టీపీసీసీ చీఫ్ కు కాంగ్రెస్ లో ఉక్కపోత.. తెలుగుదేశం గూటికి చేరే యోచన?

మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్   రేవంత్ రెడ్డి..  కాంగ్రెస్ పార్టీకి బై బై గుడ్ బై చెప్పేసి..  సొంత గూటికి అంటే..  తెలుగుదేశం పార్టీలోకి  దూకేస్తారా.. తెలంగాణలో సైకిల్‌ స్పీడ్ పెంచేస్తారా అంటే పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఔననే సమాధానమే వస్తోంది.  వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ..  కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతోందంటూ ఇటీవల పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు కాకపోయినా... ఎన్నికల తరువాత (ఒక వేళ రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్రంలో త్రిముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. త్రిముఖ పోటీలో ఏ పార్టీకీ అధికారాన్ని హస్తగతం చేసుకునే మెజారిటీ వచ్చే అవకాశాలు లేవనీ వినిపిస్తోంది.) అయినా   బీఆర్ఎస్, కాంగ్రెస్ లు చేయి చేయి కలుపుకుని అధికారాన్ని అందుకుంటారన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. అదీకాక నిన్నటి దాకా ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ ఒక్క సారిగా బీఆర్ఎస్ గా మారిపోయి జాతీయ పార్టీ అయిపోయింది. దీంతో బీఆర్ఎస్ లక్ష్యం తెలంగాణ కాదు.. ఢిల్లీ అన్న సంకేతాలు ప్రజలలోకి బలంగా వెళ్లాయి. అందుకే రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ ఆ పార్టీ పొత్తులకు చేయి సాచే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు స్పష్టత లేకపోయినా ముందు ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ లు జట్టు కట్టే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిసతోంది. అలాంటి తరుణంలో కేసీఆర్ ఫ్యామిలీతో కాంగ్రెస్ షేక్ హ్యాండ్ చేసినా.. రేవంత్ ఎంత టీపీసీసీ చీఫ్ అయినా కాంగ్రెస్ నిర్ణయాన్ని ఔదాలుస్తారా అన్న డౌట్లు అయితే పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. కేవలం డౌట్లే కాదు.. కచ్చితంగా రేవంత్ బీఆర్ఎస్ తో లేదా కేసీఆర్ తో చేతులు కలిపే పార్టీలో ఇమడ లేరనీ, బయటకు వచ్చేస్తారనీ కూడా   పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సపోజ్ ఫర్ సపోజ్ అదే జరిగితే.. రేవంత్ కు ఉన్న ఆప్షన్ ఏమిటి? అని కూడా చర్చ జరుగుతోంది. ఆ చర్చలో రేవంత్ తెలుగుదేశం గూటికి చేరడం వినా మరో ఆప్షన్ ఆయనకు లేదని కూడా అంటున్నారు.  ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కాదు.. కేసీఆర్  ప్యామిలీని కూడా  టార్గెట్‌గా చేసుకొని విమర్శలు గుప్పించే  ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి అనే టాక్ తెలంగాణ సమాజంలోకి చాలా బలంగా వెళ్లింది. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ పార్టీతో హస్తం పార్టీ చెయ్యి కలిపితే.. రేవంత్ రెడ్డి..  కాంగ్రెస్ ను వీడి బయటకు రావడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.   మరోవైపు తెలంగాణలో రేవంత రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. అయితే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ టీపీసీసీ పగ్గాలు  అప్పగించడంపై పార్టీలోని సీనియర్లు  ఇటు రేవంత్ పైనా అటు పార్టీ హై కమాండ్ పైనా గుర్రుగా ఉన్నారు. వారంతా తిరుగుబాటుకు సిద్ధం కావడంతో అధిష్ఠానం గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న మాణిక్ ఠాగూర్ కు ఆ బాధ్యతలు కట్టబెట్టింది.  మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు ఠాక్రేకు ఆ బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాల చల్లారినట్టు కనిపించినా పరిశీలకులు మాత్రం రాజుకుంటోందనే అంటున్నారు. అధిష్ఠానం మొత్తం పార్టీ సీనియర్లందరినీ నియంత్రించి పూర్తి అధికారాలు రేవంత్ కు కట్టబెట్టే పరిస్థితులైతే లేవని పరిశీలకులు సైతం అంటున్నారు. రేవంత్ పాదయాత్రకు అధిష్ఠానం నుంచి అనుమతి రావడంలో జరిగిన తీవ్ర జాప్యాన్నే అందుకు నిదర్శనగా చూపుతున్నారు.  ఈ పరిస్థితుల కారణంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉక్కపోతకు గురౌతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తరువాత తెలంగాణలో తెలుగుదేశంకు అవకాశాలు పుష్కలంగా మెరుగుపడ్డాయి. దానికి తోడు కాసాని జ్ణానేశ్వర్   తెలుగుదేశం తెలంగాణ పగ్గాలను చేపట్టిన తరువాత పార్టీ క్యాడర్ లో జోష్ పెరిగింది. ఆ పార్టీ ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఎవ్వరూ ఊహించనంతగా సక్సెస్ అయ్యింది. దీంతో అప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న కేడర్ కూడా ఒక్క సారిగా చైతన్యవంతమైంది. మరిన్ని సభలు నిర్వహించాలన్న డిమాండ్ శ్రేణుల నుంచే పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ గతంలో పార్టీలో పని చేసి వివిధ కారణాలతో ఇతర పార్టీలకు వెళ్లిన వారి కోసం తెలుగుదేశం తలుపులు తెరిచే ఉన్నాయని ప్రకటించారు. హోమ్ కమింగ్ కు వెల్ కం చెప్పారు. కాసాని జ్ణానేశ్వర్ అయితే ప్రత్యేకంగా రేవంత్ పేరు పెట్టి మరీ ఆయనకు తెలుగుదేశం స్వాగతం పలుకుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే.. భవిష్యత్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు కుదిరే అవకాశం ఉందని లేశమాత్రంగా భావించినా రేవంత్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కొలీజియం తరహాలో ఈసీల ఎంపిక.. సుప్రీం

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను ఏ ప్రాతిపదికన, ఎవరు నియమిస్తారంటూ దాఖలైన ఒక పిల్ ను విచారించిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తల నియామకం ఏ విధంగా అయితే కొలీజియం ద్వారా జరుగుతుందో.. అదే విధంగా ఒక ఉన్నత స్థాయి ప్యానల్ ద్వారా ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకం జరగాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి తో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషనర్లను నియమించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు  జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులున్న కాన్స్టిట్యూషన్ బెంచ్ తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు జడ్జిల నియామకం కొలీజయం ద్వారా సాగినట్టే ఈసీ సభ్యులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం కూడా ఓ పద్ధతి ప్రకారం సాగాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం గత ఏడాది రిజర్వ్ చేసిన తీర్పు  బుధవారం వెలువరించింది.  తమకు అనుకూలురైన వ్యక్తులను ఈసీలు, సీఈసీలుగా నియమిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. తాజా తీర్పుతో కేంద్రానికి ఈ విషయంలో సుప్రీం మార్గదర్శకత్వం చేసింది. రాజ్యాంగ నిపుణులు ఈ తీర్పును స్వాగతిస్తున్నారు.   కాగా ఇప్పటివరకు ఎన్నికల సంఘం  నియామకాలన్నీ   కేంద్ర ప్రభుత్వమే  చేస్తూ వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ అరుణ్ గోయల్ ను కొత్త ఎన్నికల కమిషనర్ గా మోడీ సర్కారు నియామకం చేసిన తీరు విమర్శలకు తావిచ్చింది. గోయల్ నియామకం వివాదాస్పదమైంది. మొత్తంగా గోయల్ ను ఎన్నికల కమిషనర్ గా నియమిక ప్రక్రియ మొత్తం ఒక్క రోజులో పూర్తైపోయింది.  దీనినే సుప్రీం కోర్టు తప్పుపట్టింది. అదే సమయంలో గోయల్ అభ్యర్థిత్వాన్ని కాదనీ, తాము తప్పుపడుతున్నది అందుకు అనుసరించిన ప్రక్రియనేనని సుప్రీం అప్పట్లోనే పేర్కొంది. గత ఏడాది నవంబర్ 18న ఐఏఎస్ గా రాజీనామా చేసిన గోయెల్ ను ఆ మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే.  ఆ తరువాత ఒక్క రోజు వ్యవధిలోనే అంటే నవంబర్ 21నే ఆయన ఎన్నికల సంఘం కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.   ఇదే వివాదానికి కారణమైంది. దీనిపైనే సుప్రీం కోర్టు కేంద్రాన్ని తప్పుపట్టింది. 

అమరావతి కేసు తక్షణ విచారణకు సుప్రీం నో.. మరో సారి జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ!

