తెలంగాణలో కొత్త పొత్తు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
posted on Feb 14, 2023 @ 2:32PM
తెలంగాణలో రానున్న రోజులలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోవడం ఖాయమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హస్తినలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని ఆయన కుండ బద్దలు కొట్టేశారు.
తెలంగాణలో బీజేపీ సంగతి పక్కన పెడితే సెక్యులర్ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రాష్ట్రంలో సొంతంగా మెజారిటీ స్థానాలను సాధించే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదని చెప్పారు.కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ సొంతంగా 60 స్థానాలు సాధించే పరిస్థితులు లేవన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో హంగ్ అనివార్యమని ఆయన జోస్యం చెప్పారు. దీంతో అనివార్యంగా బీఆర్ఎస్ అధినేత కాంగ్రెస్ తో కలవక తప్పని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
ఎన్నికల ముందు ఎటువంటి పొత్తులూ ఉండే అవకాశం లేదనీ, అయితే ఎన్నికల తరువాత మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలవక తప్పదని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గాడిన పడుతోందనీ, అయినా కూడా సొంతంగా 60 స్థానాలు సాధించే అవకాశాలు కనిపించడం లేదని కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర పేరుతో జనంలోకి వెళుతున్నారు. ఆయన పాదయాత్రకు విశేష జనస్పందన కనిపిస్తోంది.
అదే సమయంలో ఇంత కాలం రేవంత్ పై నిప్పులు చెరుగుతూ వస్తున్న సీనియర్లు ఇప్పుడిప్పుడే సమస్యలను, విభేదాలను పక్కన పెట్టి రేవంత్ తో అడుగులు కదుపుతున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు (వీహెచ్) రేవంత్ తో కలిసి భద్రాచలం నియోజకవర్గంలో మంగళవారం (ఫిబ్రవరి 14)పాదయాత్రలో పాల్గొన్నారు. అలాగే బుధవారం (ఫిబ్రవరి 15) పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ఆయన రేవంత్ తో అడుగులు కదపనున్నారు. ఇలా విభేదాలు మరచి రాష్ట్ర కాంగ్రెస్ లోని అన్ని వర్గాలూ ఐక్యమౌతున్నతరుణంలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారానికి అవసరమైన 60 స్థానాలను సాధించలేదని కోమటి రెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.