సోమేష్ కుమార్ కు బీఆర్ఎస్ లో కీలక బాధ్యతలు?.. కేసీఆర్ వ్యూహమేంటి?
posted on Feb 23, 2023 @ 10:38AM
తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వంలో కాదు, బీఆర్ఎస్ లో కీలక పదవి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆయనను బీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలో నిలబెట్టే దిశగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు. సోమేష్ కుమార్ స్వరాష్ట్రం బీహార్ లో ఆయనకు బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించి.. ఆ రాష్ట్రం నుంచి లోక్ సభ ఎన్నికలలో పోటీకి నిలపాలన్న యోచన చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి.
తొలుత ఆయన ఏపీలో రిపోర్టు చేసి.. ఆ తరువాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం వరకూ అన్నీ కేసీఆర్ చెప్పిన విధంగానే.. ఆయన కనుసన్నలలోనే జరిగాయని అంటున్నారు. ముందుగా ఆయనను రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారటీ) చైర్మన్ గా నియమిస్తారన్న ప్రచారం జరిగింది. ఎందుకంటే.. కోర్టుతీర్పు కారణంగా ఆయన తెలంగాణలో రిలీవ్ అయ్యి.. ఏపీలో రిపోర్టు చేసే సమయానికి ఆయన రెరా బాధ్యతలు చూస్తున్నారు. ఆయన వెళ్లినప్పటి నుంచీ కూడా ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారం జరిగింది. ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారమూ విస్తృతంగా సాగింది.
అయితే ఆయన మేనేజ్ మెంట్ స్కిల్స్, ఎడ్మినిస్ట్రేటివ్ ఎక్స్ పీరియన్స్ ను పార్టీ కి ఉపయోగించుకోవాలని కేసీఆర్ ఫిక్సయ్యారని అంటున్నారు. బీఆర్ఎస్ విస్తరణ విషయంలో కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. జాతీయ స్థాయిలో మద్దతు కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలూ పెద్దగా ఫలిస్తున్న సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే సోమేష్ కుమార్ సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి సొంతగా బీజేపీయేతర శక్తుల ఐక్యతకు తన వంతుగా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా కేసీఆర్ ను దూరం పెట్టడంతో... బీహార్ లో తనకు మద్దతుగా కార్యక్రమాలు చేపట్టడానికీ, పార్టీ కార్యకలాపాల వేగం పెంచడానికీ, ఆ రాష్ట్రంలో ఇప్పటికే నితీష్ కు వ్యతిరేకంగా ఒంటరిగా తన పని తాను చేసుకుపోతున్న ప్రశాంత్ కిషోర్ తో కలిసి బీఆర్ఎస్ బలోపేతం కోసం పని చేయడానికి సోమేష్ సేవలు వినియోగించుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని అంటున్నారు.
సివిల్ సర్వెంట్లు తమ సర్వీసుల నుంచి అర్ధంతరంగా రాజీనామా చేసి రాజకీయాలలోకి రావడం కొత్తేమీ కాదు. అందులో ఎంత వరకూ సక్సెస్ అయ్యారు అన్నది పక్కన పెడితే.. సివిల్ సర్వెంట్ల రాజకీయ ప్రవేశానికి ఆరంభంలో మాత్రం అన్ని వర్గాల నుంచీ ఆమోదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సోమేష్ కుమార్ ను రాజకీయాలలోకి తీసుకురావడానికి కేసీఆర్ ఆసక్తి చూపడం మాత్రం తెలంగాణ సీఎస్ గా ఆయన పని చేసిన తీరు నచ్చడమే నని అంటారు. మరీ ముఖ్యంగా కేసీఆర్ మానస పుత్రికగా అంతా చెప్పే ధరణి రూపకల్పన వెనుక ఉన్నదంతా సోమేష్ కుమారేనని పార్టీ శ్రేణులే కాదు, పరిశీలకులు కూడా పలు సందర్భాలలో చెప్పారు. అంతే కాదు పలు సందర్బాలలో సీఎం కేసీఆర్ సోమేష్ కుమార్ పై బహిరంగ వేదికలపై సైతం ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే సోమేష్ కుమార్ కు కేసీఆర్ ఏ నామినేటెడ్ పదవో, సలహాదారు పోస్టో కాకుండా బీఆర్ఎస్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశమే మెండుగా ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.