జగన్ ప్రభుత్వానికి సర్కార్ లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి కేసుల విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఏపీ సర్కార్ చేసిన విజ్ణప్తిని సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. గతంలో చెప్పిన విధంగా ఈ నెల 28నే అమరావతి పిటిషన్ల విచారణ చేపడతామని స్పష్టం చేసింది.  దీంతో సర్కార్ దిక్కు తోచని స్థితిలో పడినట్లైంది. అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని జగన్ సర్కార్ పదేపదే సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరుతూ వస్తున్నది. తాజాగా గురువారం (మార్చి 2) మరో సారి జగన్ సర్కార్ ఈ విషయాన్ని న్యాయస్థానం ముందుకు తీసుకురాగా కోర్టు నిరాకరించింది. గతంలో చెప్పని విధంగా ఈ నెల 28నే ఈ కేసు విచారణ చేపడతామని విస్పష్టంగా తేల్చి చెప్పింది.  హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకోవాలని జగన్ సర్కార్ డిస్పరేట్ గా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.  హై కోర్టు తీర్పు వెలువరించిన ఆరు నెలల పాటు నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్న జగన్ సర్కార్ ఆ తరువాత హడావుడిగా సుప్రీం ను ఆశ్రయించి, తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని పదే పదే అభ్యర్థనలు చేస్తున్నది.   మరో వంక గత ఏపీ ప్రభుత్వం అమరావతిని చట్ట బద్ధంగా ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం కూడా ఇప్పటికే  స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కు నివేదించింది కూడా.  ఈ  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే అమరావతి విషయాన్ని తేల్చేయాలన్న ఆత్రంతో ఉన్న జగన్ సర్కార్ కు  సుప్రీంలో అమరావతి కేసు ఈ నెల 28 వరకూ విచారణకు వచ్చే అవకాశం లేకపోవడం ఒకింత ఇబ్బందికరంగా పరిణమించింది.  మరో వైపు సాధ్యమైనంత త్వరగా అమరావతిని ఖాళీ చేసి విశాఖకు మకాం మార్చేయాలన్న తొందర ప్రదర్శిస్తున్న జగన్ కు ఈ కేసు విచారణ జాప్యం అవుతుండటం   అసహనానికి గురి చేస్తున్నట్లు కనిపిస్తున్నది.  అమరావతి కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు సంగతి తరువాత కనీసం హైకోర్టు తీర్పుపై స్టే అయినా దక్కితే చాలన్నట్లుగా జగన్ సర్కార్ తొందరపాటు ఉన్నది.  విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్ వెస్టర్ల సదస్సు నాటికి విశాఖ రాజధానిగా పాలన సాగిస్తామన్న కచ్చితమైన ప్రకటన చేయాలని ఉవ్విళ్లూరుతున్న జగన్ కు సుప్రీం కోర్టులో అమరావతి కేసు విచారణకు రాకపోవడం ఆశనిపాతంగానే మారిందని పరిశీలకులు అంటున్నారు. శుక్రవారం (మార్చి 3) నుంచి రెండు రోజుల పాటు విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది. అందుకే జగన్ సర్కార్ గురువారం కూడా సుప్రీంలో ఈ కేసు విచారణ కోసం ఒక ప్రయత్నం చేసింది. అది కూడా విఫలం అయ్యింది. దీంతో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో విశాఖ రాజధాని అన్న ప్రకటన చేసే అవకాశం జగన్ సర్కార్ కు ఇక లేనట్లే. కాగా జగన్ సర్కార్ వినతిని తోసిపుచ్చుతూ జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసులో రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయనీ, విచారణ చేపట్టి అన్నివిషయాలూ తేలుస్తామని వ్యాఖ్యానించారు.  

విపక్షాల ప్రధాని అభ్యర్థిగా స్టాలిన్?

విపక్షాల ప్రధాని అభ్యర్థిగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్? ఈ వార్త ఒక్క సారిగా రాజకీయాలలో పెను సంచలనం సృష్టించింది. ఔను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎందుకు విపక్షాల ఉమ్మడి ప్రధాని ఎందుకు కాకూడదు అని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్బుల్లా చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీయేతర పార్టీలన్నీ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏకతాటిపైకి వచ్చి కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఎలా ఉన్న వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి.  అయితే విపక్షాల ఐక్యతా యత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. అదే సమయంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం విపక్షాలు ఇప్పటి నుంచే చేయి చేయి కలిపి పని చేయాల్సిన అవసరం ఉందని, కాలయాపన ఇసుమంతైనా కూడదని బీహార్ సీఎం నితీష్ కూమార్ వంటి నేతలు అంటున్నారు. అంతే కాకుండా.. విపక్ష కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించాలనీ చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనాలంటే.. కాంగ్రెస్ నాయకత్వంలో జట్టుకట్టడం వినా మరో మార్గం లేదనీ నితీష్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లు మాత్రం వేరేగా ఆలోచిస్తున్నారు. వారిరువురూ కూడా తమ, తమ నాయకత్వంలోనే విపక్షాల ఐక్యత ఉండాలని భావిస్తున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్ లు రెండూ కూడా ఎవరి దారి వారిది అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో బీజేపీయేతర పార్టీల ఐక్యత సవ్య దిశలో వెళ్లడం లేదన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా ఈ తరుణంలోనే..  ఛత్తీస్ గఢ్ రాజధాని నయా రాయ్ పూర్ వేదికగా జరిగిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన తీర్మానం ఐక్యతా యత్నాలను మరో అడుగు వెనక్కు తీసుకువెళ్లిందనే చెప్పాలి. కేంద్రంలో బీజేపీని గద్దె దించాలంటే.. విపక్షాలు ఏకం కావాలన్న అభిప్రాయంతో ఏ బీజేపీయేతర పార్టీకీ మరో అభిప్రాయం లేదు.. అయితే ఆ ఐక్య కూటమికి నేతృత్వం వహించేది ఎవరన్న విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ భిన్నాభిప్రాయాలకు కారణం కూడా ప్రధాని పదవేనన్న విశ్లేషణల నేపథ్యంలో కాంగ్రెస్ తన విధానం ఏమిటన్నది క్లారిటీ ఇచ్చేసింది. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టం చేసిన కాంగ్రెస్ ఆ ప్రభుత్వానికి సారధ్యం వహించేది కాంగ్రెస్ మాత్రమేనని కుండ బద్దలు కొట్టేసింది. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విపక్షాల ఐక్య కూటమి అధికారం చేపడితో ప్రధాని రాహుల్ గాంధీయేనన్నది ఆ పార్టీ శశభిషలకు ఆస్కారం లేకుండా స్పష్టం చేసింది.  అయితే అంతలోనే స్టాలిన్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ యూపీఏ భాగస్వామ్య పక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత చేసిన ప్రతిపాదన విపక్షాల ఐక్యతా యత్నాలకు గండి కొడుతుందా అన్న విషయం రానున్న రోజులలో తేలుతుంది. ఇప్పటికిప్పుడైతే స్టాలిన్ ప్రధాని అన్న ప్రతిపాదనపై రాజకీయంగా చర్చ అయితే జరుగుతోంది కానీ.. ఔను, కాదు అన్న కంక్లూజన్ కు అయితే ఏ పార్టీ రాలేదు. అదే సమయంలో సహజంగానే ఈ ప్రతిపాదనపై బీఆర్ఎస్ కానీ తృణమూల్ కానీ స్పందించ లేదు. ఎందు కంటే ఆ రెండు పార్టీలూ వేటికవిగా తమతమ ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ స్పందన ఏమిటన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది. విపక్ష కూటమి తన సారథ్యంలోనే జరగాలని ఇప్పటికే ప్రకటించేసిన కాంగ్రెస్ తాజాగా ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కనీసంగానైనా ప్రభావం చూపని నేపథ్యంలో ఇంకా ప్రధాని పదవి కోసం పాకులాడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాదే మరో ఆరు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వేచి చూసే ధోరణి అవలంబిస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఒక్క కాంగ్రెస్ అనే కాదు.. విపక్ష కూటమి ప్రయత్నాలు సాగిస్తున్న పార్టీలన్నీ కూడా ఉమ్మడి ప్రధాని అభ్యర్థి విషయంలో ఒక అభిప్రాయం ప్రకటించడానికి ముందు ఈ ఏడాది జరిగే తొమ్మది రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూస్తాయన్న అభిప్రాయమే వెల్లడి అవుతోంది. స్వయంగా స్టాలినే కాంగ్రెస్ సారథ్యంలోనే విపక్ష కూటమి.. మూడో ఫ్రంట్ చర్చే వేస్ట్ అని చెప్పిన నేపథ్యంలో ఫరూఖ్ అబ్దుల్లా ప్రతిపాదనకు ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి. పైగా ఫరూక్ అబ్దుల్లా ఈ ప్రతిపాదన స్టాలిన్ జన్మదిన వేడుకలలో స్టాలిన్ సమక్షంలోనే చేశారు. 

వైసీపీకి దూరంగా విజయసాయి.. ఎవరు ఎవరిని వదిలేశారు?

