మెడికో ప్రీతికి న్యాయం జరిగేనా?

ర్యాగింగ్ భూతానికి బలైన డాక్టర్ ప్రీతి వ్యథ, మంత్రి కేటీఅర్ దృష్టిలో చాలా చిన్న విషయం కావచ్చును, కానీ, ఆ వ్యథ  ప్రీతి తల్లి తండ్రుల దృష్టిలో చిన్న సమస్య కాదు. ఆమె చావు. ఆ తల్లితండ్రులను  జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. వేధిస్తూనే ఉంటుంది. ప్రీతి మరణం ఆమె తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులనే కాదు,సమాజం మొత్తాన్ని బాధిస్తోంది. మంత్రి కేటీఆర్ దృష్టిలో ప్రీతి మరణాన్ని, ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయనే చులకన భావం ఉంటే ఉండవచ్చును, కానీ, సామాన్య ప్రజలు మాత్రం ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడంలో ప్రతిపక్షాలు, మీడియా విఫల మయ్యాయనే అంటున్నారు. నిజానికి, కొద్ది మాసాల క్రితం బాసర బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన సమయంలో విద్యామంత్రి సబితా ఇంద్రా రెడ్డి, విద్యార్ధుల డిమాండ్స్  ను సిల్లీ డిమాండ్స్ అని అవమానిస్తే, ఇప్పుడు ప్రీతి మరణాన్ని మంత్రి కేటీఆర్ చిన్న సంఘటనగా పేర్కొని, పేదరికాన్ని, పేదలను మరో మారు అవమానించారు.     ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. అయితే ఆమె ఎలా చనిపోయారు? ఆత్మ హత్య చేసుకున్నారా? హత్యకు గురయ్యారా? ఈ విషయంలో ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. ప్రీతి పై విష ప్రయోగం జరిగిందని, ఆమె సోదరి అనుమనిన్స్తున్నారు. ప్రీతి మృతి విషయంలో ఆమె అక్క అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్జరీకి అటెండైన ఆమె అంత సడెన్‭గా ఎలా సిక్ అయ్యిందని ప్రశ్నించారు. తనంతట తానే ఎలా ఇంజక్షన్ తీసుకుంటుందని నిలదీశారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న ప్రీతి ఆర్గాన్స్ మూడు, నాలుగు గంటల్లోనే ఎలా పని చేయకుండా పోయాయని అంటున్నారు. డ్యూటీలో చేరిన కొద్ది రోజులకే అంత పవర్ ఫుల్ డ్రగ్ ను ఆమె చేతికి ఎవరిచ్చారన్న అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రీతి అక్క డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాతనే సీనియర్స్ తో ఆమెకు వాగ్వాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రీతి తన సీనియర్స్  తో మాట్లాడిన కాల్ డేటాను బయటపెడితే అసలు నిజాలు బయటికి వస్తాయని ఆమె అంటున్నారు.  అలాగే  మెడికల్ రిపోర్ట్, అదే విధంగా టాక్సికాలజీ రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ అన్నిటిని మించి పోలీసులు, డాక్టర్లు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎవరిని కాపాడేందుకు  ప్రయత్నిస్తున్నారు అనే అనుమాలు వ్యకమవుతున్నాయి.  మరోవంక డాక్టర్ ప్రీతి ఘటనతో మెడికల్ కాలేజీలపై గవర్నర్ తమిళి సై దృష్టి సారించారు. డాక్టర్ ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని సమాచారం ఇచ్చిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వీసీకి గవర్నర్ లేఖ రాశారు. ప్రీతి ఆరోగ్యం పై తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడ్ని కాపాడేందుకు ప్రయత్నించారని యూనివర్సిటీ అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీలలో యాంటి రాగింగ్ చర్యలు గట్టిగా తీసుకోవాలని గవర్నర్ తమిళి సై సూచించారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇలాంటి సంఘటనలలో ఎలాంటి ఉదాసీనత లేకుండా, తక్షణం స్పందించి కాలేజీలలో బాధ్యులపై కఠిన తీసుకోవాలని సూచించారు.  నిజానికి  ప్రీతి మరణం విషయంలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు మాత్రమే కాదు,  మావోయిస్టులు ఇతర సంస్థలు కూడా తప్పు పడుతున్నాయి. ప్రీతి మృతికి కారకులైనవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ మావోయిస్ట్ పార్టీ  కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన  సోషల్ మీడియాలో లేఖ విడుదల చేశారు. ప్రీతిని సీనియర్ సైఫ్ ర్యాగింగ్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నా యాజమాన్యం  ఆ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని వెంకట్ ఆరోపించారు. ప్రీతికి న్యాయం చేయాలని విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే ఆమె ఆత్మహత్యకు సైఫ్ కారణం కాదని హాస్పిటల్ యాజమాన్యం బుకాయిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  అయితే, ప్రీతి మరణాన్నివిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్న మంత్రి కేటీఆర్  ఆమె మరణానికి మతం రంగు పులిమి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. అందుకే ఆయన సైఫ్ అయినా సంజయ్ అయినా ఎవరినీ ఉపేక్షించమని అన్నారని అంటున్నారు. అయితే, సంఘటన జరిగి వరం రోజులు అయినా ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం రాని నేపధ్యంలో, ఆమెకు న్యాయం   జరగడం అనుమానమే, అంటున్నారు.

మీ బిడ్డను నేను.. జగన్ కొత్త ఎత్తు.. జనం నమ్ముతారనేనా?

 అన్ని సందర్భాలలో అందరినీ నమ్మించడం, ఎవరికైనా, ఎంతటి ‘జగత్’ కిలాడీలకయినా సాధ్యం అయ్యే పని కాదనే నానుడే, వుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాత్రం, వై నాట్, అందరినీ అన్ని వేళలా నమ్మించవచ్చనే విశ్వాసంతో ముందుకెళుతున్నారు.అందుకే, ఆయన వై నాట్ 175? అంటున్నారని, రాజకీయ విశ్లేషకులు, అంటున్నారు.  జగన్మోహన్ రెడ్డి 2019లో ఎలా అధికారంలోకి వచ్చారో  వేరే చెప్పనక్కర లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ ని అడ్డు పెట్టుకుని, తల్లిని,చెల్లినీ, వారి శ్రమను ఆసరా చేసుకుని, దివంగత నేత, ప్రియతమ నాయకుడు అంటూ తండ్రి పేరును ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చారు. ఒక విధంగా సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అందుకు తోడుగా, ఒక్క ఛాన్స్ ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తానని మాటిచ్చి అధికారం దక్కించుకున్నారు. ఈ నిజం అప్పుడు తెలియక పోయినా, ఇప్పడు అందరికీ  అర్థమైంది. అందుకే, జగన్ రెడ్డి అటు సొంత కుటుంబాన్ని,ఇటు ప్రజలను నమ్మించి మోసం చేశారనే నిజాన్ని కొంత ఆలస్యంగానే అయినా జనం గ్రహించారని రాజకీయ పండితులు  విశ్లేస్తునారు. అందుకే ఇప్పుడు జగన్ రెడ్డి కొత్తగా, ‘మీ బిడ్డను నేనంటూ’ కొత్త సెంటిమెంట్ ని తెరమీదకు తెచ్చారని, జనసేన నేత నాదెండ్ల మనోహర్  వ్యంగ విశ్లేషన చేశారు.  గతంలో  దివంగత నేత, ప్రియతమ నాయకుడు.. అంటూ వైఎస్ పేరును పదే పదే ప్రస్తావించిన జగన్ రెడ్డి  ఇప్పడు  ఎక్కడ మాట్లాడినా మీ బిడ్డనని చెప్పుకుంటున్నారు. గతంలో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు… మామయ్యను అంటూ వరుసలు కలుపుకుని సెంటిమెంట్ పండించారు. ఇప్పుడు ఏకంగా అందరితో మీ బిడ్డనంటూ చెబుతున్నారు. అయితే  జగన్ రెడ్డి ఎవరి సలహా మేరకు మళ్ళీ మరోమారు ఫ్యామిలీ సెంటిమెంట్ పండించాలని అనుకుంటున్నారో  ఏమో కానీ, ఆయన సొంత కుటుంబంలోనే ఒంటరి అయ్యారనే విధంగా ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో  ఈ సారి ఫ్యామిలీ  సెంటిమెంట్ వర్కౌట్ అవదు సరికదా బూమ్ రాంగ్ అవుతుందని వైసీపీ నేతలే అంటున్నారు.  ఇదే విషయాన్ని జనసేన పార్టీ కూడా గుర్తు చేసింది. మీ బిడ్డనంటూ బహిరంగ సభల్లో సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన సెటైర్ వేసింది. ఇంట్లో వాళ్లనే నమ్మని బిడ్డ జనం బిడ్డ ఎలా అవుతాడని.. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సొంత ఇంట్లో కన్న తల్లి, సొంత చెల్లి వద్దన్న నేతగా పేరు పడిన జగన్మోహన్ రెడ్డిని ఏ కుటుంబమూ తమ బిడ్డగా ఒప్పుకోదని మనోహర్ స్పష్టం చేశారు.  నిజమే, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటే, అసలు ఆయన రాజకీయాల్లో నిలవగాలిగారు అంటే, అందుకు మూల కారణం ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల. జగన్ రెడ్డి జైల్లో ఉన్న 16 నెలలు ఆ ఇద్దరే పార్టీని బతికించారు. షర్మిల అయితే, జగనన్న వదిలిన బాణాన్ని  అంటూ ...  జగన్ రెడ్డి వదిలి వెళ్ళిన పాద యాత్ర  కొనసాగించారు.  వైసీపీని సజీవంగా ఉంచారు. కానీ, అధికారంలోక్ వచ్చిన తర్వాత  ఆమె పరిస్థితి ఏమిటో  అందరికీ తెలిసిన విషయమే. అలాగే  కారణాలు ఏవైనా తల్లి విజయమ్మ కూడా వైసీపీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి ‘గౌరవంగా’ తప్పు కున్నారు. ఇక బాబాయ్, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో వెలుగు చూస్తున్న నిజాలు ఒక విధంగా విస్మయం కల్గిస్తున్నాయి. జగన్ రెడ్డి ఇంకేమైనా కావచ్చును కానీ, కుటుంబ విలువలు గౌరవించే వ్యక్తి అంటే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు.  అందుకే, కావచ్చును నాదెండ్ల మనోహర్  ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుని పదే పదే మీ బిడ్డను చెప్పుకోవడం ఆపాలని సలహా ఇచ్చారు. తల్లి, చెల్లి విషయంలోనే కాదు.. కుటుంబం విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు తరచూ ప్రజల్లో చర్చనీయాంశం అవుతోంది. తండ్రిని చంపారంటూ.. తీవ్ర రోపణలు చేసి.. రిలయన్స్ పై దాడులు కూడా చేయించిన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ రిలయన్స్ అధినేతను ఇంటికి పిలిచి.. విందు భేటీ ఇవ్వడమే కాకుండా.. రిలయన్స్ సామ్రాజ్యంలో కీలక వ్యక్తికి రాజ్యసభ సీటు కూడా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయినా  జగన్ రెడ్డి మూడున్నరేళ్ళలో ఏ  నాడు ప్యాలెస్ గడపదాటి జనంలోకి  వెళ్లని.. అనివార్యంగా వెళ్ళినా.... పరదాలు చాటున ..పోలీసు పహారాల మధ్య మాత్రమే వెళ్ళిన ముఖ్యమంత్రి ప్రజల బిడ్డ ఎట్టవుతడు? అని, అదే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాయింటే కదూ..

