సుప్రీంలో విచారణకు రాని అమరాతి కేసు.. దిక్కు తోచని స్థితిలో జగన్ సర్కార్
posted on Feb 23, 2023 @ 2:16PM
అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మరో సారి వెనక్కు వెళ్లింది. హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకోవాలని జగన్ సర్కార్ డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది. హై కోర్టు తీర్పు వెలువరించిన ఆరు నెలల పాటు నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్న జగన్ సర్కార్ ఆ తరువాత హడావుడిగా సుప్రీం ను ఆశ్రయించి, తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించింది.
వైసీపీ ఎంపీ, లాయర్ నిరంజన్ రెడ్డి ఈ విషయంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలో అమరావతి కేసును అత్యవసరంగా విచారించాలంటూ బెంచ్ ముందు ప్రస్తావించారు. 23వ తేదీన తొలి కేసుగా విచారిస్తామని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే ఈ రోజు విచారణకు వచ్చే కేసులు జాబితాలో అమరావతి కేసు లేదు. ఇందుకు సీజేఐ ఈ నెల 14న జారీ చేసిన సర్క్యులరే కారణమని చెబుతున్నారు.
ఒక సారి నోటీసు అయిన కేసులను బుధ, గురువారాల్లో విచారణ చేయవద్దని ఆ సర్క్యలర్ సారాంశం. అందుకే అమరావతి కేసు గురువారం విచారణకు రాలేదని చెబుతున్నారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అత్యవసరంగా స్టే కోసం ప్రభుత్వం అదే పనిగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. అందుకు ఇటీవల నిరంజన్ రెడ్డి వ్యవహారం కూడా ఒక కారణమన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లోనూ, లీగల్ సర్కిళ్లలోనూ జోరుగా సాగుతోంది. జగన్ కు సంబంధించిన కేసుల బెంచ్ హంటింగ్ కు ఆయన పాల్పడుతున్నారన్నదే ఆ చర్చ, ఈ నేపథ్యంలోనే . అమరావతి కేసులో గురువారం (ఫిబ్రవరి 23) విచారణకు రాకపోవడం, ఎప్పుడు వస్తుందన్నదానిపై స్పష్టత లేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరో వంక గత ఏపీ ప్రభుత్వం అమరావతిని చట్ట బద్ధంగా ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కు నివేదించింది కూడా. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే అమరావతి విషయాన్ని తేల్చేయాలన్న ఆత్రంతో ఉన్న జగన్ సర్కార్ సుప్రీంలో అమరావతి కేసు విచారణకు రాకపోవడం ఇబ్బందుల్లో పడేసింది. మరో వైపు సాధ్యమైనంత త్వరగా అమరావతిని ఖాళీ చేసి విశాఖకు మకాం మార్చేయాలన్న తొందర ప్రదర్శిస్తున్న జగన్ కు ఈ కేసు విచారణ జాప్యం అవుతుండటం ఒక విధంగా ఆయనను అసహనానికి గురి చేస్తున్నది.
అమరావతి కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు సంగతి తరువాత కనీసం హైకోర్టు తీర్పుపై స్టే అయినా దక్కితే చాలని జగన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్ వెస్టర్ల సదస్సు నాటికి విశాఖ రాజధానిగా పాలన సాగిస్తామన్న కచ్చితమైన ప్రకటన చేయాలని ఉవ్విళ్లూరుతున్న జగన్ కు సుప్రీం కోర్టులో అమరావతి కేసు విచారణకు రాకపోవడం ఆశనిపాతంగానే పరిశీలకులు చెబుతున్నారు.