విజయసాయి రెడ్డి.. వైసీపీతో ఈ పేరును విడదీసి చూడటం సాధ్యం కాదన్న బావన ఇటీవలి వరకూ అందరిలోనూ ఉండేది. అంతగా విజయసాయి వైసీపీతో మమేకమై ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కు కుడి, ఎడమ, ముందు, వెనుక కూడా విజయసాయే అన్నట్లుగా ఆయన హవా కొనసాగింది. కొనసాగుతుందనే అంతా భావిస్తూ వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఏ2గా జగన్ కు తోడుగానే ఉన్నారు విజయసాయి. అయితే ఇటీవలి కాలంలో ఆ పరిస్థితిలో సమూల మార్పు వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అనుమానాలనేమిటి? అలాగే కనిపిస్తోంది కూడా. పార్టీ కార్యక్రమాలలో విజయసాయి నీడ కూడా కనిపించడం లేదు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలందరిదీ ఒక దారీ, విజయసాయి రెడ్డి ఒక్కడిదీ ఒక దారి అన్నట్లుగా ఆయన ఒంటరి అయిపోయారు. కేంద్ర మంత్రిని కలిసినా, ఏపీ కొత్త గవర్నర్ ను ప్రమాణ స్వీకారం ముందు కలిసినా విజయసాయి ఒక్కరే వెళుతున్నారు.  ఇక అన్నిటికీ మించి ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ సమ్మిట్ పేరుతో నిర్వహించనున్న ఇన్వెస్ట్ మెంట్ సదస్సు విషయంలో కూడా విజయసాయి ప్రమేయం ఇసుమంతైనా కనిపించడం లేదు. ఆయన గడ్కరీతో ఒంటరిగా భేటీ అయ్యారు. భేటీకి కారణమడిగితే విశాఖ అభివృద్ధిపై మాట్లాడేందుకు అని అన్నారు. అయితే అదే విశాఖలో ఏపీ సర్కార్ నిర్వహించతలపెట్టిన ఇన్వెస్ట్ మెంట్ సదస్సు ఏర్పాట్ల విషయంలో విజయసాయి ప్రమేయం ఇసుమంతైనా లేదు. విజయసాయి కేవలం ఎంపీ మాత్రమే కాదు.. పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయన వైసీపీకి ప్రజా సంబంధాల విషయంలో ఏకైక ప్రతినిథి కూడా. ఇక ఇటీవలి కాలం వరకూ ఆయన ఉత్తరాంధ్రకు ఇన్ చార్జ్ కూడా.  అంతేనా.. దేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్లతో ఆయనకు బోలెడు సంబంధాలు ఉన్నాయి. అయినా సరే వివిధ రాష్ట్రాలలో విశాఖ సదస్సు ప్రమోషన్ల కోసం నిర్వహించిన  రోడ్ షోలలో ఆయన ఎక్కడా కనిపించలేదు. పారిశ్రామిక వేత్తల ఆహ్వానం కోసం ఏర్పాటైన బృందంలోనూ విజయసాయికి ప్రాతినిథ్యం లేదు.  ఇంత కాలం పార్టీ ఎంపీలలో వెలివేతకు గురైన వ్యక్తి రఘురామకృష్ణం రాజు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా విజయసాయి కూడా చేరారా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్త మౌతున్నాయి. ఇటీవల తారకరత్న మరణం, ఆ తరువాత అంత్యక్రియల సందర్భంగా విజయసాయి బాలకృష్ణతో కలిసి అన్ని ఏర్పాట్లలోనూ పాల్గొనడం వల్లే విజయసాయిని దూరం పెడుతున్నారా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. అంతే కాకుండా జగన్ మెచ్చేలా ఇటీవలి కాలంలో ఆయన విపక్షంపై విమర్శలతో విరుచుకుపడటం లేదు. అది కూడా ఆయన పార్టీ వ్యవహారాలలో అంటీముట్టనట్టు ఉంటున్నారనడానికి తార్కాణంగా చెబుతున్నారు. అన్నిటికీ మించి తెనాలిలో జగన్ రైతు భరోసా కింద  మీట నొక్కి రైతుల ఖాతాలలో నిధులు జమ చేసే సమయంలో ఆయన పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందజేసిన సందర్భాన్ని పురస్కరించుకుని విజయసాయి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ట్వీట్ ఇటు పార్టీలోనే కాదు.. అన్ని వర్గాలనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పీఎం ఒక రోజు ముందే రైతుల ఖాతాలలోకి విడుదల చేసిన నిధులకు జగన్ ఉత్తుత్తి మీట నొక్కుతున్నారన్న భావన కలిగించే విధంగా ఆయన ట్వీట్ ఉంది.  ఆ ట్వీట్ కు ముందు వరకూ వైసీపీ అధినేత జగన్ విజయసాయిని దూరం పెడుతున్నారని అంతా భావించారు. అయితే ఆ ట్వీట్ తరువాత ఎవరు ఎవరిని దూరం పెడుతున్నారు? విజయసాయి పార్టీకి కావాలనే దూరం జరిగారా? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేవలం చిన్న చిన్న వ్యవహారాలు కాదనీ, జగన్, విజయసాయిల మధ్య దూరం పెరగడానికి వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నాయి. అవి రాజకీయ కారణాల కంటే పెద్దవి అయి ఉంటాయన్న అనుమానాలు కూడా వ్యక్త మౌతున్నాయి. అమరావతి రాజధాని విషయంలో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే విధంగా పార్లమెంటు వేదికగా సమాధారం రావడానికి కారణం విజయసాయి ప్రశ్నే అన్న విషయాన్ని ఇప్పుడు పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.  మొత్తం మీద విజయసాయి జగన్ కు దూరం కావడం, లేదా విజయసాయినే జగన్ దూరం పెట్టడానికి కారణాలేమైనా.. ఈ పరిణామం ముందు ముందు వైసీపీనే కాకుండా.. జగన్ ను కూడా చిక్కుల్లోకి నెట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమౌతోంది. ముఖ్యంగా అక్రమాస్తుల కేసులో ఏ1, ఏ2ల మధ్య అగాధంతో రానున్న రోజులలో ఏం జరుగుతుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. 

ఢిల్లీ మద్యం విధానం అమలులో లోపాలేంటి? కేజ్రీవాల్ ఎందుకు చెప్పరు?

అవినీతి వ్యతిరేక ఉద్యమ నేపథ్యంగా ఢిల్లీలో అధికారం చేపట్టిన ఆప్ ప్రభుత్వం ఇప్పుడు అదే అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పటికే ఆప్ కు చెందిన పలువురు అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యారు. తాజాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా అరెస్టయ్యారు. అరెస్టయిన తరువాత ఆయన డిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ మద్యం విధానం వివాదాస్పదం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం దీనిని గత ఏడాది జూలైలోనే రద్దు చేసింది. అయితే ఈ విధానం అమలులో అవకతవకలు, అవినీతి చోటు చేసుకుం టున్నాయంటూ ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కేంద్రానికి ఫిర్యాదు చేయడం,  సీబీఐ విచారణకు కూడా అభ్యర్థించడంతో సీబీఐ దర్యాప్తు ఆరంభించింది. ఈ విధానం రూపకల్పన నుంచి అమలు వరకూ మనీలాండరింగ్ కూడా జరిగిందన్న అనుమానాలతో ఈడీ కూడా విచారణ ప్రారంభించింది. అసలు ఢిల్లీ నూతన మద్యం విధానం ఏమిటంటే.. మద్య విక్రయాలను పూర్తిగా ప్రైవేట్‌ వ్యక్తులకే అప్పగించడం. సరే అదలా ఉంటే.. మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా అరెస్టు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని గత కొంత కాలంగా ఇబ్బందులు పెడుతున్న సంగతి విదితమే. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తుసంస్థలను విపక్షాలను వేధించడానికి కేంద్రం వినియోగిం చుకుంటోందన్న ఆరోపణలు గత కొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలసిందే. ఇప్పుడు ఆప్ కూడా అదే ఆరోపణలు చేస్తోంది. ఆ ఆరోపణలలో వాస్తవాలు ఎంత వరకూ ఉన్నాయన్నది పక్కన పెడితే.. సీబీఐ, ఈడీ మాత్రం ఢిల్లీ నూతన మద్యం పాలసీ అమలులో జరిగిన అవకతవకలు.. వాటికి సంబంధించి తమకు అందిన ఫిర్యాదు ఆధారంగానే దర్యాప్తు చేపట్టామని సీబీఐ, ఈడీ అంటున్నాయి. ఇక మనీష్ సిసోడియాను అరెస్టు చేయడానికి కారణం ఆయన తమ విచారణకు సహకరించకుండా, సమాధానాలు దాటవేస్తుండటమే కారణమని సీబీఐ చెబుతోంది.   మరో వైపు బీజేపీ మనీష్ సిసోడియా అరెస్టు, మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగమేననీ, అందులో తమ ప్రమేయం ఏముందని ప్రశ్నిస్తోంది. మొత్తంగా ఆప్ ఆరోపణలు, సీబీఐ వివరణ, బీజేపీ చట్టం తన  పని తాను చేసుకుపోతుందంటూ చెప్పడం వేటికవిగా చూస్తే అన్నీదేని పని అది చేసింది... అనే అనిపిస్తుంది. కానీ ఒక్క మద్యం కుంభకోణం అని కాదు కానీ.. గత కొన్నేళ్లుగా దర్యాప్తు సంస్థలు బీజేపీయేతర ప్రభుత్వాలు, నాయకులు లక్ష్యంగానే పని చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చుకోవలసినది కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారే అనడంలో సందేహమే లేదు. ఎందు కంటే.. ఇవే రకమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న బీజేపీ నాయకులపై ఈడీకానీ, సీబీఐ కానీ దృష్టి సారించిన దాఖలాలు కనిపించడంలేదు.  ఆ కారణంగానే  విపక్షాల విమర్శలకు, ఆరోపణలకు బీజేపీ వివరణ ఇచ్చుకోవాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది. విపక్షాలే కాదు.. సామాన్య జనం సైతం ఏ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేపట్టినా.. ఏదో రాజకీయ కారణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా అరెస్టును కూడా రాజకీయంగానే చూస్తున్నారు. అయితే మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆప్ సైతం కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోవలసిన అవసరం ఉంది. అలా సమాధానం చెప్పకుండా... రాజకీయ కక్షతోనే దర్యాప్తు సంస్థల అరెస్టులు అని విమర్శలు గుప్పించినంత మాత్రాన ఢిల్లీ నూతన మద్యం విధానంపై వచ్చిన ఆరోపణలు, అనుమానాలు నివృత్తి అయిపోయినట్లు కాదు. ఢిల్లీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన నూతన మద్యం విధానాన్ని అమలులో లోపాలున్నాయంటూ గత ఏడాది జులైలో ఎందకు రద్దు చేసింది. ఆ  ఆ లోపాలేమిటో మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రే అరెస్టయిన నేపథ్యంలో అమలులో లోపాలేమిటన్నది ప్రజలకు వివరించాలి. అందుకే మద్యం కుంభకోణం విషయంలో సీబీఐ విశ్వసనీయత ఎలా ప్రశ్నార్థకంగా ఉందో.. మనీష్ సిసోడియా విశ్వసనీయత కూడా అలాగే ప్రశ్నార్థకంగా మారింది. అన్ని రకాలుగా మనీష్ సిసోడియాను సమర్ధిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా మనీష్ సిసోడియా రాజీనామాను క్షణం ఆలస్యం చేయకుండా ఆమోదించడం, ఇదే కేసులో ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న మరో మంత్రి కూడా ఇప్పుడే, అంటే మనీష్ సిసోడియా అరెస్టై, తన ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాతే రాజీనామా చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. 

గంజాయి కేసులో సుబ్బారావు గుప్తా అరెస్టు!