ఏబీకే ప్రసాద్ కు నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్

పాత్రికేయ వృత్తిలో ఎందరో ప్రతిభామంతులైన జర్నలిస్టులకు గురువు అయిన ప్రముఖ  సంపాదకుడు డాక్టర్ ఏబీకే ప్రసాద్   రాజా రాంమ్మోహన్ రాయ్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో దాదాపు అన్ని ప్రధాన పత్రికలకు ఎడిటర్ గా పని చేసిన సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఏబీకే ప్రసాద్ ఢిల్లీలోని డిప్యూటీ స్పీకర్ హాల్ లో మంగళవారం(ఫిబ్రవరి 28) జరిగిన ఒక  కార్యక్రమంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ చేతుల మీదుగా  ఈ పురస్కారం అందుకున్నారు.   ఏబీకేగా ప్రసిద్ధి గాంచిన అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ ఏడున్నర దశాబ్దాలుగా పాత్రికేయ రంగంలో అగ్రగామిగా నిలిచారు.  2004-2009 మధ్య కాలంలో ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా కూడా పని చేశారు.

రాజధాని కేసు.. ఏపీ అత్యవసర విచారణ వినతిని పట్టించుకోని సుప్రీం

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. వచ్చేనెల 3,4 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజధాని విషయంలో సుప్రీం కోర్టు నుంచి తమకు అనుకూలంగా తీర్పు వస్తే.. ఎదురు లేకుండా చక్రం తిప్పవచ్చని భావించిన జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టు నిర్ణయం మింగుడు పడటం లేదు. మూడు రాజధానుల విషయం ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రిం కోర్టులో జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై వచ్చే నెల 28న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో జగన్ సర్కార్ పరిస్థతి కక్కలేకా.. మింగలేకా అన్నట్లుగా తయారైంది. హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సుప్రీంను ఆశ్రయించకుండా.. తీరిగ్గా ఆరు నెలల తరువాత అత్యవసర విచారణ కావాలంటూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు వచ్చే నెల 28న విచారణకు స్వీకరిస్తామంటూ తేల్చి చెప్పింది. ఇప్పటికే జగన్ సర్కార్ అత్యవసర విచారణ అంటూ కోరిన తరువాత ఈ కేసు విచారణ వెనక్కు వెళ్లడం ఇది మూడో సారి.  హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకోవాలని జగన్ సర్కార్ డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది. హై కోర్టు తీర్పు వెలువరించిన ఆరు నెలల పాటు నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్న జగన్ సర్కార్ ఆ తరువాత హడావుడిగా సుప్రీం ను ఆశ్రయించి, తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించింది. వైసీపీ ఎంపీ, లాయర్ నిరంజన్ రెడ్డి ఈ విషయంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలో అమరావతి కేసును అత్యవసరంగా విచారించాలంటూ బెంచ్ ముందు ప్రస్తావించారు. 23వ తేదీన తొలి కేసుగా విచారిస్తామని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం తెలిపింది.  అయితే ఈ రోజు విచారణకు వచ్చే కేసులు జాబితాలో అమరావతి కేసు లేదు. ఇందుకు  సీజేఐ ఈ నెల 14న జారీ చేసిన సర్క్యులరే కారణమని చెబుతున్నారు.   ఒక సారి నోటీసు అయిన కేసులను బుధ, గురువారాల్లో విచారణ చేయవద్దని ఆ సర్క్యలర్ సారాంశం.  అందుకే అమరావతి కేసు గురువారం విచారణకు రాలేదని చెబుతున్నారు.  హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అత్యవసరంగా స్టే కోసం ప్రభుత్వం అదే పనిగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. అందుకు ఇటీవల నిరంజన్ రెడ్డి వ్యవహారం కూడా ఒక కారణమన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లోనూ, లీగల్ సర్కిళ్లలోనూ జోరుగా సాగుతోంది. జగన్ కు సంబంధించిన కేసుల బెంచ్ హంటింగ్‌ కు ఆయన పాల్పడుతున్నారన్నదే ఆ చర్చ, ఈ నేపథ్యంలోనే . అమరావతి కేసులో గురువారం (ఫిబ్రవరి 23) విచారణకు రాకపోవడం, ఎప్పుడు వస్తుందన్నదానిపై స్పష్టత లేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.   మరో వంక గత ఏపీ ప్రభుత్వం అమరావతిని చట్ట బద్ధంగా ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కు నివేదించింది కూడా.  ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే అమరావతి విషయాన్ని తేల్చేయాలన్న ఆత్రంతో ఉన్న జగన్ సర్కార్ సుప్రీంలో అమరావతి కేసు విచారణకు రాకపోవడం ఇబ్బందుల్లో పడేసింది. మరో వైపు సాధ్యమైనంత త్వరగా అమరావతిని ఖాళీ చేసి విశాఖకు మకాం మార్చేయాలన్న తొందర ప్రదర్శిస్తున్న జగన్ కు ఈ కేసు విచారణ జాప్యం అవుతుండటం ఒక విధంగా ఆయనను అసహనానికి గురి చేస్తున్నది.  కాగా రాజధాని అమరావతిపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు తాజాగా  సోమవారం (ఫిబ్రవరి 27) మరోసారి వాయిదా వేసింది. రాజధానిపై పిటిషన్లను త్వరగా విచారించాల త్వరగా వాదనలు ముగించాలని జస్టిస్ కేఎం జోసెఫ్ జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ప్రత్యేకంగా విన్నవించారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఆ పిటిషన్లపై మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది.  మరోవైపు వచ్చే ఏడాది వేసవిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజధాని అంశం అన్ని పార్టీలకు అజెండా అంశంగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో పాలనా పరంగా మూడు రాజధానుల నిర్ణయం వైసీపీకి కీలకంగా మారింది. ఇందులో భాగంగానే విచారణ కోసం ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును విచారణ వేగవంతం చేయాలని కోరుతోంది. అయితే సుప్రీంకోర్టు మార్చి 28న ఈ కేసును విచారిస్తామని స్పష్టం చేసింది.

జగన్ సభ నుంచి జనం పరుగో పరుగు!

ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలన్నా, ప్రసంగాలన్నా జనాలు బెంబేలెత్తిపోతున్నారు. గత నాలుగేళ్లుగా వింటున్న ఆవు కథను ఇంకెంత మాత్రం వినలేమంటూ పారిపోతున్నారు. అదే సమయంలో విపక్ష తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సభలకు, సమావేశాలకు, యాత్రలకు, కార్యక్రమాలకు జనం పోటెత్తుతున్నారు. ప్రతి పాటకూ చప్పట్లతో తమ ఆమోదం తెలుపుతున్నారు. తాజాగా జగన్ సభ నుంచి జనం పారిపోతుండటం కెమేరాకు చిక్కింది. జనాన్ని రప్పించడానికి పథకాల ఆశ, అలాగే పథకాల కోత భయం పెట్టి తీసుకువచ్చినా.. వచ్చిన వారు వచ్చినట్లే ముఖ్యమంత్రి ప్రసంగం మొదలు కాగానే పోలీసులను తోసుకుని మరీ వెళ్లి పోతున్నారు. గతంలో పలుసార్లు ఇటువంటి దృశ్యాలు కనిపించాయి. అయినా ఇటీవలి కాలంలో జగన్ బటన్ నొక్కడానికి తప్ప మరే కార్యక్రమం కోసం పెద్దగా జనాలలోకి రావడం లేదు. అనివార్యంగా ఏదైనా కార్యక్రమం కోసం రావాల్సి వచ్చినా జనం తనకు కనబడకుండా లేదా.. జనానికి తాను కనబడకుండా పరదాల మాటునే రాకపోకలు సాగిస్తున్నారు. మిగిలిన సమయం అంతా తాడెపల్లి ప్యాలెస్ లోనే గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 28)  గుంటూరు జిల్లా తెనాలిలో మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్‌  కార్యక్రమానికి తెనాలి, వేమూరు, పొన్నూరు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో డ్వాక్రా మహిళలను తరలించారు. ఇంతకీ జగన్ ఈ సభ ఏర్పాటు చేసింది రైతు భరోసా పథకంలో భాగంగా బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేసే కార్యక్రమం కోసం. బటన్ నొక్కిన తరువాత యథావిధిగా జగన్ తన ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లు పైబడిన పాలనలో ప్రజలకు ఎంతెంత నిధులు బటన్ నొక్కి జమ చేశారు. సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది. ఇత్యాది విషయాలు చెబుతూ పనిలో పనిగా విపక్షంపై విమర్శలు గుప్పించడానికి.సమాయత్తం అయ్యారు. అయితే బటన్ నొక్కుడు కార్యక్రమం కాగానే సభలో ఏం జరుగుతుందో ముందుగానే తెలిసి ఉండటంతో సభకు వచ్చిన వారు వచ్చినట్లే సీఎం ప్రసంగానికి ముందే లేచి వెళ్లి పోవడం ప్రారంభించారు. వెళ్లే దారిలో పోలీసులు అడ్డంగా నిలుచుని ఆపడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. పోలీసులను తోసుకుని కొందరు, మార్కెట్ యార్డ్ గోడలు దూకి మరి కొందరూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు కూడా చేసేదేం లేక మిన్నకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. జగన్ చూసి జనం పరుగో పరుగు అంటూ కామెంట్లు పెడుతున్నారు. గుర్రాన్ని చెరువు దగ్గరకు తీసుకురాగలరు కానీ, నీళ్లు తాగించలేరు అన్నట్లు జనాన్ని ఏవో ప్రలోభాలు పెట్టి.. లేద పథకాల కోత పేరు చెప్పి బయపెట్టి సభకి అయితే తీసుకురాగలిగారు కానీ.. జగన్ ప్రసంగాన్ని వినేటట్లు మాత్రం చేయలేకపోయారు.  

కేసీఆర్ వ్యూహ వైఫల్యాలు.. బీఆర్ఎస్ లో ఆందోళన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  రాజకీయ వ్యూహరచనలో ఆరి తేరిన దిట్ట. ఎత్తుకు పైఎత్తులువేసి ప్రత్యర్ధులను చిత్తు చేయడంలో ఆయనకు ఆయనే సాటి... అయితే, ఇదంతా  నిన్నటి వైభోగం. ఈ రోజు ఆయన ఏమిటో, ఏమి చేస్తున్నారో ఆయనకే అర్థమవుతున్నట్లు లేదు. ఆయన ముందులా ఏ విషయం పైన దృష్టి కేంద్రీకరించలేక పోతున్నారు. ఒకడుగు అటు ఒకడుగు ఇటూ వేసి ఎటు కాకుండా తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీలో క్యాడర్  లో గందరగోళం ఏర్పడుతోంది. ఇది ఎవరో పరాయి వాళ్ళో, ప్రతిపక్షాలో చేస్తున్న ఆరోపణ కాదు. బీఆర్ఎస్ లోని  కీలక నేతలే ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటల మాంత్రికుడు.. తన వాగ్ధాటితో ఎంతటి వారినైనా మెస్మరైజ్ చేయగలరు. రాజకీయ ఎత్తులు, జిత్తులలో దిట్ట. ఆయన వ్యూహాలు ప్రత్యర్థులకు అంతు చిక్కవు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ టికెట్ పై గెలిచినా.. చివరికి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) లో చేరాల్సిందే అన్నట్లుగా ఆయన రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి. గత ఎనిమిదిన్నరేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. అయితే ఇటీవలి కాలంలో ఆయన ఎత్తులు పారడం లేదు. జిత్తులు చిత్తవుతున్నాయి. మాటలతో మాయ చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. వ్యూహాలు వికటిస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయ వర్గాలలోనే కాదు.. సొంత పార్టీ శ్రేణులలోనూ ఇదే మాట వినపడుతోంది. ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినప్పటి నుంచే ఈ పరిస్థితి ఎదురౌతున్నదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడంతోనే రాష్ట్రంలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమౌతున్న సంకేతాలు గోచరిస్తున్నాయన్నారు. ఒక వైపు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణకు ప్రణాళికలు రచిస్తూనే.. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గెలుపు బాటలో నడిపించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. రెండు పనులూ ఏకకాలంలో చేయాల్సి రావడం వల్లనే ఆయన అటూ ఇటూ కూడా కాన్ సన్ ట్రేట్ చేయలేకపోతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. తొలుత వచ్చే అసెంబ్లీలో సిట్టింగులందరికీ టికెట్లు అంటూ ప్రకటించి, ఒక్కసారిగా వెల్లువెత్తిన అసంతృప్తి, అసమ్మతిని గమనించి పునరాలోచనలో పడాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ప్రత్యర్థి పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు పార్టీ తలుపులు బార్లా తెరిచి మరీ రెడ్ కార్పెట్ పరిచిన ఫలితం ఇప్పుడు దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ నలుగురైదుగురు పార్టీ టికెట్ ను ఆశిస్తున్న వ్యక్తులు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ రెబల్స్ బెడద ఎదుర్కోవలసిన పరిస్థితి ఉందని అంటున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నప్పటికీ కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించడం వెనుక వ్యూహమేమిటో అర్ధం కాక పార్టీ శ్రేణులే తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. తాజాగా కేసీఆర్ పార్టీ ఎంపీల పనితీరు, వారికి ప్రజలలో ఉన్న అభిమానం, వారిలో మళ్లీ టికెట్ ఇస్తే గెలిచే సత్తా ఉన్నవారెవరు ఇత్యాది అంశాలపై ఫోకస్ పెట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ వారి పనితీరు, విజయావకాశాలపై ఆరా తీస్తున్నారు. అన్నిటికీ మించి వారి ఎంపీ నిధులను ఎలా వ్యయం చేస్తున్నారు. ఏయే పనులకు కేటాయిస్తున్నారు. వంటి అంశాలతో ఇప్పటికే కేసీఆర్ ఒక్కో ఎంపీపైనా సమగ్ర నివేదికను సిద్ధం చేశారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అలాగే తన నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మంట్లలో వారి పట్ల ప్రజలలో ఉన్న అభిప్రాయం, అలాగే వారి నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో వారి సంబంధాలు ఎలా ఉన్నాయి.. పార్టీ టికెట్ ఇస్తే.. నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు ఆ ఎంపీకి సహకరిస్తారా? లేదా? కనీసం తన నియోజవకర్గ పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా ఉందా? వంటి వివరాలన్నీ ఇప్పటికే కేసీఆర్ సేకరించి పెట్టుకున్నారని అంటున్నారు. ఆ వివరాల ఆధారంగానే టికెట్ ఇవ్వాలా వద్దా అన్నది కేసీఆర్ నిర్ణయిస్తారని చెబుతున్నారు. దీంతో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలలో గుబులు నెలకొంది. కేసీఆర్ వద్ద ఉన్న నివేదికలలో తమ ప్రోగస్ పై ఉన్న రిపోర్ట్ ఏమిటి? మరోసారి పార్టీ టికెట్ దక్కుతుందా? లేదా అన్న టెన్షన్ పెరిగిపోతున్నది. సరిగ్గా ఇదే పరిస్థితి పార్టీ ఎమ్మెల్యేలలోనూ నెలకొని ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు పార్టీ అధిష్ఠానం ఎన్నికల సన్నాహాకాలకు సమాయత్తం అవుతుండటం, అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు (సిట్టింగులు) తమకు పార్టీ టికెట్ వస్తుందో రాదో అన్న అయోమయంలో పడటంతో రాష్ట్రంలో ప్రస్తుతం తెరాస పార్టీ పరంగా కార్యక్రమాలేవీ చేపట్టకుండా ఒక విధమైన స్తబ్దతలో కూరుకుపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఆదాయం కోసం ప్రభుత్వ భూముల తెగనమ్మకం.. కేసీఆర్ సర్కార్ యోచన

