హస్తిన చేరిన ఏపీ బీజేపీ పంచాయతీ.. సోము వీర్రాజుపై మురళీధరన్ కు ఫిర్యాదు
posted on Feb 24, 2023 5:40AM
ఏపీ బీజేపీ పంచాయితీ ఢిల్లీకి చేరింది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ఆ పదవి నుంచి తొలగించకపోతే, బీజేపీలో ఎవరూ ఉండే పరిస్థితి లేదంటూ ఓ 30 మంది ఏపీ బీజేపీ సీనియర్ నేతలు, బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్, కేంద్రమంత్రి మురళీధరన్‌కు ఢిల్లీ వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి వారంతా ఆయనకు వివరించారు. ఇటీవల సోము వీర్రాజు, మరికొందరు నాయకులపై వచ్చిన బలవంతపు దళితుల భూ కొనుగోలు ఆరోపణలను మురళీధరన్ దృష్టికి తీసుకు వెళ్లారు.
విశ్వసనీయ సమాచారం మేరకు దాదాపు 30 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు బుధవారం సాయంత్రం కేంద్రమంత్రి మురళీధరన్‌తో భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న సీనియర్లను పక్కకుపెట్టి, తన సొంత మనుషులతో వ్యవహారం నడిపిస్తున్నారని వారు మురళీధరన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై గ్రూపులు కడుతున్నారన్న ముద్ర వేస్తున్నారని వివరించారు.
ఎలాంటి వనరులూ అందుబాటులో లేకపోయినా, తాము రెండేళ్లపాటు సొంత ఖర్చులతో జిల్లాల్లో పార్టీని విస్తరిస్తే, అవమానకరరీతిలో తొలగించారని ఫిర్యాదు చేశారు. దళితుల భూమిని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకునే అంశంలో, పార్టీ ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతిన్నదని వారు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సోము వీర్రాజు అవినీతి కారణంగా పార్టీ నష్టపోతోందని, ఆయనను కొనసాగిస్తే, బీజేపీలో తొలి నుంచీ పనిచేస్తున్న వారంతా, పార్టీ నుంచి వెళ్లిపోయే ప్రమాదం ఉందని మురళీధరన్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ మేరకు ఒక వినతిపత్రం కూడా ఆయనకు అందజేశారు. వారి ఫిర్యాదును సావధానంగా విన్న మురళీధరన్.. సోము వీర్రాజు, మరికొందరు నేతలు కలసి దళితుల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలపై, విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.