వైసీపీలో రెబల్ గా ఉన్నా, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా కష్టాలు ఎదుర్కోక తప్పదు. పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు,    కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిల తరువాత తాజాగా వైసీపీ నాయకుడు సుబ్బారావు గుప్తాకు కూడా అనుభవం లోకి వచ్చింది. గంజాయి కేసులో పోలీసులు ఆయనను బుధవారం (మార్చి 1) అదుపులోకి తీసుకున్నారు.   ఇంతకీ ఈ సుబ్బారావు గుప్తా  ఎవరంటారా? గతంలో సుబ్బారావు గుప్తాపై  బాలినేని అనుచరుల దాడి తదననంతర పరిణామాలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వైసీపీ ఎమ్మెల్యే  (అప్పట్లో మంత్రి కూడా)  బాలినేని అనుచరుల చేతిలో దెబ్బలు తిని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తే ఈ సుబ్బారావు గుప్తా.  అప్పట్లో బాలినేని ప్రధాన అనుచరులు ఒక లాడ్జిలో సుబ్బారావు గుప్తాను కొడుతున్న వీడియో ఒకటి తెగ వైరల్ అయ్యింది. మంత్రి బాలినేని అనుచరులుగా ఉన్న వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటూ   సుబ్బారావు గుప్తా విమర్శించడంతో  ఆయనను బాలినేని అనుచరులు ఒక లాడ్జి రూంలో చితక్కొట్టారు. మోకాళ్ల మీద కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించారు. ఆ తరువాతి రోజే (అప్పుడు మంత్రి) బాలినేని తెరమీదకు వచ్చి  సుబ్బారావు గుప్తాను ఇంటికి పిలిపించుకుని రాజీ చేసుకున్నారు. అయ్యిందేదో అయ్యింది... ఇక మనమంతా ఒకటే అంటూ కేకు కట్ చేసి ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే గుప్తా మాత్రం ఆ తరువాత వైసీపీ రెబల్ గా మారారు.  తనపై దాడి చేసిన వారికి పోలీసులు రాచమర్యాదలు చేసి మరీ స్టేషన్ బెయిల్ ఇచ్చారని విమర్శలు గుప్పించారు.  పర్యటనలు చేసి మరీ రాష్ట్ర వ్యాప్తంగా తనకు మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నించారు.  బెజ‌వాడ‌లో  ఆర్య వైశ్య ఐక్యత సభ నిర్వహించి ఒంగోలులో చోట రాజన్, డీ గ్యాంగులు ఉన్నాయంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పిలిచినా తాను కలవలేదని కూడా అప్పట్లో ప్రకటించారు.  సరే నెమ్మదిగా ఆ వ్యవహారం అంతా సైడైపోయిందని అంతా భావించారు. కానీ అప్పటి నుంచీ సుబ్బారావు గుప్తా వైసీపీ రెబల్ గానే ఉంటూ వచ్చారు. ఇటీవలి కాలంలో సుబ్బారావు గుప్పా తన విమర్శల దాడిని తీవ్రం చేశారు. బాలినేని, ఆయన కుమారుడిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా   బాలినేని అనుచరుడు సుభాని  తన అనుచరులతో కలిసి ఒక వసతి గృహంపై దాడి చేసిన సంఘటనలో బాలినేని తీరును నిరసిస్తూ సుబ్బారావుగుప్తా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆ తరువాత రెండు రోజుల వ్యవధిలోనే సుబ్బారావు గుప్తాను గంజాయి కేసులో పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.  సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఒంగోలులో సంచలనం సృష్టించింది. వైసీపీలో రెబల్ గా ఉంటే పోలీసుల మర్యాద ఇలాగే ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  

కమలం గూటికి భోగ శ్రావణి.. బీఆర్ఎస్ కు బిగ్ షాక్

జగిత్యాల మునిసిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి కమలం గూటికి చేరనున్నారు.  బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై  చెప్పి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన భోగ శ్రావణి బుధవారం (మార్చి 1)న కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు.   జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బాధ్యతలు నుండి తప్పుకోవడంతోపాటు కౌన్సిలర్ పదవికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన భోగ శ్రావణి బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇందుకోసం  భోగ శ్రావణి హస్తిన వెళ్లారంటున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో ఆమె కమలం గూటికి చేరుతారని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్  భోగ శ్రావణిని పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం సోమవారం భోగ శ్రావణి ప్రవీణ్ దంపతులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిసి  మంతనాలు జరిపారని సమాచారం. ఇప్పుడు తాజాగా ఆమె హస్తిన బయలు దేరి వెళ్లడంతో ఆమె కాషాయ కండువా కప్పుకోవడం ఖరారైందని చెబుతున్నారు. 

విజయ ‘సాయిలెన్స్’.. కారణం అదేనా?

వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయాసాయిరెడ్డి సైలెన్స్ వెనుక కారణాలేమిటన్న చర్చ ఆ పార్టీలో విస్తృతంగా సాగుతోంది. నిత్యం విపక్షాలపై విమర్శలతో, ట్వీట్లతో తెలుగుదేశం అగ్రనేతలపై వ్యంగ్య కామెట్లతో వార్తల్లో ఉండే విజయసాయి గత కొంత కాలంగా నిశ్శబ్దం పాటిస్తున్నారు. పార్టీ వేదికలపైనా, కార్యక్రమాలలోనూ కూడా పెద్దగా కనిపించడం లేదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్ధం కాక వైసీపీ శ్రేణులు తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి.  నిత్యం.. పార్టీలోని నాయకులతోనో.. కార్యకర్తలతోనో భేటీ కావడం... లేదా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం.. అదీ కాదనుకుంటే.. సామాజిక మాధ్యమం ద్వారా ప్రతిపక్ష పార్టీల అధినేతలు, నాయకులపై విమర్శలు గుప్పించడం చేస్తుండే విజయ సాయి హఠాత్తుగా సైలెంట్ అయిపోవడం పార్టీ శ్రేణుల్లో పలు అనుమానాలకు తావిస్తోంది.     మరోవైపు  విజయసాయిరెడ్డి..   సమీప బంధువు నందమూరి తారకరత్న మరణం, ఆ తరువాత ఆయన తెలుగుదేశం అధినేత, ఆ పార్టీ ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణతో ఒకింత సేపు మాట్లాడటంతో వైసీపీ అధిష్ఠానం ఆయన్ని  దూరంగా పెట్టిందనే   ప్రచారం కూడా జోరందుకుంది. ఆ క్రమంలోనే విజయసాయిరెడ్డిని స్టేట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అప్పగించారని అంటున్నారు. ఇంకోవైపు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న నందమూరి తారకరత్నను విజయసాయిరెడ్డి పరామర్శించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై.. ఆసుపత్రి వైద్యులను అడిగి మరీ తెలుసుకొన్నారు.   అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయన చాలా వివరింగా వివరిస్తూ మాట్లాడారు. విజయసాయిరెడ్డి మాటల ద్వారా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ప్రజలందరికీ ఓ క్లారిటీ అయితే వచ్చిందనే ఓ టాక్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.   అయితే తారకరత్న ఆరోగ్యంపై ఇంత క్లారిటీగా చెప్పిన విజయసాయిరెడ్డి.. 2019, మార్చి 15న దారుణ హత్యకు గురైన వైయస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని ఎలా చెప్పారంటూ విజయసాయిరెడ్డిని నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా ఆయన సెలెంట్ గానే ఉండిపోయారు. తారకరత్న మరణం, అంతకు ముందు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ నేతలు మాట్లాడిన మాటలకూ పూర్తి భిన్నంగా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాటిని ఖండిస్తున్నట్లుగా విజయసాయి మాటలు ఉన్నాయి. ఇదే జగన్ కు ఆయనపై ఆగ్రహం కలగడానికి కారణంగా పార్టీ శ్రేణులు అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. అయితే విజయసాయి మౌనం వెనుక  అత్యంత బలమైన కారణముందన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురి అయితే..  ఆయన గుండెపోటుతో మరణించారంటూ మొట్టమొదటగా మీడియా ముందుకు వచ్చి ప్రకటించిందీ విజయసాయిరెడ్డేనని ఇప్పుడు అదే తన తలకు చుట్టుకుంటుందన్న భయంతోనే విజయసాయి మౌనం వహిస్తున్నారన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. వివేకా హత్య కేసులో సీబీఐ.. దూకుడు పెంచడం, ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్   బెయిల్ పిటిషన్‌ను   తెలంగాణ హైకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన నేపథ్యంలో  వివేకా హత్య కేసు సాధ్యమైనంత త్వరగా ఓ కొలిక్కి వస్తుందని అటు రాష్ట్ర ప్రజలే కాదు.. ఇటు వైయస్ వివేకా ఫ్యామిలీలోని వారు సైతం భావిస్తున్నారు.  మరోవైపు వైయస్ వివేకా హత్య కేసులో చోటు చేసుకున్న వరుస పరిణామాలపై ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా హు కిల్డ్ బాబాయి అంటూ ముఖ్యమంత్రి  జగన్‌ను ఉద్దేశించి చమత్కార బాణాలు విసురుతున్నారు. ఇక తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అయితే యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రలో భాగంగా వైయస్ వివేకా హత్యపై జగన్ ప్రభుత్వానికి వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు.  కానీ వీటికి విజయసాయిరెడ్డి.. సోషల్ మీడియా ద్వారా గతంలో లాగా తనదైన శైలిలో స్పందించడం లేదని...  ఓ వేళ.. వీటికి ఆయన తన తరహాలో స్పందిస్తే.. అందుకు కౌంటర్‌గా వివేకా గుండెపోటుతో మరణించారంటూ నీకు ఎవరు చెప్పారంటూ సీబీఐ రంగంలోకి దిగి.. ఈ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసే అవకాశం లేకపోలేదని.... ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఓ టాక్ వినిపిస్తోంది.

