామర్థ్యం మాత్రం లేదనే చెప్పాలి.
ఇందుకు ప్రధాన కారణం పార్టీ ఆవిర్భవించి పుష్కర కాలం గడిచినా ఇప్పటికీ సంస్థాగత నిర్మాణం లేదు. అలాగే పవన్ కల్యాణ్ వినా జనసేనలో మరో నాయకుడు కనిపించరు. జనసేన అంటే పవన్ కళ్యాణ్ అంతే. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నా.. ఆయన క్రౌడ్ పుల్లర్ కాదు. వీరిద్దరినీ మినహాయిస్తే మిగిలిన వారంతా ఆటలో అరటి పండుతో సమానం. అదే తెలుగుదేశం విషయాన్ని తీసుకుంటే.. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పుడు ఆయన పార్టీ నిర్మాణంపై దృష్టి సారించి గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకూ పార్టీ నిర్మాణం చేపట్టారు. శిక్షణ శిబిరాలు నిర్వహించి, సభ్యత్వాలు నమోదుపైనా దృష్టి సారించారు. ఆ తరువాత పార్టీలో చంద్రబాబు కార్యకర్తల వివరాలు, పార్టీ కార్యక్రమాలను కంప్యూటరైజ్ చేశారు. శిక్షణ శిబిరాలను కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లారు. ఇప్పుడు ఎన్టీఆర్ లేకపోయినా, టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉండటానికి అదే కారణం. అందుకే టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా.. రాజకీయాల్లో తన గుర్తింపు చాటుకుని, స్థిరంగా నిలిచింది. ఏపీలో జగన్ పార్టీని ఓడించి అధికారంలోకి రావడానికి అవసరమైన శక్తి, బలం, బలగం ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్నాయి. సో .. వైసీపీని ఓడించి, జగన్ రెడ్డి పాలనకు ముగింపు పలకడమే జనసేన లక్ష్యం అన్న పవన్ కళ్యాణ్ ముందున్న ఏకైక ఆప్షన్ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఒక్కటే. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అదికారంలోకి రాకుండా అడ్డుకోవాలన్న లక్ష్యం నెరవేరాలంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకోవలసిన అవసరం ఉంది.
అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న జనసేన పార్టీతో పొత్తు తెలుగుదేశం పార్టీకీ అవసరమే. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల మధ్యా పొత్తు విషయంలో సీట్ల సర్దుబాటు అంశం కీలకం కానున్నది. ఈ నేపథ్యంలోనే జనసేన ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలను కోరుతోందన్న ప్రచారం పొత్తు చర్చలు ముందుకు సాగేందుకు అవరోధంగా మారాయని అంటున్నారు. పొత్తులో భాగంగా జనసేన 40 స్థానాలను కోరుతోందన్న ప్రచారం సాగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం 20 నుంచి పాతిక స్థానాలను జనసేనకు కేటాయించేందుకు సుముఖంగా ఉందని అంటున్నారు. సీట్ల పంపకం విషయంలో పీటముడి పడకుండా ఉంటే జనసేన, తెలుగుదేశం పొత్తుకు ఢోకా ఉండదని అంటున్నారు.
జనసేనలో అయితే పొత్తులో భాగంగా కోరిన స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉండదన్న ఉద్దేశంతోనే ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశంలో చేరారని అంటున్నారు. ఇక ఇటీవలి సర్వేలలో కూడా తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు వైసీపీ ఓటమికి రాచబాట పరిచినట్లేనని వెల్లడైంది. ఈ నేపథ్యంలోనూ పొత్తులో భాగంగా జనసేన తన వాస్తవబలం ఆధారంగా సీట్ల కేటాయింపునకు ఓకే చెబితో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న పవన్ మాట నిలబడుతుంది. అధికార వైసీపీ ఓటమి ఖాయం చేసినట్లౌతుంది.