ఏపీ బీజేపీలో తిరుగుబావుటా!
posted on Feb 23, 2023 6:55AM
ఏపీ బీజేపీలో తిరుగుబాటు జరుగుతోందా? క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే ఆ పార్టీ ఏపీలో ముక్క చెక్కలవ్వడానికి సిద్ధంగా ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఏపీలో రాజకీయంగా బలోపేతం అన్న సాకుతో పార్టీ అధిష్ఠానం అమలు చేసిన వ్యూహాలు, ఎత్తుగడలు పూర్తిగా వికటించాయని అంటున్నారు.
రాష్ట్రంలో కులాల చీలకతో సులభంగా బలోపేతం అవ్వవచ్చన్న అంచనాతో జగన్ సర్కార్ తో అంటకాగిన ఫలితమే.. ఏపీ బీజేపీలో ముసలానికి కారణమైందని విశ్లేషిస్తున్నారు. ఏపీ బీజేపీ పట్ల ఆ పార్టీ అధినాయకత్వం వ్యవహరించిన తీరే రాష్ట్ర నాయకత్వానికీ, క్యాడర్ కూ మధ్య అగాధానికి కారణమైందంటున్నారు. ఏపీ బీజేపీలో సంక్షోభానికీ, అసంతృప్తికీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అడ్డగోలుగా సమర్ధించిన జాతీయ నాయకత్వ తీరే కారణమని పార్టీ శ్రేణులే విమర్శిస్తున్నాయి. కేంద్ర నాయకత్వం తీరు కారణంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారంటున్నారు. అక్కడితో రాజీనామాల పర్వం అగే పరిస్థితి కనిపించడం లేదని కూడా అంటున్నారు.
కన్నా బాటలోనే మరికొందరు కూడా ఉన్నారని చెబుతున్నారు. కన్నా పార్టీ కార్యకర్తలతో సమావేశమయి, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడానికి ముందే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రంగంలోకి దిగి బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు రాష్ట్ర పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి సిద్ధమై విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అయిన నేతలను పార్టీ జాతీయ స్థాయి నాయకుడు శివప్రకాష్‌జీ వారించారు. ఈ నెల 26న తాను విజయవాడకు వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పడంతో బీజేపీలో రాజీనామాల పర్వానికి పడిన తెర తాత్కాలికమేనని పార్టీ శ్రేణులే అంటున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును కొనసాగిస్తే, తాము పార్టీకి రాజీనామా చేస్తామంటూ దాదాపు 200 మంది రాష్ట్ర-జిల్లా స్థాయి నేతలు విజయవాడ కేంద్రంగా ఓ సమావేశం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆ సమాచారం తెలిసి పార్టీ అధినాయకత్వం వారించింది. శివప్రకాష్‌జీ ఈనెల 26న విజయవాడ వచ్చి మరీ సమస్యలను పరిష్కరిస్తామన్న హామీలో తిరుగుబాటు జెండా ఎగురవేయడాన్ని వాయిదా వేశారు. గతంలో కూడా రెండు సార్లు పార్టీలో అసమ్మతి నేతలు సమావేశం ఏర్పాటుకు ప్రయత్నించిన సందర్భాలలో కూడా కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని వారించింది. ఇప్పుడు ఇది మూడోసారి. ఈసారి శివప్రకాష్‌జీ సమక్షంలో తాడో పేడో తేల్చుకోవాలన్న పట్టుదలతో రాష్ట్ర బీజేపీ అసమ్మతి నేతలు ఉన్నారు.
బుజ్జగించి సమస్య పరిష్కారాన్ని వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఈ సారి వెనక్కు తగ్గేదే లే అంటున్నారు. ఏపీలో పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారు? వైసీపీ విషయంలో పార్టీ అధిష్ఠానం వైఖరి ఏమిటి? సోము వీర్రాజును ఏపీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఎందుకు తప్పించరు? అని శివప్రకాష్ జీని నిలదీయాలని నిర్ణయించుకున్నట్లు అసమ్మతి నేతలు చెబుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారంలో పార్టీ హైకమాండ్ వ్యవహరించిన తీరు ఏపీలో బీజేపీలో తొలి నుంచీ పని చేస్తున్న వారిలో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోందని చెబుతున్నారు.
బీజేపీ వ్యవస్థాపక కాలం నుంచి పనిచేస్తున్న వారిలో సైతం ఏపీ బీజేపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ భూ స్థాపితం అయిపోతుందన్న భావనే వ్యక్తమౌతోందని అసమ్మతి నేతలు చెబుతున్నారు. ప్రధానంగా జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తుకు మద్దతు విషయంలో పార్టీ అనుసరిస్తున్న వైఖరి పట్ల వారు అసమ్మతి తెలియజేస్తున్నారు. 35 మంది రాష్ట్ర-జిల్లా స్థాయి నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా ఇప్పటికే సంతకాల సేకరణ చేసినట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. సోము వీర్రాజును అధ్యక్షుడిగా కొనసాగించాలని భావిస్తే, తాము ఆయనతో పనిచేయడం కష్టమని ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి స్పష్టం చేశారంటున్నారు. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పట్ల పార్టీ అధినాయకత్వం వైఖరి ఏమిటన్నది స్పష్టం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.