ఏపీలో జనం నెత్తిన ట్రూ అప్ చార్జీల పిడుగు.. ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలులో వంద కోట్ల అవినీతి!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవగాహనా రాహిత్యం వల్ల ప్రజల నెత్తిన ట్రూ అప్ చార్జీల పిడుగు పడుతోంది.  తాను ముఖ్యమంత్రిని కనుక  ఏమి చేసినా చెల్లుతుందని అహంభావం కారణంగానే ప్రజలకు మరోసారి విద్యుత్ భారం తప్పడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికే ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు.  ఇప్పుడు ఎనిమిదవ సారి విద్యుత్ చార్జీల పెంపునకు రెడీ అయ్యారు. ట్రూ ఆప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తప్పుపట్టారు. సీఎం అసమర్థత, చాతకాని తనం వల్ల జనం తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.  తగ తెలుగుదేశం ప్రభుత్వహయాంలో రెన్యుబుల్ ఎనర్జీ కోసం కొన్ని  యూనిట్ విద్యుత్ మూడు నుంచి మూడున్నర రూపాయలకు కొనుగోలు చేసే విధంగా   ఒప్పందాన్ని కుదుర్చుకుందనీ,  గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏలను గౌరవించకుండా, రేటు తగ్గించాలని కోరడమే కాకుండా, వారి నుంచి విద్యుత్ ను కొనుగోలు చేయకుండా మానేశారని మంగళవారం (ఫిబ్రవరి 28) రచ్చబండ లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.  పిపిఏ లను పునసమీక్షించేందుకు విద్యుత్ నిపుణుల కమిటీ అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి తో పాటు మరొక రెడ్డితో కమిటీ వేశారు. పిపిఏ లు చేసుకున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన పాత బకాయిలను నిలిపివేశారు. కొత్తగా విద్యుత్తును కొనడం ఆపివేశారు. ఎక్స్చేంజిలో యూనిట్ విద్యుత్ కు ఐదు రూపాయలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనితో యూనిట్ విద్యుత్ ధరకు అదనంగా రూపాయిన్నర చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో పిపిఏ ఒప్పందాలను చేసుకున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కోర్టును ఆశ్రయించాయి.  పిపిఏలు చేసుకున్న సంస్థలకు యూనిట్ విద్యుత్తు ధర మూడున్నర చెల్లించడంతోపాటు ఎక్స్చేంజిలో యూనిట్ విద్యుత్ ఐదు రూపాయలకు కొనుగోలు చేయడం వల్ల , ప్రజలపై యూనిట్ విద్యుత్ భారం ఎనిమిది రూపాయలు పడింది. ఎక్స్చేంజిలో కాకుండా, అదే పిపిఏలు చేసుకున్న సంస్థల వద్ద విద్యుత్ ను కొనుగోలు చేసి ఉంటే మూడు నుంచి మూడున్నర రూపాయలకే యూనిట్ విద్యుత్ లభించి ఉండేది. పాలకులు అజ్ఞానంతో ,   ఎక్స్చేంజిలో విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై భారాన్ని మోపారు.   హిందూజా ప్లాంట్ ఖాళీగా ఉంచినందుకు 1230 కోట్ల రూపాయలను అప్పుచేసి మరి ఆ సంస్థకు చెల్లిస్తున్నారు. ఆ భారాన్ని మొత్తం ఇప్పుడు ప్రజలు ట్రూ అప్ చార్జీల రూపంలో భరించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ప్రజలు భారం మోయాల్సి వస్తోందని రఘురామకృష్ణం రాజు అన్నారు.   రాష్ట్రంలో శిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ నుంచి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో  100 కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు.    

ఏపీ బీజేపీ.. వైసీపీ ‘బీ’ టీం ముద్ర నుంచి బయటపడేనా?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎందుకు ఎదగడం లేదు?  ఆ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ ఎందుకు దిగజారిపోతొంది.  రాష్ట్రంలో  కమలం కాలు ఎందుకు కదలడం లేదు. అడుగు ఎందుకు ముందుకు పడడం లేదు? ఎందుకు ఏ   వర్గం ప్రజలనూ కమలం  పార్టీ ఆకట్టుకోలేక పోతోంది? దేశమంతా మోడీ .. మోడీ అంటున్నా ఏపీలో మాత్రం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా, పార్టీ ఎందుకు పడకేసింది? ఎందుకు పార్టీలో ఏ ఇద్దరు నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేకుండా పోయింది?  రాష్ట్ర  అధ్యక్షునిగా .. మీ సంజాయిషీ సమాధానం  ఏమిటి? అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన సమాధానం, ఆడ లేక మద్దెల ఓడు’ అన్న సామెతను గుర్తుకు తెస్తోంది. ఎందుకంటే, ఏపీలో బీజేపీ ఎదగక పోవడానికి, ఎదగలేక పోవడానికి తాను ఏమాత్రం కారణం కాదని వీర్రాజు పార్టీ కేంద్ర నాయకత్వానికి పొడుగాటి లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమను ఎదగ నీయడం లేదని, అడుగడుగునా అడ్డు పడుతున్నారని వాపోయినట్లు తెలుస్తోంది. నిజానికి ఏపీలో బీజేపీ ఎందుకు ఎదగలేదనే ప్రశ్నకు, సమాధానం చెప్పడం అంత సులువు కాదు.   కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలున్నాయి. అయితే సోము బీజీపీ ఎదగక పోవదానికి తెలుగు దేశం అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు కారణమని లేఖలో పేర్కొనడమే చిత్రంగా ఉందని బీజేపీ నాయకులే విస్తుపోతున్నారు . ముక్కున వేలేసుకుంటున్నారు. నిజానికి, సోము వీర్రాజు ఆయన అనుచరగణం అధికార వైసీపీతో అంటకాగుతూ  తెలుగు దేశం పార్టీని  చంద్రబాబు నాయుడిని దూరం చేసుకోవడం వల్లనే బీజేపీకి ఈ దుర్గతి పట్టిందని ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆయన విచిత్రంగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ నాయకులే సైటైర్లు వేస్తున్నారు.  అదలా ఉంటే ఇటీవల రాష్ట్ర బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు  ముఖ్యంగా పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ పార్టీకి రాజీనామాచేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న నేపధ్యంలో, బీజేపీ జాతీయ నాయకత్వం కొంత అలర్ట్ అయింది. నిజానికి,కన్నాతో మొదలైన వలసల వరదలో పార్టీ పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాద సంకేతాలు స్పష్టమైన నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం  అసమ్మతి నేతలను ఢిల్లీకి పిలిపించుకుని  మంతనాలు సాగించింది.  ఈ సందర్భంగా సోము వ్యతిరేక బీజేపీ నేతలు బీజేపీ రాష్ట్ర వ్యవహారాలు ఇంచార్జి మురళీధరన్ ను కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని, సోము వీర్రాజు వైఖరిని పూర్తిగా వివరించారు.  వీరితో సమావేశం ముగిసిన తర్వాత మురళీధరన్ ఏపీకి వచ్చారు. రాజమండ్రిలో సమావేశం ఏర్పాటు చేశారు. పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. సోమును కేంద్ర నాయకత్వం వివరణ కోరిందో  లేక ఆయనే స్వయంగా సంజాయిషీ ఇచ్చుకున్నారో తెలియదు  కానీ  కేంద్ర నాయకత్వానికి ఓ పెద్ద లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర బీజేపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితిని పూర్తిగా తెలియజేస్తూ ఆయన ఈ లేఖ రాశారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడి వల్లే రాష్ట్రంలో పార్టీ ఎదగడంలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నానని  ఈ విషయంలో గతంలో కూడా వివరాలు తెలియజేస్తూ నివేదికలు ఇచ్చానని కానీ చంద్రబాబునాయుడు బీజేపీని బతకనివ్వడంలేదని ఎక్కడికక్కడ కీలక నాయకులను పార్టీలోకి తీసుకుంటున్నారని  పదవులు ఆశ చూపుతున్నారని  ఇలా అయితే పార్టీ బతకడం కష్టం అని సోము తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి బీజేపీ అధిష్టానానికి ఏపీ మీద పెద్దగా ఆశలు లేవు.  రెండు బలమైన ప్రాతీయ పార్టీల నడుమ ఒక జాతీయ పార్టీ ఎదిగే అవకాశాలు అంతగా లేవనే విషయం బీజేపీ పెద్దలకు తెలియందేమీ కాదు. గత ఎన్నికల్లో బీజేపీకి  నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయినా  బీజేపీ ఢిల్లీ పెద్దలు జాతీయ రాజకీయాలు, జాతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని  అప్పుడప్పుడు నాయకులను అలెర్ట్ చేయడం, ఆ తర్వాత కథ కంచికి చేరిపోవడం రివాజుగా వస్తోంది. ఈ పరిస్థితి చూసి, ఇక బీజేపీ మారదనే నిర్ణయానికి వచ్చిన  కన్నా లక్ష్మీనారాయణ, ఆయన అనుచరులు  రాష్ట్రానికి ప్రధాన శత్రువుగా మారిన వైసీపీను ఎదుర్కునే సత్తా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం అన్న భావనతో ఆ పార్టీలో చేరారు.  అలాగే, ఇంకొందరు కూడా అదే బాటలో ఉన్నారు. సో .. ఈసారి ఏమి జరుగుతుంది ..  ఇప్పటికైనా సోము వీర్రాజుకు ఉద్వాసన పలుకుతారా ..పలికితే ప్రయోజనం ఉంటుందా ? ఏపీ బీజేపీ  వైసీపీ ‘బీ’ టీం అనే ముదనుంచి బయట పడతుందా ? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని భేతాళ ప్రశ్నలు.

మెడికో ప్రీతికి న్యాయం జరిగేనా?