తెలంగాణ ప్రభుత్వం ఆదాయం కోసం వెతకని మార్గం లేదు. చేయని ప్రయత్నం లేదు. కేంద్రం నుంచి గ్రాంట్లపై కేసీఆర్ సర్కార్ నమ్మకం కోల్పోయింది. కేంద్రం నుంచి ఎటువంటి సహకారమూ అందదని నిశ్చితాభిప్రాయానికి వచ్చేసింది. దాంతో ప్రభుత్వ ఆదాయ మార్గాలు దాదాపు మూసుకుపోయాయనే చెప్పవచ్చు. దీంతో తెలంగాణ సర్కార్ ఆదాయం కోసం మరో సారి భూముల అమ్మకంపైనే దృష్టి పెట్టింది. ఇందు కోసం ఏకంగా వనరుల సమీకరణ కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘం పనేమిటయ్యా అంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో గుర్తించడం. అలా గుర్తించిన భూములను తెగనమ్మి నిధులు సమకూర్చుకోవడమె ప్రభుత్వం ఇప్పుడు ఎంచుకున్న మార్గం. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఏయే జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి అన్నది గుర్తించడంలో ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగమంతా నిమగ్నమై ఉంది. వక్ఫ్ భూములు వినా.. అసైన్డ్ ల్యాండ్స్ సహా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములన్నీ తెగనమ్మేయడానికి కేసీఆర్ సర్కార్ సూత్ర ప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇందుకు కారణం ఆర్థికంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎటువంటి సహకారమూ అందకపోవడమే కారణంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రమే సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. పన్నులు, చార్జీలు పెంచి ఆదాయాన్ని పెంచుకుందామనుకుంటే.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో బీఆర్ఎస్ సర్కార్ అందుకు సాహసంచలేని పరిస్థితి. ముఖ్యంగా ఆదాయం పెంపునకు ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపు మాత్రమే. అయితే అందుకు ప్రభుత్వం ఇసుమంతైనా సుముఖంగా లేదు.   దీంతో ప్రభుత్వం  భూములను తెగనమ్మడం, పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించింది.   హెచ్ఎండీఏ, ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు,ఇలా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయన్న ఆరా తీస్తోంది. అలాగే గతంలో సెజ్ లకు ఇచ్చిన భూములు నిరుపయోగంగా ఉంటే వాటినీ తిరిగి స్వాధీనం చేసుకుని విక్రయానికి పెట్టాలని యోచిస్తోంది.   భూముల గుర్తింపు, విలువ మదింపు వంటి ప్రక్రియలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి భూముల తెగనమ్మకం చేపట్టాలన్న తొందరను బీఆర్ఎస్ సర్కార్ కనబరుస్తోంది.  వచ్చే ఆరు నెలల్లో ఈ భూముల విక్రయ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  

తెలంగాణ హోంమంత్రి బంధువు కంపెనీలో ఐటీ సోదాలు

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ బంధువుల నివాసాలపై ఐటీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించాయి. గత కొంత కాలంగా రియల్ కంపెనీలు లక్ష్యంగా ఐటీ దాడులు జరగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఉదయం కూడా గూగీ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ అధికారులు ఐదు బృందాలుగా సోదాలు నిర్వహించాయి. గూగీ రియల్ ఎస్టేట్ సంస్థ తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ బంధువు అయిన అక్బర్ కు చెదినది కావడం గమనార్హం.   దిల్ సుఖ్ నగర్  కొత్తపేటలోని గూగీ రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యాలయంతో పాటు కంపెనీ డైరెక్టర్ల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లుసమాచారం. హైదరాబాద్‌లో ఐటీ అధికారులు మొత్తం 20 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు.

ఈశాన్యంలో ముగిసింది.. ఇక కర్నాటకలో మొదలు.. మోడీ ప్రచారం

ఈశాన్య రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మార్చి 2 వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే, రెండు రోజుల కిందటి  వరకూ ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ .. ఇప్పుడు మరో  రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి  శ్రీకారం చుట్టారు. నిజానికి  కర్ణాటకలో ఇప్పటికే ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కావడంతో కమల దళం కర్ణాటకపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురురు కేంద్ర మంత్రులు కర్ణాటకకు క్యూ కడుతున్నారు.  అదలా ఉంటే  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్  ‘రైతు సంక్షేమం’ ప్రధాన నినాదంగా బరిలో దిగుతున్న నేపథ్యంలో  ప్రధాని మోడీ కూడా రైతుల సంక్షేమాన్నే, ప్రచార అస్త్రం చేసుకున్నారు.   సోమవారం(ఫిబ్రవరి 27)  బెళగావి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సన్నకారు రైతుల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.  2014లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వ్యవసాయం కోసం రూ.25 వేల కోట్లు కేటాయించామన్న మోడీ ప్రస్తుతం అది రూ. 1.25 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపారు.  దేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతులకు ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ 13వ విడత కింద రూ.16,000 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రధాని మోడీ విడుదల చేశారు.  వాతావరణ మార్పుల వలన కలిగే ఇబ్బందులను ఎదుర్కోగల సత్తా తృణధాన్యాలకు ఉంటుందన్న మోడీ..   వాటిని ‘ సూపర్‌ ఫుడ్‌ ’గా అభివర్ణించారు . కేంద్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ఎంత మేర దోహదం చేస్తుందనే విషయం ప్రతిఏటా వ్యవసాయం కోసం కేటాయిస్తున్న బడ్జెట్‌ను చూస్తే అర్థమవుతుందని చెప్పారు.  పీఎం కిసాన్‌  పథకం కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఏడాదికి రూ.6000 ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటి వరకు  11 కోట్ల మంది రైతులకు రూ.2.25 లక్షల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ సందర్భంగా నూతనంగా అభివృద్ధి చేసిన బెళగావి రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ప్రయాణికులకు అత్యున్నత సౌకర్యాలు కల్పించేలా దాదాపు రూ.190 కోట్లతో రైల్వేస్టేషన్‌ నవీకరించారు. అంతేకాకుండా లొండా-బెళగావి-ఘటప్రభ మధ్య ఏర్పాటు చేసిన రైల్వే డబుల్‌ లైన్‌ను కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. రూ.930 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపట్టారు.  దాదాపు రూ.1,585 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఆరు బహుళ గ్రామీణాభివృధ్ధి పథకాలకూ మోదీ శంకుస్థాపన చేశారు. తద్వారా 315 గ్రామాల్లోని 8.8 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమార్‌, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తదితరులు పాల్గొన్నారు. మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ కర్ణాటకలో మోదీ సుడిగాలి పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేయకముందు గ్రీన్‌ఫీల్డ్‌ శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. బెళగావి చేరుకునే మార్గంలో మాలిని నగరం నుంచి దాదాపు 10.5 కి.మీ మేర మోదీ రోడ్‌ షో చేపట్టారు. రోడ్డుకి ఇరువైపులా నిల్చున్న ప్రజలకు అభివాదాలు తెలుపుతూ ముందుకు సాగారు. దాదాపు లక్ష మంది మహిళలు కాషాయ వస్త్రాలు ధరించి మోదీకి స్వగతం పలికారు.‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు చేశారు

కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో రాష్ట్రంలోని  బ్యూరోక్రాట్లకు కోర్టు మెట్లు ఎక్కడం అన్నది రోజూ డ్యూటీకి హాజరైనట్లుగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి   కోర్టు ధిక్కరణ  కేసులో కోర్టుకు హాజరయ్యారు. పోలీసు ఇన్ స్పెక్టర్ బదలీ విషయంలో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో ఆయన సోమవారం (ఫిబ్రవరి 27) కోర్టులో హాజరయ్యారు. ఇన్ స్పెక్టర్ పదోన్నతి వ్యవహారంలో కోర్టు ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు కాలేదని పేర్కొన్న న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే కేసులో మాజీ డీజీపీ, ప్రస్తుత ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ కూడా హాజరు కావాల్సి ఉండగా.. ఆయనకు మినహాయింపు కోరుతూ ప్రభుత్వ న్యాయవాది అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. విజయనగరం జిల్లా పోలీసు ట్రైనింగ్ కాలేజీ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ కు గతంలో అంటే 1999లో జారీ చేసిన జీవో ప్రకారం పదోన్నతి కల్పించాల్సి ఉందనీ, ఆ విషయాన్ని పరిగణనలోనికి తీసుకుని పదోన్నతి కల్పించాలని కోర్టు 2019 సెప్టెంబర్ లో ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకూ ఆ ఆదేశాలు అమలు కాలేదంటూ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయన పిటిషన్ పైవిచారణ జరిపిన న్యాయస్థానం ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ డీజీపీ గౌతం సవాంగ్ లు స్వయంగా విచారణకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో డీజీపీ రాజేంద్రనాథ్ హాజరయ్యారు.   కాగా, రాజశేఖర్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు బాగా లేనందునే ఆయన పదోన్నతి వ్యవహారాన్ని ప్రమోషనల్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరడంతో కోర్టు అందుకు అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణకు హాజరుపై డీజీపీకి మినహాయింపు ఇచ్చింది.  ఇలా ఉండగా ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టు ధిక్కరణ కేసులలో న్యాయస్థానాల ఎదుట హాజరు కావడం ఇదే మొదటి సారి కాదు. జగన్ కు సన్నిహితంగా మెలుగుతూ, ఆయన అడుగులకు మడుగులొత్తే పలువురు  ఐఏఎస్‌లు ఇప్పటికే పలు మార్లు కోర్టు మెట్లు ఎక్కారు.  సిన్సియర్ అధికారిగా గుర్తింపు పొందిన పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలకూ కోర్టు ముందు నిలుచోక తప్పలేదు.   విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ విషయంలో  కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదంటూ  హర్టీకల్చర్, సెరీకల్చర్ కమిషనర్‌ చిరంజీవి చౌదరి.. వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ  పూనం మాలకొండయ్యలు కోర్టు అభిశంసనను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.   అలాగే గత ఏడాది  ప్రభుత్వ స్థలాల్లో , పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయ భవనాలు నిర్మించడం పై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ… వాటిని వెంటనే తొలగించాలని జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు  విజయ్‌కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్‌, శ్రీలక్ష్మి, గిరిజాశంకర్‌, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎంఎం నాయక్‌ లకు రెండు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.   ఐఏఎస్ లు కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో జైలుశిక్షకు బదులుగా ఏడాది పాటు ప్రతినెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్‌కు వెళ్లి సేవ చేయాలని, అదేవిధంగా ఏడాది పాటు సంక్షేమ హాస్టల్‌లో ఒక్కపూట భోజనం పెట్టాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాలు ఇచ్చినా అమలు విషయంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్లనే తాము కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సారి హైదరాబాద్ లో.. తెలంగాణలో తెలుగుదేశం కు పూర్వ వైభవమే లక్ష్యంగా అడుగులు

తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే ఆయన అధ్యక్షతన ఖమ్మం వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అలాగే తాజాగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. మరోవైపు మార్చి 29వ తేదీ..తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని.. హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ గెడ్డ.. అదీ హైదరాబాద్ నడిబొడ్డు ఓల్డ్ ఎమ్మెల్యే కోర్టర్స్‌లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించన విషయం తెలిసిందే.  దీంతో హైదరాబాద్‌ వేదికగా సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.  2014లో ఓ వైపు రాష్ట్ర విభజన జరగగా.. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. తెలంగాణలో మాత్రం తెరాస( ఇప్పుడు బీఆర్ఎస్) అధికారం చేజిక్కించుకుంది. దీంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం కొన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకొంది. అయితే రాష్ట్రంలో చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలోతెలుగుదేశం టికెట్ పై గెలిచిన వారంతా వారంతా.. దాదాపుగా కేసీఆర్ నేతృత్వంలోని అధికార పార్టీలోకి జంప్ చేసేశారు. దీంతో తెలంగాణలోని పసుపు పార్టీ శ్రేణుల్లో ఓ విధమైన నిశ్శబ్దం  ఆవరించింది.  మరోవైపు తెలంగాణ నినాదంతో... ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకోవడమే కాదు.. ముఖ్యమంత్రి పీఠాన్ని   కైవసం చేసుకున్న గులాబీ బాస్ కేసీఆర్, ఇటీవల టీఆర్ఎస్‌లో తెలంగాణ పదాన్ని పక్కన పెట్టి.. ఆ స్థానంలో భారత్ అనే పదాన్ని ఆయన చేర్చారు. దీంతో టీఆర్ఎస్  కాస్తా బీఆర్ఎస్‌ గా రూపాంతరం చెందింది. దీంతో కేసీఆర్ ఏర్పాటు చేసిన ప్రాంతీయ పార్టీ కాస్తా.. బీఆర్ఎస్ పార్టీగా మారి .. జాతీయ పార్టీగా మారిపోయింది. ఇక ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని.. తెలుగుదేశం నేతలు..వచ్చే ఎన్నికల్లో పసుపు పార్టీ సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.   ఆ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో... గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పోల్చుతూ.. ప్రజల్లోకి వెడుతున్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో అదీ టీడీపీ ప్రభుత్వ హయాంలో పరిపాలన, అభివృద్ధి, శాంతి భద్రతలు, ఉద్యోగ కల్పన.. రాజధాని హైదరాబాద్ నగరాభివృద్ధి, ఐటీ పరిశ్రమ, సైబరాబాద్ నిర్మాణం తదితర అంశాలను సైతం ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లేందుకు ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే సమాయత్తం అయ్యాయి.  ఇక తెలంగాణలో ఆంధ్ర సెటిలర్లు అత్యధికంగా ఉన్న పలు జిల్లాలు, ప్రాంతాలపై   తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది.  ఆయా ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించే దిశగా తెలుగుదేశం అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది.  ఇక తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్‌ పగ్గాలు అందుకున్న తర్వాత    పార్టీలో   నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంకోవైపు.. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి  తీసుకు వెళ్లేందుకు,  సాధ్యమైనంత త్వరలో అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.  ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. అందుకోసం ఆ పార్టీ కేంద్ర నాయకత్వమే కాదు.. రాష్ట్ర నాయకత్వం సైతం ప్రణాళికలు సిద్దం చేసుకొంటూ.. ముందుకు సాగుతోంది. అలాంటి వేళ.. అటు బీఆర్ఎస్ కి, ఇటు బీజేపీకి వచ్చే ఎన్నికల్లో పోటీ ఇచ్చే దిశగా సైకిల్ పార్టీ అధినేత చంద్రబాబు.. తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించేందుకు సిద్దమవుతోన్నట్లు తెలుస్తోంది.

గోరంట్ల మాధవ్ దారే దిక్కా.. పలువురు పోలీసు అధికారుల అంతర్మథనం?!

తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణంలో.. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సమీపంలో దుకాణాల తొలగింపు నేపథ్యంలో అటు అదికార వైసీపీ శ్రేణులకు.. ఇటు విపక్ష తెలుగుదేశం నేతల మధ్య చోటు వివాదం జరిగింది. ఆ సందర్భంగా స్థానిక సీఐ మధు.. జోక్యం చేసుకోవడమే కాకుండా  వైసీపీ నేతల భుజాలపైకి ఎక్కి.. మరీ మీసాలు మెలేయడం.. స్థానిక మహిళా కౌన్సిలర్‌పై బూతులతో విరుచుకపడడం.. రాయలసీమలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది.  గతంలో ఇదే జిల్లా.. ఇదే కదిరి పట్టణం సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్.. జిల్లా పోలీస్ అధికారుల సంఘం నాయకుడిగా ఉన్నారని.. అయితే ఆ సమయంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. పోలీసులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సదరు సీఐ గోరంట్ల... ప్రెస్ మిట్ పెట్టి మరీ మీసం మేలేసిన సంగతిని ఈ సందర్భంగా సీమ వాసులు గుర్తు చేసుకొంటున్నారు. ఆ తర్వాత గోరంట్ల మాధవ్ తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. జగన్ పార్టీలో చేరడం.. ఆ వెంటనే ఆయనకు హిందూపురం ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఆయన గెలిచి.. లోక్‌సభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత సదరు ఎంపీగారి న్యూడ్ వీడియో   అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేయడం.. దీనిపై ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం.. మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్రంలోని పెద్దలకే కాదు... జాతీయ మహిళా కమిషన్ చైర్మన్‌కు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై విచారిణ జరిపి... నివేదిక అందజేయాలంటూ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ జిల్లా ఉన్నతాధికారులుకు లేఖ సైతం రాశారు కూడా అయితే ఆ తర్వాత ఈ వ్యవహారం ఏమైందో ఎవరికీ తెలియలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో గోరంట్ల మాధవ్ మాదిరిగానే..  తాజాగా సీఐ మధు వ్యవహర శైలి ఉండడం పట్ల స్థానిక ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు  సీఐ మధు కూడా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా అంటు సీమ వాసులు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇంకోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో పోలీస్ శాఖ.. అధికార పార్టీకి ఫేవర్‌గా పని చేస్తోందంటూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం... గత మూడున్నరేళ్లుగా   ఆరోపింస్తోంది. అంతేకాదు.. గతంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై అధికార పార్టీ శ్రేణులు దాడి చేసినా.. ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపైన ఆ పార్టీ శ్రేణులే దాడులకు దిగి.... వాహనాల విధ్వంసం చేసినా.. పోలీసులు   చోద్యం చూశారు.... చూస్తున్నాయి అని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో ఖాకీవనంలోని పలువురు ఉన్నధికారుల్లో ఓ విధమైన భయం ఆవహించిందని తెలుస్తోంది. ఓ వేళ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే.. తమ పరిస్థితి ఏమిటనే ఓ సందేహం   వారిలో ప్రారంభమైందని.. అదే జరిగితే.. ఇటీవల.. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ యువనేత నారా లోకేష్ పోలీసుల వైఖరికి నిరసనగా చెప్పినట్లు చేస్తే... మన పరిస్థితి ఏమిటనే ఓ చర్చ   పోలీస్ ఉన్నతాధికార వర్గంలో నడుస్తున్నట్లు తెలుస్తోంది.   ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలకు రాజీనామా చేసి.. పోలీస్ క్యాప్.. చేతిలోని లాటీ పక్కన పెట్టేసి... ఫ్యాన్ పార్టీలో చేరితే.. అయితే ఎంపీ లేకుంటే.. ఎమ్మెల్యే .. అదీ లేకుంటే.. ఆ పార్టీకి పని చేసుకొంటూ.. ఉంటే.. భవిష్యత్తులో తమకు ఎంతో కొంత రక్షణ ఉంటుందనే ఆలోచనలో కొందరు పోలీసు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అదీకాక సీఐడీ మాజీ డీజీ పి.వి. సునీల్ కుమార్‌ ప్రస్తుతం ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో.. భవిష్యత్తులో తమకు అలాంటి పరిస్థితులు ఎదురైతే.. అనే ఆలోచనలో పలువురు పోలీసు ఉన్నతాధికారు ఉన్నారన్న  చర్చ ఏపీ పోలీస్ శాఖలో హల్‌చల్ చేస్తున్నట్లు సమాచారం.

భావసారూప్యత ఓ బ్రహ్మ పదార్ధం!

కాంగ్రెస్ పార్టీ చక్కటి నిర్ణయం తీసుకుంది. భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. పార్టీ 85వ ప్లీనరీ సందర్భంగా రూపొందించిన ‘రాయపూర్‌ డిక్లరేషన్‌’లో ఈ విషయాన్ని వెల్లడించింది. రాజ్యాంగాన్ని పరిరక్షించడంతో పాటు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకుగాను ఉమ్మడి, నిర్మాణాత్మక కార్యక్రమం కింద భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంచేసింది. నిజానికి, ప్లీనరీకి ముందు నుంచి కూడా బీజేపీని ఒంటరిగా ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు కాంగ్రెస్ దిగ్గజ నేతలు అందరూ అంగీకరిస్తూనే ఉన్నారు. ఖర్గే అయితే భావసారూప్యత కలిగిన అన్ని పార్టీలతో తాము చర్చలు జరుపుతున్నామని, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిదే విజయమని ప్లీనరీ ప్రారంభానికి ముందే ప్రకటించారు. నిజానికి, రాయపూర్‌ డిక్లరేషన్‌లోనే కాదు  రాజకీయ తీర్మానంలోనూ, పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఇతర ముఖ్య నాయకుల ప్రసగాలలోనూ కూడా కాంగ్రెస్‌ ఇతర పార్టీలతో కలిసి పోరాడేందుకు సన్నద్ధంగా ఉందని ఒకటి పది సార్లు ప్రకటించారు.  అయితే, ఇంతకీ ఈ భావసారూప్యత అంటే ఏమిటి? బీజేపీ నియంతృత్వ, మతతత్వ, క్రోనీ క్యాపిటలిజం దాడి నుంచి రాజకీయ విలువల్ని కాపాడేందుకు పోరాడతామని, అదే భావసారుప్యత కాంగ్రెస్ అంటోంది. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, తీవ్రమవుతున్న సామాజిక విద్వేషాలు, రాజకీయ నియంతృత్వం.. ఈ మూడు దేశానికి ప్రధాన సవాళ్లని కాంగ్రెస్‌ అభివర్ణించింది. వీటిని ఎదుర్కొనేందుకు భావసారూప్యత కలిగిన బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చింది. అయితే కాంగ్రెస్ ఒకటే కాదు, ఈ లక్షణాలు (నియంతృత్వ, మతతత్వం, క్రోనీ క్యాపిటలిజం)  అంటని పార్టీ ఏదీ లేదు. నిజానికి, పద గాంభీర్యం కోసం  ఎంత పదునైన పదాలను ప్రయోగించినా  అసలు భావసారుప్యత అది కాదు.  అసలు సిసలు భావసారూప్యతఅధికారమే. ఇది చరిత్ర చెపుతున్న సత్యం.  ఒకప్పుడు బీజేపీతో జట్టు కట్టిన పార్టీలు ఆ తర్వాత కాంగ్రెస్ తో చేతులు కలిపాయి. కాంగ్రెస్ తో చేతులు కలిపిన పార్టీలు మళ్ళీ ఎన్నికల నాటికీ కమలం గూటికి చేరాయి. తమిళనాడు విషయాన్నే తీసుకుంటే ఉభయ ద్రవిడ పార్టీలు ( డిఎంకే, అన్నా డిఎంకే) ఉభయ జాతీయ కూటములు (ఎన్డీఎ, యూపీఎ) లతో జట్టు కట్టాయి. విడిపోయాయి.  కుండమార్పిడి పద్దతిలో పొత్తులు మార్చుకున్నాయి. ఒక సారి కమలంతో చేతులు కలిపిన పార్టీ మళ్ళీ ఎన్నికల నాటికీ హస్తం చెయ్యందుకుంది. హస్తం చెయ్యందుకున్న పార్టీ మళ్ళీ ఎన్నికల ఆనాటికి కమలం గూటికి చేరింది. చిత్రం, ఏమంటే ఒక్క ఓటు తేడాతో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం కూల్చి వేయడంలో కీలక పాత్ర పోషించిన జయలలిత( ఎఐఎడిఎంకే) తదనంతర కాలంలో బీజేపీ మిత్ర పక్షమయ్యింది. అలాగే, మహారాష్టంలో సుదీర్ఘ కాలంపాటు బీజేపీతో కలిసి సాగిన శివసేన ముఖ్యమంత్రి పీఠంకోసం కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టు కట్టింది. ఎన్నికలలో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ తో కలిసింది. అలాగే బీహార్ లో నితీష్ కుమార్, బీజేపీతో కలిసి పోటీచేసి గెలిచి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపారు.  జమ్మూ కశ్మీర్ లో పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నడిపాయి, అంతకు ముందు నేషనల్ కాన్ఫరెన్స్ వాజపేయి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా వుంది. అలాగే వామ పక్ష పార్టీలు (సిపిఐ, సిపిఎం)బెంగాల్లో కాంగ్రెస్’ పార్టీతో భావసారూప్యత ఉన్న మిత్ర పక్షాలు, కేరళలో భావ వైరుధ్య శత్రు పక్షాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే... అదో రామాయణమే అవుతుంది. అధికార ఆకాంక్షకు అదొక ముసుగు. అందుకే భావసారూప్యత అన్నది.. అదొక బ్రహ్మ పదార్ధం అంటారు.

ముఖ్యమంత్రి పీఠం దూరమౌతోందనేనా.. కేసీఆర్ లో అసహనం?

