ఎన్నికల వేళ నామినేటెడ్ పోస్టుల పందేరం.. అసమ్మతి తెనెతుట్టె కదపడమేనా?
posted on Feb 23, 2023 @ 11:18AM
నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. ఖాళీగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లను నియమించేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందు కోసం ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఇందుకు సంబంధించిన జాబితాను తెప్పించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీలో ఇంత వరకూ ఎలాంటి పదవీ దక్కని వారెంతమంది, ఒక్క సారి పదవి దక్కిన వారెవరు.. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అర్హతలుండీ పార్టీ టికెట్ దక్కే చాన్స్ లేని వారెవరు వంటి వవరాలన్నిటినీ క్రోడీకరించుకుని కేసీఆర్ నామినేటెడ్ పోస్టుల పందేరానికి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇంతవరకు ఏ పదవి రాని లీడర్లు ఎవరెవరున్నారు?
ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై మంత్రులతో కేసీఆర్ చర్చించినట్లు కూడా చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నామినేటెడ్ పోస్టుల పందేరం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి పరిస్థితుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ నిర్ణయించుకోవడమంటే అసమ్మతి తేనెతుట్టెను కదిపినట్లే అవుతుందన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్త మౌతోంది. చాలా ఏళ్లుగా వందలాది మంది బీఆర్ఎస్ నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఎన్నికల సంవత్సరంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పార్టీలో అసమ్మతి పెరిగేందుకు దోహదపడే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటి వరకూ కేసీఆర్ సీరియస్ గా నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టలేదు. అడపాదడపా ఒక్కో కార్పొరేషన్ కు చైర్మన్ లనో డైరక్టర్లనో ప్రకటిస్తూ వచ్చారు.
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కూడా నామినేటెడ్ పోస్టల భర్తీ చేపట్టకపోతే కేడర్ కు, నేతలకు తప్పుడు సంకేతాలు వెళతాయన్న వాదన ఉన్నప్పటికీ.. ఎన్నికల వేళ పదవుల పందేరానికి శ్రీకారం చుడితే.. దక్కిన వారిలో అసమ్మతి భగ్గుమనడం ఖాయమన్న ఆందోళన కూడా వ్యక్తమౌతోంది. ఎది ఏమైనా ఎన్నికల సమాయత్తం కోసం పార్టీ కార్యక్రమాలు చేపట్టకుండా స్తంబ్దంగా ఉన్న కేసీఆర్ నామినేటెడ్ పోస్టల భర్తీతో ఎన్నికలకు సిద్ధం కావడంపై పార్టీ శ్రేణుల్లో సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ముందు ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు పార్టీ నేతలనూ, శ్రేణులను జనంలోకి పంపే కార్యక్రమాలకు శ్రీకారం చుడితే మేలు జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.