ర్యాగింగ్ భూతానికి బలైన డాక్టర్ ప్రీతి వ్యథ, మంత్రి కేటీఅర్ దృష్టిలో చాలా చిన్న విషయం కావచ్చును, కానీ, ఆ వ్యథ  ప్రీతి తల్లి తండ్రుల దృష్టిలో చిన్న సమస్య కాదు. ఆమె చావు. ఆ తల్లితండ్రులను  జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. వేధిస్తూనే ఉంటుంది. ప్రీతి మరణం ఆమె తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులనే కాదు,సమాజం మొత్తాన్ని బాధిస్తోంది. మంత్రి కేటీఆర్ దృష్టిలో ప్రీతి మరణాన్ని, ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయనే చులకన భావం ఉంటే ఉండవచ్చును, కానీ, సామాన్య ప్రజలు మాత్రం ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడంలో ప్రతిపక్షాలు, మీడియా విఫల మయ్యాయనే అంటున్నారు. నిజానికి, కొద్ది మాసాల క్రితం బాసర బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన సమయంలో విద్యామంత్రి సబితా ఇంద్రా రెడ్డి, విద్యార్ధుల డిమాండ్స్  ను సిల్లీ డిమాండ్స్ అని అవమానిస్తే, ఇప్పుడు ప్రీతి మరణాన్ని మంత్రి కేటీఆర్ చిన్న సంఘటనగా పేర్కొని, పేదరికాన్ని, పేదలను మరో మారు అవమానించారు.     ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. అయితే ఆమె ఎలా చనిపోయారు? ఆత్మ హత్య చేసుకున్నారా? హత్యకు గురయ్యారా? ఈ విషయంలో ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. ప్రీతి పై విష ప్రయోగం జరిగిందని, ఆమె సోదరి అనుమనిన్స్తున్నారు. ప్రీతి మృతి విషయంలో ఆమె అక్క అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్జరీకి అటెండైన ఆమె అంత సడెన్‭గా ఎలా సిక్ అయ్యిందని ప్రశ్నించారు. తనంతట తానే ఎలా ఇంజక్షన్ తీసుకుంటుందని నిలదీశారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న ప్రీతి ఆర్గాన్స్ మూడు, నాలుగు గంటల్లోనే ఎలా పని చేయకుండా పోయాయని అంటున్నారు. డ్యూటీలో చేరిన కొద్ది రోజులకే అంత పవర్ ఫుల్ డ్రగ్ ను ఆమె చేతికి ఎవరిచ్చారన్న అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రీతి అక్క డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాతనే సీనియర్స్ తో ఆమెకు వాగ్వాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రీతి తన సీనియర్స్  తో మాట్లాడిన కాల్ డేటాను బయటపెడితే అసలు నిజాలు బయటికి వస్తాయని ఆమె అంటున్నారు.  అలాగే  మెడికల్ రిపోర్ట్, అదే విధంగా టాక్సికాలజీ రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ అన్నిటిని మించి పోలీసులు, డాక్టర్లు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎవరిని కాపాడేందుకు  ప్రయత్నిస్తున్నారు అనే అనుమాలు వ్యకమవుతున్నాయి.  మరోవంక డాక్టర్ ప్రీతి ఘటనతో మెడికల్ కాలేజీలపై గవర్నర్ తమిళి సై దృష్టి సారించారు. డాక్టర్ ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని సమాచారం ఇచ్చిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వీసీకి గవర్నర్ లేఖ రాశారు. ప్రీతి ఆరోగ్యం పై తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడ్ని కాపాడేందుకు ప్రయత్నించారని యూనివర్సిటీ అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీలలో యాంటి రాగింగ్ చర్యలు గట్టిగా తీసుకోవాలని గవర్నర్ తమిళి సై సూచించారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇలాంటి సంఘటనలలో ఎలాంటి ఉదాసీనత లేకుండా, తక్షణం స్పందించి కాలేజీలలో బాధ్యులపై కఠిన తీసుకోవాలని సూచించారు.  నిజానికి  ప్రీతి మరణం విషయంలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు మాత్రమే కాదు,  మావోయిస్టులు ఇతర సంస్థలు కూడా తప్పు పడుతున్నాయి. ప్రీతి మృతికి కారకులైనవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ మావోయిస్ట్ పార్టీ  కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన  సోషల్ మీడియాలో లేఖ విడుదల చేశారు. ప్రీతిని సీనియర్ సైఫ్ ర్యాగింగ్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నా యాజమాన్యం  ఆ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని వెంకట్ ఆరోపించారు. ప్రీతికి న్యాయం చేయాలని విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే ఆమె ఆత్మహత్యకు సైఫ్ కారణం కాదని హాస్పిటల్ యాజమాన్యం బుకాయిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  అయితే, ప్రీతి మరణాన్నివిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్న మంత్రి కేటీఆర్  ఆమె మరణానికి మతం రంగు పులిమి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. అందుకే ఆయన సైఫ్ అయినా సంజయ్ అయినా ఎవరినీ ఉపేక్షించమని అన్నారని అంటున్నారు. అయితే, సంఘటన జరిగి వరం రోజులు అయినా ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం రాని నేపధ్యంలో, ఆమెకు న్యాయం   జరగడం అనుమానమే, అంటున్నారు.

మీ బిడ్డను నేను.. జగన్ కొత్త ఎత్తు.. జనం నమ్ముతారనేనా?

 అన్ని సందర్భాలలో అందరినీ నమ్మించడం, ఎవరికైనా, ఎంతటి ‘జగత్’ కిలాడీలకయినా సాధ్యం అయ్యే పని కాదనే నానుడే, వుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాత్రం, వై నాట్, అందరినీ అన్ని వేళలా నమ్మించవచ్చనే విశ్వాసంతో ముందుకెళుతున్నారు.అందుకే, ఆయన వై నాట్ 175? అంటున్నారని, రాజకీయ విశ్లేషకులు, అంటున్నారు.  జగన్మోహన్ రెడ్డి 2019లో ఎలా అధికారంలోకి వచ్చారో  వేరే చెప్పనక్కర లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ ని అడ్డు పెట్టుకుని, తల్లిని,చెల్లినీ, వారి శ్రమను ఆసరా చేసుకుని, దివంగత నేత, ప్రియతమ నాయకుడు అంటూ తండ్రి పేరును ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చారు. ఒక విధంగా సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అందుకు తోడుగా, ఒక్క ఛాన్స్ ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తానని మాటిచ్చి అధికారం దక్కించుకున్నారు. ఈ నిజం అప్పుడు తెలియక పోయినా, ఇప్పడు అందరికీ  అర్థమైంది. అందుకే, జగన్ రెడ్డి అటు సొంత కుటుంబాన్ని,ఇటు ప్రజలను నమ్మించి మోసం చేశారనే నిజాన్ని కొంత ఆలస్యంగానే అయినా జనం గ్రహించారని రాజకీయ పండితులు  విశ్లేస్తునారు. అందుకే ఇప్పుడు జగన్ రెడ్డి కొత్తగా, ‘మీ బిడ్డను నేనంటూ’ కొత్త సెంటిమెంట్ ని తెరమీదకు తెచ్చారని, జనసేన నేత నాదెండ్ల మనోహర్  వ్యంగ విశ్లేషన చేశారు.  గతంలో  దివంగత నేత, ప్రియతమ నాయకుడు.. అంటూ వైఎస్ పేరును పదే పదే ప్రస్తావించిన జగన్ రెడ్డి  ఇప్పడు  ఎక్కడ మాట్లాడినా మీ బిడ్డనని చెప్పుకుంటున్నారు. గతంలో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు… మామయ్యను అంటూ వరుసలు కలుపుకుని సెంటిమెంట్ పండించారు. ఇప్పుడు ఏకంగా అందరితో మీ బిడ్డనంటూ చెబుతున్నారు. అయితే  జగన్ రెడ్డి ఎవరి సలహా మేరకు మళ్ళీ మరోమారు ఫ్యామిలీ సెంటిమెంట్ పండించాలని అనుకుంటున్నారో  ఏమో కానీ, ఆయన సొంత కుటుంబంలోనే ఒంటరి అయ్యారనే విధంగా ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో  ఈ సారి ఫ్యామిలీ  సెంటిమెంట్ వర్కౌట్ అవదు సరికదా బూమ్ రాంగ్ అవుతుందని వైసీపీ నేతలే అంటున్నారు.  ఇదే విషయాన్ని జనసేన పార్టీ కూడా గుర్తు చేసింది. మీ బిడ్డనంటూ బహిరంగ సభల్లో సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన సెటైర్ వేసింది. ఇంట్లో వాళ్లనే నమ్మని బిడ్డ జనం బిడ్డ ఎలా అవుతాడని.. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సొంత ఇంట్లో కన్న తల్లి, సొంత చెల్లి వద్దన్న నేతగా పేరు పడిన జగన్మోహన్ రెడ్డిని ఏ కుటుంబమూ తమ బిడ్డగా ఒప్పుకోదని మనోహర్ స్పష్టం చేశారు.  నిజమే, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటే, అసలు ఆయన రాజకీయాల్లో నిలవగాలిగారు అంటే, అందుకు మూల కారణం ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల. జగన్ రెడ్డి జైల్లో ఉన్న 16 నెలలు ఆ ఇద్దరే పార్టీని బతికించారు. షర్మిల అయితే, జగనన్న వదిలిన బాణాన్ని  అంటూ ...  జగన్ రెడ్డి వదిలి వెళ్ళిన పాద యాత్ర  కొనసాగించారు.  వైసీపీని సజీవంగా ఉంచారు. కానీ, అధికారంలోక్ వచ్చిన తర్వాత  ఆమె పరిస్థితి ఏమిటో  అందరికీ తెలిసిన విషయమే. అలాగే  కారణాలు ఏవైనా తల్లి విజయమ్మ కూడా వైసీపీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి ‘గౌరవంగా’ తప్పు కున్నారు. ఇక బాబాయ్, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో వెలుగు చూస్తున్న నిజాలు ఒక విధంగా విస్మయం కల్గిస్తున్నాయి. జగన్ రెడ్డి ఇంకేమైనా కావచ్చును కానీ, కుటుంబ విలువలు గౌరవించే వ్యక్తి అంటే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు.  అందుకే, కావచ్చును నాదెండ్ల మనోహర్  ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుని పదే పదే మీ బిడ్డను చెప్పుకోవడం ఆపాలని సలహా ఇచ్చారు. తల్లి, చెల్లి విషయంలోనే కాదు.. కుటుంబం విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు తరచూ ప్రజల్లో చర్చనీయాంశం అవుతోంది. తండ్రిని చంపారంటూ.. తీవ్ర రోపణలు చేసి.. రిలయన్స్ పై దాడులు కూడా చేయించిన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ రిలయన్స్ అధినేతను ఇంటికి పిలిచి.. విందు భేటీ ఇవ్వడమే కాకుండా.. రిలయన్స్ సామ్రాజ్యంలో కీలక వ్యక్తికి రాజ్యసభ సీటు కూడా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయినా  జగన్ రెడ్డి మూడున్నరేళ్ళలో ఏ  నాడు ప్యాలెస్ గడపదాటి జనంలోకి  వెళ్లని.. అనివార్యంగా వెళ్ళినా.... పరదాలు చాటున ..పోలీసు పహారాల మధ్య మాత్రమే వెళ్ళిన ముఖ్యమంత్రి ప్రజల బిడ్డ ఎట్టవుతడు? అని, అదే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాయింటే కదూ..

