బీఆర్ఎస్ కు తెలంగాణలో కష్టకాలమేనా?... యూజ్ ఆండ్ త్రో పాలసీయే అసలు కారణమా?
posted on Feb 24, 2023 @ 12:00PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు యుద్ధ తంత్రాన్ని తలపంప చేస్తాయి. ఆయన అవసరానికి బొంత పురుగును కూడా ముద్దు పెట్టుకోవడానికి వెనుకాడరు.. ఈ మాట ఎవరో అన్నది కాదు స్వయంగా కేసీఆరే. ఆయన రాజకీయ చాణక్యం ముందు నరేంద్ర వంటి ఎందరో నేతలు సోదిలోకి లేకుండా పోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎందరో నేతలు ఆయన పంచన చేరి ఆ తరువాత కనుమరుగైపోయారు.
తెలంగాణ ఆవిర్భావం తరువాత కూడా ఉద్యమ సమయంలో తనతో కలిసి నడిచిన ఎందరో నేతలను ఆయన పక్కన పెట్టేశారు. ఇప్పుడు తెలంగాణ కాదు.. జాతీయ స్థాయి రాజకీయాలు అంటూ ఆయన చేసిన చేస్తున్న ప్రసంగాలకుఆకర్షితులై గతంలో ఆయనతో విభేదించో.. లేక ఆయనకే నచ్చకో దూరం అయిన వారిని మళ్లీ అక్కున చేర్చుకున్నారు. పిలిచి మరీ పార్టీ కండువా కప్పారు. పార్టీలో చేరే వరకే ఆ తరువాత వారికి ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్, బిక్షమయ్యగౌడ్ వంటి నేతలు ఘర్ వాపసీ అంటూ బీఆర్ఎస్ కండువా కప్పుకున్న తరువాత పార్టీలో వారి అతీగతీ పట్టించుకునే నాథుడే కరవయ్యారు.
అలాగే మోత్కుపల్లి.. కేసీఆర్ నిజమైన దళిత బంధుగా కేసీఆర్ ను అభివర్ణించి పంచన చేరి ఈ నాడు ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితిలో ఉన్నారు. కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించినా.. పార్టీ నుంచి బయటకు పంపేసినా ఏ పని చేసినా అవసరం వినా మరో మాటకు తావే ఉండదని రాజకీయ వర్గాలలో ఓ టాక్ జోరుగా ఉంటోంది. నేతలను ఇలా కూరలో కరివేపాకులా వాడుకున్న ఆయన తీరు కారణంగానే తెరాస భారాసగా మారిన తరువాత రాజకీయంగా ఆయన తెలంగాణలో వెనుకబడే పరిస్థితి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో వెనుక బాటు అన్నంత మాత్రాన ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ దూసుకు పోతోందని కాదు.. విస్తరణ ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కేసీఆర్ ఎవరికి టికెట్లు ఇస్తారు? ఎవరికి మొండి చేయి చూపుతారు అన్న చర్చ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. ఘర్ వాపసీల తో అయితేనేమీ, ఆపరేషన్ ఆకర్ష్ తో అయితేనేమి.. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ హౌస్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఎవరికి పార్టీ టికెట్ కేటాయించినా అసమ్మతి, అసంతృప్తి భగ్గు మనడం ఖాయం.
అంతేనా.. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనే రెబల్స్ బెడద అధికంగా ఉండే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఏళ్ల తరబడి నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయకుండా నాన్చిన ఫలితంగా ఇప్పుడు ఆ నామినేటెడ్ పోస్టుల భర్తికీ కేసీఆర్ పచ్చ జెండా ఊపినా.. ఎవరికి పదవి ఇస్తే ఎవరికి కోపం వస్తుందో అన్న జంకు పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం, ఎదుర్కొని గెలుపు బాట పట్టడం అంత సులభ సాధ్యం కాదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతోంది.