వంశీ ప్రతిష్ట డ్యామేజీ.. వైసీపీలో ఆయన వ్యతిరేకులు సో హ్యాపీ
posted on Feb 24, 2023 @ 11:28AM
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు.. స్థానిక టీడీపీ కార్యాలయంపై ముకుమ్మడి దాడితో... ఫ్యాన్ పార్టీలోని వంశీ వ్యతిరేక వర్గానికి చక్కటి అవకాశం చే జేతులా చిక్కినట్లు అయిందని.. ఈ నేపథ్యంలో వంశీకి వ్యతిరేకంగా పావులు కదిపేందుకు సదరు వర్గానికి చేతి నిండా పని దొరికినట్లు అయిందనే ఓ చర్చ ఆ నియోజకవర్గంలో విస్తృతంగా వినిపిస్తోంది.
గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలిచిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాత జగన్ పార్టీలోకి దూకేసిన సంగతి తెలిసిందే. అయితే వంశీ రాకను.. గన్నవరం నియోజకవ వైసీపీ ఇన్‌చార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్ అప్పట్లోనే తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగి.. వెంకట్రావ్‌ను కూల్ కూల్ చేశారు. కానీ వంశీకి, యార్లగడ్డ వెంకట్రావ్‌కు మధ్య వైరం నాడే కాదు.. నేటికి పచ్చి పచ్చిగానే ఉందని తదననంతర పరిణామాలు రుజువు చేశాయి.
మరోవైపు ఇదే నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ కీలక నేత దుట్టా రామచంద్రరావు తన అల్లుడికి గన్నవరం టికెట్ ఇప్పించుకొనేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన జగన్ ఫ్యామిలీతో దగ్గర బంధుత్వం కలిగి ఉన్న వ్యక్తి కూడా. వీరందరినీ కాదని... వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ టికెట్ వంశీకేనంటూ ఇప్పటికే జగన్ క్లారిటీతో చెప్పేసినట్లు వైసీపీ శ్రేణుల్లోనే ఒక చర్చ జోరుగా సాగుతోంది. జరిగిన, జరుగుతున్న పరిణామాలను దుట్టా వర్గం, యార్గగడ్డ వర్గం సైలెంట్‌గా గమనిస్తూ ఉన్నాయనీ.... తాజాగా టీడీపీ కార్యాలయంపై వంశీ వర్గీయులు దాడి ఘటనను ఈ రెండు వర్గాలు తమకు అనుకూలంగా మలచుకుని.. వంశీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.
మరోవైపు గతంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. చంద్రబాబు ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం.... ఆ తర్వాత ఓ టీవీ చర్చా కార్యక్రమంలో సారీ సిస్టర్ అంటూ క్షమాపణలు చెప్పినా.. అప్పటికే వంశీ ఇమేజ్ ఎంతగా డ్యామేజ్ కావాలో అంతా జరిగిపోయిందని.. ఇప్పుడు తాజాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై ముక్కుమ్మడి దాడి ఘటనతో టోటల్‌గా వంశీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయిందనే ఓ చర్చ సైతం సైతం జరుగుతోంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అయినా.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అయినా.... పోలిటికల్ లైఫ్ ఇచ్చిందీ తెలుగుదేశం పార్టీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత మరో పార్టీలో చేరి.. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కన్నతల్లి లాంటి పార్టీపైనే ఆరోపణలు గుప్పించడం వల్ల... వీరిపై ప్రజల్లో ఓ విధమైన తప్సుడు అభిప్రాయం ఇప్పటికే వ్యక్తమవుతోందని.. ఈ అంశాన్ని దుట్టా, యార్లగడ్డ వర్గాలు... ఒక తాటిపైకి వచ్చి.. ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లగలిగితే.. ఆయన తట్టుకోగలడా అనే ఓ విధమైన సందేహం ప్రస్తుత ఎమ్మెల్యే వర్గంలో వ్యక్తమవుతోన్నట్లు తెలుస్తోంది.
అదీకాక వంశీపై రాజకీయంగా పట్టు సాధించేందుకు యార్లగడ్డ వెంకట్రావ్, దుట్టా వర్గాలు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకొంటూనే ఉన్నాయని... ఇంకోవైపు వచ్చే ఎన్నికల్లో వంశీపై టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కె.పట్టాభిరామ్‌ను బరిలో నిలిపేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని తెలుసుకొన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. టీడీపీ కార్యాలయంపై దాడి చేయాలంటూ ఆయన వర్గీయులను ఆదేశించారనే చర్చ సైతం స్థానికంగా వైరల్ అవుతోంది.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. వాటిలో గన్నవరం నియోజకవర్గం ముందు వరుసలో ఉంటుదన్న సంగతి అందరికి తెలిసిందే. అందుకే 2019 ఎన్నికల్లో వైయస్ జగన్ వేవ్‌లో సైతం టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ గెలుపొందారు. అలాంటి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పట్టాభిని నిలబెడితే.. ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అవుతోందని.. అందులో ఎటువంటి సందేహం అయితే లేదనే ఓ చర్చ సైతం వంశీ వర్గీయుల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే వంశీ వర్గీయులు సైకిల్ పార్టీ కార్యాలయంపై దాడికి పునుకున్నారనే చర్చ సైతం స్థానికంగా కొన.. సాగుతోంది.