ఏబీకే ప్రసాద్ కు నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్

పాత్రికేయ వృత్తిలో ఎందరో ప్రతిభామంతులైన జర్నలిస్టులకు గురువు అయిన ప్రముఖ  సంపాదకుడు డాక్టర్ ఏబీకే ప్రసాద్   రాజా రాంమ్మోహన్ రాయ్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో దాదాపు అన్ని ప్రధాన పత్రికలకు ఎడిటర్ గా పని చేసిన సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఏబీకే ప్రసాద్ ఢిల్లీలోని డిప్యూటీ స్పీకర్ హాల్ లో మంగళవారం(ఫిబ్రవరి 28) జరిగిన ఒక  కార్యక్రమంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ చేతుల మీదుగా  ఈ పురస్కారం అందుకున్నారు.   ఏబీకేగా ప్రసిద్ధి గాంచిన అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ ఏడున్నర దశాబ్దాలుగా పాత్రికేయ రంగంలో అగ్రగామిగా నిలిచారు.  2004-2009 మధ్య కాలంలో ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా కూడా పని చేశారు.

రాజధాని కేసు.. ఏపీ అత్యవసర విచారణ వినతిని పట్టించుకోని సుప్రీం

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. వచ్చేనెల 3,4 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజధాని విషయంలో సుప్రీం కోర్టు నుంచి తమకు అనుకూలంగా తీర్పు వస్తే.. ఎదురు లేకుండా చక్రం తిప్పవచ్చని భావించిన జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టు నిర్ణయం మింగుడు పడటం లేదు. మూడు రాజధానుల విషయం ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రిం కోర్టులో జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై వచ్చే నెల 28న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో జగన్ సర్కార్ పరిస్థతి కక్కలేకా.. మింగలేకా అన్నట్లుగా తయారైంది. హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సుప్రీంను ఆశ్రయించకుండా.. తీరిగ్గా ఆరు నెలల తరువాత అత్యవసర విచారణ కావాలంటూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు వచ్చే నెల 28న విచారణకు స్వీకరిస్తామంటూ తేల్చి చెప్పింది. ఇప్పటికే జగన్ సర్కార్ అత్యవసర విచారణ అంటూ కోరిన తరువాత ఈ కేసు విచారణ వెనక్కు వెళ్లడం ఇది మూడో సారి.  హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకోవాలని జగన్ సర్కార్ డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది. హై కోర్టు తీర్పు వెలువరించిన ఆరు నెలల పాటు నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్న జగన్ సర్కార్ ఆ తరువాత హడావుడిగా సుప్రీం ను ఆశ్రయించి, తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించింది. వైసీపీ ఎంపీ, లాయర్ నిరంజన్ రెడ్డి ఈ విషయంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలో అమరావతి కేసును అత్యవసరంగా విచారించాలంటూ బెంచ్ ముందు ప్రస్తావించారు. 23వ తేదీన తొలి కేసుగా విచారిస్తామని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం తెలిపింది.  అయితే ఈ రోజు విచారణకు వచ్చే కేసులు జాబితాలో అమరావతి కేసు లేదు. ఇందుకు  సీజేఐ ఈ నెల 14న జారీ చేసిన సర్క్యులరే కారణమని చెబుతున్నారు.   ఒక సారి నోటీసు అయిన కేసులను బుధ, గురువారాల్లో విచారణ చేయవద్దని ఆ సర్క్యలర్ సారాంశం.  అందుకే అమరావతి కేసు గురువారం విచారణకు రాలేదని చెబుతున్నారు.  హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అత్యవసరంగా స్టే కోసం ప్రభుత్వం అదే పనిగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. అందుకు ఇటీవల నిరంజన్ రెడ్డి వ్యవహారం కూడా ఒక కారణమన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లోనూ, లీగల్ సర్కిళ్లలోనూ జోరుగా సాగుతోంది. జగన్ కు సంబంధించిన కేసుల బెంచ్ హంటింగ్‌ కు ఆయన పాల్పడుతున్నారన్నదే ఆ చర్చ, ఈ నేపథ్యంలోనే . అమరావతి కేసులో గురువారం (ఫిబ్రవరి 23) విచారణకు రాకపోవడం, ఎప్పుడు వస్తుందన్నదానిపై స్పష్టత లేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.   మరో వంక గత ఏపీ ప్రభుత్వం అమరావతిని చట్ట బద్ధంగా ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కు నివేదించింది కూడా.  ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే అమరావతి విషయాన్ని తేల్చేయాలన్న ఆత్రంతో ఉన్న జగన్ సర్కార్ సుప్రీంలో అమరావతి కేసు విచారణకు రాకపోవడం ఇబ్బందుల్లో పడేసింది. మరో వైపు సాధ్యమైనంత త్వరగా అమరావతిని ఖాళీ చేసి విశాఖకు మకాం మార్చేయాలన్న తొందర ప్రదర్శిస్తున్న జగన్ కు ఈ కేసు విచారణ జాప్యం అవుతుండటం ఒక విధంగా ఆయనను అసహనానికి గురి చేస్తున్నది.  కాగా రాజధాని అమరావతిపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు తాజాగా  సోమవారం (ఫిబ్రవరి 27) మరోసారి వాయిదా వేసింది. రాజధానిపై పిటిషన్లను త్వరగా విచారించాల త్వరగా వాదనలు ముగించాలని జస్టిస్ కేఎం జోసెఫ్ జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ప్రత్యేకంగా విన్నవించారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఆ పిటిషన్లపై మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది.  మరోవైపు వచ్చే ఏడాది వేసవిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజధాని అంశం అన్ని పార్టీలకు అజెండా అంశంగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో పాలనా పరంగా మూడు రాజధానుల నిర్ణయం వైసీపీకి కీలకంగా మారింది. ఇందులో భాగంగానే విచారణ కోసం ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును విచారణ వేగవంతం చేయాలని కోరుతోంది. అయితే సుప్రీంకోర్టు మార్చి 28న ఈ కేసును విచారిస్తామని స్పష్టం చేసింది.

జగన్ సభ నుంచి జనం పరుగో పరుగు!

ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలన్నా, ప్రసంగాలన్నా జనాలు బెంబేలెత్తిపోతున్నారు. గత నాలుగేళ్లుగా వింటున్న ఆవు కథను ఇంకెంత మాత్రం వినలేమంటూ పారిపోతున్నారు. అదే సమయంలో విపక్ష తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సభలకు, సమావేశాలకు, యాత్రలకు, కార్యక్రమాలకు జనం పోటెత్తుతున్నారు. ప్రతి పాటకూ చప్పట్లతో తమ ఆమోదం తెలుపుతున్నారు. తాజాగా జగన్ సభ నుంచి జనం పారిపోతుండటం కెమేరాకు చిక్కింది. జనాన్ని రప్పించడానికి పథకాల ఆశ, అలాగే పథకాల కోత భయం పెట్టి తీసుకువచ్చినా.. వచ్చిన వారు వచ్చినట్లే ముఖ్యమంత్రి ప్రసంగం మొదలు కాగానే పోలీసులను తోసుకుని మరీ వెళ్లి పోతున్నారు. గతంలో పలుసార్లు ఇటువంటి దృశ్యాలు కనిపించాయి. అయినా ఇటీవలి కాలంలో జగన్ బటన్ నొక్కడానికి తప్ప మరే కార్యక్రమం కోసం పెద్దగా జనాలలోకి రావడం లేదు. అనివార్యంగా ఏదైనా కార్యక్రమం కోసం రావాల్సి వచ్చినా జనం తనకు కనబడకుండా లేదా.. జనానికి తాను కనబడకుండా పరదాల మాటునే రాకపోకలు సాగిస్తున్నారు. మిగిలిన సమయం అంతా తాడెపల్లి ప్యాలెస్ లోనే గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 28)  గుంటూరు జిల్లా తెనాలిలో మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్‌  కార్యక్రమానికి తెనాలి, వేమూరు, పొన్నూరు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో డ్వాక్రా మహిళలను తరలించారు. ఇంతకీ జగన్ ఈ సభ ఏర్పాటు చేసింది రైతు భరోసా పథకంలో భాగంగా బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేసే కార్యక్రమం కోసం. బటన్ నొక్కిన తరువాత యథావిధిగా జగన్ తన ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లు పైబడిన పాలనలో ప్రజలకు ఎంతెంత నిధులు బటన్ నొక్కి జమ చేశారు. సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది. ఇత్యాది విషయాలు చెబుతూ పనిలో పనిగా విపక్షంపై విమర్శలు గుప్పించడానికి.సమాయత్తం అయ్యారు. అయితే బటన్ నొక్కుడు కార్యక్రమం కాగానే సభలో ఏం జరుగుతుందో ముందుగానే తెలిసి ఉండటంతో సభకు వచ్చిన వారు వచ్చినట్లే సీఎం ప్రసంగానికి ముందే లేచి వెళ్లి పోవడం ప్రారంభించారు. వెళ్లే దారిలో పోలీసులు అడ్డంగా నిలుచుని ఆపడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. పోలీసులను తోసుకుని కొందరు, మార్కెట్ యార్డ్ గోడలు దూకి మరి కొందరూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు కూడా చేసేదేం లేక మిన్నకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. జగన్ చూసి జనం పరుగో పరుగు అంటూ కామెంట్లు పెడుతున్నారు. గుర్రాన్ని చెరువు దగ్గరకు తీసుకురాగలరు కానీ, నీళ్లు తాగించలేరు అన్నట్లు జనాన్ని ఏవో ప్రలోభాలు పెట్టి.. లేద పథకాల కోత పేరు చెప్పి బయపెట్టి సభకి అయితే తీసుకురాగలిగారు కానీ.. జగన్ ప్రసంగాన్ని వినేటట్లు మాత్రం చేయలేకపోయారు.  