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడవ సారి ముఖ్యమంత్రి  అవుతారా? బీఆర్ఎస్ నాయకులు ఏ ఇద్దరు కలసిన ఇదే విషయం చర్చకు వస్తోంది. నిజానికి  సర్వేలు ఏమి చెపుతున్నప్పటికీ, ఎన్నికలు ఎప్పుడు జరిగినా, బీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ వచ్చినా రాకున్నా  కాంగ్రెస్ సహకారంతో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కొందరు నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ వస్తే  మాత్రం కేసీఆర్ హ్యాట్రిక్  మిస్సవుతారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.అవును బీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ వస్తే, కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పరిమితం అవుతారని అంటున్నారు.  అయితే, ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్  కు పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు అంతగా లేవని, అదుకే 2014లో వచ్చిన  అత్తెసరు మెజారిటీ కూడా ఈసారి రాక పోవచ్చని అంటున్నారు. అదుకే, కేటీఆర్ లో అసహనం పెరుగుతోందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కేటీఆర్ ఎక్కడ మాట్లాడినా, విపక్షాల మీద విరుచుకు పడుతున్నారు.  ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ గా కేటీఆర్ చేస్తున్న విమర్శలు శృతి మించుతున్నాయని విమర్శకులు అంటున్నారు. చివరకు ప్రధాని మోడీని, తెలంగాణకు పట్టిన శని   అనే స్థాయిలో విమర్శించారు. అదే విధంగా  రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రను ఉద్దేశించి,కొందరు పనికిమాలిన పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని అంటున్నారని, యాభై ఏళ్లు అధికారంలో ఉండి ఏం పీకారని దుయ్యబట్టారు. అలాగే  వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ(కేఎంసీ)కి చెందిన పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ప్రీతి మరణం ఘటనను రాజకీయం చేస్తున్నారని  విపక్షాలను తప్పుబట్టారు. ప్రీతిని హత్య చేసిన వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు సైఫ్ అయినా సంజయ్ (బండి సంజయ్?) అయినా ఎవరినీ వదలమని కేటీఆర్ హెచ్చరించారు. ఇది ఆయనలో అసహనానికి  నిదర్శనం కావచ్చునని బీఆర్ఎస్ నాయకులే అంటున్నారు. సీఎం కుర్చీ దూరమౌతోందన్న భావనతోనే ఆయన విమర్శలు శృతి మించుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కాంగ్రెస్ లో కాన్ఫిడెన్స్ ఏదీ? ఒంటరిగా ఓడించలేమంటూ చేతులెత్తేసిన హస్తం పార్టీ

కాంగ్రెస్ పార్టీ, పూర్వ వైభవం పై ఆశలు వదిలేసుకుందా? పునర్జ్జీవనం పొందితే చాలానే దశకు చేరుకుందా? అధికారమే పరామావధి అనే ఆలోచనకు వచ్చిందా? సంకీర్ణ సారథ్యం దక్కితే చాలు అనుకుంటోందా?  అంటే, పాత తరం కాంగ్రెస్ పెద్దలు, రాజకీయ  విశ్లేషకులు అవుననే అంటున్నారు.  ఛత్తీస్ గఢ్ రాజధని నయా రాయ్ పూర్ లో జరిగిన పార్టీ  మూడు రోజుల ప్లీనరీ సమావేశాలలో పసంగించిన పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, 2004 నుంచి 2014 వరకు సాగిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వ సంకీర్ణ పాలన దగ్గరే ఆగిపోయారు. అదే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవ స్థితికి ప్రామాణికం అన్నట్లుగా, మళ్ళీ మనం మరో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు, బీజీపీ యేతర పార్టీలను కలుపుకుని ముందుకు పోదాం అని, సోనియా పిలుపు నిచ్చారు. అలాగే, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమ ప్రారంభ ఉపన్యాసంలోనే...  సంకీర్ణ ప్రభుత్వమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు.  అలాగే,  రాయపూర్‌ డిక్లరేషన్‌  లోనూ భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. రాజ్యాంగాన్ని పరిరక్షించడంతో పాటు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకుగాను ఉమ్మడి, నిర్మాణాత్మక కార్యక్రమం కింద భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంచేసింది.  తెలంగాణ, కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ కార్యకర్తలు, నేతలు క్రమశిక్షణతో కలిసి మెలిసి పనిచేయాలి. తప్పనిసరిగా పార్టీని గెలిపించాలి. 2024లో జరగనున్న కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ఈ విజయాలే ప్రాతిపదిక  అని డిక్లరేషన్‌ పేర్కొంది.  అయితే మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ విధానం ఇదేనా అంటే, కాదని అంటున్నారు, పాతతరానికి చెందిన సీనియర్ నాయకులు.  నిజానికి 2014 ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు భావసారుప్యత పేరిట అనేక పార్టీలను వివిధ పార్టీలను అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ పార్టీ సీనియర్ నేతగా ప్రణబ్ ముఖర్జీ కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంకీర్ణాలకు ఒడిగట్టడం అసలు గుర్తింపునకే ముసురు తెస్తుందని చేసిన సూచన ఇప్పటికీ అలోచింపచేసేదిలా ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు.  1996-2012 మధ్యకాలంలో సాగిన సంకీర్ణ ప్రభుత్వాలపై రాసిన ఓ పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ అనేక అంశాలను ప్రస్తావించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ సంకీర్ణ ప్రభుత్వాలపై తన ఆలోచన మారలేదన్నారు. 2004 ఎన్నికలకు ముందు బీజేపీని  ఓడించేందుకు వివిధ పార్టీలతో చేతులు కలపాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలతో తాను ఏకీభవించలేదన్నారు. ఏ ఎన్నికల్లోనైనా ఒంటరిగా పోటీ చేయడమే సరైన మార్గమని, దీని వల్ల కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని పదిలపరచుకోగలుగుతుందని ఉద్ఘాటించారు. బిజెపిని ఎదుర్కొనేందుకు లౌకిక వాద పార్టీలతో చేతులు కలపాలంటూ 2003లో సిమ్లాలో జరిగిన మేథోమధన సదస్సులో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించిన ప్రణబ్  అది అంతకుముందు జరిగిన పంచమడి తీర్మానానికి విరుద్ధం. తప్పనిసరి పరిస్థితుల్లోనే సంకీర్ణ కూటములను ఏర్పాటు చేసుకోవాలని ఆ సదస్సులో మేము తీర్మానించాం అని గుర్తు చేశారు. సిమ్లా సదస్సులో అందరి అభిప్రాయాలను సేకరించారని, పంచమడి తీర్మానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని సోనియా, మన్మోహన్ సహా అందరూ మొగ్గు చూపారని ప్రణబ్ తెలిపారు. కానీ తానొక్కడినే అందుకు భిన్నంగా మాట్లాడానని, ఇతర పార్టీలతో చేతులు కలపడం వల్ల కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంటుందని విస్పష్టంగా తెలియజేశానన్నారు. ప్రత్యేకంగా 2004 సంవత్సరానికి సంబంధించి ఈ పుస్తకంలో అనేక ఆసక్తిరమైన అంశాల్ని ముఖర్జీ ప్రస్తావించారు. ‘ది ఇందిరా ఇయర్స్’, ‘ది టర్బ్యులెంట్ ఇయర్స్’ పేరుతో ఇప్పటివరకూ ప్రణబ్ రెండు పుస్తకాలు వెలువరించారు. సంకీర్ణ శకానికి సంబంధించిన అంశాలపై తన మూడో పుస్తకాన్ని వెలువరించారు. అధికార పీఠాన్ని ఎక్కాలన్న పట్టుదలకు పోయి కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోకూడదన్నది తన నిశ్చితాభిప్రాయమని పేర్కొన్న ప్రణబ్  ప్రతిపక్షంలో కూర్చున్నా తప్పులేదు కానీ.. జాతీయ పార్టీగా కాంగ్రెస్ తన ఉనికిని మాత్రం కోల్పోకూడదు  అని ఉద్ఘాటించారు.  అయితే ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ లేరు. ఆయన స్థాయి నాయకులూ లేరు. అదీ గాక  అవునన్నా కాదన్నా, కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బీజేపీని ఎదుర్కునే పరిస్థితిలో లేదు.  అంతే  బీజేపీయేతర పార్టీలలో సగానికి పైగా పార్టీలు, కాంగ్రెస్ నాయకత్వంలో పని చేసేందుకు కూడా సుముఖంగా లేరు...  మరో వంక థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ ప్రయత్నాలు జరుగ్తున్నాయి .. ఈ పరిస్థితిలో  రాయపూర్‌ డిక్లరేషన్  వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోందని అంటున్నారు.

వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతున్న సమయంలో బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితుల స్వేచ్ఛ కంటే సాక్షుల భద్రత, పాదర్శక దర్యాప్తు ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది. కాగా  ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న వై.సునీల్ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై వివేకా సతీమణి సౌభాగ్యమ్య దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ ను హైకోర్టు అనుమతించిన సంగతి విదితమే.  ఈ బెయిలు పిటిషన్ విచారణ సందర్భంగా  వివేకా హత్య కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకుందని, ఈ కేసులో  రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని ఈ పరిస్థితుల్లో సునీల్ యాదవ్ కు బెయిలు ఇస్తే సాక్షులను ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ పేర్కొంది. సీబీఐ వాదనలను పరగణనలోనికి తీసుకున్న హైకోర్టు సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. 

