టి.20 మహిళల ప్రపంచకప్ లో టీమ్ ఇండియా ఫైనల్ ఆశలు గల్లంతు
posted on Feb 24, 2023 8:59AM
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా పోరు సెమీస్ తో ముగిసింది. సెమీస్ లో ఆస్ల్రేలియా చేతిలో ఐదుపరుగుల తేడాతో పరాజయం పాలైంది. విజయం ముంగిటకు వచ్చి కూడా చివరి నిముషంలో తడబడి ఓటమి మూటగట్టుకుంది. అయితే పోరాడి ఓడిన భారత అమ్మాయిలు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.
మొత్తం మీద టైటిల్ ఆశలో వరల్డ్ కప్ టోర్నీలో అడుగుపెట్టిన టీమ్ ఇండియా మహిళల జట్టుకు ఆ ఆశ నెరవేరలేదు. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ పోరాడి ఓడింది. 173 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్ 43 పరుగులు చేసింది. వీరిద్దరూ అవుటైన తర్వాత దీప్తి శర్మ (20 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది.
చివరి ఓవర్ లో 16 పరుగులు చేయాల్సిన దశలో భారత్ పది పరుగులు మాత్రమే సాధించగలిగింది. దీంతో 5 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా ఫైనల్స్ కు చేరింది. అయితే సెమీస్ లో టీమ్ ఇండియా ఓటమికి దురదృష్టమే కారణమని చెప్పాలి. విజయం దిశగా జట్టును నడిపిస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ అవ్వడంతోనే మ్యాచ్ స్వరూపం మారిపోయింది. 15వ ఓవర్లో తొలి రెండు బంతులను బౌండరీకి తరలించిన హర్మన్ ప్రీత్ కౌర్ నాలుగో బంతిని హర్మన్ మరో షాట్ కొట్టింది.
అయితే బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపిన ఫీల్డర్..బంతిని వేగంగా వికెట్ కీపర్ కు త్రో చేసింది. రెండో పరుగు తీస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజ్ లోకి చేరేలోగా కీపర్ వికెట్ స్టంప్ చేశాడు. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ అయ్యింది. ఆ ఔటే విజయం ముందు టీమ్ ఇండియా బోల్తాపడేలా చేసింది. జర్వంతోనే క్రీజ్ లోకి దిగిన స్కిప్పర్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్ తో జట్టును దాదాపు విజయం అంచులకు చేర్చింది. అయితే దురదృష్టవశాత్తూ..ఆమె రనౌట్ టీమ్ కు విజయాన్ని దూరం చేసింది.