ఇక అరెస్టేనా?
posted on Feb 24, 2023 6:39AM
ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్దమైందా?అంటే పోలిటికల్ సర్కిల్‌లో ఔననే సమాధానమే వినిపిస్తోంది. శుక్రవారం (ఫిబ్రవరి 24) వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్‌లో సీబీఐ విచారణకు హాజరుకానున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే రాజకీయవర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పటికే వివేకా హత్య జరిగిన సమయంలో చోటు చేసుకున్న వరుస ఘటనలను నిరూపించేందుకు సాక్ష్యాలున్నాయంటూ ఓ వైపు ఫోన్ కాల్స్ ఆధారంగా తీగ లాగడంతో.. ఈ హత్య కేసులో డొంకంతా కదిలి..సూత్రదారులు ఎవరో తెలిపోయిందని, అలాగే మరోవైపు తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తేల్చి చెప్పిడం చూస్తుంటే.. ఇక ఈ హత్య కేసులో వరుస బెట్టి ఆరెస్ట్‌లే తరువాయి అన్న ప్రచారం కూడా జోరందుకొంది.
అయితే ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డిని గత నెల 28 తేదీనే సీబీఐ అరెస్ట్ చేసేందుకు సిద్ధమైందని.. అయితే ఆయన కాల్ డేటాను పరిశీలించి.. వాటి వివరాల ఆధారంగా కాల్స్ వెళ్లిన వారిని ఓ సారి విచారిస్తే.. ఆ తర్వాత తమ పని మరింత సులువు అవుతుందన్న ఓ ఆలోచనతో ఉందని.. అందుకే ఆ రోజు.. సీబీఐ వెనక్కి తగ్గి.... అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదని.. ఆ క్రమంలోనే ఆయన ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్ ఆధారంగా.. నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణీ వైయస్ భారతీ పీఏ నవీన్‌లకు నోటీసులు జారీ చేసి.. వారిని విచారించిన తర్వాత.. సీబీఐ అధికారులకు క్లారిటీ వచ్చిందని.. అందుకే మళ్లీ అవినాష్ రెడ్డికి నోటీసులు పంపారని.. అదీ కూడా వాట్సప్‌లో పంపడం బట్టి చూస్తే.. అరెస్టు తప్పదన్న చర్చ పోలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారిందని తెలుస్తోంది.
ఇంకోవైపు.. గత నెల 28 నే తనను అరెస్ట్ చేస్తారని కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అర్థమైందని.. అందుకే తనతోపాటు.. తన సొంత జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతోపాటు జిల్లాలోని పలువురు కీలక నాయకులు, కేడర్‌ను సైతం హైదరాబాద్ తీసుకువచ్చారనే ప్రచారం సైతం కొన.. సాగుతోంది. కానీ సీబీఐ మాత్రం వేచి చూసే దోరణి కారణంగా.. నాడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదని సమాచారం.
అదీకాక జనవరి 28వ తేదీన వైయస్ అవినాష్ రెడ్డి... సీబీఐ విచారణకు హాజరయ్యారని.. మరోవైపు తన సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్... అంతకుముందు అధికారికంగా ఆ రోజు నిర్ణయించుకున్న అన్నీ పర్యటనలను అర్థాంతరంగా రద్దు చేసుకుని మరీ తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమయ్యారనే అంశం కూడా ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
మరి ఫిబ్రవరి 24వ తేదీన సీఎం జగన్.. తన అధికారిక పర్యటనలు లేకుండా ముందుగానే ప్లాన్ చేసుకున్నారా? లేకుంటే. ఓ వేళ ఆ రోజు పర్యటనలు ఏమైనా ఉంటే వాటిని గతంలో లాగా అర్థాంతరంగా రద్దు చేసుకుని.. తన నివాసానికే పరిమితమైపోతారా? అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. వివేకా హత్య కేసులో ఓ వేళ వైయస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే.. ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేసేది ఎవరిని అనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో జోరుగా సాగుతోంది.