ఫామ్ హౌస్ కేసులో కేసీఆర్ తీరును తప్పుపట్టిన సుప్రీం.. క్షమాపణ చెప్పిన ప్రభుత్వ న్యాయవాది

ఫామ్ హౌమ్ కేసు లో బీఆర్ఎస్ ప్రభుత్వం పీకల్లోతు ఇరుక్కుందా? తాజాగా  కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆ అభిప్రాయాన్ని బలపరుస్తున్నట్లుగా ఉన్నాయి. ఈ కేసులో వీడియో, ఆడియో క్లిప్పింగ్ లను తెలంగాణ ముఖ్యమంత్రి న్యాయమూర్తులకు పంపడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది.  ఈ కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా  జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  సీఎం నేరుగా  పెన్ డ్రైవ్ లు తమకు పంపడాన్ని ఎత్తి చూపుతూ, రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్నవారు చేయాల్సిన పనేనా అని వ్యాఖ్యానించారు. అలాగే మీకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటే.. మాకు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయన్న వ్యాఖ్యలను కూడా తప్పుపట్టారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే.. సిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నట్లే కదా అని జస్టిస్ వ్యాఖ్యానించారు.  ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ న్యాయమూర్తులకు పెన్ డ్రైవ్ లు పంపడం పట్ల తెలంగాణ న్యాయవాది దవే తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. మొత్తంగా ఫామ్ హౌస్ కేసులో కేసీఆర్ వ్యవహరించిన తీరు, పన్నిన వ్యూహాలు అన్నీ బూమరాంగ్ అయ్యాయన్న అభిప్రాయం రాజకీయ సర్కిల్స్ లోనే కాదు, బీఆర్ఎస్ వర్గాల్లో కూడా వ్యక్తమౌతోంది. ఈ కేసు సీబీఐ దర్యాప్తునకు సుప్రీం ఓకే చెబితే చిక్కుల్లో పడేది కేసీఆర్ సర్కారేనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.   ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి కేసీఆర్ సర్కార్ అన్నీ తప్పుటడుగులే వేసిందన్న అభిప్రాయం బీఆర్ఎస్ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతోంది. తాజాగా సుప్రీం కోర్టు కేసీఆర్ తీరునే తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యలతో పార్టీ వర్గాలలో ఆందోళన వ్యక్తమౌతోంది.  సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేయడం.. మళ్లీ డివిజన్ బెంచ్ సూచన మేరకు సింగిల్ బెంచ్ కు వెళ్లడం.. అక్కడితో ఆగకుండా సుప్రీంను ఆశ్రయించడంతో ఈ కేసు విషయంలో  ఇక ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని  పార్టీ వర్గాలు అంటున్నాయి. సింగిల్ బెంచ్ సుప్రీం కోర్టులోనే తేల్చుకోండని చెప్పేసినా.. సుప్రీం కోర్టు ప్రభుత్వం కోరిన విధంగా వెంటనే అత్యవసరంగా ఈ కేసు విచారణకు స్వీకరించడానికి సుప్రీం కోర్టు నిరాకరించడం, అదే సమయంలో  స్టేటస్ కో ఉత్తర్వులను ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను సైతం తోసి పుచ్చడంతో  ఇక సుప్రీం ఏం చేబుతుందో వేచి చూడడం తప్ప మరేం చేయలేని స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది.   

విపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ చెక్

విపక్షాల ఐక్యతా యత్నాలకు కాంగ్రెస్ ప్లీనరీ గండి కొట్టిందా? వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పార్టీల ఐక్యతే లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నాలకు రాయ్ పూర్ లో జరిగిన పార్టీ  ప్లీనరీ వేదికగా గండి పడిందా? విభేదాలను పక్కన పెట్టి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ కలుపుకు పోయే దిశగా అడుగులు వేయాల్సిన కాంగ్రెస్.. అతి విశ్వాసంతో కొన్ని పార్టీలను ఐక్యత విషయంలో తమతో కలిసి అడుగువేయాలన్న ఆలోచన కూడా చేయకుండా నిరోధించిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా వచ్చిన సానుకూల స్పందన.. పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి పెరిగిన జనాదరణ కారణంగా కాంగ్రెస్ మళ్లీ తన సహజ లక్ష్యమైన ఒంటెత్తు పోకడలకు శ్రీకారం చుట్టినట్లు కనిపిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా పలు మార్లు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి ఉప సంహరించుకున్న చరిత్ర కాంగ్రెస్ ఉంది. అయితే మన్మోహన్ సారథ్యంలో  రెండు పర్యాయాలు అంటే పదేళ్ల పాటు కాంగ్రెస్ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపింది. అయితే అప్పట్లో ఆ పార్టీ మిత్రధర్మాన్ని పాటించిందా అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు అంటే దాదాపు పదేళ్ల పాటు కేంద్రంలో ప్రధాన విపక్ష పాత్రను పోషిస్తున్న కాంగ్రెస్.. ఈ పదేళ్ల కాలంలోనూ ఉమ్మడి పోరాటాలకు నేతృత్వం వహించిన సందర్భాలు బహుస్వల్పం అనడంలో సందేహం లేదు.  కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి కూడా మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళనలకు సారథ్యం వహించే విషయంలో కాంగ్రెస్ వెనుకబడింది. మొత్తంగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి 2019 ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ వైదొలగిన తరువాత ఆ పార్టీలో నాయకత్వ లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. జాతీయ పార్టీగా శతాధిక వత్సరాల అనుభవం ఉన్న గ్రాండ్ ఓల్డ్ పొలిటికల్ పార్టీ విపక్ష పాత్రను పోషించడంలో సందేహాలకు అతీతంగా విఫలమైంది. అయితే జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత విషయంలో ఇప్పటికీ కాంగ్రెస్  లేకుండా కూటమిని ఊహించడం అసాధ్యం. ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో ఈ విషయం పలుమార్లు నిరూపితమైంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్సేతర, బీజేపీ యేతర ప్రత్యామ్నాయ కూటమి కోసం కేసీఆర్, మమత, నితీష్ వంటి నేతలు చేసిన ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లుగానే సాగాయి. చివరాఖరికి శరద్ పవార్ వంటి దిగ్గజన నేతలు, స్టాలిన్ వంటి వ్యూహ చతురులు కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేకుండా విపక్షాల ఐక్యత నీటి మీద రాతలాంటిదేనని పలు సందర్బాలలో విస్పష్టంగా చెప్పేశారు. అంటే కాంగ్రెస్ నేతృత్వంలోనే జాతీయ స్థాయిలో బీజేపీని దీటుగా  ఎదుర్కొనగలమని బీజేపీయేతర పార్టీలు విశ్వాసంతో ఉన్నాయి. అటువంటి తరుణంలో సంయమనంతో వ్యవహరించి.. విపక్షాల ఐక్యతకు నాయకత్వం వహించాల్సిన కాంగ్రెస్ ఏకపక్షంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తాము కలుపుకునే పార్టీలు ఇవి మాత్రమేనన్న విధంగా ప్లీనరీ వేదికగా ప్రకటన చేయడం.. ఇక మూడో ఫ్రంట్ ప్రయత్నాలపై సెటైర్లు వేస్తూ, వాటిని బీజేపీకి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నాలుగా అభివర్ణించడం ఏ విధంగా చూసినా తొందరపాటుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ కార్గే, రాహుల్‌ గాంధీ కూడా  కాంగ్రెస్‌ సారథ్యంలో మాత్రమే ప్రతిపక్షాల ప్రంట్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తుందంటూ చేసిన వ్యాఖ్యలపై కొన్ని బీజేపీయేతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంటే బీజేపీయేతర ఫ్రంట్ కాంగ్రెస్ సారథ్యంలో మాత్రమే సాధ్యమౌతుందనీ, ఆ ఫ్రంట్ లో చేరగోరే వారు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించి తీరాల్సిందేనన్నది కాంగ్రెస్ కండీషన్ గా  పెట్టిందని అర్ధం అవుతోంది.  అయితే ఆ కండీషన్ ను అదీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే విధించడమంటే.. ఆలూ లేదు.. చూలూ లేదన్న సమెతను గుర్తుకు తేవడమేననడంలో సందేహం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాది జరగననున్న సార్వత్రిక ఎన్నికల కంటే ముందు తొమ్మది రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. వాటి ఫలితాలు వచ్చే నెల మొదటి వారంలో వెలువడనున్నాయి. వీటన్నిటి ఫలితాల తరువాత రాజెవరు, మంత్రెవరు.. అసలు రాహుల్ సారథ్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారా? లేదా అన్న విషయం వెల్లడి అవుతుంది. అప్పటి వరకూ ఆగకుండా తన సారథ్యంలో మాత్రమే బీజేపీ వ్యతిరేక కూటమి పని చేయాలన్న షరతు విధించడం ద్వారా కాంగ్రెస్ విపక్షాల ఐక్యతకు స్వయంగా అవరోధంగా మారిందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ముందు ఎన్నికలలో ఐక్యంగా పోటీ చేసి ఆ తరువాత గెలిచిన స్థానాల ఆధారంగా సారథ్యం, ప్రధాని వంటి అంశాలపై చర్చల ప్రక్రియ అని ఉంటే ఐక్యతా యత్నాలు అడ్డంకులు లేకుండా సజావుగా సాగి ఉండేవని అంటున్నారు.