కేసీఆర్ వ్యూహ వైఫల్యాలు.. బీఆర్ఎస్ లో ఆందోళన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  రాజకీయ వ్యూహరచనలో ఆరి తేరిన దిట్ట. ఎత్తుకు పైఎత్తులువేసి ప్రత్యర్ధులను చిత్తు చేయడంలో ఆయనకు ఆయనే సాటి... అయితే, ఇదంతా  నిన్నటి వైభోగం. ఈ రోజు ఆయన ఏమిటో, ఏమి చేస్తున్నారో ఆయనకే అర్థమవుతున్నట్లు లేదు. ఆయన ముందులా ఏ విషయం పైన దృష్టి కేంద్రీకరించలేక పోతున్నారు. ఒకడుగు అటు ఒకడుగు ఇటూ వేసి ఎటు కాకుండా తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీలో క్యాడర్  లో గందరగోళం ఏర్పడుతోంది. ఇది ఎవరో పరాయి వాళ్ళో, ప్రతిపక్షాలో చేస్తున్న ఆరోపణ కాదు. బీఆర్ఎస్ లోని  కీలక నేతలే ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటల మాంత్రికుడు.. తన వాగ్ధాటితో ఎంతటి వారినైనా మెస్మరైజ్ చేయగలరు. రాజకీయ ఎత్తులు, జిత్తులలో దిట్ట. ఆయన వ్యూహాలు ప్రత్యర్థులకు అంతు చిక్కవు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ టికెట్ పై గెలిచినా.. చివరికి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) లో చేరాల్సిందే అన్నట్లుగా ఆయన రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి. గత ఎనిమిదిన్నరేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. అయితే ఇటీవలి కాలంలో ఆయన ఎత్తులు పారడం లేదు. జిత్తులు చిత్తవుతున్నాయి. మాటలతో మాయ చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. వ్యూహాలు వికటిస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయ వర్గాలలోనే కాదు.. సొంత పార్టీ శ్రేణులలోనూ ఇదే మాట వినపడుతోంది. ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినప్పటి నుంచే ఈ పరిస్థితి ఎదురౌతున్నదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడంతోనే రాష్ట్రంలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమౌతున్న సంకేతాలు గోచరిస్తున్నాయన్నారు. ఒక వైపు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణకు ప్రణాళికలు రచిస్తూనే.. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గెలుపు బాటలో నడిపించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. రెండు పనులూ ఏకకాలంలో చేయాల్సి రావడం వల్లనే ఆయన అటూ ఇటూ కూడా కాన్ సన్ ట్రేట్ చేయలేకపోతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. తొలుత వచ్చే అసెంబ్లీలో సిట్టింగులందరికీ టికెట్లు అంటూ ప్రకటించి, ఒక్కసారిగా వెల్లువెత్తిన అసంతృప్తి, అసమ్మతిని గమనించి పునరాలోచనలో పడాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ప్రత్యర్థి పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు పార్టీ తలుపులు బార్లా తెరిచి మరీ రెడ్ కార్పెట్ పరిచిన ఫలితం ఇప్పుడు దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ నలుగురైదుగురు పార్టీ టికెట్ ను ఆశిస్తున్న వ్యక్తులు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ రెబల్స్ బెడద ఎదుర్కోవలసిన పరిస్థితి ఉందని అంటున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నప్పటికీ కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించడం వెనుక వ్యూహమేమిటో అర్ధం కాక పార్టీ శ్రేణులే తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. తాజాగా కేసీఆర్ పార్టీ ఎంపీల పనితీరు, వారికి ప్రజలలో ఉన్న అభిమానం, వారిలో మళ్లీ టికెట్ ఇస్తే గెలిచే సత్తా ఉన్నవారెవరు ఇత్యాది అంశాలపై ఫోకస్ పెట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ వారి పనితీరు, విజయావకాశాలపై ఆరా తీస్తున్నారు. అన్నిటికీ మించి వారి ఎంపీ నిధులను ఎలా వ్యయం చేస్తున్నారు. ఏయే పనులకు కేటాయిస్తున్నారు. వంటి అంశాలతో ఇప్పటికే కేసీఆర్ ఒక్కో ఎంపీపైనా సమగ్ర నివేదికను సిద్ధం చేశారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అలాగే తన నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మంట్లలో వారి పట్ల ప్రజలలో ఉన్న అభిప్రాయం, అలాగే వారి నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో వారి సంబంధాలు ఎలా ఉన్నాయి.. పార్టీ టికెట్ ఇస్తే.. నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు ఆ ఎంపీకి సహకరిస్తారా? లేదా? కనీసం తన నియోజవకర్గ పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా ఉందా? వంటి వివరాలన్నీ ఇప్పటికే కేసీఆర్ సేకరించి పెట్టుకున్నారని అంటున్నారు. ఆ వివరాల ఆధారంగానే టికెట్ ఇవ్వాలా వద్దా అన్నది కేసీఆర్ నిర్ణయిస్తారని చెబుతున్నారు. దీంతో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలలో గుబులు నెలకొంది. కేసీఆర్ వద్ద ఉన్న నివేదికలలో తమ ప్రోగస్ పై ఉన్న రిపోర్ట్ ఏమిటి? మరోసారి పార్టీ టికెట్ దక్కుతుందా? లేదా అన్న టెన్షన్ పెరిగిపోతున్నది. సరిగ్గా ఇదే పరిస్థితి పార్టీ ఎమ్మెల్యేలలోనూ నెలకొని ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు పార్టీ అధిష్ఠానం ఎన్నికల సన్నాహాకాలకు సమాయత్తం అవుతుండటం, అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు (సిట్టింగులు) తమకు పార్టీ టికెట్ వస్తుందో రాదో అన్న అయోమయంలో పడటంతో రాష్ట్రంలో ప్రస్తుతం తెరాస పార్టీ పరంగా కార్యక్రమాలేవీ చేపట్టకుండా ఒక విధమైన స్తబ్దతలో కూరుకుపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఆదాయం కోసం ప్రభుత్వ భూముల తెగనమ్మకం.. కేసీఆర్ సర్కార్ యోచన

తెలంగాణ ప్రభుత్వం ఆదాయం కోసం వెతకని మార్గం లేదు. చేయని ప్రయత్నం లేదు. కేంద్రం నుంచి గ్రాంట్లపై కేసీఆర్ సర్కార్ నమ్మకం కోల్పోయింది. కేంద్రం నుంచి ఎటువంటి సహకారమూ అందదని నిశ్చితాభిప్రాయానికి వచ్చేసింది. దాంతో ప్రభుత్వ ఆదాయ మార్గాలు దాదాపు మూసుకుపోయాయనే చెప్పవచ్చు. దీంతో తెలంగాణ సర్కార్ ఆదాయం కోసం మరో సారి భూముల అమ్మకంపైనే దృష్టి పెట్టింది. ఇందు కోసం ఏకంగా వనరుల సమీకరణ కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘం పనేమిటయ్యా అంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో గుర్తించడం. అలా గుర్తించిన భూములను తెగనమ్మి నిధులు సమకూర్చుకోవడమె ప్రభుత్వం ఇప్పుడు ఎంచుకున్న మార్గం. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఏయే జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి అన్నది గుర్తించడంలో ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగమంతా నిమగ్నమై ఉంది. వక్ఫ్ భూములు వినా.. అసైన్డ్ ల్యాండ్స్ సహా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములన్నీ తెగనమ్మేయడానికి కేసీఆర్ సర్కార్ సూత్ర ప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇందుకు కారణం ఆర్థికంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎటువంటి సహకారమూ అందకపోవడమే కారణంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రమే సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. పన్నులు, చార్జీలు పెంచి ఆదాయాన్ని పెంచుకుందామనుకుంటే.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో బీఆర్ఎస్ సర్కార్ అందుకు సాహసంచలేని పరిస్థితి. ముఖ్యంగా ఆదాయం పెంపునకు ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపు మాత్రమే. అయితే అందుకు ప్రభుత్వం ఇసుమంతైనా సుముఖంగా లేదు.   దీంతో ప్రభుత్వం  భూములను తెగనమ్మడం, పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించింది.   హెచ్ఎండీఏ, ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు,ఇలా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయన్న ఆరా తీస్తోంది. అలాగే గతంలో సెజ్ లకు ఇచ్చిన భూములు నిరుపయోగంగా ఉంటే వాటినీ తిరిగి స్వాధీనం చేసుకుని విక్రయానికి పెట్టాలని యోచిస్తోంది.   భూముల గుర్తింపు, విలువ మదింపు వంటి ప్రక్రియలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి భూముల తెగనమ్మకం చేపట్టాలన్న తొందరను బీఆర్ఎస్ సర్కార్ కనబరుస్తోంది.  వచ్చే ఆరు నెలల్లో ఈ భూముల విక్రయ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.